5, మార్చి 2017, ఆదివారం

సమస్య - 2300 (స్త్రీలకు మ్రొక్కిన ధనమును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్" 
లేదా...
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో)

83 కామెంట్‌లు:

  1. కాలము మారెను లలనల్
    బేలలు కారింక గౌరవించు పురుషుడా
    భూలోకపు దేవతలీ
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పునరాగమనం ఆనందదాయకం. సంతోషం!
      భూలోకపు దేవతలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. శ్రీ లక్ష్మి ధనము నిచ్చును
    శ్రీ లలితకు మ్రొక్క నిచ్చు శ్రేయము సుఖముల్
    మేలిమి తల్లులు సతులగు
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ధన శ్రేయాల నిచ్చే లక్ష్మీపార్వతుల ప్రస్తావనతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  3. కాలరు నెగరే యకనిక
    డాలరు యెన్నులును పౌండ్లు ఢమఢమ లాడే
    వాలెట్లు పాకెటులు గల
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      సంపన్నురాలైన స్త్రీల వల్ల ప్రయోజనాన్ని తెలుపుతున్న మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. డాలరు మోజున వనితలు
    కాలము తోపరుగు లిడుచు కలవర పడగన్
    విలువల మాటున మమతల
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యగారూ మూడవపాదారంభం గురువు పడలేదనుకుంటా

      తొలగించండి
    2. అవునుకదా ధన్య వాదములు .ఈమధ్య మతిమరుపు ఎక్కువ ఐపొఇంది .పెద్ద ఐపోయాను కదా
      ----------------------------------
      డాలరు మోజున వనితలు
      కాలముతో పరుగు లిడుచు కలవర మందున్
      చాలని విలువగు ప్రేమల
      స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్

      తొలగించండి
    3. అక్కయ్యా,
      ప్రేమ గల స్త్రీని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. శీలవతు లౌచు వ్రతముల
    మేలౌ పతిసేవ యంచు మేదినిలో నే
    కాలము చరియించెడి యా
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్.

    మేలగు నోము లన్నిటను మేదిని లోపల భర్తృ సేవయే
    కాలము మారనేమి యని గట్టిగ నమ్ముచు నాత్మ నాథునిన్
    శీలమె భాగ్యమై వెలుగ జేరుచునుండు గుణాఢ్యలైన యా
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      సచ్చీలవతుల గురించిన మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    నేలకుగల యోపికకై
    బాలల ప్రభవంపు భారవహ వేదనకై
    మేలు, పతివ్రత దీక్షకు
    స్త్రీలకుమ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    నేలను దేవతల్ గలుగ నింగిని జూడకు పూజ జేయగా
    పాలను జేరదా పెరుగు భవ్య ఘృతంబును,గాచి చూడు పా
    పాలను జేయ వారియెడ భద్రత నీ జగమందు గాన వా
    స్త్రీలకుమ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి,ఆర్యా, కృతజ్ఞతలు.

      తొలగించండి


  8. బాలకుమారా! వినుమో
    యీ ! లోలకము వలె తిరుగు యింతుల కున్నూ
    మాలోకంబై చుట్టెడు
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'ఇంతులకున్నూ' అనడం వ్యావహారికం. '...యింతులకు కడున్। మాలోకంబై..' అనండి.

      తొలగించండి
  9. కూలీలు నమ్రు లౌచును
    వాలిన మర్యాదతోడ భాగ్య విధాతల్
    మేలొన రించరె యని మే
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ 'మేస్త్రీల' పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి


  10. బాలకుమార! లోలకపు పాటిగ తానగుచూ ధనమ్ము సం
    చాలన మెల్ల గూర్చి సహ చర్యము గాను‌ జిలేబి బోలు నా
    రీ,లవ లేశ మైన తను రీఢము గాన క సేవ గానెడున్
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
      'తానగుచున్' అనండి.

      తొలగించండి
  11. మేలిమి చేతల లేమలు
    వీలుగ ధర్మాచరణను వీడక నెపుడున్
    మేలును దలపోయుదు రా
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్

    రిప్లయితొలగించండి
  12. మేలిమి చేతలన్, ముదము మెండుగ పొందగ సంప్రదాయమున్
    వీలుగ ధర్మరక్షణను, వీడక బంధుజనాళి క్షేమమున్
    దేలుచు భక్తివార్దినురు దీప్తిని, కోరుచు లోకరీతి నా
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గునిద్దరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వీడక' అన్నది కళ. కనుక 'వీడక యెపుడున్' అనండి.

