21, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3139 (వచ్చెను మార్గశీర్షమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మార్గశిరమందు వచ్చె నామని పుడిమికి"
(లేదా...)
"వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రి నిండుగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

44 కామెంట్‌లు:

  1. పచ్చని పైర్లు పంటలకు వాసిగ రాగల కాలమాదటన్
    వచ్చెను మార్గశీర్షమున;..భవ్య వసంతము, ధాత్రి నిండుగన్
    ముచ్చట మీర వేములకు పూవులు కొల్లలు పూయగా రహిన్,
    వచ్చును చైత్ర పాడ్యమిని పచ్చడి తోడ నుగాది పండుగన్

    రిప్లయితొలగించండి
  2. ముచ్చట గొల్పు రీతిగను ముత్యము లంటి తుషార బిందువుల్

    పచ్చిక పైన కాంతులిడి భామమొసంగు మనోజ్ఞ కాలమే

    వచ్చెను మార్ఘశీర్షమున, భవ్య వసంతము ధాత్రినిండుగన్

    మెచ్చెడు రీతిగా తలిరు మేతరి కిచ్చెను దివ్య గాత్రమున్.

    రిప్లయితొలగించండి
  3. మెచ్చిరి విజ్ఞులందరిల మెచ్చగ కాలము యెప్పుడొచ్చునో
    పచ్చని కాపురమ్ముననె వచ్చెడుసౌఖ్యము ముద్దు గూర్చగా
    ముచ్చటగొల్పునట్టి మరి మోదముగూర్చగ నంతటన్ గదా
    వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్!!

    రిప్లయితొలగించండి
  4. 🙏శ్రీ గురుభ్యోన్నమః🌺

    సచ్చరితాత్ముడా విరటుఁ సత్కృప గావునటంచు వేడుచున్
    జొచ్చిరి పాండు పుత్రులట చోద్యపు వేషము లెత్తి దాము, తా
    నచ్చెరువొంద యుత్తరయు నర్జును గోడలు నౌట నొప్పుచున్
    వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్

    రిప్లయితొలగించండి
  5. ఉత్పలమాల

    మెచ్చదు తల్లిగాక నను మేటిగ లోకమటంచు నోర్పుతోఁ
    జొచ్చెను వైద్యశాలఁ గొనఁ జూలును డెబ్బది మించ ప్రాయమే
    పెచ్చుగఁ దల్లియై యమడబిడ్డల నందఁగ లోకమిట్లనెన్
    "వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్!"

    రిప్లయితొలగించండి
  6. నెమ్మదిగ మలయుచు చల్లని పవనములు
    మార్గశిరమందు వచ్చె ; నామని పుడమికి
    వచ్చు చైత్రమా సమునందు, వనము లన్ని
    నిండు వికసించు పూలతో నిశ్చయముగ

    రిప్లయితొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జీవిత యానము:

    పుచ్చిన పండులూడగను ముగ్గుల బుట్టయి శీర్షమాదటన్
    ముచ్చటి తీరు స్వర్గమున మూడెడి కాలము దాపుదాపుగా
    వచ్చెను మార్గశీర్షమున; భవ్యవసంతము ధాత్రి నిండుగన్
    వచ్చును బోసి నోటినహ భళ్ళున నవ్వెడి మన్మరాలుతో!

    రిప్లయితొలగించండి


  8. ఆమని కొమార్తె కాన్పునకై వసతికి
    మార్గశిరమందు వచ్చె నామని పుడిమికి
    కనెను పండంటి బిడ్డను కాన రండి
    యంచు జామాతకిదె లేఖ నంపినాము!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. నచ్చిన కన్యతో తనకు నాయన చేయుచుచునుండె పెండ్లి యే
    మిచ్చిన దీరు దండ్రి ఋణ మింక వధూ మణి చేయి బట్టి తా
    నిచ్చలు ప్రేమ లోకమున నెమ్మి విహారము చేయవచ్చు సూ
    వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రి నిండుగన్.

