ది. 4-12-2016 (ఆదివారం) వరంగల్లులోని రైజింగ్ సన్ హైస్కూలులో కుమారి 'పుల్లాభట్ల నాగశాంతి స్వరూప' గారు అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ శ్రీ తమ్మెర లక్ష్మీనరసింహ రావు గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ అష్టావధాని డా॥ శ్రీ ఇందారపు కిషన్ రావు గారు సమన్వయకర్తగా వ్యవహరించారు. అతిథులుగా శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, డా॥ శ్రీ టి. శ్రీరంగస్వామి గారు పాల్గొన్నారు.
అష్టావధానంలోని అన్ని అంశాలను అవధాని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకున్నారు.
౧) నిషిద్ధాక్షరి - గుండు మధుసూదన్
ఓరుగల్లులో పోతన భాగవతావిష్కరణం...
అవధాని పూరణ - (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకులు నిషేధించిన అక్షరాలు. x అని ఉన్నచోట పృచ్ఛకులు నిషేధం విధించకుండా అవధాని చిత్తానికి వదిలివేశారు.).....
(x)శ్రీ(x)క(ర)ళ(య)తో(ప)ని(త)ండి(య)న(య)నీ
పాక(x)ము(x)మే(న)లై(x)స(క)త(త)ంబు భ(స)ళి(ర)యై (x)యె(స)ప్డున్
(రెండు పాదాలకు మాత్రమే నిషేధం విధించబడింది)
శ్రీకళతో నిండిన నీ
పాకము మేలై సతంబు భళియై యెప్డున్
లోకానికి మేలు కలుగ
శ్రీకారమె భాగవతము చిన్మయ కవిరాట్!
౨) సమస్య - జీడికంటి శ్రీనివాస మూర్తి
"అవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ"
అవధాని పూరణ....
వ్యవధానం బిసుమంత లేక యిలలో వర్ధిల్లు సత్క్రీడయై
కవిలోకానికిఁ గాంతు లీను శశియై గంభీర వాగ్బంధమై
యవురా చిత్ర విచిత్ర దీపితములై హ్లాదంబుఁ జేకూర్చు నీ
యవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ!
౩) దత్తపది - కంది శంకరయ్య
"సీత-కైక-సుమిత్ర-తార" పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం చెప్పాలి.
అవధాని పూరణ....
రాజ్యమునకై కలవరించి రహిని వెలుఁగ
ధరణి వసుమిత్రమై వెల్గు తపనఁ గూడి
కౌరవులె యిసీ తండ్రినిఁ గలఁతఁ బెట్టి
పశుతను వనితా రత్నముఁ బరిభవించె!
౪) వర్ణన - పాతూరి రఘురామయ్య
భద్రకాళి అమ్మవారి వర్ణన.....
అవధాని పూరణ....
అల్లాడించితివే సురారుల ననిన్ హాయంచు విశ్వేశ్వరీ
యిల్లాలా శివ వామభాగ నిలయా హేరంభ సంతోషిణీ
ముల్లోకాలకు మూలమైన జననీ మోక్షప్రదా ధీప్రదా
యుల్లంబందున భద్రకాళి యమవై యుత్సాహ మందింపవే!
౫) వ్యస్తాక్షరి - బోయినిపల్లి రాధ
ధరణి ననేక శిష్యులను దక్షులఁ జేసెడు ప్రాజ్ఞు లిమ్మహిన్.
౬) ఆశువు - చేపూరి శ్రీరామ్
1. మహాసహస్రావధానులు మీ అవధానాన్ని చూసి మనస్సులలో ఏమనుకొని వుంటారో ఊహించిచెప్పండి.
అవధాని పూరణ....
దిగ్గజములు నెదుట దిట్టలై యుండఁగా
పద్య పాదములవి పరుగుఁ దీయు
నింత వారి నెల్ల నెంతెంతగాఁ జూపు
వారి దృక్కు నాకు వాక్కు నిడెగ!
2. పెద్దనోట్ల రద్దుతో...ప్రజల సహనం...భావి బాగుంటుందని చెప్పండి.
అవధాని పూరణ...
మంచి ముందుఁ గలదు మదినుంచి మసలుఁడీ
పొంచియున్న చెడునుఁ బోవఁ జేయు
నాశ గలుగువాఁడె యానంద మయుఁడురా
సహన భావ మున్న సాధు సాధు!
3. ఈ అవధాన సభా వర్ణన చేయండి.
అవధాని పూరణ...
ఆఱు నైదుఁ గూడి యానంద మందింప
యత్నములను సలిపె నూత్నముగను
నోరుఁగల్లులోన నుయ్యాల లూపెగా
తెల్గు భాషలోన వెల్గులంద!
౭) ఘంటావధానం - యం. వెంకటలక్ష్మి
(పృచ్ఛకురాలు చేసిన శబ్దాలను విని అవధాని చెప్పినవి...)
1. రాగ మీవె భక్తి రాగ మీవె
2. రాలు పూలు పూసె రంజితముగ
3. బమ్మెర పోతన
౮) అప్రస్తుత ప్రశంస - పల్లేరు వీరస్వామి గారు సమర్థవంతంగా నిర్వహించారు.
డా॥ ఇందారపు కిషన్ రావు గారి ఆశీఃపద్యములు:
ప్రతిభా నాన్యతో దృష్టః
వ్యుత్పత్తిశ్చ గరీయసి|
శాంతిస్వరూప వాగ్దేవ్యాః
అభ్యాసశ్చాద్భుతః క్రమః||
సకల కష్టాంశములు తీర్చె సరసరీతి!
చాలు ప్రశ్నలా యవి, సునామీలు గావ?
అన్నిఁటినిఁ బట్టి పూరించె నద్భుతముగ
నబలయా కాదు నిజముగ సబల యనుము!
అవధానానంతరం శ్రీలేఖ సాహితి, వరంగల్ వారు ప్రచురించిన డా॥ పిట్టా సత్యనారాయణ గారి 'బ్రతుకు బాట (పద్య కథాకావ్యము), 'ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము' అన్న పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
అవధానమును విజయవంతంగా చక్కగా పూర్తి చేసిన అవధానిగారికి పృచ్చకులకు అభినందనలు.
రిప్లయితొలగించండిసభికు లందఱు మెచ్చగ సరళ ముగను
రిప్లయితొలగించండిదిగ్విజయము గా నవధాన ప్రక్రియ యట
సాగి నందుల కెంతయో సంబ రమ్ము
నయిన కతమున నతులివె యందఱకును
గురువుగారూ అవధాన సమీక్షనందించినందులకు కృతజ్ఞతలు..... పూరణలు బాగున్నాయి.... నమస్సులు.
రిప్లయితొలగించండిచాలా బాగున్నది. ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. అవధానికి అభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు !
రిప్లయితొలగించండికం. అలవోకగ నవధానము
చెలరేగుచు తొణకకుండ చేసితివి కదా !
అలరించితి వందరినీ
పులకింపగ మనములు; నిను ప్రోచుత శివుడే!