31, మే 2021, సోమవారం

సమస్య - 3738

1-6-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ”
(లేదా...)
“తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే”

57 కామెంట్‌లు:

 1. ధర్మజుని , భీమ సేనుని, తమ్ములు సహ

  దేవ నకులులను నిలిపె దైవ బలిమి

  తోడు పంపగ పుత్రుకు ధూర్త రాజు

  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పుత్రునకు' అనడం సాధువు. అక్కడ "సుతునకు" అందామా?

   తొలగించండి
 2. అరటిచెట్టుకుగెలవచ్చెనందముగను
  కోన్నినాళ్లకునదిపండెకోరితినగ
  కత్తితోడనురైతన్నగాటుఁబెట్టె
  తలనరుకఁగాంచిమెచ్చిరితగినపనిగ

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. చంపెదను సైంధవుననుచు చక్రి‌ తోడ

  వెడలి యాతనిన్ గానక వేదనలను

  పడుచునుండ భీతిల్లిరి పాండు
  సుతులు,

  సైంధవుడు చక్రి మాయతో సంత సముగ

  తన తలను జూపగ, కిరీటి
  ధనువు తోడ

  తలనఱుక గాంచి మెచ్చిరి తగిన పనిగ

  రిప్లయితొలగించండి
 5. తెన్నును జూప మీనమున ధీధితి నొప్పుచు చేరి నావుగా,
  మన్నిక తోడ కూర్మముగ మంధర పర్వత మెత్తి నావుగా,
  మన్నుశుభాంగి కాచ మన మంధిర మందు వరాహ మైతివే ,
  చిన్ని మనంబు వాడడుగ చేరితివే మొగరాడు నందునన్,
  మిన్నుకు నొక్క పాదమును మేధిని పైనొక పాదమున్
  తన్నుచు నెత్తిపై నొకటి దైత్యుని పైనిడి నావు శోభతో ,
  మన్నియ లెల్లరన్ వెదకి మౌలిని లోపడ ద్రొక్కి నావుగా,
  అన్నుల మిన్న భూమిజను యాతువు బట్ట వధించి నావుగా,
  వెన్నుడవై శుభాంగనల వేడుకలన్ సరి దీర్చుచు నుండి నావుగా,
  పన్నగ శాయి రూపములు బాడము లైనను యెన్ని జీవులం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విష్ణువు వివిధ రూపాల చిత్రణతో చక్కగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
   5, 9 వ పాదాలలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 6. వలపుననీశుడాయెడనువచ్చినవాకిటబాలుఁజూచియున్
  తలపగరానిభావనలతల్లడమందుచుఖడ్గమూనియున్
  విలవిలలాడవిఘ్నములవేల్పుకుశీర్షముతీసెగానటన్
  తలనరుకఁగాంటిబహుధాస్తుతకార్యమటంచుమెచ్చిరే

  రిప్లయితొలగించండి

 7. చీడ పురుగులె చేరుచున్ జేతి కంది
  నట్టి పైరుల నాశించి యాశ్రయింప
  రైతు కృంగక యోచించి పీతల మిడు
  తల నఱుక గాంచి మెచ్చిరి తగిన పనిగ.

  రిప్లయితొలగించండి
 8. తలపులు తప్పులయ్యె తన తల్లియె తాపిన రొమ్ము పొంగులన్

  తలవక , నారి పొంగులను తామస దృష్టిని కాంచి ధూర్తతన్

  పలువురు కూడి ఘోరముగ భంగము చేసిరి , వారి హేయమౌ

  తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 9. విచ్చలవిడిగా వర్తించి విటుల కొఱకు
  సొగసు కత్తెలుగ తమనె చూడు డనుచు
  యువకుల చెఱుపు నట్టి యా యువిదల పతి
  తల నఱుక గాంచి మెచ్చిరి తగిన పనిగ

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చెడ్డ గుణమున జనులను చెఱచి యుండి
  సతము వారిని హింసించి సాగినట్టి
  దుష్ట మహిషుని శూలము తోడ నంబ
  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ.

  రిప్లయితొలగించండి
 11. పాశుపతమును మంత్రించి పార్థుడట్లు
  చెల్లిమగడునిచూడక శీఘ్ర గతిని
  సమరమందున సమసింప సైంధ వుడిని
  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ.

  రిప్లయితొలగించండి
 12. ఖలురగు నేతలన్ గనుచు కాసులె జీవితమంచు నెంచి ప
  త్సలమును తప్పుచుండ గని ఛాత్రుల జేరుచు వారియందునన్
  నెళవును బెంచ శిక్షకులు నెయ్యపు కాడిగ మారి ప్రీతితో
  పలువిధ నీతిగాథలను బాలురకున్ వచియించి దుష్టచిం
  తల నఱుకంగ గాంచి బహుధాస్తుత కార్యమటంచు మెచ్చిరే.

  రిప్లయితొలగించండి
 13. తేటగీతి
  లలిత! జగదాంబ! గూల్చవే రాక్షసాళి
  లోక భీకరులౌ వారి దూకుడాప
  దేవి యన నవదుర్గయై దెబ్బకొక్క
  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ

  చంపకమాల
  కలతల గూర్చు రాక్షసుల గ్రన్ననఁ గూల్చఁగ, స్తోత్రపర్వమై
  లలితఁ బరాత్పరిన్ సురలు రాజిత భక్తిని వేడినంతటన్
  దులుపుచు దండయాత్ర నవదుర్గలరూపిణి సారెకొక్కరిన్
  దల నఱుకంగఁ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే

  రిప్లయితొలగించండి
 14. పచ్చగున్నవృక్షము మాడె, పనికిరాదు
  ఎండిబోయిన చెట్టును జూడ తగదు
  గొడ్డలినిదెచ్చి పిత తన బిడ్డకివ్వ
  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ

  రిప్లయితొలగించండి
 15. సమస్య :

  తల నరుకంగ గాంచి బహు
  ధా స్తుతకార్య మటంచు మెచ్చిరే

  ( రాజసూయమహాసభ - శిశుపాలుని దుర్భాషణములు శ్రీకృష్ణుడు విధించిన దండన )

  చంపకమాల
  ...................

  తులువ వలెన్ బ్రవర్తిలుచు
  దోచినయట్టుల గృష్ణు దిట్టుచున్
  జెలువపు రాజసూయసభ
  జేదినరేశుడు వాగుచుండగా
  ములుకుల బల్కులన్ సహన
  మూర్తి భరించి సుదర్శనంబుతో
  దల నరుకంగ గాంచి బహు
  ధా స్తుతకార్య మటంచు మెచ్చిరే .

  రిప్లయితొలగించండి
 16. బలమగు ప్రక్క దేశమరె భా
  రత దేశము తోడ నీర్షతో
  దలపడ, గాంచి వారలను
  దర్పముతో నెదిరించ సైనికుల్
  ఫలితము శూన్యమైన మరి భం
  డన మందున నొక్కరొక్కరిన్
  దల నరుకంగ గాంచి బహుధా
  స్తుత కార్యమటంచు మెచ్చరే.

  రిప్లయితొలగించండి
 17. రుక్మిణీ కల్యాణ సమయం లో శ్రీ కృష్ణుడు రుక్మి ని చంపక, క్షమించి తలవెంట్రుకలు తీస్తాడనే సందర్బంగా నా ప్రయత్నము:

  చం:

  విలవిల లాడె రుక్మి కడు విస్మయ మొంద మురారి చేష్టలన్
  తలచిన దొక్కటైన మరి తాగొనె రుక్మిణి బెండ్లియాడనై
  తలపడి నంత కయ్యమున దండన మాపి క్షమించు మంచనన్
  తల నఱుకంగ గాంచి బహుధా స్తుత కార్య మటంచు మెచ్చిరే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తల నరకడము అంటే గుండు కొట్టడము అనే భావనలో రాశాను. ఈ సందర్భము గా సగం తల గుండు కొట్టడము నైతికంగా తల నరకడమనే భావనగా రాశాను

   తొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తలవని రీతి నిచ్చలును తల్లడపెట్టి జనాళి నెంతయున్
  కలవరమొంద జేసిన వికారియు నా మహిషాసురున్ ననిన్
  నులుమగ నెంచి దుర్గయె తనున్ కరవాలముతోడ వానిదౌ
  తల నఱుకంగ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే!

  రిప్లయితొలగించండి
 19. ( ధర్మజుని రాజసూయ యాగం సమయంలో )

  అగ్ర తాంబూలముకు కృష్ణుడర్హుడంచు
  పేర్కొనగ వంచకుడనుచు వెక్కిరించి
  శతక తప్పులు ముగియించ జక్రి చైద్యు
  దల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ

  రిప్లయితొలగించండి
 20. దుష్ట కార్యాల చెలరేగు దుండగీడు
  వంద తప్పులు గావించ నంద సుతుడు
  ఘోర పాపియౌ శిశుపాల క్రూర నృపుని
  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ

  రిప్లయితొలగించండి
 21. కలతలు లేక మోమునను, గాటపు గోపము బూని తండ్రియే
  చెలగు మటన్న తల్లి తల శీఘ్రమె గొడ్డలి బూని, లేక చిం
  తలు మన మందు భార్గవుడు తండ్రి నియుక్తిని దాల్చి యౌదలన్
  తల నరుకంగ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ పూరణ. ధన్యోఽస్మి!
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 22. సీతాశోక విదూరుడు

  బలిమిని రావణాసురుడు బందిని జేయ నశోకవాటికన్
  మలినపు దేహమున్ వగచు మాతను మారుతి యూరడిల్లెడిన్
  బలుకుల సేదదీర్చిపతి బంగరు యంగుళినిచ్చి దేవి చిం
  తల నరుకంగ గాంచి బహుధా స్తుత కార్యమటంచు
  మెచ్చిరే

  సీతాదేవి

  రిప్లయితొలగించండి
 23. పొలుపుగ స్వాగతింప యదుభూషణుఁ పాండవులగ్రపూజకున్
  నిలుపుచు చేదిరాజు యపనిందలతో హరి నీసడింపగా
  కలఁగక నూరు దప్పులను గాచిన మీఁదట చక్రఘాతమున్
  తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే

  రిప్లయితొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  అల దనుజాదిదుష్టతతి నంతము సేయఁగ నాదిశక్తియే
  ఖలబలనాశకాస్త్రములఁ గాంక్షనుఁ దాల్చియు భండనంబునన్
  బలుమఱు శంఖనాదసమవాయము లిచ్చుచు దైత్యజాతినే

  తల నఱుకంగఁ గాంచి, "బహుధా స్తుతకార్య!" మటంచు మెచ్చిరే!

  రిప్లయితొలగించండి
 25. వంద తప్పులు సేయగ చేదివిభుడు
  క్రుద్ధ మనసున గృష్ణుండు గ్రూరుడగుచు
  మేన యత్తకు నిచ్చిన మనసు గడువ
  శిరము ఖండించ ముదమొంది రుర్విజనులు
  తలనఱుక గాంచి మెచ్చిరి తగిన పనిగ

  రిప్లయితొలగించండి
 26. చుట్టు నున్నట్టి పిల్లలు దట్టముగఁ బె
  రుఁగ వలయు నంచు నెంచుచుఁ దగ నెడంద
  గెలను గొట్టి నైపుణ్యమే యలర నరఁటి
  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ


  కలవర మీయ నెల్లరకుఁ గాఱియ పెట్టుచు నాగ కుండఁ జూ
  పులు మఱి త్రిప్పకుండ నలవోకగ మిత్రుఁడు పల్కుచుండఁగా
  నల పన నేర కుండఁగ నిరంతర మచ్చట స్వీయముల్ బొగ
  డ్తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుత కార్య మటంచు మెచ్చిరే

  రిప్లయితొలగించండి
 27. కలిగిన కోపభారమున గన్నులు నెఱ్ఱవియై కనంగ నా
  కలియుగ దైవరూపుడగుగృష్ణుడు,రాజగు నాశిశుపాలు
  తల నఱుకంగ గాంచి బహుధా స్తుతకార్యమటంచు మెచ్చిరే
  యిలనున రాజులందఱును నెంతయొ సంతస మొంది రయ్యెడన్

  రిప్లయితొలగించండి
 28. చం:

  పలువురు చుట్టు చేరగనె పంతము లాడుచు మత్తు గ్రోలుచున్
  పలుకుచు నుండె డంబములు వంకలు బెట్టుచు నీసడించుచున్
  సొలుగుట గాంచి యెల్లరును సోదిని వింటిమి చాలటంచు కో
  తల నఱుకంగ గాంచి బహుధా స్తుత కార్య మటంచు మెచ్చిరే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 29. పలువురు మెచ్చునట్లు పరిపాలన చేయుదు నంచు చెప్పి, పే
  దల సహకారమున్ బడచి దౌష్ట్యములన్ పొనరించు చుండగా
  కలిగిన యాధిపత్యమున, కాంచి ప్రజాళులు వోట్లతోడ నే
  తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే

  రిప్లయితొలగించండి
 30. అలసిన నాశ్రయమ్మొసగి యాతపతప్తుల సేద దీర్చుచున్
  ఫలములు బూవులన్ మిసిమి పచ్చదనమ్ము నొసంగు చెట్లు, భూ
  తలమున జీవకోటికి ప్రధానుల నెవ్వరు ప్రాణవాయుదా
  తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే?

  కంజర్లరామాచార్య.

  రిప్లయితొలగించండి
 31. కాళ్లు లేకున్న చదివెను కష్టపడుచు
  కలిమి లేనట్టి యింటను కలకటేరు
  తెగడు మాటలు వినకుండ తెగువగను వె
  తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ

  రిప్లయితొలగించండి