18, మార్చి 2020, బుధవారం

సమస్య - 3313 (కవితాకన్యక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"
(లేదా...)
"కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

95 కామెంట్‌లు:

  1. వివరింప నిటులడిగితివ
    "కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"
    కవిపుంగవులకెపుడు నీ
    కవితా కన్యక యనుజయె!కాదనుటేలన్??

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:
    (కంది శంకరయ్య గారికి అంకితం)

    కవనంబందున నారితేఱి బలుపౌ కావ్యమ్ములన్ వ్రాయకే
    భువనంబందున నొక్కడై కవులనున్ పుట్టించి పాలించుచున్
    భవనమ్ముల్ విడి శంకరాభరణమే వాసమ్ముగా నొప్పగా
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకైతే ఆడపడుచే. 'వాణి నా రాణి' అనే అధికారం, సాహసం నాకు లేవు మిత్రమా!
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    స్వగతం:

    చవిలేనట్టిది బంగభూమిజనుచున్ సంపూర్తిగా వీడుచున్
    ప్రవరాఖ్యుండు వరూథినిన్ కథలనున్ బంగారు భాషందునన్...
    కవివర్యుండగు శంకరున్ కరుణతో కాట్లాడి పోట్లాడెడిన్
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
      'భాష+అందు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "బంగారపుం భాషలో" అందాం.

      తొలగించండి
  4. (ఒక అభిమాని శృంగారశాకుంతలం,జైమినిభారతం రచించిన పినవీరభద్రమహాకవిని
    "కవితాకన్యక మీచెల్లెలా?"అని ప్రశ్నించాడు.పినవీరన తల అడ్డంగా తిప్పాడు."అయితే మీయిల్లాలా?
    అన్నాడు అభిమాని.మహాకవి సరససమాధానం చెప్పాడు.)
    "కవితాకన్యక నీకు నాడపడుచా?
    కాకున్న నిల్లాలొకో?"
    నవతల్ జిందెడి ప్రశ్న వేయ నొక వి
    న్నాణంపు విద్వాంసుడే;
    కవనార్థం బుదయించినట్టి ఘనుడౌ
    గాంభీర్యు వీరన్ననిన్;
    కవివర్యుండనె వాణియే తనకు సం
    క్రాంతంపు వాగ్రాజ్ఞిగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'వీరన్ననున్/వీరన్ననే' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  5. శంకరాభరణం......18/03/2020
    బుధవారం

    సమస్య. : 
    **** ****

    "కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

    నా పూరణ :: మత్తేభవిక్రీడితం
    **** ***** ***** ***** ***** ****

    భువినన్ దార మదిన్ గ్రహించి మెలగన్ బోరామి యెట్లవ్వునో

    కవితల్ రాయగ నాకు నెప్పుడు గడున్ గష్టమ్మె యట్లవ్వుగా

    వివరింతున్ గద! కావ్యకన్య సతిగన్ బేర్కొందు నువ్విట్లనన్....

    "కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"


    (పోరామి అనగా సంకటము)

    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవ్వు' అనడం సాధువు కాదు. "...యెట్లైన నా కవితల్... యట్లైనచో...నీవిట్లనన్" అనండి.

      తొలగించండి


  6. కవిరాట్ కందివరార్యా
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో
    తవణించెడు రీతి భళి వి
    డువకనరె యనుదిన మడుగడుగు దండాలే !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. చవులూరించెడు రీతి కైపదములే జవ్వాదులద్దుళ్ళతో
    డవిరామమ్ముగ శంకరాభరణ మందాడంబరంబాయెనే
    కవిరాట్ కందివరార్య! తీఱుగడయే కాన్పట్టదే సేవలో
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?



    శుభాకాంక్షలతో
    జాల్రా
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకు ముందే చెప్పాను ప్రభాకర శాస్త్రి గారితో... "కవితాకన్యక నాకు ఆడపడుచు" అని.

