20, ఫిబ్రవరి 2020, గురువారం

సమస్య - 3286 (మారెడు కాయలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఊయల గలదు మారేడు కాయలోన"
(లేదా...)
"మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"

59 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


నడిరేయి సరదా పూరణ:

చేరుచు నట్లతద్దియను చెల్లెలి తోడను తోటలోన భల్
మీరిన ప్రీతినిన్ నగుచు మేకును గొట్టుచు త్రాడు కట్టుచున్;...
తీరుగ బీజముల్ పెరిగి తేకువ మీరగ చెట్టు వోలెనున్
మారెడు కాయలోన;...నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై...

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

😊

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

"శివుని మానస పూజ"
(చిత్తంబు శ్రీ వారణాసిలోనుండు;
కాకుంటె నా మనసు కాశిలోనుండు...)

తీరుగ కోవెలన్ జనుచు దేవుని పూజకు తోట జేరుచున్
వీరుని శూరునిన్ మిగుల వెండియు బంగరు నున్నవాడినిన్
కోరుచు భర్తగా శివుని గొల్వగ చెట్టున నూగుచుండెడిన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై...

Zilebi చెప్పారు...



చెప్పవేయమ్మ జో కొట్టి చెప్పు మమ్మ
కథను నేనిదురను తూగ గావలయును
"ఊ! యల గలదు మారేడు కాయ; లోన
వృక్షము కలదు సూక్ష్మమె వృద్ధి గాన"


నిదురపోవలె నిక :)


జిలేబి

Zilebi చెప్పారు...



సోరణి దివ్వె వెల్గుల ప్రచోదిత మాయెను‌ నీలి నీడలే
మారుచు బొమ్మలెల్ల కనుమాయని చేయుచు దోచు చుండగా
ప్రేరిత మానసమందున సరీనృప రజ్జు వికల్పమై సఖీ
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై!


జిలేబి

pks kumar చెప్పారు...

చెట్టు కేమది తాడుతో కట్టు బడెను,

భవుని పూజకొరకు వాడు పత్ర మేమి,

చాటు బడుచుండు నెచట బీజంబు లెపుడు,

ఊయలకలదు, మారేడు, కాయలోన

purushothamarao ravela చెప్పారు...

కోరినకోర్కెదీరుటకు,కొండలరాయనివేడగాజనన్
తీరుగకోర్కె దీర్చుమని,తీపిపదార్ధము వీడజూచితిన్
నేరుగ నట్ల తద్దియని నేనొక చెట్టుకుగట్టియూహలన్
మారెడు కాయలోననొక మానిని యూయలలూగెబ్రీతిమై.

pks kumar చెప్పారు...

లాలి యననేమి తెలుపుమ బాల యిపుడు,

లేదుకున్ వ్యతిరేకము నేది లేమ,

భిన్న మేది "మీ రాజుకు" బిడ్డ లార,

పూవుకు తదుపరి దశను పొలతి దెలుపు,

"బయట"కు విముఖ పద మేమొ పాప తెలుపు

ఊయల,కలదు, మారేడు, కాయ,లోన:

purushothamarao ravela చెప్పారు...

మీరదు నాదుమాటలను,మేనగుయత్తకు ముద్దుకూతురే
కోరికదీర్చరమ్మనుచు,గొప్పగనన్నిటుకీర్తిజేసెలే
వీరుడు శూరుడీవనుచు,వేడెనుగట్టగ నూయలన్నటన్
మారెడుకాయలోననొకమానిని, యూయలలూగె బ్రీతిమై

Sitharamayya Solasa చెప్పారు...

వనము నంతటను తిరిగి వచ్చితిమిక
మారెడు తరువునకుగల మానునకొక
యూయల గలదు :
మారేడు కాయలోన
నున్న గుజ్జు దీసి దినుచు నూగ నొప్పు

విరించి చెప్పారు...

