20, జూన్ 2010, ఆదివారం

సమస్యాపూరణం - 16

కవి మిత్రులకు నమస్కృతులు. ఈ రోజు పూరణ కోసం నేనిస్తున్న సమస్య .......................
మేడపైనుండి పడినను మేలు కలిగె.

19 కామెంట్‌లు:

Sandeep P చెప్పారు...

శంకరయ్యగారు, ఈ పూరణ మరీ సులువుగా ఉందనిపించిందండి. అందుకే కొంచెం ఛమక్కు కనిపించడానికి మళ్ళీ కాస్త శృంగారరసాన్ని ఆశ్రయించక తప్పట్లేదు.

ఏడు నెలలుగ మెచ్చిన ఇంతి ఎదుట
పడితి, ననుఁజూసి జాలిగ పాపమంచు
మాట కలుపుచు లేపెను, మాడు పగులఁ
మేడపైనుండి పడినను మేలు కలిగె

ఊకదంపుడు చెప్పారు...

గణ,యతి,ప్రాసలు కిట్టించాననే అనుకుంటున్నాను, తప్పులుంటే చెప్పండి

పైన యుండునుమోహను- పడుచు పిల్ల
వనజ క్రిందిభాగమునందు; కనులు గలిపి
దిగుచు కాలుజారిపడగ మగువ నిలిపె
మేడపై నుండి పడినను మేలు కలిగె

కంది శంకరయ్య చెప్పారు...

@ సందీప్ -
@ వూకదంపుడు -

సందీపు, వూకదంపుడు
అందించిరి పూరణముల నందముగా నే
మందును వీరల భావము
లం దేకత తోచె; చిత్ర మనిపించెఁ గదా!

జిగురు సత్యనారాయణ చెప్పారు...

తే.గీ.
పూచె మేడపై నొక జాజి పూల తీగ
మెట్ల నెక్కఁజాలక వృద్ధ మిన్నకుండే
గాలి వానకు రాలెను పూలు కొన్ని
మేడపైనుండి పడినను మేలు కలిగె!!

జిగురు సత్యనారాయణ చెప్పారు...

(అక్షర దోష సవరణతో)
తే.గీ.
పూచె మేడపై నొక జాజి పూల తీగ
మెట్ల నెక్కఁజాలక వృద్ధ మిన్నకుండె
గాలి వానకు రాలెను పూలు కొన్ని
మేడపైనుండి పడినను మేలు కలిగె!!

చదువరి చెప్పారు...

కదప లేనట్టి కాలికి కట్టుగట్టి
కదల వద్దని చెప్పి నా కాంక్ష పెట్టె
కాలు విరిగితేనేమి నా కాంక్ష దీరె
మేడపైనుండి పడినను మేలు కలిగె

కంది శంకరయ్య చెప్పారు...

@ జిగురు సత్యనారాయణ -
@ చదువరి -

జాజిపూలను పడగొట్టి సరసముగను
"జిగురు సత్యనారాయణ" చెప్పె కవిత!
కాలు విఱుగఁగాఁ దన కోరికలను దీర్చు
కొను నదృష్టమునుఁ దగఁ జెప్పెను "చదువరి".

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

అన్ని పద్యాలు బాగున్నాయండి.....మీ అందరికీ నా ధన్యవాదములు మంచి పద్యాలు అందచేస్తున్నందుకు "" ఒక వ్యక్తి కేవలం మాటలు చెప్తూ ,గాలి లో మేడలు కడుతూ బ్రతికే రొజుల్లో ఇవన్నీ వ్యర్ధం అని తెలుసుకున్నాడు...ఆతని గాలి మేడలు అన్నీ కూలి పొయాయి...నిజం తెలుసుకుని అతనికి మేలు జరిగింది "" ఇలాంటి భావన నాది పద్యం రాయాలనే ఆసక్తి నే గానీ రాయగల శక్తి లేదు నాకు నా భావన తగినది అయితే పద్య రూపం లో అందచేయగలరు

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

పరుచూరి వంశీ కృష్ణ గారూ,
మీ భావనకి పద్య రూపాన్నిచ్చే ఓ ప్రయత్నం.

ఏడ నున్నాను నేనను ఎరుక లేక
అంబరమునంట నేనెగుర సంబరమున
కలిగె కనువిప్పు కూలితి కడకు కలల
మేడపై నుండి పడినను మేలు కలిగె

ఫణి

కంది శంకరయ్య చెప్పారు...

@ పరుచూరి వంశీకృష్ణ గారూ,
నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు. మీ భావాన్ని శ్రీ ఫణిప్రసన్న కుమార్ గారు అందమైన పద్యంగా తీర్చి దిద్దారు. గమనించారు కదా.

@ ఫణిప్రసన్న కుమార్ గారూ,
వంశీకృష్ణ గారి భావానికి అందమైన పద్యరూపం ఇచ్చి నాకు శ్రమ తప్పించారు. అభినందనలు, ధన్యవాదాలు.

సుమిత్ర చెప్పారు...

గతముమరచెను శిరమునగాయమయ్యి
బండి గుద్దుకొనగ నాడు బస్సుతోడ
స్మృతియు కలిగెనేడు మరల సుగతి వలన
మేడపైనుండి పడినను మేలు కలిగె

రవి చెప్పారు...

బాబు సైకిలు నేర్వగ బాగుఁ గంటి
మేడపైనుండి; పడినను మేలు కలిగె
తనకు. మరల మరల ప్రయత్నమును జేసి
కడకు నేర్చుకునెఁ యతఁడు కష్ట పడుచు

ప్రణీత స్వాతి చెప్పారు...

వెరైటీ గా ఉన్నాయండీ అన్నీ(అందరి) పద్యాలు. చాలా బాగున్నాయ్.

కంది శంకరయ్య చెప్పారు...

@ సుమిత్ర -
@ రవి -

గతము గుర్తు చేయు హితమును కల్పించు
మేటి పూరణము "సుమిత్ర" దయ్యె,
మేడపైన నిలిచి చూడఁగా బాలుఁడు
పడిన విధము నిట్లు పలికెను "రవి"

కంది శంకరయ్య చెప్పారు...

ప్రణీత స్వాతి గారూ,
సమస్యాపూరణ లందిస్తున్న కవులు మీరడిగినట్లుగా తమ పద్యాలకు వివరణలు కాని, కఠిన పదాలకు అర్థాలను కాని ఇవ్వకున్నా మీరు ఆ పద్యాల భావాన్ని అవగతం చేసుకొని పద్య కవితా మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

నర్సు భామను ప్రేమించి నాను నేను,
మేడ పైనుండి పడ చిట్లె మెడలు, జేర,
ఆసుపత్రిని ఐలవ్యు అనెను భామ
మేడపైనుండి; పడినను మేలు కలిగె.

వసంత కిశోర్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)
________________________________

వాణినే , జూచి ప్రేమలో - పడితి నేను
మేడ పైనుండి ! పడినను - మేలు కలిగె !
పొరుగు వారది జూచిమా - పొందు నెరిగి
వాణికిని నాకు జేసిరి - పరిణయమ్ము !
________________________________

పొందుప్రేమ

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.