    రిప్లయితొలగించండి
  10. ముచ్చటగొల్ప, గోద తన ముద్దుల రంగని కోరికోరి వ్రా
    సిచ్చిన ప్రేమలేఖలవి శ్రీతిరుపావయి పాశురమ్ములై
    విచ్చెను !ముద్దుగుమ్మలవె ప్రేమగ గ్రోలగ కోయిలమ్మలై
    వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రినిండగన్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  11. నెచ్చెలి మోము చైత్రమది నేత్రము లందున చిత్రవర్ణముల్
    విచ్చును కోయిలై గళము వేణి మయూరము మేని స్వర్ణమే
    మెచ్చగ చూతసారములు మేలగు గుబ్బలు స్వర్గ సౌఖ్యముల్
    వెచ్చని కౌగిలింతలు నివేదన జేయగ పాన్పులందు హా!
    *వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రినిండుగన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి


  12. అబ్బో మా మనవడు వచ్చె పోయె !


    విచ్చిన మోము చూచుటకు వేకువ ఝామున పిల్లకాకియే
    వచ్చెను మార్గశీర్షమున, భవ్యవసంతము ధాత్రి నిండుగన్
    తెచ్చిన శోభలెల్లగని దిగ్గని కావుమటంచు వేగమై
    వచ్చిన దేశమేగె నను వార్ధక మించుక గూడె మీదుగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. ఆకాశవాణి కి పంపినది


    విచ్చిన మోము వల్లభుని వెంట ప్రయాణము చేసి పొందగా
    నచ్చిక లేని సౌఖ్యము, సయాటల పెన్నిధి, కాన్పు లాడగా
    వచ్చెను మార్గశీర్షమున, భవ్య వసంతము ధాత్రి నిండుగన్,
    తెచ్చిన సంతసమ్మున ప్రతీకగ నిచ్చెను పండు బిడ్డనే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. చిట్టి పాప మా ఇంటిలో నట్ట నడుమ
    కాలి పట్టీల చప్పుడు ఘల్లు మనగ
    వేయి పున్నమ కలిసొక్క వేటు నొచ్చె
    మార్గశిరమందు వచ్చె నామని పుడమికి

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    పచ్చని పంటలన్ ధరణి బంగరుకాంతులనీనుచుండగా
    మెచ్చెను రైతు సంపదలు మిక్కిలి గల్గును ., పౌష్యలక్ష్మి తా
    చెచ్చెరవచ్చెనంచు తలచెన్ మది , గాంచగ వాని కన్నులన్
    వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రి నిండుగన్" !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. ప్రతి పరీక్ష పది తడవ వ్రాస్తె తప్ప
    పాసు అవుతాడనేనాడు ఆశలేని
    అంట్ల వెధవకు బ్యాంకు జా బమర గానె
    మార్గశిరమందు వచ్చె నామని పుడమికి

    రిప్లయితొలగించండి
  17. పచ్చని పెండ్లి పందిరిని వైభవమొప్ప నలంకరింపగన్
    విచ్చిన పూల సోయగము విందొనరింపగ కన్నులన్ గనన్
    అచ్చెరువొంది యందురిటు ఆ రమణీయత మెచ్చుచున్ "భళా
    వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్"

    రిప్లయితొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    మార్గశిరమందు వచ్చె నామని పుడమికి