వింత కథలెన్నొ చెప్పెడు వృద్ధు రాలు
చెప్పె నీరీతి యొకనాడు చిత్రముగను
వడ్ల గింజలో నగల ప్రపంచ మందు
నూయల గలదు మారేడు కాయలోన.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ విలక్షణమైన విరుపుతో అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(వరమిచ్చిన పరమేశ్వరుని శిరసుపైననే
చేయి జాపబోయిన భస్మాసురుని భరతం
పట్టటానికి విష్ణుదేవుడు విశ్వమోహినిగా మారి వాడిని మాయలో పడేయటానికి మారేడుకాయలో దర్శనమిచ్చాడు )
మారినబుద్ధితోడ హరు
మన్నన పొందిన భస్మదైత్యుడే
బారెడుచేయి జాపి " తల
పై నిడెదన్ నిలు " మంచు బారుచున్ ;
గారెడు స్వేదమున్ దుడిచి
కాంచెను ; చిత్రము ; విష్ణుమాయతో ;
మారెడుకాయలోన నొక
మానిని ; యూయలలూగె బ్రీతిమై .
(భస్మదైత్యుడు - భస్మాసురుడు ; పారుచున్ - పరుగెత్తుచు )

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణభంగం. "మానసంబున సరీసృప...." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

vsnmhari చెప్పారు...

చేరిరి యందరచ్చటకు శీఘ్రముగా నొక మాంత్రికోత్తముం
డౌర! యనంగ జేయు మహదద్భుతముల్ గన, వానిచేతిలో
గోరినరీతి మారగల కొబ్బరి కాయ, విచిత్రమౌగతిన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Sitharamayya Solasa చెప్పారు...

🙏🏽

purushothamarao ravela చెప్పారు...

మారని బుద్ధితో మణులమానముదోచెడురాక్షసాధముల్
వేరుగదల్చనేమిటికి?వేదికయేగదలంకరాజుయే
తీరనిద్రోహమిద్దియని ,తీరుపుజెప్పిరి పూజ్యులందరున్
మారెడుకాయలోననొక ,మానినియూయలలూగెబ్రీతిమై
+++++++++++++=++=======
రావెలపురుషోత్తమరావు

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

ఆరయ భూమి వారియు మహౌజసమున్ పవనమ్ము వ్యోమమున్
శ్రీ రమణీయకంఠుడె! విచిత్రము ! సత్తది ! వాని చిహ్నమే
మారెడుకాయ! చిత్తనగ మానిని పార్వతి! యీ ప్రపంచమన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...



చెరువు గట్టున మారేడు చెట్టు కొక్క
నూయల గలదు , మారేడు కాయలోన
విత్తు దీసి నాటి మరల వృక్షముగును
నిదియె కాలచక్ర మహిమ నిలను గనుడు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సృష్టి లోనున్న వింతలు చెప్ప తరమె
యనుచు నొక్కండు పలికె నబ్బురము గ
తనదు చరవాణి జూపించె దర్పముగను
ఊయల గలదు మారే కాయ లోన

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చివరి పాదం లో మారేడు అని సవరణ చేయడ మైనది

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మణుల మానము'? "సతుల మానము" అని ఉండాలనుకుంటాను. 'రాజు+ఏ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "భూపుడే" అనవచ్చు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విత్తు దీసి నాట మరల వృక్షమగును" టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పలికె తా నబ్బురముగ" అనండి. లేకుంటే గణభంగం.

pks kumar చెప్పారు...

నమస్కారము ధన్యవాదాలు ఆచార్య

కస్తూరి శివశంకర్ చెప్పారు...

శ్రీగురుభ్యోనమః

శారద రాత్రులందు విరజాజుల తావుల పారవశ్యమున్
చారెడు కన్నులున్న చెలి జాబిలి చందన బంధురంబులో
కోరగ హాసచంద్రికల కూజిత రాగపు భావనంబునన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

కస్తూరి శివశంకర్, ముంబై

కవితా ప్రసాద్ చెప్పారు...

