30, మార్చి 2017, గురువారం

సమస్య - 2323 (గరుడుని హరి చూచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్"
లేదా...
"గరుడుని చూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

67 కామెంట్‌లు:

 1. శరణమ్మిమ్మని గోరుచు
  సురపతి యాసనము జుట్టి శోకము దాల్చన్
  హరి పిలువగ వడి జనియెడు
  గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్


  హరి = విష్ణువు
  హరి = సర్పము

  రిప్లయితొలగించండి


 2. అరగన్నున పిలిచెనహో
  గరుడుని హరి, చూచినంత గ్రక్కున మ్రొక్కె
  న్నరుణానుజుండు చక్రికి,
  జిరజిర రెక్కల విదల్చి సిద్ధంబాయెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   విరుపుతో చక్కని పూరణ చెప్పారు. 'అరుణానుజుడు' అనడం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 3. కం: హరి వానరగుమితో ఉలి
  మిరి కట్టదలచి వందనమిడ, వేగముగా
  దరిచేరు చున్నఆ సా
  గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్

  ఉలిమిరి = సేతువు వానర గుమి = వానరమూక

  లంక దాటుటకు వానరమూకతో సేతువు కట్టదలచి శ్రీరాముడు సముద్రమును ప్రసన్నత కోరుచు మనసులో వందన మిడగా సముద్రుడు వెంటనే దర్శన మీయ శ్రీరాముడు వేగమే వందన మిడెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ప్రయత్నం ప్రశసార్హం. కాని 'వానరగుమి' అనడం దుష్టసమాసం. 'ఉలిమిరి' అంటే వృక్షవిశేషమని నిఘంటువులు చెప్తున్నవి. సేతువు అన్న అర్థం లేదు. రెండవపాదం మూడవ గణం నలం కాని జగణం కాని ఉండాలి. మీరు భగణం వేశారు. 'సాగరుని' అనడం సాధువు. 'సాగరుడుని' అనరాదు.
   (మీరు నేమాని సోమయాజులు గారే కదా! నాగమణి గారి మెయిల్ నుండి పంపినప్పుడు పూరణకు ముందు కాని తరువాత కాని మీ పేరు టైప్ చేయండి. నాకు సందిగ్ధత ఉండదు.
   అన్నట్టు... వంగూరు ఫౌండేషన్ వారి పురస్కారం పొందిన అట్లాంటా వాసి మీరేనా? అయితే అభినందనలు).

   తొలగించండి
  2. నమస్కారములు రెండవ పాదములో పొరపాటు జరిగినది. క్షమించండి. వానరగుమి దుష్ట సమాసమని తెలియక వాడాను. శ్రీ శబ్ద రత్నాకరము (బహుజపల్లి వారిది) 939 వ పేజిలో సేతువు అన్న నీటి కట్ట, ఉలిమిరి అని వున్నది. అందువల్ల ఉపయోగించాను. సాగరుడుని అని వాడకూడదని తెలియదు. సరిదిద్దు కొంటాను. పూసపాటి కృష్ణ సూర్య కుమార్

   తొలగించండి
 4. డా.పిట్టా
  హరినెరుగును తన రెక్కల
  పరిపాటిగ బూన గ్రద్ద పయనము గరపున్
  సరినెదురుగ తన రాకన
  గరుడుని హరి చూచినంత;గ్రక్కున మ్రొక్కెన్

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  బరువది వెన్క వెన్కనగు వాహక ధర్మము ముందు చూపగున్
  హరినట గాంచ వీలగునె హాయిని గొల్పుట గ్రద్ద వంతగున్
  సరినొక సారి పూనికన చక్కగ ముందుకు వచ్చి ప్రేమమై
  గరుడుని చూచినంత హరి;గ్రక్కున మ్రొక్కె వినమ్ర మూర్తియై!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. డా.పిట్టా
  ఆర్యా,అభినందనలు మీకును మన కవి మిత్రులకు!
  ఉగాది,నవరత్నాలు,మూడేసి పద్యములు,27నక్షత్రాలు.మంచి ప్రణాళిక.ఆ పద్యాలను బ్లాగు ద్వారా ప్రకటిస్తారని ఆశిస్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలండీ!
   నా పద్యాలను నిన్ననే ప్రకటించాను. మిగిలిన కవిమిత్రుల పద్యాలు కుందావఝ్ఝల వారి వద్ద ఉన్నవి. వారు వాటిని పుస్తకంగా ప్రచురించే ఆలోచనలో ఉన్నారు.

