23, ఆగస్టు 2018, గురువారం

సమస్య - 2770 (కదలనివాఁ డిల్లు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్"
(లేదా...)
"కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

89 కామెంట్‌లు:



  1. మెదలడు యులకడు పలుకడు,
    వదలక నమ్మిన నతడిని వరదుండగుచున్
    హృదయపు దీపంబగుచున్
    కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మెదలడు + ఉలకడు' అన్నపుడు యడాగమం రాదు. "మెదలం డులకడు" అనండి.

      తొలగించండి
  2. సదమలహృదయుడు జనులకు
    నదనెంచుచుమేలు సేయు నాతడు ఘనుడున్
    మదిలో స్వార్థపు దిశకయి
    కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్.

    రిప్లయితొలగించండి
  3. సదయుడు కరుణాలోలుడు
    ముదముగ శ్రీరాము డఖిల మునిజన హితుడా
    పదలనుఁగాచెడు దేవుడు
    కదలని వాడిల్లుఁజేర్చె కానని వానిన్

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ

      సమస్యాపూరణం...

      కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్"

      ఇలుఁ గాననివాని = దేహాత్మభావం తొలగినవానిని...

      కదలని వాడు... స్థాణువు.. స్థిరుడు.. శాశ్వతుడు.

      హృదయమునందు నిల్చి, కలిగించు చరాచరజీవకోటికిన్
      కదలికనీశ్వరుండతడె గాంచి యొసంగును ముక్తి మ్రొక్కుచో !
      తుదకు " పరాత్పరా " యనుచు తొండమునెత్తి భజింపగా కరిన్
      కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. డా. పిట్టా సత్యనారాయణ
    తమ కాళ్ళపై తాము నిలిచే యుక్తి నేర్పక ప్రభుత్వపు సాయములతో ప్రగతి సాధ్యం కాదు.
    చదివిన చదువకపోయిన
    సదమలమౌ స్వావలంబ సాధనలేవీ?
    ఇది యివ్వ నదియు నడుగగ
    కదలనివాడిల్లు జేర్చె గాననివానిన్

    రిప్లయితొలగించండి
  6. కదలనివాడు నద్యతనకాలము సర్వముఁ జేయఁ జాలెడిన్

    గదలకనే ప్రదేశములఁ గాంచు తదంతరజాలదృష్టితో

    పదపడి ; యట్లు నొప్పు చరవాణిలొకేషను సాయమొందచున్

    కదలనివాడు సేర్చె , నిలు గానని వానిని విభ్రమంబునన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'సాయమొందుచున్' టైపాటు!

      తొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    సదమల తత్త్వమున్నెరుగు సాయము జేయు ప్రభుత్వమేది?"రా!
    ఇదొగొను మిప్పుడిత్తునిక నింకొకటిత్తును నన్నె నెన్నగన్"
    అది యిది నన్ని యిచ్చినను నక్కడి గొంగళి నక్కడే గనన్
    కదలనివాడు సేర్చెనిలు గాననివానిని విభ్రమంబుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నన్నె నెన్నగా। నది యిది యన్ని యిచ్చినను..." ఆనండి.

      తొలగించండి


  8. మెదలడు పల్కడే యనక మెంగెపు వాడిని నమ్మ గా నతం
    డుదయపు సూర్యు డై యితవరుండగు! డుంగని వాడు సూక్ష్ముడా
    కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్
    చెదరని ప్రత్యయమ్ము మన చెంగట గావలె నంత యే సుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మదిలో శంభుని రూపము
    పదిలముగా నిల్పి సతము భజియింప గన్
    ముదము న భక్తుని యతడే
    కదలని వా డిల్లు జేర్చె గానని వానిన్
    _______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భక్తుని నతడే' అనండి.

      తొలగించండి


  10. మన తెలుగు బ్లాగ్ లోకపు తీరుతెన్నులు :)



    సదనంబందున వ్యాఖ్యల
    కదనము చూడగ జిలేబి కాకులబడియే
    కద! యగు పించె సుమా భళి
    కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. GPS. Navigation with Voice :)


    అదరకు, జీపీయెస్ యిత
    డు! దారిని తెలిపెడు వాడు! డుంగుచు తానై
    కదలక కదలన కదుపుచు
    కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులు!