శంకరయ్యగారూ! రండు! చకితమౌను!
పోయి చూచివత్తము మనమును! జను లను
కొనుచు నుండ్రి శివమహిమ గోచరమయె!
"ఊయల కలదు మారేడు కాయలోన!"

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

గారడివాఁ డొకండు ధనకాంక్షను నొక్కెడఁ జేరి, దండమున్
గోరి ధరించియున్, జనులకున్ దన మాయలఁ జూప, మంత్ర స
త్పారణ సేయఁగానె, యహొ! బమ్మియె తిమ్మిగ మాఱె! నట్టులే,
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై!

Zilebi చెప్పారు...



ఊరి కావల గుడికలదు సఖి తూగు
టూయల కలదు మారేడు కాయలోన
లింగ మును ప్రతిష్టించి భళీయనంగ
దాని పైనిడి కొలువను తరుణమిదియె


జిలేబి

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

పూరణకు సమస్య

మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై
ఉత్పలమాల

కోరెనుభార్యగాతనకుకోమలినొక్కతెజూపుమంచుఁదాన్
దీరుగమంత్రగానిగనిధీరుడునాయువకుండునంజనం
బారయుమంచురాసెఁగనుపట్టునటంచునుజూడఁదీక్షగాన్
మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

గాదిరాజు మధుసూదన రాజు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గజాసుర ఉవాచ :

తేటగీతి
బిల్వము మహాశివుడటంచు విశ్వసించి
కోరి పూజించఁ బ్రభువుకై కుక్షిఁ జేరె
నూపఁగా నీ గజాసురు నుల్ల మందు
నూయల గలదు మారేడు కాయ లోన





వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
"మారెడు కాయలోన నొక మానిని యూయల
లూఁగెఁ బ్రీతిమై"