   తొలగించండి
 7. డా.పిట్టా (contd.)ఆర్యా,
  ఇక 12మంది ఆస్వాదకులు ఉంటే చాలనుకొని సహృదయులు భావించి భాషానిలయంలో నమోదైన సెల్సుకు గూడా పిలుపు ,మనవారికి మనవారి పిలుపు చేకూరక పాతూరి పట్టే కొనసాగింది.స.కుఅకు తేడానెంచకూడదు కదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆ విషయమే నిన్న ఎవరో అడిగితే "అన్ని పేపర్లలో వేశాం కదా! ఎవరికీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి పిలువలేదు" అన్నారు సహృదయ సభ్యుల్లో ఒకరు.

   తొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. సురగణముల బ్రోచుటకై
  యురువేగముతోడ నేగు నుత్సాహముతో
  నిరుపమ బలసంయుతు డగు
  గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   ఇక్కడ 'హరి' అంటే ఇంద్రుడే కదా?

   తొలగించండి
 10. సరగున నమృతము దొంగిలి
  సురపతి వజ్రాయుధమును జల్కన సేయన్
  సరిలేని వీరుఁ డనుచును
  గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్
  (హరి = ఇంద్రుఁడు)

  రిప్లయితొలగించండి
 11. సురగణ రాక్షణార్థ మయి సుంత విలంబము చేయకుండగా
  నురుతరమైన వేగమున నొప్పుగ చేరుట కుత్సహించుచున్
  వరబలధైర్యయుక్తు డగు వానిని శీఘ్రగుడౌ ఖగోత్తమున్
  గరుడుని చూచినంత హరి, గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 12. సిరి చేలాంచలము విడక
  కరముల నాయుధములఁ గొన గలుగుట మఱపై
  కరిఁ బ్రోవఁగ బిరబిరఁ జన
  గరుడుని హరి చూచినంత, గ్రక్కున మ్రొక్కెన్

  రిప్లయితొలగించండి
 13. ఇరవుగ రమ్మని బిలిచెను
  గరుడుని హరి చూచి నంత, గ్రక్కున మ్రొక్కెన్
  గరుడుడు వచ్చుచు నతనికి
  పరమాత్మా !వందనములు బాయకు నన్నున్

  రిప్లయితొలగించండి
 14. రిప్లయిలు
  1. మురియుచు రతి మదనునితో
   విరిసిన నందన వనమున విహరించంగన్
   హరిగొని గగనము దరలెడి
   గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్


   హరి = చిలుక (రతీదేవి మన్మధుల వాహనము)

   ...టైపాటును సూచించిన డా. సీతాదేవి గారికి ధన్యవాదములు...

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. స్థిరమగుచిత్తముతోడను
  తరలించగ నమృతము తన తల్లికి తొలగన్
  వరవుడము, శూరుడౌ యా
  గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్
  వరవుడముః దాస్యము, హరిః ఇంద్రుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. దురితుండు మేఘనాథుని
  నరర్షభుల బంధనమ్ము నాగాస్త్రమ్ముం
  ద్వరితము విఫలము సేసిన
  గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్

  [హరి = కోతి, హనుమ]


  సురవర వీరు లెల్లరను జోద్యము మీర పరాక్రమంబునం
  బరుగిడఁ జేసి మాతృ హిత బద్ధుడు వేగ సుధారసమ్ము దాఁ
  గరమునఁ బూని పోవు తరిఁ గశ్యప సూనుడు నమ్మహాత్మునిన్
  గరుడునిఁ జూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై

  [హరి = ఇంద్రుఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు కవివర్యులు విజ్ఞులు శ్రీ కామేశ్వర రావు గారు:

   మీరు సూచించే వరకు "ఆంధ్ర భారతి" యన్న ఒక కామధేనువున్నదని నాకు తెలియదు. ఆ రోజు నుండీ నేను హనుమంతుని వలె తోక విప్పితిని. కృతజ్ఞతతో శతసహస్ర వందనములు...

