17, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4193

18-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు”
(లేదా...)
“రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే”

29 కామెంట్‌లు:

శంకరజీ డబ్బీకార్ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి చెప్పారు...

కాల్పుల్సల్పుచులాఠిచార్జులనుదీక్షాకంకణాబద్ధులన్
గోల్పోవన్దెలగాణరాజ్యమికనాకున్స్వంతమౌనంచునా
డల్పుండ్రంచునిజాముబేర్కొనినధైర్యస్తుల్బ్రబోధించరే
*రైల్పట్టాలఁబరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే*

Rama Murthy Duvvuri చెప్పారు...

ఆటవెలది
రయముగాను వెడలు *రైలు,పట్టాలపై ;
నిద్ర మేలొసంగు *నిక్కముగను
చల్లగాలి వీచు శయనంపు పెట్టెలో
పయనమేగు మోయి బాటసారి.

విరించి చెప్పారు...


పట్టె మంచము పైనను పదిలముగను
హంసతూలిక తల్పమె హాయినిచ్చు
నెవడు వచియించె చెప్పుమా యిట్టి మాట
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు?


శిల్పా యెవ్వడు చెప్పినో యిటుల వైచిత్రంబు కాందందువే?
యల్పుండెవ్వడొ కూసినట్టి నుడులే యాయుస్సికన్ తీర్చునే
రైల్పట్టాలఁ బరుండ, మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే
తల్పంబొక్కటి చాలుకాదె సఖి నిద్రాసక్తులే మెచ్చగన్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
సలుప దూర ప్రయాణంబు చక్కగాను
కదిలెడు గది వలెఁ గడు సౌఖ్యమిడుననఁగ
విశ్రమింపఁ దల్పము సిక్క, వేగమంద
రైలు పట్టాలపై, నిద్ర మేలొసంగు


శార్దూలవిక్రీడితము
పొల్పారున్ సుఖవంతమౌచు పయనంబుల్ దూరమైనన్ సదా
కొల్పున్హాయి గృహమ్ము చక్రములపై గూర్చంగనౌ పోలికన్
దల్పంబుల్ దగఁ జిక్కగన్ దనువు శ్రాంతంబందఁ, బోవన్ వడిన్
రైల్పట్టాలఁ, బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే!

M.B.G.TILAK చెప్పారు...

జీవితానవిఫలమొంది జీవితేచ్చ
మలుగ బ్రతుకుభారంబైన మానవునికి
మరణవాంఛప్రబలమైన తరుణమందు
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు

sitharamayya solasa చెప్పారు...

ఊయలను బోలి యటునిటు నూగుచు చనె
ఱేయినందు బండి , పరుగులెత్తు చుండి
రైలు పట్టాలపై ; నిద్ర మేలొసంగు
గమనపు వెత యేమియు నెరుక పడ కుండ

Rama Murthy Duvvuri చెప్పారు...

శార్దూలము
కల్పించెంగద యెంతయో సుఖము సర్కారుంబ్రజాకోటి క
త్యల్పంబౌ రుసుమిచ్చి యానమును జేయంగాను,పోవుంగదా
*రైల్పట్టాలఁ; బరుండ మేల్గలుగు నార్య ప్రోక్త సత్యంబిదే *
తల్పంబై యలరారు శీతలపు వాతాయానమౌ పేటికన్ .

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చీకు చింతల కష్టాల జీవిత మ్ము
భార మైనట్టి జీవికి వాంఛ లుడిగి
రైలు పట్టాల పై నిద్ర మేలొ సంగు
ననుచు వచి యించె నొక్కడీ యవని యందు

Aravalli Sreedevi చెప్పారు...

శార్దులము!!
శిల్పంబైనటి రీతిగా నడుమునే సిద్ధంబుగా జేయగా
తల్పంబెట్లగునో నదేమి కథయో తాదాత్మ్యమై పండగా?
నల్పంబైనటి మాటగాదె నినగా నార్యోక్తిగా దెల్పగా,
రైల్పట్టాల బరుండ మేల్గలుగు నార్య ప్రోక్త సత్యంబిదే?

తే.గీ!!
గుచ్చుకొనుచుండు పడుకొన ఘోరముగను
రాళ్లు రప్పలు పాన్పుగా ప్రాకటముగ
వింత గాచెప్పు చుండగ వేడ్క కాద?
రైలు పట్టాలపైనిద్ర మేలొసంగు!!
ఆరవల్లి శ్రీదేవి

Aravalli Sreedevi చెప్పారు...

పట్టు శయ్యను సుఖములు పగటి కలలె
కాయ కష్టము జేయగన్ గనగ లేరు
రాత్రి వేళ దారుల నిద్ర క్రమ్ముకొనగ
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు!!

దండిగా ఏసి టికెటును తాము కొనగ
రండి రండనుచును పిల్చి రాత్రి వేళ
పయన మైన సీతాదేవి పండు కొనగ
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు!!

శ్రీదేవి ఆరవల్లి

Subbarao Ayyalasomayajula చెప్పారు...

శా.

తల్పమ్ముల్ మృదువైన రీతి రచనల్ తద్ధర్మ లాభమ్ములౌ
తెల్పంగన్ సుకుమార లోకులకు నిస్తేజమ్ము కాఠిన్యమే
*రైల్పట్టాలఁ బరుండ, మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే*
వేల్పుల్ తోడ్పడరాత్మహత్య సృజనన్ వేదాదిబీజంబుగన్.

seethadevi gurram చెప్పారు...

రండి వైజాగు వెళదాము! రాత్రివేళ
ఏసి బోగీలొ హాయిగా యిరుకులేక
సాటి కవులతో సరదాగ! సాగుచుండ
రైలు పట్టాలపై, నిద్ర మేలొసంగు!