    [గ్రుడ్డివానినిఁ గుంటివాఁ డిలు సేర్చిన విధము]

    కదలనివాఁడు మోదమునఁ గాంచని యంధుని స్కంధ మెక్కియున్
    వదలక యింటి బాట నడుపంగను వాంఛయె తీరునంచు నా
    యదనున గ్రుడ్డివాఁడుఁ జనె నధ్వమునన్ మునుముందు; కిట్టులా
    కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్!

    రిప్లయితొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2770
    సమస్య :: కదలని వాఁడు సేర్చె నిలుఁ గానని వానిని విభ్రమంబుగన్.
    కదలలేని వాడు కళ్లు లేని వానిని ఇంటికి చేర్చినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర అనే ప్రబంధంలో ప్రవరుని కథ ఉంది. సిద్ధు డిచ్చిన పాదలేపనం మహిమ వలన హిమాలయములకు చేరుకొన్న ప్రవరుడు మంచువలన పాదలేపనం కరగిపోగా తిరిగి ఇల్లు చేరుకొనే దారి ఉపాయం కానలేక కన్నులున్నా గ్రుడ్డివాని పరిస్థితి ఏర్పడగా తనను ఇంటికి చేర్చమని అగ్నిదేవుని ప్రార్థించినాడు. వాయువు తోడుగా లేకపోతే కదలలేని వాడైన వాయుసఖుడు (అగ్నిదేవుడు) ఆ ప్రవరుని క్షేమంగా ఇంటికి చేర్చినాడు అని విశదీకరించే సందర్భం.

    ‘’ఇది హిమవన్నగమ్ము, కనిపించదు మార్గము, హవ్యవాహనా !
    కదలగలేను, లేపనము గానను, కానను కన్నులున్న, నీ
    యదనున బ్రోవు’’ మన్న ప్రవరాఖ్యుఁ గృశానుడు గాలి లేనిచో
    కదలని వాఁడు సేర్చె నిలుఁ గానని వానిని విభ్రమంబుగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-8-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. విభ్రమంబునకు అద్భుతముగా "కోటిచ్చిన" కోట వారికి నమో నమః


      జిలేబి

      తొలగించండి
    2. సహృదయులు శ్రీ జిలేబి గారికి ధన్యవాదాలు.

      తొలగించండి
    3. శ్రీయుతులు శ్రీ కృష్ణ ప్రసాద్ గారికి ప్రణామాలు.

      తొలగించండి
    4. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  14. సవరణతో
    గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2770
    సమస్య :: కదలని వాఁడు సేర్చె నిలుఁ గానని వానిని విభ్రమంబుగన్.
    కదలలేని వాడు కళ్లు లేని వానిని ఇంటికి చేర్చినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర అనే ప్రబంధంలో ప్రవరుని కథ ఉంది. సిద్ధు డిచ్చిన పాదలేపనం మహిమ వలన హిమాలయములకు చేరుకొన్న ప్రవరుడు మంచువలన పాదలేపనం కరగిపోగా తిరిగి ఇల్లు చేరుకొనే దారి ఉపాయం కానలేక కన్నులున్నా గ్రుడ్డివాని పరిస్థితి ఏర్పడగా తనను ఇంటికి చేర్చమని అగ్నిదేవుని ప్రార్థించినాడు. వాయువు తోడుగా లేకపోతే కదలలేని వాడైన వాయుసఖుడు (అగ్నిదేవుడు) ఆ ప్రవరుని క్షేమంగా ఇంటికి చేర్చినాడు అని విశదీకరించే సందర్భం.