   తొలగించండి
  2. శాస్త్రి గారు నమస్సులు. అదే మన యదృష్టము. పూర్వ కవులకు లేనిదీ మనకున్నదీను.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   *****
   శాస్త్రి గారూ,
   'ఆంధ్రభారతి' కోసం ఎక్కడికో వెళ్ళే పని లేదు. మన బ్లాగులోనే కుడివైపు 'లింకులు' అన్న వర్గంలో 'ఆంధ్రభారతి - నిఘంటుశోధన' అన్న లింకు క్లిక్ చేస్తే సరి!

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారు:

   ఈ సుళువును శ్రీయుతులు కామేశ్వర రావు గారే సూచించి యుండిరి. కానీ ఆరు నెలల క్రితం నేను శంకరాభరణం లో ప్రవేశించినప్పటికే laptop వాడుట మానివేసియుంటిని. నా Android Samsung smart phone లో ఎంత వెదికినా లింకులేవీ కనిపించ లేదు. ఈరోజు laptop మరలా తెరవగానే అద్భుతమగు లింకులన్నీ విరబూసినవి. ధన్యవాదములు!!!

   తొలగించండి
  6. శాస్త్రి గారూ,
   ఆండ్రాయిడ్ ఫోనులోను ఆంధ్రభారతిని చూడవచ్చు. బ్లాగును తెరచి, పేజీకి క్రింద ఉన్న 'వెబ్ సంస్కరణలను చూడుము' అన్నదానిని క్లిక్ చేయండి. మన డెస్క్ టాప్ లేదా లాప్ టాపులో కనిపించే విధంగానే శంకరాభరణం పేజీ కనిపిస్తుంది. కుడివైపున లింకుల్లో ఆంధ్రభారతి కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి.

   తొలగించండి
 17. ఇరవని జాటు మార్గమును నెంచుకు బోవుచు నుండగా నటన్
  గరుడుని చూచి నంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్ర మూర్తియై
  పరమ విరోధి దానగుట పాము భయంబును నొంది యత్తఱి
  న్న రయగ సాజమే గద వినమ్రతగాను జరించు టి ధ్ధరన్


  రిప్లయితొలగించండి
 18. చరియించు సతము తనపై
  వరియించు నరుదుగ నన్ను వాహనముగనే
  పరివారమున ఘనుడనుచు
  గరుడుని హరి జూచినంత గ్రక్కున మొక్కెన్

  హరి = కోతి ఇచ్చట హనుమంతుడు

  రిప్లయితొలగించండి
 19. పరగడుపున చెరలాడుచు
  హరిమ్రింగగ హుంకరించి హాయన బోవన్
  తరుముకు వచ్చిన తనరిపు
  గరుడుని హరి జూచినంత గ్రక్కున మొక్కెన్!

  మొదటి హరి కప్ప, రెండవ హరి పాము!

  రిప్లయితొలగించండి
 20. శరవేగమ్మున వాసవు
  గురి జేయుచు తల్లి వినతకు నమృతమిడ భీ
  కరమగు రణమున నెగ్గిన
  గరుడుని హరి చూచినంత! గ్రక్కున మ్రొక్కెన్
  (హరి = ఇంద్రుడు).

  మరణమె మదిలో మెఱయును
  గరుడుని హరి చూచినంత! గ్రక్కున మ్రొక్కెన్
  శిరమును వంచుచు నా శ్రీ
  హరిని గనిన పక్షిరాజు హర్షము తోడన్!
  (హరి = పాము).

  రిప్లయితొలగించండి

 21. వరమయ నాకిది! వరదా!
  ధరనేలెడి నిన్ను, నేను తరియించుటకై
  సరమ గొనక మోయుదునను
  గరుడుని, హరి జూచినంత గ్రక్కున మ్రొక్కెన్!