      తొలగించండి
  8. కవియై యుండియు గూడను
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?
    వివరమడుగ నెందులకో !
    కవితను కన్యయన పెండ్లి గాలేదనిగా!

    రిప్లయితొలగించండి
  9. నవరసములు జిందించుచు
    కవనములో కమ్మనైన కారణమవగా
    భువనమనోహరితానే
    కవితాకన్యకయనుజయొకాకగృహిణియో

    +++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  10. భువనము నందున జూడగ
    *కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*
    నవబో దెప్పుడు వినుమా
    కవులకు కావ్యంబు నిజము కమ్మని సుతయే

    రిప్లయితొలగించండి
  11. నవవాసంతవనాంతరస్థిత లతాంతశ్రీల సౌందర్యమా...
    ర్దవశోభాకలితమ్ము సత్కవనమార్యా! ధీరతన్ ధీ మహా...
    ర్ణవమంథానమునన్ జనించు సుధ! పిల్వన్ నిశ్శ్రమన్ జేరునే?
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ ప్రయత్నం 🙏🙏

    *"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

    *కం||*
    అవలీలగ పద్యమ్ములు
    అవలీలగ కవితలనిన యనుజయె యగునే
    కవివర్యులు కష్ట పడగ
    *"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  13. కవిభావాంబుధి లోను
    ద్భవించి నందంతిగా బుధానుని కయ్యెన్
    గవనమె, గ్రహీతకున్ గన
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?

    రిప్లయితొలగించండి
  14. భువిలో కవులకు యెపుడున్
    అవిరళముగ కవితలల్లు నాశయె కానీ
    యెవరును యోచింప రెపుడు
    కవితా కన్యక యనుజయొ కాక గృహిెెణియో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *...కవులను నెప్పుడు । నవిరళముగ..." అనండి.

      తొలగించండి


  15. బ్లాగ్లోకంలో పేరడీ కింగ్ బండి వారి సొబగు గానములు


    జవరాలా బండి వరుల
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో
    చవులూరు పేరడి వరుస
    జవగట్టుచు వచ్చు వారి శర్కరి లోనన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. అవతారంబని కొల్తువామెనొకచో నందించుచున్ కీర్తులన్
    వ్యవధానమ్మది సుంత లేక కవి! నీవందింతువా నిందలన్
    వివరింపన్ దగు నీదు తత్వమును వైవిధ్యమ్ముగన్ దోచెడిన్
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  17. కవనము నారాధించె డు
    కవి కేనాడును కలుగవు గజిబిజి తలపు ల్
    వివరింపుడు మీర లిపుడు
    కవితా కన్యక యనుజ యొ కాక గృహిణి యో?

    రిప్లయితొలగించండి
  18. కవితాప్రసాదు నడుగం
    గవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?
    సవినయము నుడివెద వినుడ
    య!వెలది మాకాడుపడుచె యగు నిశ్శంకన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవితాకన్య యొకింటి యాడుపడుచా? కాకున్న నిల్లాల? లే
      క వశంబందున నుండు వారవధువా? కాదెట్టులన్! పూర్వ సం
      భవమందుంగల పుణ్యలేశమున సంప్రాప్తించునే కాని మా
      నవు డెన్నేవిధముల్ దపించినను జెంతం జేరదొక్కింతయున్!

      - కీ.శే. మద్దులపల్లి కవి.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మద్దులపల్లి వారి పద్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  19. నవలావణ్యరసప్రసారమధువిన్న్యాసార్థశబ్దస్ఫుర
    ద్వివిధోక్తిశ్రుతిమాధురీభరితయై వేనోళ్ళఁ గీర్తిం గనన్
    గవితాకోమలి నీ యనుంగు సుతయౌ, కాదట్టులం దల్చ నా
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  20. మరో పూరణ 🌹🌹

    *కం||*

    అవలీలగనడిగితిరే
    కవివర్యా మీరిచటను ఖంగు తినగనే
    నెవరైనా తెలుపగలర
    *"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ 🌹🌹🌹

      *కం||*

      కవులకు కొంపను ముంచగ
      వివరము తెలిసియు నడిగిరి విపరీతమిదే
      నెవరు తెలుపగలరునిలను
      *"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"*

      🙏😊🙏😊🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "తెలుపగల రిలలో" అనండి.

      తొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "కవితాకన్యక నీకు నాడపడుచా?
    కాకున్న నిల్లాలొకో?"

    సందర్భము: ఓ కవీ! (వాల్మీకి మహర్షీ!) నీవు రామాయణం రామున కంకితం చేసినపుడే కవిత నీ కూతు రని తెలిసిపోయింది. అదే మంచి భావన అనిపిస్తున్నది. మళ్ళీ ఇలా ప్రశ్నించడం దేనికో! (ఇలాంటి ప్రశ్న ఎలా తలెత్తుతూ వున్నదో!) "కవితా కన్యక ఆడపడుచా! ఇల్లాలా!.." అనేది..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *రాముడే వరుడు*

    రవి వంశాగ్రణి రామచంద్రునకు నీ
    రామాయణం బిచ్చినా..
    వవు, నప్డే తెలిసెన్ గవీ! కవిత నీ
    కౌ పుత్రికా రత్న మం
    చు.. వరిష్ఠం బగు నీ తలంపె యని తో
    చున్.. బ్రశ్న యి ట్లేలనో!...
    "కవితా కన్యక నీకు నాడపడుచా?
    కాకున్న నిల్లా లొకో?"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    18.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. కందం
    శ్రవణీయమ్ముగ జదువన్
    కవనమ్మును రంగరించి కవి కన సుతయౌ!
    యవివేకమా! యెటులనౌ
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?

    మత్తేభవిక్రీడితము
    దివిలో శారద దీవెనల్ బనుపఁ జిందించంగ భావాబ్ధిలో
    కవితావేశము రూపమై మెరయు సత్కావ్యమ్ము నందంతియౌ
    శ్రవణీయమ్మది కాదుకాదొకొ! వినన్ చాలించు ప్రశ్నించుటల్
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒక సుకవి, యతని నాదరించిన రాజు మాటలాడుకొనుచున్న సందర్భము]

    "నవనీతాంచితవాక్కులన్ బిలిచితే నన్ "దండ్రి" యం చిట్లు? నా
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"
    "భవదీయాదరతాప్తిచేఁ బిలిచితిన్! భావ్యంబు కాదా కవీ?

    నవలావణ్యకవిత్వకన్యనొసఁగన్ నా కద్ది "యిల్లా" లగున్!"

    రిప్లయితొలగించండి
  24. కవనము మేధో జనితము
    కవులకు మానస సుతయెగ కాదన గలమే ?
    భువిలో పోలదు నన్యము
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?

    రిప్లయితొలగించండి
  25. కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?
    వివరంబీయ మనస్సు భావభరి తావేశంబు పద్యంబుగా
    కవికిన్ బుట్టును గాన పుత్రికయె, బాగా యెంచి చూడంగ నా
    కవనంబంకిత మొందు పుంగవుడు నాకల్లుండు కాదే యిలన్

    రిప్లయితొలగించండి
  26. జవముం బూనుచు పృచ్ఛకాళి యెదుటన్ శక్తిన్ బ్రదర్శించుచున్
    కవనక్రీడను జేయువాని సుమహత్కౌశల్యమున్ మెచ్చి యా
    యవధానిన్ గని యొక్క డిట్టులనియెన్ హర్షాతి రేకమ్మునన్
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    రిప్లయితొలగించండి
  27. కం.

    అవిరామముగా వచ్చెడి
    కవితా ధోరణి యనుజయె గదరా నెపుడున్
    యువతులు నివ్విధి వచ్చునె?
    కవితా కన్యక యనుజయొ కాక గృహిణియో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గదరా యెపుడున్... నివ్విధి వత్తురె" అనండి.

