27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3145 (ఏనుఁగు చంపనోపునొకొ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చంపఁగలదె యేనుంగు మూషకమునైన"
(లేదా...)
"ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్"
(డా. వెలుదండ సత్యనారాయణ గారు పంపిన సమస్య)

40 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  కానగ నాల్గు మార్లచట కాంగ్రెసు గెల్వగ చిత్తుచిత్తుగా
  సోనియ తోడుగా చనుచు స్రుక్కక వీడక పోరుచుండినన్
  చాన యిరానినిన్ గెలువ చాలడె శూరుడు రాహులయ్యరో!
  ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  మానుము! తాకబోవకుము! మాదకవస్తువులన్ సహోదరా !
  బానిసవౌదురా ! బతుకు బండలునౌనుర ! శక్తియుక్తులున్
  హీనములౌనురా ! గన మహిన్ మదమత్తత లేవలేనిచో
  నేనుఁగు చంపనోపునొకొ ? యెల్కఁ గడుంగడు విక్రమించినన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 3. మైత్రి కరుణ భావనలను మదిని నింపి
  చిత్త వృత్తుల సంయమ చేయగలుగు
  యోగ సూత్రము పాలించి యుండు నపుడు
  చంపగలదె యేనుంగు మూషకమునైన

  రిప్లయితొలగించండి
 4. నిపుణుడైనట్టి శిల్పియే నిష్ఠ తోడ
  చెక్కెఁ రాతితో నేనుగు శిల్ప మొకటి
  యదిగని యెగతాళిగ వాని నడిగె నొకడు
  చంపఁగలదె యేనుంగు మూషకమునైన

  రిప్లయితొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కానగ బక్క పీన్గు వలె, కాళ్ళకు పాతవి చెప్పులూనుచున్,
  పూనుచు చేతికర్ర, బహు ముద్దుగ కట్టుచు పుట్టగోచినిన్,
  దీనుడు గాంధి తాత భళి దింపెను నవ్వుచు చక్రవర్తినిన్!
  ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్?

  రిప్లయితొలగించండి
 6. చంప దగిన శత్రువు తన చెంత చిక్క
  పొసగి మేలునే జేయుము పొల్లు బోక
  యనుచు సూక్తుల నేర్చిన పిదప కూడ
  చంపగలదె యేనుంగు మూషకమునైన

  రిప్లయితొలగించండి


 7. బ్రహ్మ రాతను మీరుచు భరణి పైన
  చంపఁగలదె యేనుంగు మూషకమునైన,
  చావ గలదె చంపంగను చావు గడియ
  లవియె రాని తరుణమున లలిత బాల!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. (ధర్మగజేంద్రుడు భీష్ముడు-అధర్మమూషికం అంబ . ఐనా
  ఆ మూషికాన్ని ఈ గజేంద్రుడు ఏమీ చేయలేడు . చిత్రం ! )
  కానగరాని బింకమున
  కాశికరాజు కుమార్తె అంబయే
  కానల కేగి యీశ్వరుని
  గాఢతపంబున మెచ్చజేయుచున్
  దాను శిఖండిగా వెడలి
  ధర్ముడు భీష్ముని గూల్పనెంచెగా ;
  ఏనుగు చంపనోపునొకొ
  యెల్క ? గడుంగడు విక్రమించినన్ .  రిప్లయితొలగించండి


 9. యానము పంచభూతముల యావళి బ్రహ్మయె చేర్చె రాత గా
  దానిని మీరుచున్ భువిని దాడిని చేయుచు నెంత యైన నా
  ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్
  కేనము లెన్ని చేయను వికీర్ణత గాంచునొకో శరీరమే?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. సాననుబట్టరత్నమయి ,సాహసమందున శక్తిమంతుడన్
  పూనిక మాదిగొప్పదని పూనకమొచ్చిన యట్లు వాగుచున్
  తాననతందనానయని ధన్యతజెందెడు పాకుప్రధానియీ
  ఏనుగు జంపనోపునొకె యెల్క గడుంగడు విక్రమించినన్ .

  రిప్లయితొలగించండి
 11. తానొక వీరుడా యసలు ? ధన్యునిజేయున పాక్కుదేశమున్!
  ఏనుగుబోలు భారతిని ఏదశనైననుగెల్వగల్గునా?
  పీనుగువంటి సైన్యమది ,పీచమణంచగ తప్పదింక ,మా
  ఏనుగు జంపనోపునొకె ?యెల్క గడుంగడు విక్రమించినన్ .

