13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3131 (జనకుని సేవించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్"
(లేదా...) 
"జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్"

36 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  వినయము విద్య నేర్వకయె విత్తము నందున ప్రీతినొందుచున్
  మనమున పాపభీతియును మాన్యత లేకయె మంత్రియై భళా
  ధనమును ధాన్య రాశులను దాచగ పేదల యిండ్లు కూల్చెడిన్
  జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  ప్రహ్లాదుడు...

  జనకుని ధిక్కరించెదొ ! నిశాచరవైరిని బ్రస్తుతించెదో !
  వినుముర బాలకా ! యనగ వే మరి నవ్వుచు ముజ్జగాలకున్
  జనకుడనంగ శ్రీహరియె ! సద్గురులార ! సతమ్ము భీతితో
  జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 3. కం.
  జననీ జనకులు తనకును

  తనువునిడి చదువును నేర్పి దారిని చూపన్

  కనివినలేనీ వాక్యము

  "జనకుని సేవించు సుతుడు చను యమపురికిన్ "

  రిప్లయితొలగించండి
 4. మునుపటి హిరణ్య కశిపుగ
  అనిశముహరిలేడనంచు అరిచెడుతండ్రిన్
  కనికరముదాల్చి దలచుచు
  జనకునిసేవించు సుతుడు చనుయమపురికిన్.

  రిప్లయితొలగించండి
 5. ఘనమైన కీర్తి నందడె
  జనకుని సేవించు సుతుడు, చను యమపురికిన్
  జననీ జనకుల దూరుచు
  మనుగడ సాగించు పాపి మహిలో గదరా!

  రిప్లయితొలగించండి


 6. నా పూరణ. చం.మా.
  ***** *** ***

  వినుమయ! సుంత కూడను వివేచన విద్యలు లేక యుండి తా

  ననయము సజ్జనాళికిని హానినె సల్పుచు నక్రమంబునన్

  ధనమును గూడగట్టుచును ధారుణ కృత్యమొనర్చు దుష్టుడౌ

  జనకుని సేవ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి


 7. అనుకొనకిక కష్టమనుచు
  జనకుని సేవించు! సుతుఁడు చను యమపురికిన్
  వినకున్న నాదు పల్కుల
  తనరన్ జీవితము లోన తరమిక కాదోయ్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి

 8. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తినుచును మంత్రి మండలిని తిప్పల తిప్పల మానికమ్ములన్
  కినుకను మోడిఁ దిట్టుచును క్రిందను మీదను కోర్టులందునన్
  ధనధన వాగి వాగి విధి తప్పక దిల్లిని జైలు జేరెడిన్
  జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్

  రిప్లయితొలగించండి
 9. ధనమదిగొప్పదేయనుచు,దారినివీడెడు నట్టినేతలే
  అనయము వారె మేలనుచు ఆశ్రయమందెడు నట్టి పుత్రులే
  కనికరమేమిలేకనటు , కర్కశ కార్యము లెన్నొజేయునా
  జనకుని సేవజేయుతనుజాతుడు,రౌరవమంది చింతిలున్.

  రిప్లయితొలగించండి
 10. సమస్య :-
  "జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్"

  *కందం**

  అనుకొనగా యేరీతిగ
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్?
  జననీ జనకుల సేవిం
  చిన నుత్తమ గతులు గల్గి చేరును దివమున్
  ......................✍చక్రి

  రిప్లయితొలగించండి
 11. వినయము వీధికెక్కుటయె ,వీనుల విందనిజెప్పు తండ్రులా
  తనయులబెంచురీతదియు ,ధన్యతనందగ జేయదెప్పుడున్
  పనితనమేమిజూపకనె, పాడగురీతినబెంచునట్తి నా
  జనకుని సేవజేయుతనుజాతుడు,రౌరవమంది చింతిలున్.

  రిప్లయితొలగించండి
 12. 🙏శుభోదయం🌺

  మన బడులందున కరువవ
  ఘన నీతి విలువ లికపయి,కఠినులు గారే
  తనయులు, దలుపుదుఁ రీవిధి
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్

  రిప్లయితొలగించండి


 13. అనుకొనకోయి కష్టమని నావల నీవల‌ చూడ కోయి పా
  వనమగు నీదు జీవితము వర్ధిలు! సౌఖ్యము పొందు మెండుగా
  జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు, రౌరవ మంది చింతిలున్
  వినక వివేకమున్ గనక విచ్చలమై నడువంగ నాతడే!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. కనునట సురపురి తదుపరి
  జనకుని సేవించు సుతుఁడు, చను యమపురికిన్
  వినకను తండ్రుల విడిచిన
  ధనమును దానమొసగినను తప్పవు నిడుముల్!

  రిప్లయితొలగించండి
 15. ధనము గృహమ్ము సొమ్ము వితతమ్మగు భూమి సమస్త మెట్లు నా
  కొనర నధీనమౌనొ! యను నోర్మి నశించిన దుష్టకాంక్ష, నే
  దినమునఁ జచ్చునో! యనుచు ధిక్కరణీయనిరీక్షఁ జేయుచున్
  జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్.

  రిప్లయితొలగించండి
 16. నిన్నటి పూరణ.

  యే విశ్వాసము నెట్టి ధర్మమ ననుష్ఠించున్ నరుండట్లు నే
  దైవమ్మున్ భజియించునో తనరి తద్ధర్మమ్మె శ్రేష్ఠమ్మునౌ
  చావైనన్ దగు నందు మేలుఁ, పర భీసందేహధర్మాశ్రయ
  ద్దైవమ్మున్ గొలువంగ రాదనిరయో ధర్మజ్ఞులున్ యోగులున్.

  రిప్లయితొలగించండి
 17. అనయము ప్రేమ లు పంచుచు
  మునుకొని ప్రత్యక్ష దైవ ములు గను గనుచున్
  వినయము న మెల గ నెట్టుల
  జనకుని సేవించు సుతుడు చను యమ పురికి న్?

  రిప్లయితొలగించండి
 18. ధనమునకై పదవులకై
  తన పర భేదములు లేక తప్పుడు పనులన్
  జనులను వేధించు చెనటి
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్

  రిప్లయితొలగించండి
 19. ఘనమగు కీర్తిని బొందును
  జనకుని సేవించు సుతుడు,చను యమపురికిన్
  తనువును శాశ్వతమనుకొని
  యనయము పాపంబుసేయ నవివేకమునన్

  రిప్లయితొలగించండి
 20. వినయము నయములను వదిలి
  అనునయమను మాటనసలు హృది నెఱుఁగక తా
  తనయుడనను మాట మరచి
  జనకుని సేవించు సుతుడు చను యమపురికిన్

  రిప్లయితొలగించండి
 21. జననీజనకులను వదలి
  తన కాస్తియె సర్వమనుచు, దండితనము లే
  క నతి వినయమున భార్యా
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్

  రిప్లయితొలగించండి
 22. చనుతా నాకంబునకును
  జనకుని సేవించు సుతుఁడు, చను యమపురికిన్"*
  ననయము హితమును చెప్పిన
  వినక తిరిగెడు తనయుండు విధిగా తుదకున్

  రిప్లయితొలగించండి
 23. వినువీడునకే తప్పక
  జనకుని సేవించుసుతుడు చను, యమపురికీన్
  జనుమాతాపితలనునిల
  ననయము బాధించునతడు నార్యా!వింటే?

  రిప్లయితొలగించండి
 24. అనయము కూతురు శనియని
  యనగూడనిమాట లనుచు నంతము చేయన్
  వినయముతో నా తుంటరి
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్

  రిప్లయితొలగించండి
 25. తన తండ్రిని సేవించెడి
  తనయుండీ లోకమందు ధన్యుడు గాడే?
  కనగానా ప్రహ్లాదుని
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్ !

  రిప్లయితొలగించండి
 26. వినుముర పొందుపుణ్యమును వేయివిధంబులుగాగ నీభువిన్
  జనకునిసేవజేయుతనుజాతుడు,రౌరవమందిచింతిలు
  న్ననయము మాతృదూషణము నచ్చతెనుంగున జేయునాతడున్
  వినయముతోడ మాతృపిత భేదములేకను గౌరవించమేల్

  రిప్లయితొలగించండి
 27. దనుజుఁడుగుణముల ధూర్తుడు
  తనుజుడు తనతండ్రిహితముదలపడుమదిలో
  కనికరమన్నదియెరుగక
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్

  రిప్లయితొలగించండి
 28. కనలేదా పెక్కుర ఱే
  లను చెఱసాల నిడి యన్నల నిలఁ బ్రజా పా
  లన జనుల, వధించి తనదు
  జనకుని, సేవించు సుతుఁడు చను యమపురికిన్