    సందర్భము: మాహిష్మతీ పురం రాజధానిగా పాలించే చంద్రవంశ ప్రభువు సోమదత్తుడు శత్రువు లంతా కుమ్మక్కై దండెత్తిరాగా యుద్ధములో కొడుకులు మృతినొందగా ఓడిపోయి కట్టుబట్టలతో భార్యతో అడవులు పట్టినాడు. రాణి దేవిక ఎంతో ఊరడించి గర్గ మహాముని ఆశ్రమానికి చేర్చింది. ఐదు నెలలు గడువగా క్రమంగా రాజు పాక్షికంగా కుంటి మూగ చెవిటి తనముల పొందినాడు.
    గర్గుడు శరణాగతుడైన రాజుకు సమస్త విద్యలకు సారభూతమైన హనుమత్ పంచవక్త్ర విద్య నుపదేశించి వ్రత విధానమును కూడా చెప్పెను. రాజు భక్తి శ్రద్ధలతో నాచరించెను. హనుమదనుగ్రహంతో ఖడ్గ సిద్ధి నంది ఒక్క పూటలోనే అవలీలగా శత్రువుల నెల్ల జయించి సంపూ ర్ణారోగ్యవంతుడై మార్గశీర్షమందు తిరిగి రాజైనాడు.
    ఆ సందర్భంలో ప్రజ లీ విధంగా (వసంతం వచ్చినట్టుగా) భావించారు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సోమవంశ భవుండు సోమదత్త విభుండు
    ప్రత్యర్థు లోడింప రాణిగూడి
    గర్గ మహాముని ఘన కుటీరము జేరె,
    హనుమ న్మహా మంత్రమును కరుణను
    ముని యుపదేశించె, ఘన వ్రత విధి జెప్పె..
    భక్తితో శ్రద్ధతో ప్రభువు చేసె..
    ఖడ్గ సిద్ధి వరించె ఘన విద్విషులఁ దేలి
    కగనే జయించె మార్గశిరమందు..
    "మనకుఁ జక్కని యామని మన నృపుండు
    మనకు దక్కిన యప్పుడే" యనుచు జనులు
    మనమునందున ముదితులై మరల ననిరి
    "మార్గశిరమందు వచ్చె నామని పుడమికి"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    21.9.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  19. విచ్చెను ముద్దబంతులరవిచ్చెగులాబులు, మొల్ల, జాజులున్
    నెచ్చెలి నవ్వుఁబువ్వులును నెమ్మిగ విచ్చె, తుషార బిందువుల్
    పచ్చిక లేఁ జిగుళ్ళపయి భానుని రశ్మికి తళ్కులీన తా
    వచ్చెను మార్గ శీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్

    రిప్లయితొలగించండి
  20. నిచ్చలు ద్రోహచింతనము నీమమెరుంగని వర్తనమ్ముతో
    పచ్చని కొంపగూల్చ వల పన్నిరి దాయలు కాశ్మిరమ్ములో
    చెచ్చెర వారి దౌష్ట్యమును చిత్తొనరింపగ నాయకుండు తా
    వచ్చెను మార్గ శీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్

    రిప్లయితొలగించండి
  21. వరుణ దేవుడు కరుణ తో వర్ష మొ స గ
    వ సుధ వెలిగెను పచ్చ ని పైరు త తు ల
    కను ల వింద గు పూలతో కమ్ర మగు చు
    మార్గశిర మందు వచ్చె నామని పుడమికి

    రిప్లయితొలగించండి
  22. (బంతిచేమంతుల పరిమళాలతో , గోదాదేవి పాశురాలతో.,
    అయ్యప్ప భక్తికీర్తనలతో హేమంతంలో వసంతం వచ్చింది.)
    విచ్చిన పూలగుండియల
    వీచెడి చల్లని పిల్లగాలితో ;
    హెచ్చిన రక్తిమై రమణు
    లెందరొ పాడెడి పాశురాలతో ;
    నచ్చెరు వందజేయు ఘను
    డయ్యప గొల్చెడి భక్తకోటితో ;
    వచ్చెను మార్గశీర్షమున
    భవ్యవసంతము ధాత్రి నిండుగన్ .

    రిప్లయితొలగించండి
  23. ఉ.

    నెచ్చెలు లంత జేరి గన నేగిరి వింతల వేధశాలకున్
    ముచ్చట దీరగా మదిని మోదము నిండిన ఉత్సుకంబునన్
    నచ్చట జూడ నాకసము నంతయు దిర్గగ వేగవంతమై
    వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్

    వై. చంద్రశేఖర్
    వేధ శాల=planetarium

    రిప్లయితొలగించండి
  24. పచ్చటియాకుతోమిగులభాసిలువృక్షపుటాకురాలగా
    వచ్చెను మార్గశీర్షమున,భవ్యవసంతముధాత్రినిండుగ
    న్నచ్చపుజీకటిన్దొలగి హారతిబట్టిన గోమలాంగియే
    యచ్చుగ నుండెనాయనగ నందెలు మ్రోయగ నేగుదెంచెసూ

    రిప్లయితొలగించండి
  25. ఈరోజు ఆకాశవాణి లో ...