      తొలగించండి
  28. కం.

    అవగతమగు సరళముగను
    కవితా కన్యక యనుజయొ కాక గృహిణియో
    నవిరామముగా వచ్చెడి
    కవితా ధోరిణి యనుజయె గదరా నెపుడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  29. కవివర!పాడియెయిటులన
    కవితాకన్యకయనుజయొకాకగృహిణియో
    వివరణయిత్తునువినుమా
    కవితాకన్యకయనుజయెకవులకునెపుడున్

    రిప్లయితొలగించండి
  30. పవలున్ రేయియుఁ బలుమా
    ర్లు వచ్చు ముచ్చటలకై సరోజదళాక్షా
    వివరం బిమ్మిఁక నీ కీ,
    కవితా! కన్యక యనుజయొ? కాక గృహిణియో?

    [గృహిణియో = చూడ వచ్చిన యొక గృహిణియో]


    అవనీ క్షేత్రము నందు వింతలకు వింతా యేమి వీక్షించఁగన్
    సవతుల్ రారె తలంచ సీతకును నాశ్చర్యంబు నీ కేల మీ
    కు వయోభేదము గాంచ సందియము నాకుం గల్గెఁ జిత్తమ్మునం
    గవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో

    [కవితాకన్యక = కవిత యను కన్య; ఆడపడుచు = కూతురు]

    రిప్లయితొలగించండి
  31. భవతాపార్తి హరా శివా నిఖిల గోపాలా మదిన్ నీదు ప్రా
    భవముల్ మూర్తి విశేషముల్ సొబగులున్ భావించి పారమ్యమౌ
    కవనంబున్ రచియించితిన్ సుకరమున్ గావింప సందిగ్ధమే
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో

    రిప్లయితొలగించండి
  32. కవిభావాంబుధి లోనపుట్టు గదరా కావ్యంబు తత్పుత్రికై
    కవనమ్మున్ బఠియించు వారికది వాగ్దాయిస్వరూపమ్మెయౌ
    నవనీశా! కవివర్యుడంకితము నీకందింపగా, తెల్పుమా
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

    రిప్లయితొలగించండి
  33. కవిరోచెప్పుమ,యిప్పుడేయిడునునాకత్యంతమోదంబునున్
    కవితాకన్యకనీకునాడపడుచా!కాకున్ననిల్లాలొకో
    కవితాకన్యకనీకునాడపడుచే,కాదన్నయాప్రశ్నయే
    యవనింబుట్టదునేర్వుమాయికనునాహాయండ్రుగాదేప్రజల్

    రిప్లయితొలగించండి
  34. కవితాననుకొనదగునా
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"
    ధవళాంగితానె స్వయముగ
    కవి కవన వనమునఁ గురియు కవితాఝరియే!

    రిప్లయితొలగించండి
  35. చవి గొంచున్ చదువన్ లభించు మతి, భాషాలక్ష్మియూతమ్ముతో
    కవితల్ వ్రాయు సుశక్తి కూడుకొను నిక్కమ్మౌగతిన్ మిత్రమా!
    వ్యవసాయమ్మును చేయకుండ కలుగన్ పాండిత్యమీ ధాత్రిపై
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో ?

    రిప్లయితొలగించండి
  36. కవితో మిత్రుడు

    నవనీతంబగు రీతినిన్ కవితలన్ నాణ్యంబుగా నల్లుచున్
    అవిరామంబుగ సల్పుచుందువుగదా యష్టావధానంబులన్
    తనివిన్ బొందక నింతగా పొదవగా తాత్పర్యమేమౌనహో!
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిచే సృజియింపబడిన
      కవితాకన్యక,యనుజయో కాక గృహిణియో?
      వివరమ్మారయ కవికిన్
      నవజాత శిశువు సతియగు గృతిపతికిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  37. నవ హేలా రస రంజిత ప్రకటవి
    న్యాసంబులం దూగుచున్
    రవళించున్గద కావ్య రాగ సుధ వి
    భ్రాజ ప్రభాలోకమున్
    తవ భావోక్త ప్రయుక్త రాగ ఝరితో ద్భావంబులన్నోకవీ!
    కవితా కన్యక నీకు నాడ పడుచా?!
    కాకున్న నిల్లాలొకో!