రైల్పట్టాలకు ప్రక్కనే వసతియై రాత్రింబవల్ కూతలై
తల్పుల్ మూసినగాని కన్నులకు కద్దాయెన్ గ
నిద్రన్నదే
తల్పంబెంతయు మెత్తనైన నరరే తాళంగ లేమో హరీ!
రైల్పట్టాల బరుండ మేల్గలుగు నార్యాప్రోక్త సత్యంబిదే



M.B.G.TILAK చెప్పారు...

అల్పంబౌ కనుగొన్నచో సరసమౌ హాస్యోక్త సంభాషణల్
స్వల్పాధిక్యులెరుంగకుండ మిగిలే సంతృప్త సంకేతముల్
రైల్పట్టాలనిజెప్పనొప్పునుగదా 'రంజిల్లు తల్పంబు'నే
రైల్పట్టాలఁబరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

రయముగాబోవ రాతిరి రైలుబండి
రైలు పట్టాలపై, నిద్ర మేలొసంగు
నలసటన్ బాపు రైలులో హ్లాదమొసగు
దూర తీరాల గమ్యముల్ చేరువరకు

sarada చెప్పారు...

తేటగీతి
జీవితేచ్ఛ నశించిన జీవి యొకడు
తలచె నాత్మహత్య విధము ,తలపుకొచ్చె
నంత రైలు పట్టాలవి నడిచి చేరె
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.

అపర్ణ గాడేపల్లి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తల్పమ్ముల్ గలవందు సౌఖ్యముగ రాత్రంబందు నిద్రింపగన్
పొల్పారన్ పయనింపగానెలమి యేప్రొద్దైన నా రైలులో
తల్పన్ రైలొనరింప యానము నితాంతంబైన వేగంబుగా
రైల్పట్టాలఁ, బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే

krkr చెప్పారు...

సమసమాంతరరేఖలసరళినిచట
నత్తకోడళ్ళునిల్వగా నడచువాడు
వేఱువేరైన భావాలవేరు జేసి
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు


గిల్పంబొక్కటిఁదెమ్మనెన్గదర సాగిన్చన్గ 'మాయాబజార్'
స్వల్పంబేగద మీదుఁగోర్కెయని నూపందిప్పి రేనొద్దొద్దనన్
అల్పంబియ్యిది నవ్యమౌ జగతి నూహాతీత మైగోఱగన్
రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

subbarao చెప్పారు...

వేగ ముగఁబోవు చుండగ భీతిఁగలిగె
రైలు పట్టాలపై ,నిద్ర మేలొసంగు
హాయి గలిగించు విశ్రాంతి నీయు మిగుల
పయన మద్భుత ముగసాగుఁ బరవశమున

subbarao చెప్పారు...

రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే
అల్లా!వింటివె వీరి మాటలు గడున్ హాస్యాస్ప దంబే గదా
రైల్పట్టాలవి చూడ నుండుగ నహా యన్నట్టుసన్నంబుగాఁ
దెల్పుంరంగున గాంతి తోడను దగన్ దీర్ఘంబు నాకారమై

Sistla Sharma చెప్పారు...

బ్రతుకు ఛిద్రమ్ము, ప్రాణమున్ వదల వలయు
నిదుర నూనిన; నింటను చదునులేని
నేలపై పరుండిన నది నిజము గాదె
రైలుపట్టాలపై; నిద్ర మేలొసంగు!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

భార్య పిల్లల తోడను పరవశాన
తిరుమలేశును చూడంగ తెరలు చున్న
సమయమందున హరినామ స్మరణ చేయ
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు

కంజర్ల రామాచార్య. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంజర్ల రామాచార్య. చెప్పారు...

స్వల్పాదాయము లెక్కుడైన వ్యయముల్ సంతాన మాధిక్యమై
తల్పన్ నారకభాధ లట్లు పెలుచన్ తార్కొన్న రోగమ్ములున్
శిల్పమ్మట్లు నెడంద జేసుకొనినన్ చేకూరునా? శాంతి, హా!
రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు, నార్యప్రోక్త సత్యంబిదే

కంజర్ల రామాచార్య

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

బ్రతుకు నందు సుఖము లేక బాధ పడుచు
శాశ్వతసుఖమువెదుకంగ జగతి నివిడి
చనగ తలచెనిటుమదిని చాన యోర్తు
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కీటక సరీసృపమ్ములు పాటవముగఁ
బ్రాక విహరింప నింకను నాఁకలిఁ దగఁ
దీర్చికొనఁగ నింపుగ శ్రమ తీర మేలి
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు

తల్పశ్రేష్ఠము లధ్వముల్ దివికి నిర్ద్వంద్వంబుగా నింపుగా
స్వల్పంబుల్ రుజ లంద నేర రిఁక నా వైకుంఠ వాస్తవ్యులై
యల్పాయుష్కుల కిద్ధరా తలము నం దానంద ధామమ్ములౌ
రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యం బిదే

Koninty Ramesh చెప్పారు...

కొనింటి . రమేశ్

తే.గీ
వరదలొచ్చియు నేలంత వల్ల కాడు
గాగ కదలిమెదలుటెల్ల కష్టమవ్వ
జనులు విశ్రాంతి నందగ జంక కున్న
రైలు పట్టాలపైనిద్ర మేలొసంగు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

రంగనాథుని దర్శింప రైలునెక్కి
పయనమొనరించుచుగడిపి పగలు నెల్ల
రాత్రివేళల నిదురించ రయముగాను
రైలుపట్టాలపైనిద్రమేలొసంగు

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.