      తొలగించండి
  13. మాలిన్యంబులనంటని
    స్త్రీలకుమ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్
    బాలా! వినుమా యరయగ
    గేలమునకు దొరక రట్టి గృహిణులు మనకున్

    రిప్లయితొలగించండి
  14. శీలము గల్గు పూరుషులు జీవితమందున భక్తి తోడ శా
    ర్దూలము నెక్కి యున్న వనదుర్గను గొల్చెడి రీతి మేటి ప
    ద్మాలను కూర్చి, జన్మ నిడి ధన్యతఁ గూర్చిన మాతృమూర్తులౌ
    స్త్రీలకు, మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ తాతా గారూ,
      మాతృదేవతను గురించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.

    ఏ లోపము లేకుండగ

    సాలోచనగా కుటుంబ సంక్షేమముకై

    కీలకముగ పని చేసెడు

    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముగల్గున్.

    **********************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      కుటుంబ సంక్షేమ కారిణి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  16. రిప్లయిలు
    1. కాలానుగుణము నవనీ
      పాలామ్నాయ గురుజన కృపారస సుర స
      జ్జాల సురుచిర విశాలా
      స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్

      [అస్త్రీ+ఇల = అస్త్రీల: అస్త్రి “న” కారాంత పుంలింగము
      అస్త్రి : అస్త్రమును ధరించిన వాడు, ఇల : భూమి: అస్త్ర ధారి యొక్క భూమి.
      “అస్త్రధారి (విష్ణువు) యొక్క భూమి ని గొల్చిన” అను నర్థమును తీసుకొన వచ్చును.]


      శైలము నందు జన్మమట సత్వర మాయుమ శంభు పత్నినిం
      బాల సముద్ర మందు నట పన్నుగ శ్రీసతిఁ గంజ పత్నినిన్
      మేలగు భక్తి నుంచి మది మిన్నగ శక్తి రమా సరస్వతీ
      స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ మొదటి పూరణ నారికేళ పాకమే. ముగ్గురమ్మలను ప్రస్తావించిన రెండవ పూరణ మధురంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      మొదటి పూరణ నారికేళ పాకమన్నారు కనుక నా భావమును దెలియ పరచుట భావ్యమని తలచి వ్రాయు చున్నాను. కృతకృత్యుడ నైతినో లేదో తెలుప గోర్తాను.

      సందర్భానుసారముగా రాజ సమూహమును, పెద్దలను, దయామయులైన దేవతా బృందమును, యోగ్యము పరంధాముని భార్య యైన భూదేవిని పూజించిన శుభములు కల్గును.


      తొలగించండి
  17. కాలము లేవైన నిలను
    వేలుపు లింతులె గృహమున విత్తము గూడన్
    మాలిమి తోడను తమతమ
    స్త్రీలకు మొక్కిన ధనమును శ్రేయము గల్గున్!

    రిప్లయితొలగించండి
  18. వేలుపులే వారలిలను
    కాలానుగుణముగ ఋణము, కామిత మివ్వన్
    పాలకులు కోశముల కా
    స్త్రీలకు మొక్కిన ధనమును శ్రేయము గల్గున్!


    అరుంధతీ భట్టాచార్య, చందా కొచ్చర్ వంటి బ్యాంకు అధికారులకు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు (రెండవది వైవిధ్యంగా ఉంది) బాగున్నవి. అభినందనలు.
      అన్నట్టు... ఈమధ్య గుఱ్ఱం జనార్దన రావు గారు బ్లాగులో కనిపించడం లేదు. కారణం?

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్కారము! జనార్దనరావుగారి విషయం నాకు తెలియదు!
      నేను జి. పి. శాస్త్రి గారి సోదరిని!

      తొలగించండి
  19. మూలపు ముగుర౦బికలౌ
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్
    పాలింతురు పోషింతురు
    లోలో లీనమ్ము జేసి లోకము లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      ముగురమ్మలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. మేలగు జ్ఞానమిడు నొకతె
    యాలిగ పతినంటియుండు నతివ యొకతెయున్
    మేలిమి బంగార మొకతె
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      ముగ్గురు స్త్రీమూర్తుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. బాలకుమారి వింటివిగ భాస్కరు సెప్పిన నాపతి వ్రతా
    స్త్రీలకు మ్రొక్కినన్ధనము శ్రేయము శౌర్యము గల్గు నిధ్ధరన్
    స్త్రీలను జూడగా దగును శ్రీలిడు దేవత వోలెనెప్పుడు
    న్మేలగు నప్పుడే మనకు మేదిని బాగుగ నుండ వీలగున్

    రిప్లయితొలగించండి
  22. లీలా విలాసినులెగద
    శ్రీలును శీలమ్ము ధైర్య క్షేమమ్ములకున్
    మూలము, శ్రీత్రయములె యౌ
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్


    శ్రీలకు మూలమెవ్వరన జెప్పిరి పెద్దలు లక్ష్మియంచు, స
    చ్చీలము నిచ్చు విద్దెలకు శ్రీకర కారిణి భారతాంబయే
    శ్రీలలితేగదా జనుల చింతలు దీర్చెడు మాతయంచు నా
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      దేవీత్రయాన్ని గురించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'లలిత+ఏ' అన్నపుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. 'శ్రీలలితాంబయే జనుల...' అనండి.