సందర్భము:
బిల్వాటవీ మధ్య లస త్సరోజే
సహస్రపత్రే సుఖ సన్నివిష్టామ్
అష్టాపదాంభోరుహ పాణి పద్మామ్
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్
(కనకధారాస్తవం..)
సీతా రామ లక్ష్మణు లొక మారేడు తోటలో నడుస్తుండగా రాము డన్నాడు గదా!.. "మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"
అప్పుడు లక్ష్మణు డిలా అన్నాడు "ఆ మానిని లక్ష్మియే గాని వేరే కాదు. అంతే కాదు. ఈ మారేడు తోటలో ఇప్పుడు నడుస్తున్న మా వదినమ్మయే ఆ లక్ష్మి. ఆమెయే సీతగాగా భూమిమీదకు జీవుల నుద్ధరించడానికై దిగి వచ్చిన శ్రీ హరివి నీవే!"
~~~~~~~~~~~~~~~~~~~~~~~

*సీతా లక్ష్మి*

శ్రీ రమ సీతగాగ భువి
జీవులకై దిగినట్టి శ్రీహరీ!
మారెడు కాయలో వెలుగు
మానిని లక్ష్మియె సుమ్మి! నే డిటుల్
మారెడు తోటలో నడచు
మా వదినమ్మయె లక్ష్మి; అంటివే!..
"మారెడు కాయలోన నొక
మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
20.02.20
-----------------------------------------------------------

subbarao చెప్పారు...

అల్ల చూడుముత్రాడుతోనల్లినట్టి
యూయలగలదు,మారేడుకాయలోన
గానిపించెనుశంభునిమేనువోలె
నున్నయొకరూపు,వింతగాసన్నుతాంగి!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గజాసుర ఉవాచ :

ఉత్పలమాల
మారెడు నీవె శంకర సమంచిత రీతినిఁ గొల్తు వేగమే
చేరుము కుక్షిలో ననుచుఁ జేయ తపమ్మును నీలకంఠుడే
తీరెను నిర్మలాత్ముఁడటఁ దీర్చుచు మానిని శాంతి నాత్మలో
మారెడు కాయ లోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

Surya చెప్పారు...

జేరిన వారలందరు విచిత్రమహా యని మెచ్చునట్టులన్
నేరుపు జూడ నచ్చెరువు నింపెడి జక్కని చిత్ర రాజముల్
దీరు నమర్చినారిచట దెల్లమగున్ గనుమీ పటమ్ములో
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తీరుగనొక్కమాంత్రికుడుదీసెను పక్కిని శూన్యమందునన్
కోరగనొక్కవీక్షకుఁడు కోమలిజేసెనువాని,నంతలో
నారయనెల్లవారలునునాతనివిద్య ప్రదర్శనంబునన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శివున కర్పించ భక్తిని శీఘ్ర మేఁగి
కైకొనఁగఁ బ్రీతి యున్న, నక్కట చెలంగి
స్వాంతమును వడి నూపఁగ సంది యంపు
టూయల గలదు, మారేడు కాయలోన


ధారుణి దూల నూపులకుఁ దా వడి దానిఁ గ్రహించు నాశతో
వారక యెవ్వ రే మనినఁ బంతము వీడక యింత యేనియున్
మూరఁగఁ జిత్త మందు కడు మోహము తియ్యని మావి పండుగా
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

[మారు మొగము – తిక్కన గారి ప్రయోగము ర ప్రాస యతి స్థానములో. మాఱు ప్రయోగము కూడ కలదు ]

విరించి చెప్పారు...

చేరిన మంత్రగాడొకడు చిత్రము లెన్నియొ చేసిచూపెనే
వారణమంబుదాయనముఁ వైహళి జేయుచు నుండగా సుఖా
చారము శృంగముల్ గలిగి సాగర గామిని లోన నీదగన్
మారెడి కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై.

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sailaja చెప్పారు...

చిన్నవస్తువు లందున చిత్రముగను
చిర్తకుడు చెక్కుచుండెను చిత్రములను
తండులమ్మున యీశుడు తనరునటులె
యూయల గలదు మారేడు కాయలోన!!!

subbarao చెప్పారు...

వారునువీరునున్ననకభర్గునిరూపముజూడరండహో
మారెడుకాయలోన,నొకమానినియూయలలూగెబ్రీతిమై
భీరువులేకయేతనకువీరముతోడనుబైకియూగుచున్
నౌరయనంగదానిపుడయూహలదేలుచునుండెనేగదా

శ్రీహర్ష చెప్పారు...

మఱుగుజ్జులు...

బూరెలపై వధూవరులు పొంగుచునాడిరి బంతులాట సాం
బారున మున్గి దంపతులు స్వర్గసుఖమ్మల నందినారు గోం
గూరయె తల్పుమై పతిని కూడె శుభాంగి యొకర్తె మామతో
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

Sistla Sharma చెప్పారు...

కోరకనే ఫలమ్ములిడి
కూరిమి బంచుచు నెండ వేళలన్
చారు సుహాస బంధుర ర
సాలము దోచెను, నేత్రపర్వమై
జారుచు రంగులీని సుధ
చక్కబడంగ దొడంగి పండుగన్
మారెడు కాయలోన, నొక
మానిని యూయలలూగె బ్రీతిమై!

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

అతి సులువుగ సమస్యలు పరిష్కరించటంలో జిలేబి గారికి జిలేబీగారే సాటి...

chandrashekhar yelisetty చెప్పారు...

ఉ:

వారిజ వైరినిన్ గనిన వర్ణి గడుంగడు వర్ణనమ్మునన్
నూరొక తీరుగా పొగడ నున్నది రూప మదేమి యంచనన్
మారుగ కుంచె తోడు కడు మారులు చంద్రుని రూప మద్దగన్
మారెడు కాయ లోన నొక మానిని యూయల లూగె బ్రీతిమై

వై. చంద్రశేఖర్