    ‘’ఇది హిమవన్నగమ్ము, తెరు వింతయు గానను, హవ్యవాహనా !
    కదలగలేను, లేపనము గానను, కానను కన్నులున్న, నీ
    యదనున బ్రోవు’’ మన్న ప్రవరాఖ్యుఁ గృశానుడు గాలి లేనిచో
    కదలని వాఁడు సేర్చె నిలుఁ గానని వానిని విభ్రమంబుగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-8-2018)

    రిప్లయితొలగించండి
  15. సదమలవృత్తితో మెలగు
    సన్నుతుడౌ ప్రవరాఖ్యు డెంతయున్
    హృదయపువేదనన్ దనను
    దృప్తుని జేయగ స్తోత్రమంజరిన్ ;
    బదనుగ నగ్నిహోత్రుడును
    భద్రుడు ; భక్తుల గుండెనుండియున్
    గదలనివాడు ; సేర్చె నిలు
    గానని వానిని విభ్రమంబుగన్ .

    రిప్లయితొలగించండి
  16. కార్తికపురాణంలో శత్రుజిత్తు అనే రాజకుమారుని కథానుసారము:

    చదువగ నా పురాణముల సారము నెంచగ, కార్తికమ్మునన్
    వదలక దేహవాంఛలను వారిజనేత్రను వెంటతోడ్కొనిన్
    ముదమును బొందగా గుడిని ముచ్చటగా వెలిగించె దీపమున్
    *"కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్"*

    కదలనివాడు = స్థాణువు, రుద్రుడు
    ఇల్లు = కైలాసము
    కాననివాడు = కామాంధుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోడ్కొనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "తోడు రాన్। ముదమును..." అనండి.

      తొలగించండి
  17. వదరును తల లేకున్నన్,
    యిది విఠలార్యుని కిజెల్లు,నెన్నియొ వింతల్,
    కదలడు వదలడు నందున్
    కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్"

    తల లేని వాడు మాట్లాడుట కదల లేనివాడు ఎగురుట కనులు లేని వాడు చూచుట ఇవి అన్ని విఠలాచార్యుని సినిమా (కదలడు వదలడు నందమూరి , కాంతారావు నటించిన ) లో మాంత్రికుని గుహలో చూడ వచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేకున్నన్ + ఇది' అన్నపుడు యడాగమం రాదు. "తల లేకయె తా। నిది..." అనండి.

      తొలగించండి
  18. బెదరుచు గమ్యము గానక
    వెదకు తన హితుని మొబైలు విజ్ఞానముతో
    గదిలో కూర్చొని యిల్లే
    "కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్"
    ****)()(****
    ఇది స్వానుభవము.కొన్ని సంవత్సరాల క్రితం బెంగుళూరులో ఒక మిత్రని యింటికి వెళ్ళవలసి ఉంది.కారులో బయలుదేఱినాము.చిరునామా ఉంది.మొబైల్ ఉంది కానీ GPS గురించి బొత్తిగా తెలియదు. ఆమిత్రుడే మేమున్నచోటు గుర్తిస్తూ GPSసాయంతో మొబైల్ ద్వారా యింటినుండే మార్గ నిర్దేశనం చేస్తూ తన యింటికి చేర్చినాడు.

    రిప్లయితొలగించండి
  19. వదలక సతతము శ్రీహరి
    పదములపై వ్రాలి పరమ పదమును గోరన్
    సదమల మతినే మెచ్చుచు
    కదలని వాడిల్లు జేర్చె గానని వానిన్

    కదలని వాడు .....శ్రీహరి
    ఇల్లు.........ఇచ్చ
    పరమపదాన్ని ఇంతవరకు కనలేని వాడు భక్తుడు.