      తొలగించండి
  23. గురువుగారు దయచేసి నా నిన్నటి పూరణ జూడగోరెదను!
    ఆ వాణికి మునిమనుమడు
    పావన పౌలస్త్యవంశ పాలన శ్రేష్ఠున్
    బ్రోవగ యనుపమ దశరధ
    రావణునకు బుత్రుడయ్యె రాముడయోధ్యన్!


    రావణుడు=గొప్పధ్వని చేయువాడు
    దశరధ రావణుడు= పది రధములు నడుపుతూ గొప్ప ధ్వని పుట్టించువాడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణలోని 'లాజిక్కు' బాగున్నది. మంచి పూరణ. అభినందనలు.

      తొలగించండి
  24. ………………………………….
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కూలీలు వినయమున మే

    స్త్రీలకుమ్రొక్కినధనమునుశ్రేయముకలుగున్

    కూలీ జనముల యెడల దు

    రాలోచన మున్న మేస్త్రి , య౦దడు వృద్ధిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మేస్త్రీలపై మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  25. స్త్రీలు సమస్త లోకజన శిష్ట గరిష్ఠ పటిష్ట సంపదల్
    స్త్రీలె గదా పవిత్ర వర సేవిత లాలిత మాతృమూర్తు లా
    స్త్రీలె గదా త్రిమూర్తులకు తేజము,శక్తి నొసంగు వారలా
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము ,శ్రేయము,శౌర్యముఁ గల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
  26. మాలల వైభవ లక్ష్మికి
    శీలముగ నలంకరించి చేసి వ్రతము, తాం
    బూళమొసఁగి ముత్తైదువ
    స్త్రీలకు, మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      ముత్తైదువలతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. శ్రీలలితకు మ్రొక్కంగా
    స్త్రీలకు సౌభా గ్యమెల్ల చేకూరునిలన్
    శ్రీలక్ష్మి యొసగును కలిమిని
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము కలుగున్.

    మేలగు నోముల నెల్ల స
    కాలము నందున సతతము ఘనముగ చేయన్
    మేలగు వరముల నొసగెడు
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము శీఘ్రమె కలుగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోదరీ.. డా. బల్లూరి ఉమాదేవీ!
      రెండు మూడు రోజులుగా ఒకటే ఆలోచన... ఈ సోదరుని మీద అలిగారా అని! ఈమధ్య తరచుగా బ్లాగులో పద్యాలు వ్రాయడం లేదు. ఆమధ్య మీరు రాత్రి పొద్దు పోయిన తర్వాత మీ పూరణలను పోస్ట్ చేయడం, అప్పటికే నేను నిద్రపోవడం, మరునాడు గతదినం పోస్ట్ చూడక పోవడం ఎక్కువసార్లు జరిగింది. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే మన్నించండి.
      ఈనాటి మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మ్రొక్కంగా' అంటే వ్యావహారికం. 'మ్రొక్కంగన్' అనండి. మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువయింది. '..యొసగు కలిమిని (లేదా) ..యొసగును కలిమి' అనండి.

      తొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మొన్నటి పూరణ::

    ఏపారిరి సుచరితలై
    తాపము లెన్నియొ భరించి తరుణు లిరువురున్
    ప్రేపు నయోనిజలౌ యా
    ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే

    నిన్నటి పూరణ:

    దావరియగు నా యింద్రజి
    రావణునకు బుత్రు డయ్యె; రాముడయోధ్యన్
    కైవడి గూడిన నరునిగ
    రావణ వధకై జనించె రంజన మిడగన్

    నేటి పూరణ:

    వాలకమగు గుణములతో
    శీలముగల నిలువడి నిల చెలగెడి ధ్రువలై
    డాలించెడి వారగునౌ
    స్త్రీలకు మొక్కిన ధనమును శ్రేయము గలుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ప్రేపు...? దానికి ఉషఃకాల మని నిఘంటువు చెప్తున్నది.