  రిప్లయితొలగించండి
 12. మందు సారాల దాగుచు మాన కుండ
  ముందు వెనుక జూడక మత్తు మునిగి నపుడు
  యెంత బలమున్న నేమి చేయంగ లేవు
  చంపగలదె యేనుంగు మూషకమునైన

  రిప్లయితొలగించండి
 13. ఉత్పలమాల
  కూనడు నాకు మూషికము గూల్చెద దాన నటంచు కంసుడున్
  బూనిక నందబాలకుని మూర్ఖతఁ బిల్చి కరంబుఁ జాచినన్
  దానవ వైరి చిక్కునె? మదంబునఁ గాయము పెద్దదైనఁ దా
  నేనుగు చంపనోపునొకొ యెల్కఁ? గడుంగడు విక్రమించినన్!

  రిప్లయితొలగించండి
 14. శివుని యనుమతి లేనిదే చీమ యైన
  కుట్ట నేరద దెవ రి ని కోప మూని
  చంప గలదె యేనుంగు మూషక ము నైనఁ
  న ను ట తగ దందు రార్యు లీ యవని యందు

  రిప్లయితొలగించండి

 15. ... శంకరాభరణం... . 27/09/2019 ......శుక్రవారం

  సమస్య:

  యేనుగు చంపనోపునొకొ యెల్క గడుంగడు విక్రమించినన్

  నా పూరణ.
  ***** ***

  నేనెవరో యెరుంగుదువె?నేను గజాస్యుని వాహనమ్మునే!

  కానను రాకుమా దరికి కాదని వచ్చిన కచ్చితమ్ముగా

  హీనపు చావు తప్పదన;హెచ్చుగ భీతిని జెంది నట్టి యా

  యేనుగు చంపనోపునొకొ యెల్క గడుంగడు విక్రమించినన్


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 16. దంతి ముఖమును చక్కగ తన ముఖముగ
  చేసి యెలుకపైన విహరించెడి గణపతి
  తలపున మెదల నామది తలచెనిటుల
  చంపఁగలదె యేనుంగు మూషకమునైన

  రిప్లయితొలగించండి
 17. మానిని యేనుగొక్క కరిమాచలమున్ బరిమార్చెడి ఘోర దృశ్యమున్
  దానట గాంచి భీతిలగ ధైర్యముఁ జెప్పుచు భర్తయిట్లనెన్
  గానలలో జరించు కరి కాదిది, శిల్పము గాంచుమోయి య
  య్యేనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్.

  రిప్లయితొలగించండి
 18. ఎట్టియాపదలొదవిన నేమియైన
  ఆయువున్నంత కాలమీ యవని యందు
  చంపఁగలదె యేనుంగు మూషకమునైన
  చంపబడువారలెవ్వరు చంపునెవరు?

  రిప్లయితొలగించండి
 19. చంపగలదె యేనుంగుమూషకమునైన
  జంపగలదయ్య చిటికలోజంతువులను
  కాళ్ళతోడను ద్రొక్కుచు గరముతోడ
  గిరగిరగ ద్రిప్పిచంపును హరినిదప్ప

  రిప్లయితొలగించండి
 20. జంబుకమ్ము చంపఁ గలదె జటిల రాజు
  వాలమును జంపఁ గలదె మార్జాల మెంచఁ
  బెన్నరుని మిన్నఁగఁ గలతం బెట్టు పేను,
  చంపఁగలదె, యేనుంగు మూషకమునైన

  [ఏనుఁగు = పెద్దది]


  స్థాన బలమ్ము మిన్న నిజ సత్త్వము కన్నను నిశ్చయమ్ముగన్
  మీనుల కంబురాశియ యమేయ బలమ్ము నభమ్ము పక్షికిం
  గానక పర్వు పర్వులిడి గ్రక్కునఁ దూఱఁగఁ గ్రంత లోన న
  య్యేనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్

  రిప్లయితొలగించండి
 21. ఏనుగుచంపనోపునొకొయెల్కగడుంగడు విక్రమించినన్
  వీనులవిందుగాగనముద్విరదమయ్యదిమూషకాదులన్
  బూనికతోడజంపుటకుపోడిమిలేదను నార్యుపల్కులన్
  గానము,మూషకంబునదికాలనుద్రొక్కుచుజంపునేసుమా

  రిప్లయితొలగించండి
 22. ఏనుగు లూత పన్నగములీశ్వరు గొల్చుచునుండునత్తరిన్
  యేనుగు తుండమందుజనియెంతయునంకిలివెట్టెలూత తా
  న్యూనమెయైన నాకృతిని యుల్లము దైవముపైననూన్చియున్
  ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్?

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఖరుని దయతో డడరిన మృకండు సుతుని
  కాలు డేమియు జేయలేక వెను దిరిగె
  ఈశ్వరుని యండ యున్నచో నెప్పుడైన
  చంపగలదె, యేనుంగు మూషకము నైన

  రిప్లయితొలగించండి
 24. చంపగలదె యేనుంగు మూషకమునైన
  నేను గణపతికి సవారి, నీవు నన్ను
  చేయ లేవేమి యీసారి! చెప్పె నెలుక!
  మనము యింటికి, మనకథ కంచి కీను!

  రిప్లయితొలగించండి
 25. శివుని యాజ్ఞ లేక జనదు చీమయైన
  చంపఁగలదె యేనుంగు మూషకమునైన
  బలము గలదని గర్వించు వారికైన
  నెగుడు తాకగ భక్తుల నీడనైన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శివుని యాజ్ఞ లేక జనదు చీమయైన
   చంపఁగలదె యేనుంగు మూషకమునైన
   బలము గలదని గర్వించు వారలైన
   తాకలేరుగ భక్తుల దలపునైన

   తొలగించండి
 26. తే. భారి కాయముగలకరిబలముగెలువ
  భారి యేయగునేజీవి బ్రతుకు గన్న
  సింగమైనను వెనుజేరి శిరము కొట్టు
  ఇంత బలముగలిగియాకులింపుగతిను
  చంపఁగలదె యేనుంగు మూషకమునైన

  రిప్లయితొలగించండి
 27. తానొక లంకరాజునని, తాహతుమించిన కార్యమెంచుచో
  మానుగజిక్కె హన్మయని,మానము ప్రాణముదీయనెంచగా!
  వానరమూకయొక్కటయి,వారినెదుర్చుచు గూల్చె లంకనే
  ఏనుగు జంపనోపునొకె యెల్క గడుంగడు విక్రమించినన్ .

  రిప్లయితొలగించండి
 28. నేనొక చక్రవర్తినని, నేరముజేసినపాక్ ప్రధానులన్
  కానిదికాకమానదని గర్వమడంచిరి,వీరసైనికుల్
  పూనకమొచ్చి సేనలిక , పూర్తిగగూల్చిరి వారి వాసముల్
  ఏనుగు జంపనోపునొకె యెల్క?? గడుంగడు విక్రమించినన్ .

  రిప్లయితొలగించండి
 29. రిప్లయిలు
  1. నేనొక యప్సరాంగనను ,నెవ్విధినైనను కాంక్ష దీర్చులే
   తానొక మూర్తిమంతుడుగ,ధన్యతజెందగజేయు దేహమున్
   పానుపుపైన పండెదను,పావనమూర్తియె యొప్పుకొన్నచో
   మానము గారవించదగు మానిసి,మానిని కోర్కె దీర్చునా?
   ఏనుగు జంపనోపునొకె యెల్క?? గడుంగడు విక్రమించినన్ .

   [మనుచరిత్ర ఘట్టము మనసున మెదలగా]

   తొలగించండి
 30. శివుని యానతి లేకున్న చీమ యైన
  కుట్టలే దెవరి నటండ్రు కువలయమున
  నటువలె నదెంత బలమున్న నవని యందు
  చంపగలదె యేనుంగు మూషకమునైన

  రిప్లయితొలగించండి
 31. తేటగీతి
  కత్తిఁ జేపట్టి ఖండించఁ గలమె తరువు?
  గొడ్డలిఁగొని కాగితమది కోయఁ దగునె?
  వెంటఁ బడిగూడ పరుగున విక్రమించఁ
  జంప గలదె యేనుంగు మూషకమునైన?

  రిప్లయితొలగించండి
 32. . శ్రీ గురుభ్యో నమః
  శంకరాభరణం-సమస్యాపూరణం
  సమస్య ::
  ఏనఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్.
  సందర్భం :: శివుని మెడలోని సర్పం తన జాతికి విరోధియైన గరుత్మంతుని చూచి ఏమాత్రం భయపడకుండా ఓ గరుత్మంతుడా బాగున్నావా? అని అడుగుతుందట. శివలింగమును శరణు వేడిన మార్కండేయుని యముడు ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి శివుని ఆశ్రయించినది వినాయక వాహనము అగు ఎలుకను ఏనుగైనా సరే ఏమీ చేయలేదు అని చెప్పే సందర్భం.
  పూరణ ::
  స్థాణువు నాశ్రయింప లఘు సర్పముఁ జంపగ లేడు తార్క్ష్యుడున్,
  పూని మృకండుపుత్రు యమమూర్తియు చంపగ నోప, డట్టు లెం
  తేని విరోధ మేర్పడ గణేశుని వాహన సీమ కేగి యే
  యేనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్.
  కోట రాజశేఖర్ నెల్లూరు 27.9.2019

  రిప్లయితొలగించండి
 33. Bitcoin is the popular coin in the crypto world and if you are facing error while making a transaction in the Bithumb account, you can take help and guidance directly from the team of skilled and elite professionals who are there to assist you. All you have to do is call on Bithumb customer support number which is the medium to get in touch with the professionals and you can talk to the team anytime for availing results in nick of time. Starting conversation with the team is a better idea as you can clearly clear all your doubts by discussing to them.

  రిప్లయితొలగించండి