28, డిసెంబర్ 2016, బుధవారం

సికింద్రాబాదులో రాంభట్ల వారి అష్టావధానం


ది. 26-12-2016 (సోమవారం) నాడు సికింద్రాబాద్, బోయిన్‍పల్లిలోని శ్రీ భోళాశంకర మందిరంలో 'భక్తిసాధనమ్' పత్రికా వ్యవస్థాపకులు పండరి రాధాకృష్ణమూర్తి గారి నిర్వహరణలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానం జరిగింది. ఆనాటి అవధానాంశాలు, పూరణలు....

1) సమస్య (ధనికొండ రవిప్రసాద్ గారు)
"కృష్ణునకు వెన్న నొసఁగెను క్రీస్తు గూడ"

పూరణ.....
వత్సలతఁ జూపి ప్రోవఁగా వర యశోద
కృష్ణునకు వెన్న నొసఁగెను; క్రీస్తు గూడ
పట్టుదలతోడఁ బెట్టెను రొట్టెలెన్నొ
మానవత యన్న నిదె యౌను మహిమ గనుమ.

2) దత్తపది (సాయిపవన్ గారు)
"ఆభరణము, అలంకారము, శ్మశానము, కపాలము పదాలను ఉపయోగిస్తూ పెద్దనోట్ల రద్దు వల్ల సమస్యలను తెలుపుతూ నచ్చిన ఛందంలో పద్యం"

పూరణ......
కొనఁగ నాభరణమ్ముల కొరత వచ్చె
ముగిసె మేన నలంకారములను బెట్ట
సకల ధననిధు (Bank) లెల్ల శ్మశానములుగ
ద్రవ్యమే లేక పాలన సవ్యమె? శివ!

3) వర్ణన (ఉప్పల బాలసుబ్రహ్మణ్యం)
"మహాభారతంలో విదురుని పాత్ర, విదురనీతులను గురించి పద్యం"

పూరణ....
చెదరిపోవ ధర్మ మకట చింతఁ బాపివేయఁగా
పదిలమైన భావరాశి భారతమ్మునందునన్
విదురనీతి యన్న రీతి వెలుగుచుండె చూడుమా
సదయులార! యాచరించి సర్వశాంతి నొందుమా.

4) నిషిద్ధాక్షరి (గౌరీభట్ల రఘురామ శర్మ గారు)
"శంకరుని గురించి పద్యం"

పూరణ.... (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకుల నిషిద్ధాక్షరాలు)
శ్రీ(హ)శ్రీ(హ)లన్(క)మ(న)ది(న)గ(గ)న(గ)వాక్
శ్రీశ్రీ(శ)మత్(క)మూ(ర్ధ)ల(మ)జ(న)త్వ జీ(వ)రన్(చే)మ(క)మ్మున్...
(రెండు పాదాలకే నిషేధం పరిమితమయింది)

శ్రీశ్రీలన్ మదిఁ గన వా
చ్ఛ్రీశ్రీమన్మూలజత్వ! జీరన్ మమ్మున్
స్వాశ్రయులన్ గావుమయా
యాశ్రితజనరక్షకా! విహాయసకేశా!

5) న్యస్తాక్షరి (కంది శంకరయ్య)
"అంశం - శివస్తుతి.
౧వ పాదంలో ౧వ అక్షరం - పా
౨వ పాదంలో ౭వ అక్షరం - ర్వ
౩వ పాదంలో ౧౩వ అక్షరం - తీ
౪వ పాదంలో ౧౭వ అక్షరం - శ"

పూరణ....
పావనమైన ప్రాంగణము పర్వతరాజ తనూజ భర్తకున్
దేవికి నేత్రపర్వమగు దివ్య సభస్థలి యెంచి చూడఁగా
ధీవినయాది సద్గుణమతిన్ మహతీయ యతీంద్రగానమే
యీవిధి నాంధ్రపద్య కవితేశుని బ్రోవుమ యీశ! శంకరా!

6) ఛందోభాషణం (హన్మకొండ రామ్మూర్తి)
(పద్యాల వేగం ఎక్కువై వ్రాయడానికి వీలు పడలేదు)

7) ఆశువు (వెంపటి అనిత గారు)
౧. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వర్ణన.
౨. 'భక్తిసాధనమ్' పత్రికపై పద్యం.

(పద్యాల వేగం ఎక్కువై వ్రాయడానికి వీలుపడలేదు)

8) అప్రస్తుత ప్రసంగం (కస్తూరి శశిధర శర్మ గారు)

4 కామెంట్‌లు:

 1. పృచ్చకులుగా పాల్గొను అవకాశం లభించిన మాస్టరుగారికి, శ్రీ ధనికొండ గారికి చక్కని అవధానమునందించిన అవధానిగారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 2. చక్కని పూరణ.
  కొనఁగ నాభరణమ్ముల కొరత వచ్చె
  ముగిసె మేన నలంకారములను బెట్ట
  సకల ధననిధు లెల్ల శ్మశానములుగ
  ద్రవ్యమే లేక పాల ముదమ్మువోయె

  అనిన "కపాలము" పూర్తి పదము ఇమిడ్చి నట్లగును.

  రిప్లయితొలగించండి
 3. తనరపార్వతీశునియవధానమందు
  పాలుపంచుకొనినకవిపండితులకు
  కార్యకర్తలకునిడుదుకరముమోడ్చి
  వందనమ్ములునాయవివందలాది

  రిప్లయితొలగించండి


 4. ఆభరణములు యలంకా
  రాభీష్టములూ శ్మశాన రమణీయతలై
  భీభత్సములయ్యె జిలే
  బీ, భూరి కపాలము సరి బేగమ్ సాయ్బాల్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి