18, మార్చి 2022, శుక్రవారం

సమస్య - 4024

19-3-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్”
(లేదా...)
“సామాన్యుండగు వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్”

12 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నామస్తోత్రము సేయుచు
జీమూతమునెక్కి వేచి స్థిరచిత్తముతో
రోమాంచితుడై గాంచఁగ
సామాన్యుఁడు, వేంకటపతి సంపద లొసఁగున్

శార్దూలవిక్రీడితము
నామస్తోత్రము సేయుచున్ మిగుల తా నత్యంత భక్త్యాత్ముఁడై
జీమూతమ్మును మెట్టులెక్కి వరుసన్ జేకొట్టి గోవిందునిన్
రోమాంచమ్మున శ్రీనివాసమున నాలోకించు వాడాతఁడే
సామాన్యుండగు, వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్!

M.B.G.TILAK చెప్పారు...

నీమము తప్పక దేవుని
నామము మదిలో తలచుచు నారాధించన్
సామాన్యజనులకైన న
సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్

BMahalakshmi చెప్పారు...

భామావినుమీదేవుడు
తామానకనుండుమనకుదాపునదయతో
వేమరుపిలచినచాలును
సామాన్యుడు;వేంకటపతిసంపదలొసగున్

విరించి చెప్పారు...


తామరకంటి సుచిశ్రువు
డా మధుసూదనుడతండు యజ్ఞేశ్వరుడౌ
శ్రీమంతుని కొలిచిన హం
సా! మాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కామిత వరదు డటంచును
నీమము తో నామ జపము నిష్టగ సత మున్
ప్రేమగ భక్తిన్ వేడగ
సామాన్యుడు : వేంకట పతి సంపద లొసఁగున్

BMahalakshmi చెప్పారు...

తోమాలన్నిజభక్తులన్గనుచుతాతోనుండునెల్లప్పుడున్
భూమిన్జూడగవేల్పునైప్రజకుతాభోగంపువాసుండుపో
రామిన్కొండకుపేదయైనరుడుసంరంభంబువేవచ్చి;తా
సామాన్యుండగు;వేంకటేశుడిడునిష్టశ్రీలుసంపూర్తిగన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నీమముతో భక్తులు కరు
ణామయుడౌ వేంకటాద్రి నాథుని మ్రోలన్
తామసభావము వీడ న
సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్

విరించి చెప్పారు...


హే! ముంగొంగులతండ్రి నాకికను నీవే దిక్కుగా నెంచి నీ

నామంబే నను బ్రోచునంచు మదిలోనన్ నమ్మినన్ జాలునే

క్షేమంబొప్పగ జేయు పుట్టు వడుగా శ్రీనాథుడే నమ్ము హం

సా! మాన్యుండగు వేంకటేశుఁడిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్.

sitharamayya solasa చెప్పారు...

నామాల వాన్కి ముడుపిడె
సామాన్యుఁడు ; వేంకటపతి సంపద లొసఁగున్
నేమఱక డింగరీలకు ,
చామర సేవను నిరతము సలుపుచు నుండన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శ్రీమంతుండగు వేంకటాద్రిపతి సంక్షేమంబు జేకూర్చగన్
సామాన్యుండని గొప్పవాడనుచు వైషమ్యంబు చూపించకన్
నీమంబొప్పగ భక్తితత్పరతతోనెమ్మిన్ భజింపంగ దా
సామాన్యుండగు, వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్

తిరివీధి శ్రీమన్నారాయణ చెప్పారు...

కం.
శ్రీమన్నారాయుణుడే
కామితముల దీర్చునంచు కలియుగ మందున్
నీమంబున కొలువగ నొక
సామాన్యుడు వేంకటపతి సంపదలొసగున్

✍️ తిరివీధి శ్రీమన్నారాయణ

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

దామోదరునకు హరి కా
శ్రీమన్నారాయణునకు లేఁడు సముండే
నేమమ్మునఁ బూజించిన
సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్


భామా ద్వంద్వ వివాద కారణమునం బ్రాప్తాశ్మ రూపుండు నా
హా మాహాత్మ్యము నందు విశ్రుతుఁడు దేవారాధ్యుఁడౌ యా పరం
ధాముం డెన్నఁడు స్వీయ భక్తునకు స్వాంతం బందు బందీకృ తా
సామాన్యుం డగు వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్