  సరమగొను=శ్రమించు

  రిప్లయితొలగించండి
 22. కరికుల నాధు చేయు మొర కైటభవైరి యెరింగి వెంటనే
  పరుగులు దీయుచున్ జనెను భక్తుని బ్రోవగ, విష్ణు వెంటనే
  పరుగిడు శంఖ చక్రముల, భార్యను లక్ష్మిని, వాహనంబ గా
  గరుడుని చూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై

  రిప్లయితొలగించండి
 23. హరి,హరులుగలసినప్పుడు
  గరుడుని హరిచూచినంత గ్రక్కున మ్రోక్కెన్|
  మరువని మర్యాదలతో
  పరమేశుని హారమైన పామే విధిగా|
  2.కరుణ కటాక్ష వీక్షణల కామిత సిద్ధికి రూప కల్పుడౌ
  హరుడొక నాడు శ్రీహరి సహాయము గోరియువెళ్ళ?వెంటనే
  గరుడుని జూచినంత హరి గ్రక్కున మ్రొక్కె-వినమ్రమూర్తియై|
  ఎరుగరు వైర మెప్పుడును యేలెడి వారి సమక్ష మందునన్| {హరి=పాము}

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కరుణాకటాక్షము' అనడం సరియైనది.

   తొలగించండి
 24. హరిహరు లిద్దరు కలిసిరి
  సరదాగాముచ్చటాడి సమయము గడపన్
  హరికే ప్రణమిల్లె హరుడు
  గరుడుని హరిచూచినంత గ్రక్కున మ్రొక్కెన్

  హరి=పాము


  అరయగ పక్షివాహనుని యార్తిగ గొల్చిన భక్తకోటినే
  వరములనిచ్చి బ్రోచు, ఖగవాహనుడందురు వాస్తవమ్మదే గదా
  శరణము నీవెనంచు గరి సంకటమందున వేడగా ప్రభున్
  త్వరపడి వెళ్ళబోయి తన దాపున యుండిన వాహనమ్మె యౌ
  గరుడుని చూచినంత హరి, గ్రక్కున మ్రొక్కెను వినమ్రుడై

  రిప్లయితొలగించండి
 25. సరగున రమ్మని బిలువగ
  గరుడుని హరి, జూచినంత గ్రక్కున మ్రొక్కెన్
  సురుచిరసుందరరూపుడు
  పురుహూతికి భక్తితోడ భుజగాంతకమే!!!


  రిప్లయితొలగించండి
 26. వరముల చేత దైత్యుఁడు జవంబున దుష్టకరత్వ కార్యముల్
  జరుపఁగ నీవెదిక్కనుచు చక్రిని వేడఁగ నిర్జరాళి యీ
  శ్వరుని, దలంచి తాను హిమశైలము బోయెను చీరబంచి యా
  గరుడుని, చూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 27. వరమున బుట్టి తల్లికి నుపాస్తి దొలంగ సురా కరీర మం
  త రయమునన్ హరింప సురతాణి శతారము వేయ నంత స
  త్వ రమొక యీక మాత్రమె విదల్ప గ్రహించి బలాఢ్యుడంచు నా
  గరుడుని చూచి నంత హరి గ్రక్కు న మ్రొక్కె వినమ్ర మూర్తియై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 28. నరునిగ హరి నిల మెలగుచు
  ధరణిజ కై పెనగులాడ దశకంఠునితోన్
  హరిపాశము విడిపించిన
  గరుడుని హరి జూచినంత గ్రక్కున మ్రొక్కెన్

  నా తమ్ముడు రవికిరణ్ తాతా చేసిన పూరణ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రవికిరణ్ తాతా గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హరి యిల' అనండి.

   తొలగించండి
 29. కరి విడిపింపబోవ , వెనుకన్ సిరి, శంఖముఁజక్రమున్ గదన్
  గరుడుని జూచినంత హరి., గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై
  యురగవిరోధి " సేవకుడనో మధుసూదన ! నీకు నేను , న..
  న్నరయక బోవ భావ్యమగునా? కరుణింపు" మటంచు పల్కుచున్ !!

  మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 30. బరువగు నీదు రెక్కలను బారెడు జాపగ మూర్ఛవచ్చెనే
  తిరమగు నీదు చూపులును తీక్ష్ణపు గోరులు భీతిగొల్పెనే
  చురుకగు నీదు ముక్కునహ చూడగ గుండియ లాగునంచు నా
  గరుడుని చూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై

  హరి = పాము

  రిప్లయితొలగించండి