  కని విని నేర నట్టి విధిఁ గాంతలఁ గారల నుంచి వారినిం
  గనికర మించు కెంచకయుఁ గర్కశ రీతి తపించఁ దండ్రి, తా
  ముని సుర సంచయమ్మునకు ముప్పులు వెట్టెను గాన, నింద్రజి
  జ్జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్

  రిప్లయితొలగించండి
 29. అనయము మద్యపానమున నాలిని దన్నుచు తిట్టుచుండెడిన్
  పనియును పాటలేకనె యవాంఛితశక్తుల గూడియాడుచున్
  ధనమును మానమున్విడచి దారనుపుత్రుల హింసబెట్టెడిన్
  జనకుని సేవజేయ దనుజాతుడు రౌరవమంది చింతిలున్

  రిప్లయితొలగించండి
 30. ననుగని, నీతులు నేర్పి, అ
  నునయము, విద్యావినయము నూర్పితి వంచున్
  అనయమునే యుండెడి యే
  జనకుని సేవించు సుతుడు చను యమపురికిన్?

  రిప్లయితొలగించండి
 31. కనగను కన్నతండ్రి ఖలు కర్మలు సేయగ నేమి భక్తితో
  ననిశము సేవఁ జేయమని యాద్యులు పూర్వమె చెప్పిరందురే
  వినయము వీడి యివ్విధిని ప్రేలుచు నుంటివి న్యాయమౌనె యే
  జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్ ?

  రిప్లయితొలగించండి
 32. అనయము తల్లిదండ్రులనునార్తిగగొల్చుచునాదరించుచున్
  వినయవిధేయతల్ గలిగి పెద్దల సేమము జూడమేలగున్
  కనికరమేమిలేక కడు కర్కశచిత్తముగల్గి మెప్పుకై
  జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్

  రిప్లయితొలగించండి
 33. వినుమిది సత్యమేయనుచు,వీధులవింపడు రీతిజెప్పెగా!
  తనువదశాశ్వతమ్మనుచు,తండ్రులు జెప్పెడు, నీతిసూత్రమున్
  వినబడి తండ్రి తీరునిక ,వేరని నమ్మగ మోసగించు , దు
  ర్జనకుని సేవజేయుతనుజాతుడు,రౌరవమంది చింతిలున్.

  రిప్లయితొలగించండి
 34. తన వారలతో కడు మ
  న్ననగొని నిరతము పలుకెడి నైజము లేకన్
  జనమెప్పుకు నాటకముగ
  జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్.

  రిప్లయితొలగించండి
 35. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  జనకుని సేవించు సుతుఁడు
  చను యమపురికిన్

  సందర్భము: సాందీపని వద్ద విద్య పూర్తియైన కృష్ణుడు గురుదక్షిణ గా గురు పుత్రుని యమలోకంనుంచి తెచ్చి యిచ్చా డనే కథ.
  దేవకి ఒకసారి సాందీపని ఆశ్రమానికి వెళ్ళి "నా సుతు డేడి? ఏం చేస్తాడు రోజూ? ఈ రో జేం చేస్తాడు?" అని ప్రశ్నల వర్షం కురిపించింది.
  గురువు గారి సోదరుని కొడుకు "మా జనకుని సేవిస్తాడు. నీ సుతు డీ రోజేమో యమలోకానికి వెళుతాడు." అన్నాడు.
  "ఎందు?" కన్నది దేవకి కంగారుగా.. "చనిపోయిన గురుపుత్రుని తీసుకురావడానికి.." అని చెప్పి.. చెప్పిందే చెప్పటం అలవాటైన ఆ పిల్లవాడు మళ్ళీ ఇలా అన్నాడు..
  "జనకుని సేవించు.. సుతుఁడు చను యమపురికిన్"
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "దినదిన మే మొనరుచు? నీ
  దినమున సుతు డేమి చేయు?
  దెలుపు" మనగ బ
  ల్కెను గురు సోదరజుడు "మా
  జనకుని సేవించు.. సుతుఁడు
  చను యమపురికిన్"

  అన "నెందుల?" కనె దేవకి..
  "చనిపోయిన గురు తనయుని
  సరగునఁ దేగా.."
  నని.. వాడు మరలఁ బలికెను
  "జనకుని సేవించు.. సుతుఁడు
  చను యమపురికిన్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  13.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి