29, ఏప్రిల్ 2024, సోమవారం

సమస్య - 4750

30-4-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి”
(లేదా...)
“లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చెరన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

12 కామెంట్‌లు:

  1. పాఠశాల వేడుకలందు వాదు జరిగె
    చదువు సంపద లందేది జాత్యమనుచు,
    ముందుగ గురువుల నడుమ మొదలు బెట్ట
    చిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి

    రిప్లయితొలగించండి
  2. పార్వతితో సరస్వతి:


    తేటగీతి
    నెగడ నీలకంఠుని జేయ మగనినీవు
    క్షీరసాగర కన్యకన్ శ్రీహరి గొని
    రాజిలె స్థితికర్తగ మీది లయమటంచు
    చిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి

    ఉత్పలమాల
    చిచ్చఱకంటివాడు పతి క్షేళమొసంగితె కాలకంఠుఁడై
    బిచ్చపు వాడిగన్ లయమె వృత్తిగ మీకయె! కాక సింధుజన్
    నిచ్చలు సృష్టిపోషణకు నీరజ నేత్రుడునందె నంచు నా
    లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చెరన్

    రిప్లయితొలగించండి
  3. తే॥ అమ్మలక్కలకు నెపుడు నమరఁ బోదు
    పొగడ నొకరిని తెగడఁగఁ బోటి పడర
    కూడి ముచ్చటించెడి వేళ కొసరి కొసరి
    చిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి

    ఉ॥ మెచ్చఁగ నొక్క యింతినటు మిక్కిలి కోపము నందు వారలే
    నచ్చకఁ బెక్కులుందురను నానుడి తెల్పఁగఁ దప్పు గాదనిన్
    రచ్చను జేసి కాంతలటు రావముఁ బెంచుచు నిర్ధరించిరే
    లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చరన్

    గత కాలములో స్త్రీల సంభాషణల స్వరూపమండి

    రిప్లయితొలగించండి

  4. సతతము శివుని గొల్చెడి జంగములను
    జేరి యాదిభిక్షువు కేల సేవలంచు
    గౌరి నగజాత దేవత కాదటంచు
    చిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి


    మెచ్చిన తల్లి దుర్గయని మిక్కిలి భక్తిని జూపి కొల్చెడిన్
    జిచ్చర కంటి భక్తులను జేరుచు నీరసమంది వారితో
    నచ్చలి కొండకూతురు మహత్మ్యము లేనిదటంచు పల్కుచున్
    లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చెరన్.

    రిప్లయితొలగించండి
  5. దైవ మొసగినదె తనకు దక్కు ననుచు
    సంతసమున నుండ గనుచు సైచ లేక
    చిచ్చు రగిలించె నొ క కాంత లచ్చి పొగడి
    బంధువుల కించపరచుచు వడిగ తాను


    రిప్లయితొలగించండి
  6. మెట్టినింటికి చేరిన మీన నేత్రి
    పుట్టినింటి వైభవమును పొగడుచుండె
    కల్కి నడవడిక వలన కాపురమున
    చిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి

    మెచ్చెను భోగభాగ్యములఁ మెండగు వియ్యపు వారి సంపదల్
    మెచ్చదు వారి ప్రాకటము మెచ్చదు వారి కుటుంబ సభ్యులన్
    వచ్చిన తోడనే మొదలు వారికుటుంబమునన్ వివాదముల్
    లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చెరన్

    [లచ్చి = సంపద]

    రిప్లయితొలగించండి
  7. తోడి కోడళ్ళ మధ్యన దూరి యొ కతె
    కల్పన లు జేసి పెంచెను కలహ మచట
    చిచ్చు రగిలిం చె నొక కాంత లచ్చి పొగడి
    పోరు జరుగుట గాంచియు మో ద మందె

    రిప్లయితొలగించండి
  8. అక్క రుక్మిణి చెల్లెలు ఆదిలక్ష్మి
    యరమరికలేమి యెరుఁగని యాప్త సఖులు
    పలకరింపఁగ వారల వద్దకుఁ జని
    చిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి

    రిప్లయితొలగించండి
  9. అచ్చఁపు స్నేహభావమునఁ నక్కయు జెల్లెలు లచ్చి శారదల్
    మెచ్చగ జూచి యెల్లరును మెల్గిరి క్షీరము నీరమట్టులన్
    మచ్చరమొంది వారిఁగని మైత్రిని భగ్నమొనర్చు నిచ్చతో
    లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చెరన్

    రిప్లయితొలగించండి
  10. వచ్చిన కృష్ణ సత్యలకు వాసవుడాతని దేవి సన్నుతుల్
    హెచ్చుగ జేసి స్వాగతమునిచ్చి సుఖాంతిక మేగి వేడుకౌ
    నిచ్చకమాడు వేళ పలుకెత్తుచు నేర్పడు రీతి రుక్మిణౌ
    లచ్చిని మెచ్చి వచ్చి నవలామణి చిచ్చు రగిల్చె చెచ్చెరన్

    రిప్లయితొలగించండి
  11. ఒక్క యొఱను గత్తుల రెంటి నుంచ వచ్చు
    మీఱి నరులందు నొక్కని మెచ్చవచ్చుఁ
    బొగడ రాదు నారుల నొక్క మగువ నెందుఁ
    జిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి


    నెచ్చెళు లెల్లఁ గోరు మిట నిచ్చను మెచ్చిన నామె నం చనం
    గచ్చెలు గల్గు నచ్చముగఁ గాంతల కిచ్చట మచ్చరమ్మునం
    బొచ్చెము లేల గోర నన ముచ్చట నెల్లరు పట్టు పట్టఁగా
    లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చెరన్

    రిప్లయితొలగించండి