    రిప్లయితొలగించండి
  20. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    కదలని వాడు సేర్చె నిలు
    గానని వానిని విభ్రమంబుగన్
    =======================
    కదదలలేని వాడు జడ సమానుడు,
    చూడలేని గ్రుడ్డి వాడిని ఆశ్చర్యమని
    పించగ ఇంటికి చేర్చినాడని చెప్పడం
    వెనుక గల అసంబద్దతె సమస్య
    =========================
    సమస్యా పూరణము - 238
    ====================

    కదలని జడమది కదిలె చైతన్యమిది
    విను శృతి వాక్యమిది
    కదలగ అసలు వీలు లేనిది
    అంతటను మరి తానే అయినది
    బ్రహ్మమె జగతినిటు కూర్చెనన
    సంభ్రమాశ్చర్యంబుగన్
    కదలని వాడు సేర్చె నిలు
    గానని వానిని విభ్రమంబుగన్

    ====##$##====

    "తదేజతి తన్మైజతి
    తద్దూరే తద్వదంతికే
    తదంత రస్య సర్వస్య
    తదు సర్వస్యాస్య బాహ్యతః"

    "కదిలే చైతన్యమది కదలని జడమది
    బహు సమీపమది ఎంతో దూరమది
    తానే సర్వస్వమైనది లోపల
    అంతటను వ్యాపించినది వెలుపల "

    (ఈశావ్యాసోపనిషత్తు :5/18 వ మంత్రం )
    (యజుర్వేద అంతర్గతము )

    అంతటను తానై నిండి ఉన్నది ఆత్మ
    లేక బ్రహ్మము, తానును స్థిర పడి ఉన్నది
    అందులోనే అన్న నిజమును చూడలేని
    వాడు గ్రుడ్డి వాడనియే భావము అలాంటి
    గ్రుడ్డి వాడిని కదలలేని వాడు (కదులుటకు
    అవకాశమే లేని వాడు అనగా తాను ఒక
    చోటునుండి మరొక చోటుకు కదలవలెనన్న
    అక్కడ ఖాళీ యన్నది ఉంటేగా,అంతటను
    తానే నిండి నిబిడీకృతమైనవాడు )జీవన
    యానంలో ఇంటికి చేర్చుచున్నాడని
    భావము

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    (శుభోదయం )

    రిప్లయితొలగించండి
  21. పథమును గానక దొరలెడి
    పథికుడు చెలికాడు మూగవానికి తెలుపన్
    కుదురుగ నడపుచు కుత్తుక
    కదలనివాడిల్లు జేర్చె గాననివానిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      స్వవర్గజ ప్రాసలో కేవలం ధ,థ లకు మాత్రమే చెప్పబడింది. మీరు ద,థ లకు వేసారు. నాకు తెలిసినంత వరకు ఇది చెల్లదు.

      తొలగించండి
    2. 🙏🏽 తప్పు తెలుసుకున్నాను ధన్యవాదములు🙏🏽

      తొలగించండి
  22. కదలనివానిట్లనుటను
    కదలనివానివాడిల్లుజేర్చెగాననివానిన్
    సదయనుజేర్చుటవింతయె
    మదికిన్సంతోషమయ్యెమాన్యా!కంటే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో 'వాని' అదనంగా టైపు చేశారు.

      తొలగించండి
  23. మదిలో మెదలనియూరది
    పదపదమని రూపురేఖ బంచగ సెల్ఫోన్
    కదలుచుకారున వెళ్లగ
    కదలని వాడిల్లు జేర్చె గాననివానిన్!

    రిప్లయితొలగించండి
  24. వదలి సుగమ్యమార్గమును , బ్రాప్తినియోజితసాధనమ్ములన్

    గుదురుగ దుర్వ్యయంబు నొనగూరిచి , తత్ఫలభుక్తిఁ గ్రుందగన్

    హృదయగతుండు నా గతివిహీనుని శ్రీహరి బ్రోవ నట్లుగా

    కదలని వాడు సేర్చె నిలుఁ గానని వానిని విభ్రమంబునన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. వదలక యోగము ధ్యానము
    మెదపక పెదవిని తపమున మెలకువ తోడన్
    వెదకగ నాత్మను చింతను
    కదలని వాడిల్లు జేర్చె కానని వాడిన్

    కదలని వాడు = స్థిరమగు నాత్మ
    కానని వాడు = మనస్సు ( కనబడని వాడని)( మోహాంధుడు యని)
    తురీయావస్థలో మనస్సు ఆత్మలో లయమవు తుందని పెద్దల ఉవాచ