    రిప్లయితొలగించండి
  38. కవివా?కావ్యములెన్ని వ్రాసితివి?యే గ్రంధంబులన్ జూచితో?
    భువనంబందుననెందునేగితివొ?యేభూనాధుఁ డేమిచ్చెనో?
    కవినేనంచును విర్రవీగెదవుపాఖండా! తగన్జెప్పుమా
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "కవితాకన్యక నీకు నాడపడుచా?
    కాకున్న నిల్లాలొకో?"

    సందర్భము:
    సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం
    సాధువృత్తాం సువర్ణాం
    సద్భిస్సంస్తూయమానాం సరసగుణయుతాం
    లక్షితాం లక్షణాఢ్యామ్
    ఉద్యద్భూషా విశేషా ముపగత వినయాం
    ద్యోతమా నార్థ రేఖాం
    కళ్యాణీం దేవ! గౌరీప్రియ! మమ కవితా
    కన్యకాం త్వం గృహాణ
    (ఆది శంకరుల శివానందలహరి)
    ఓ ఆదిశంకరా! నీ కవితను శివునకు సమర్పించుకున్నావు. (గౌరీప్రియ! మమ కవితా కన్యకాం త్వం గృహాణ..అంటూ..)
    ఆనాడే కవిత నీ కూతు రయింది. ఇవాళ కంది శంకరులు ప్రశ్నిస్తున్నారు. "కవితా కన్యక నీకు ఆడపడుచా! ఇల్లాలా!.." అని
    (ఏం జవాబు చెబుతావో! చెప్పుకో!.. నీ యిష్టం..)
    మొత్తానికి కవితను కూతురుగా భావించడ మనేది ఆది శంకరుల కాలంనుంచి వస్తున్నట్టు తెలుస్తున్నది. పై శ్లోకంలో కవితా పరంగానూ కన్య పరంగానూ రెండర్థా లున్నవి. ఉదా.. సర్వ అలంకార యుక్తాం=అన్ని అలంకారాలతో కూడినదానిని (కవితా పరంగా సాహిత్యంలోని ఉపమాది అలంకారాలు.. కన్యపరంగా అన్ని రకాలుగా లేపనాదులతో అలంకరించుకొన్న దానిని) అట్లే తక్కినవీ..
    ప్రామాణికమైన వివరణలకై శ్రీ సూరం శ్రీనివాసులు గారి శివానందలహరీ.. (జ్యోతిష్మతీనామ వ్యాకరణాంశోల్లిఖిత వివృతి మహితా) పుస్తకాన్ని చూడవచ్చు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *ఆది కంది శంకరులు*

    శివునిన్ బెండ్లి కుమారుఁ జేసి కవితన్
    శ్రేయంబుగా నిచ్చినా..
    వవు.. నవ్వేళనె యాదిశంకర కవీ!
    ఆ కైత నీ కూతు ర
    య్యె.. వరిష్ఠం బదె! కంది శంకరులు ని
    న్నివ్వేళఁ బ్రశ్నించెడిన్..
    "కవితా కన్యక నీకు నాడపడుచా?
    కాకున్న నిల్లా లొకో?"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    18.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  40. యువకుడుపాధ్యాయుండగు
    రవితో సతతము తిరుగెడి రమణి యెవతియో
    వివరించి శంక తీర్చుమ
    కవితా! కన్యక యనుజయొ? కాక గృహిణియో?

    రిప్లయితొలగించండి