    రామస్వామి కిడాంబి, హైదరాబాద్

    వచ్చిన మన్మ లందరును బంతుల యాటలు నాడు చుండగా/
    చిచ్చిర పిడ్గు తా వెనక జేరుచు ముద్దులు గుప్పు చుండగా/
    ముచ్చటతోటి తాత కడు మోదము నందుచు తల్లడిల్లగా
    వచ్చెను మార్గ శీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్

    రిప్లయితొలగించండి
  26. వచ్చేవారం ఆకాశవాణి వారి సమస్య...

    చుక్కలు భూమిపై వెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జీపీయెస్ వారి కై ప్రేరణగా పూరణ :)


      మిక్కిలి మోదమొందుచు ప్రమేయము గాంచెను! దీది మోడికై
      చక్కగ కుట్టి కుర్త తను చాటెను మైత్రిని; చూచెనా జశో
      దక్కను నిచ్చె సేలయు! ప్రధానికి వందన మాచరింపగా
      చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్!


      జిలేబి

      తొలగించండి
    2. ఈరోజు చదువబడిన పూరణలలో జిలేబి, చెన్నై, గారిది 2 Down

      తొలగించండి
    3. యాదృచ్ఛికము 2011 నాటి శంకరాభరణ పూరణలు నా కంటబడినవి.
      అప్పుడు కవి కోకిలముల కల క లారావముములు మిన్నంటితే నేడు కవి సంయముల మౌన జపమ్ములు విన్నంటు చున్నవి.

      తొలగించండి


    4. కవి సంయముల మౌన జపమ్ములు !


      జిలేబి

      తొలగించండి
  27. ముచ్చటగొల్పునామదినపుణ్యపుభారతభిన్నసంస్క్రతుల్,
    వచ్చును నూత్నవత్సరమువారికివీరికివిశ్వమం తటన్,
    పచ్చనిపాడిపంటలిటబండ్లనునింపగమార్గశీర్షమై
    వచ్చునుమార్గశీర్షమునభవ్యవసంతముధాత్రినిండుగన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి

    రిప్లయితొలగించండి
  28. అత్త వారింటి కేఁగంగ నతివఁ గూడి
    యాదిఁ బాద ముంచఁగ నెంచి మోద మడర
    నత్త నడకయె చాగఁగఁ దత్తరిల్ల
    మార్గ శిరమందు వచ్చె నామని పుడిమికి

    [మార్గ శిరము = దారి చివర]


    నచ్చిన వానిఁ బెండ్లి నిజ నందన యాడి విదేశ మేఁగి తా
    నచ్చపుఁ దెన్గు వేషమున నాఱవ యేటఁ బదమ్మిడం దమిన్
    మెచ్చఁగ దల్లితండ్రులును మీఱ గృహమ్మున సంతసమ్ము రా
    వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రి నిండుగన్

    రిప్లయితొలగించండి
  29. వాన లధికముకుర్వగ బంటచేలు
    పచ్చ దనమును గలుగుచు వరలుచుండ
    మార్గశిరమందు వచ్చెనామని పుడమికి
    నాయ నునటుల దోచెను నాకనులకు

    రిప్లయితొలగించండి

  30. విచ్చవు ఓష్ఠ్యముల్ విడిగ -వీడిన దంతము లాడు టంటటల్ !
    వెచ్చగ నుండ గోరుదురు -వేడిని నిల్పెడి వస్త్ర ధారణన్!
    పచ్చని మొల్కలేవి? హిమ పాతము నిండె ధరిత్రి తానెటుల్
    వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్ ?

    రిప్లయితొలగించండి
  31. చిచ్చెర కంటివాని శుభ సేవలు కార్తిక మందు సేయగన్
    నచ్చిన వాడు దీక్ష విడి నా హృదయమ్మును మీటినంతనే
    విచ్చె పికమ్ము గొంతు యెరు పెక్కెను లేత చిగుళ్ళ తో తరుల్!
    వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్ !!

    రిప్లయితొలగించండి
  32. వివిధ మొక్కల పెంచుచున్ విక్రయించు
    వనము వెల్లి విరిసె నిండు పచ్చదనము
    తోడ, నదిగాంచి నంతనే దోచె నాకు
    మార్గ శిరమందు వచ్చె నామని పుడిమికి.

    రిప్లయితొలగించండి
  33. Asnreddy
    వెచ్చని పొత్తుకై పతుల వెంపరచేయగ మంచు మెండుగా
    వచ్చెను మార్గశీర్షమున, భవ్య వసంతము, ధాత్రి నిండుగన్
    పచ్చని పండ్ల, పుష్పముల వర్ధిల జేయగ పాదపమ్ములన్
    వచ్చెను చైత్ర మాసమున, స్వాగత మివ్వగ గండుఁ గోయిలల్

    రిప్లయితొలగించండి
  34. పుచ్చెలునేలరాలినవి ,పూర్తిగ చట్టము మార్చ పాక్కుకే

    మెచ్చగ దేశభక్తినట, మేలునొనర్చగ రాష్ట్రసంపదన్

    తెచ్చిరి కొత్తచట్టమును,తేటగ ,కోనల శాంతినింపగా

    వచ్చెను మార్గశీర్షమున భవ్య వసంతము ధాత్రినిండగన్.

    రిప్లయితొలగించండి
  35. మెచ్చెడు భక్తిభావనలు, మేలుగ నింపగ జీవవాహినిన్!
    నచ్చినరీతిగా ప్రజలు, నాణ్యముగానిక సాగవారికై
    తెచ్చిరి గొప్పచట్టమును,తేటగ శాంతిని నింప రాష్ట్రమున్
    వచ్చెనుమార్గశీర్షమున,భవ్యవసంతము ధాత్రిమెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  36. నెచ్చెలి వచ్చులేయికను,నేత్రపు పర్వము నింపనెంచుచున్
    వెచ్చనియూర్పు తగ్గునిక వేదికతానయి ప్రేమనింపగా
    నచ్చినరీతినాదరికి,నామెయె వచ్చు వసంతయామినై
    వచ్చెనుమార్గశీర్షమున,భవ్యవసంతము ధాత్రిమెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  37. ఈరోజు సమస్యా పూరణకార్యక్రమం లో చదివిన నా రెండు పూరణలు
    1) ఉ . దిక్కులు పిక్కటిల్నటుల, ధీటగుకాంతులగాల్టపాసులున్,
    చక్కనితారజువ్వబలు,సందడిగొల్పుచు,చిచ్చుబుడ్లు,భూ
    చక్కర,కాకరొత్తులకు,సాటిమతాబులశోభతోడవన్
    చుక్కలబోలుదీపములు,చొచ్చుకు భూమిన కాంతిజిమ్మగా,
    చుక్కలు భూమిపైవెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్.

    2) ఉ. చిక్కని చీకటిన్నడువ ఛీయని పించెనుపాతకాలమున్
    ఠక్కనిచీకటేతొలగె,టంగ్స్టనుబల్బును,కన్గొనంగ,నే
    డెక్కడజూచినన్గలవు, యింపగువిద్యుతుకాంతిపుంజ ,మీ
    వెక్కసమేమిజెప్పు, కనిపించవుతారలు,యాకశంబులో,
    చుక్కలు భూమిపైవెలిగె సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్.

    రిప్లయితొలగించండి
  38. వాన లు కురియ నింటికి పంట చేర
    మార్గ శిరమందు వచ్చె నామనియు దరికి
    పాడిపంటలతో మది పరవశించ
    మురిసి పోయెనా రైతన్న పుడమి యందు

    రిప్లయితొలగించండి