    రిప్లయితొలగించండి
  26. మదవతిఁ వెంట బెట్టుకుని మల్లెల తోటకు చేరినంత కౌ
    ముదమని కాంత వక్షమది బుధ్నుడటంచు దలంచి కొల్వగా
    మదనరిపుండె మెచ్చెనట మాలిమి తోడ వరమ్మునిచ్చుచున్
    కదలని వాడె చేర్చెనిలు గానని వానిని విభ్రమంబుగన్

    రిప్లయితొలగించండి
  27. ముదముగ వెంబడించె తన ముద్దుల ప్రేయసి ముందు సాగగా
    ముదుసలి గ్రుడ్డివాడొకడు మూల్గుచు నుండగ వానినింటిలో
    వదలెదవా యనంగ చెలి ప్రాపకమొందగ బండిలేక తా
    *"కదలనివాఁడు, సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్"*

    రిప్లయితొలగించండి
  28. ఎదనువసించునాశివుడుహేశివయంచునుబిల్వయాతడే
    కదలనివాడుసేర్చెనిలుగాననివానినివిభ్రమంబుగ
    న్గదలికగల్గినాభవుడుకన్నులజల్లగజూచుచోనిక
    న్గదలనివాడుజేర్చుటనుగాననివానినివింతగాదుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బిల్వ నాతడే... కల్గి యా భవుడు..' అనండి.

      తొలగించండి
  29. కదలక శివుడు జగమునను
    మదాంధులకు గోరి వేడ మరి ముక్తినిచ్చు
    కదలక మోక్షము నొసఁగఁగ
    కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర తప్పక గురువుండాలి కదా! "మరి ముక్తి నిడున్" అనండి.

      తొలగించండి
  30. వదలక పట్టి తనను జం
    పుదురని యెంచి మనమందుఁ బోయిన వానిన్
    బెదరి వడి యొకండు జనుల
    కదలని వాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్

    [జనులకు + అదలని = జనుల కదలని; కానని వాఁడు =కనిపించని వాఁడు]


    చదివితి వీవు మెండుగను జాలి యొకింతయుఁ బుట్ట దేల నీ
    హృదయము నందు నంచు సఖు లెల్లరు తన్నటఁ గిన్కతోడుతన్
    గదుమఁగ భీత మానసుఁడు కర్కసుఁ డన్యుల యార్తి కెన్నడుం
    గదలని వాఁడు సేర్చె నిలుఁ గానని వానిని విభ్రమంబుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. పోచిరాజు వారు ప్రయోగించారంటే అది సమంజసమే. అయినా అడుగుతాను, సున్న తో పాదం ముగించి వ్రాయవచ్చునా? అది అన్ని వేళలా అమోదమేనా? (వదలక పట్టి తనను జం...). సందేహం తీర్చగలరు.

      తొలగించండి
    4. క.
      తిలలును నీళ్ళును వస్త్రం
      బులుఁ బుష్ప సుగంధ వాసమున సౌరభముం
      బొలు పెసఁగఁ దాల్చుఁ గావున
      నలయక సత్సంగమమున నగు సద్గుణముల్‌. ......భార. ఆర. 1. 6.


      చ.
      పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులుఁ దోడ రా మహీ
      సురవరులెల్లఁ బాండునృపసూనులయొద్దకుఁ బ్రీతి నేఁగుదెం
      చిరి బహువేదఘోషములఁ జేసి నిరస్త సమస్త కిల్బిషో
      త్కరు లగుచున్న ధన్యులు జగత్పరిపూజ్యులు బ్రహ్మసమ్మితుల్‌. ......భార. ఆర. 1. 11


      ఇచట వస్త్రంబు లో సహజ బిందువు; సౌరభముం బొలు పెసఁగఁ లో సంధిగత బిందువు పాదాంతముల నున్నవి కదా! తప్పు లేదు. అట్లే యేఁగు దెంచిరి.
      పాదాంతమున పదచ్ఛేదముల కంభ్యంతరము కొందఱు చెప్పినను కవిత్రయము వారి ప్రబంధ కవుల ప్రయోగములు పెక్కు గలవు.

      దానము మున్నగు పదముల ము వర్ణమునకు పూర్ణ బిందువు వాడరాదు.

      తొలగించండి
  31. పదవిని గానక నటునిటు
    మెదలుచు తోడైన మూగమిత్రకు తెలుపన్
    కుదురుగ నడపుచు కుత్తుక
    కదలనివాడిల్లు జేర్చె గాననివానిన్

    పదముల గానని విదునికి
    పదిలముగ తిరమగు యాంధ్రభారతి చూపన్
    కుదురుగ పద్యము వ్రాయగ
    కదలనివాడిల్లు జేర్చె గాననివానిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మిత్రకు'...? 'తిరమగు నాంధ్రభారతి' అనండి.

      తొలగించండి
  32. మెదడుకు మేత:

    ద్వ్యక్షర పదక్షయీకృత
    కుక్షి క్షేమంకర వర గోత్ర క్షిప్త
    త్ర్యక్షర వాచ్య క్షిత్యా
    భ క్షాంత మనో రుచి ప్రభావిత సతియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గమనిక:
      సంఖ్యాపర గుణ వర్ణనము రామాయణాది సనాతన కవిత్వ వైచిత్ర్యము.

      తొలగించండి
  33. మదమెక్కి సంచరించుచు
    హృదయము పాషాణమైన వృజినుని మదిలో
    మదనారి చేర సెసలకు
    కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్

    రిప్లయితొలగించండి
  34. అదిగొ హిరణ్య రేతుడట నాకసమందున నిశ్చలుండునై
    ముదమున కౌముదీ పతిని ముచ్చట గొల్పగ వెల్గజేయుచున్
    తుదకు కృపీటపాలమును ద్యోతక మౌనటు చేయు వానికిన్
    *కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్*

    రిప్లయితొలగించండి
  35. పదిలము హృదయము నెమ్మిని
    వదలక నీవణచి యుంచి వాంఛిత ములనే
    సదమల హృదయము నిండిన
    కదలనివాఁ డిల్లు జేర్చెఁ గానని వానిన్

    రిప్లయితొలగించండి
  36. పది దినముల్ వసింప తన బావ గృహమ్మున కేగె కారులో
    కదిరికి రామమూర్తి వెనుకం జని యుండమి జేరి యూరికిన్
    వెదుకగ నిల్లు బావ చరవేదిని జూపెను దారి గుమ్మమే
    కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్.

    ( చదివేది ని మొబైల్ అనేభావంలో వాడేను)

    రిప్లయితొలగించండి
  37. కదలక వెదలక సతతము
    సదనము నందున వసించు సాధకు డిలలో
    ముదమున నంధుని గనియా
    కదలని వాడిల్లు చేర్చె కానని వానిన్.

    రిప్లయితొలగించండి
  38. పదములు గూర్చుచు బిల్డరు

    కదలను జెప్పుచు నభమున కట్టెను మేడల్!

    చదువరి! ఇది యెట్లన్నన్:

    "కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్"

    రిప్లయితొలగించండి
  39. వదరుచు "నేను నాది"యని వందల వేలను లెక్కపెట్టగా

    ముదరగ కష్ట నష్టములు మూసిన గంతలు వీడిపోవగా

    తుదకిక "నీవు నీదె” యని తుంటరి చేష్టలు కట్టిపెట్టగా

    కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్

    రిప్లయితొలగించండి
  40. Calmpose 5 mg:

    కుదురుగ నుండదీ మనసు గ్రుడ్డిది కుంటిది పిచ్చిపిచ్చిగా
    పదిపది దార్ల పర్వులిడి భళ్ళున నేడ్వగ గుండెబాదుచున్
    పొదుపగు మాత్ర చాలుగద బుధ్ధిని కూల్చుచు నిద్రపుచ్చుటన్:👇
    "కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్"

    రిప్లయితొలగించండి