      తొలగించండి
  29. కాలపరీక్షల కోర్చుచు
    మేలగు పరిశోధనలను మీరిన తెలివిన్
    మేలిమి ఫలముల నిడు శా
    స్త్రీలకు మొక్కిన ధనము శ్రేయము గూర్చున్


    శాస్త్రీలు=శాస్త్ర వేత్తలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసింపదగినది. పద్యం వరకు నిర్దోషంగా బాగున్నది. కాని 'శాస్త్రి'కి బహువచనం 'శాస్త్రులు' అవుతుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు!🙏🙏🙏🙏

      తొలగించండి
  30. మేలగు పూజలు చేసిన
    కాలానుగుణమగు మేలు కలుగనిచో నా
    బేల కడు భక్తిని పుని
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      పుణ్యస్త్రీలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పుణ్యస్త్రీ.. పునిస్త్రీ అని రూపాంతరంగా చెప్పినా అది సాధువు కాదు. బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువుల్లో ఉన్నా అది కేవలం వ్యావహారికం అని గమనించండి. 'బేల కడు భక్తి పుణ్య।స్త్రీలకు...' అనండి.

      తొలగించండి
  31. కోలాహలపు ధనికులను
    గాలమ్ముల బట్టి తిరుగుచు కారులన న్నీ
    కాలపు రణగొణపణ "శా
    స్త్రీ"లకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పద్యం భావం బోధపడలేదు. రెండవ పాదంలో ఒక లఘువు ఎక్కువయింది. 'అన్నీ' అనడం వ్యావహారికం. 'అన్నియు' అనడం గ్రాంధికం. గమనించగలరు.

      తొలగించండి
    2. నిజమే! ఒక లఘువు ఎక్కువైనది. "నన్నీ కాలపు = నన్ + ఈ కాలపు". నా భావము ఈ కాలపు పురోహితుల వైభవము ఎనలేనిది అని. పాపాలు ఎక్కువైతే పూజలకు డిమాండు కూడా!

      __/\__

      తొలగించండి
  32. బిల్డర్ల గురించి
    మేలైన యిల్లుకట్టుట
    కాలస్యమ్మైన వేళ కరమగు భక్తిన్
    కాలాతీతమడగ మే
    స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్

    రిప్లయితొలగించండి
  33. మేలగుపూజనమ్ములను మిక్కిలి శ్రద్ధగ నాచరించినన్
    కాలము వెక్కిరించగ విఘాతములెన్నియొ గాసిబెట్ట తా
    త్కాలిక కీడు కోలుపడ దానవవైరి భజించి దేవతా
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మేస్త్రీలు, దేవతా స్త్రీలు ప్రస్తావింపబడిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  34. శ్రీ సి.వి.సబ్బన్న, శతావధానుల ఆత్మకు శాంతిచేకూరవలెనని ప్రార్థిస్తూ


    జబ్బ చరిచి పిలచితిరో
    యబ్బుర పరచెడు కవిత్వమబ్బిన సీవీ
    సుబ్బన్నను దివిజ కవులు?
    నిబ్బరముగ వారి గెల్చి నేలకు దిగడే!

    రిప్లయితొలగించండి
  35. స్త్రీలే సిరిసంపదలై
    స్త్రీలే మనరక్ష గూర్చు చైతన్యులిలన్|
    స్త్రీలన?దేవత మూర్తులు
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును,శ్రేయముగల్గున్|
    2.స్త్రీలన?అమ్మలక్కలును,చింతను బాపెడి భార్య,చెల్లియల్
    స్త్రీలన బాధ్యతాయుతమె చేరువ జేసెడిశక్తి యుక్తులే|
    స్త్రీలన లక్ష్మి,పార్వతులు,చిన్మయ తత్వపువాణి వాక్కులే|
    స్త్రీలకుమ్రొక్కినన్ ధనము,శ్రేయము శౌర్యముగల్గు నిద్ధరన్|

    రిప్లయితొలగించండి
  36. మూలపు టమ్మల రూపులు
    మేలిమి బంగరు నెలతలె మేదిని యందున్
    తాలిమి గలిగిన వారౌ
    స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్!!!

    రిప్లయితొలగించండి
  37. శ్రీలక్ష్మిని బూజించుచు
    చేలము గాజులను బెట్టి చిన్మయముగ తాం
    బూలము పండ్లిడి పుణ్య
    స్త్రీలకు,మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్!!!

    రిప్లయితొలగించండి
  38. శ్రీలనొసంగు శ్రీని హృది జేర్చెను శ్రధ్ధగ కౌస్తుభుండు యు
    న్మూలము జేయు రుద్రు డటు యోలమునన్ ధరియించె మాతన
    న్నాలిని దాల్చె నాల్కపయి నాత్మభవు౦డను సత్యమున్ గనన్
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిధ్ధరన్

    రిప్లయితొలగించండి
  39. కాలరు నెత్తుచున్ తిరిగి కన్నెలు బ్యాంకుల మోయుచుండిరే
    డాలరు లెన్నియో పడసి ట్రంపును కాల్చుకు తించునుండిరే
    పాలన జేయుచున్ మురిసి వంగిన కాంగ్రెసు నేలుచుండిరే...
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి