3, నవంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 142

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
పొట్టివాఁడె కాని గట్టివాఁడు.

22 కామెంట్‌లు:

  1. జైజవాను జైకిసానంచు నినదించి
    జాతి భవిత దీర్చు నేత యయ్యె
    అమరవరులు బిలువ నంతలో నరిగెను
    పొట్టి వాడె కాని గట్టి వాడు!

    మరొక పూరణ

    దేశ గమనమునకు దిక్సూచి వంటిదౌ
    ఆర్థికాంగణమున కధిపతాయె
    రెండుమార్లు త్రిప్పె రివ్వున చక్రము
    పొట్టి వాడె కాని గట్టి వాడు!

    రిప్లయితొలగించండి
  2. ఆణి ముత్యమంటి బాణి నందించెను
    “జై జవాను బోలొ జైకిసాను !”
    లాలు బహదురు ఘనులా శాస్త్రిజీ చూడ
    పొట్టివాఁడె కాని గట్టివాఁడు !
    మనవి: నేను గౌరవించే దేశ ప్రముఖులలో ప్రథముడు లాల్ బహదూర్. దేశానికి అలాంటి ప్రధాని కావాలి, అప్పుడూ-ఇప్పుడూ కూడా.

    రిప్లయితొలగించండి
  3. రాజ నీతి బుధుడు రాణిoచె ఆనాడు
    రాజ కీయ మందు,రణము నందు ,
    గెలిచి పేరు దెచ్చె లాలు బహద్దూరు .
    పొట్టి వాడె కాని గట్టి వాడు !

    రిప్లయితొలగించండి
  4. ఇలయు నందు ఘనుడు నీ లాల్ బహద్దూరు
    సత్యధర్మమూర్తి,సౌమ్యుడయ్యు
    కయ్యమందు గవియు కవ్వడి యీతండు
    పొట్టివాఁడె కాని గట్టి వాఁడు

    రిప్లయితొలగించండి
  5. అదితి పుత్రుడయ్యె నారాధ్య వటుడయ్యె
    అడుగు లిడుచు విశ్వ మాక్రమించె
    బలిని మట్టుపెట్టె బాతాళ లోకంబు
    పొట్టివాఁడె కాని గట్టి వాఁడు

    రిప్లయితొలగించండి
  6. బెంగబడ్డ ధరకు పెద్దదిక్కైనిల్చి
    అత్యవసరమునకు అడ్డు తగలి
    భరత భువికి జూపె ప్రగతిబాటనె-పి.వి-
    పొట్టి వాడె కాని గట్టి వాడు

    ---
    పెక్కు కాంగిరేసు పెద్దలకుగురువీ
    తడు; చూచు ప్రభుత తరణ కితని
    వంగదేశబుధుడు ప్రణబుముఖర్జి, సూ!
    పొట్టి వాడె కాని గట్టి వాడు
    --
    ఆశుపద్యవిధిని అగ్రగామీతండు
    అంత్య ధారణమొక ఆటవిడుపు
    కనగ సింహ రాయ గరికపాటికవి తా-
    పొట్టి వాడె కాని గట్టి వాడు
    ---
    బ్యాటు బట్టి నంత భయభ్రాంతులుగల్గు
    వైరి జట్ల కెల్ల వరస గాను
    ఠీవి యన్న, సచిను టెండుల్కరునిదిగా-
    పొట్టి వాడె కాని గట్టి వాడు

    రిప్లయితొలగించండి
  7. సాటి లేని మేటి సచిను టెండుల్కరే
    క్రికెటు ఆట నందు మకుటధారి
    ఎదుటి జట్టు వారు ఇట్లు జెప్పెదరట
    "పొట్టి వాడె కాని గట్టి వాడు!"

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పద్యం రెండవ పాదంలో "అధిపతాయె" అనడం గ్రామ్యం. "అధిపతి యయె" అంటే బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  9. చంద్రశేఖర్ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    "ఆణిముత్య మంటి" అనడం కంటే "ఆణిముత్యము వలె" అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  10. మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. ముఖ్యంగా రెండవది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ఊకదంపుడు గారూ,
    రాజకీయ, ఆర్థిక, సాహిత్య, క్రీడా రంగాలను ప్రస్తావిస్తూ మీ నాలుగు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పద్యం రెండవ పాదంలో "తడు" అన్నారు. "తండు" టైపు చేయబోయి "సున్నా" మరిచారేమో.
    నాల్గవ పద్యం మొదటి పాదంలో "భయభ్రాంతులు గల్గు" అన్నప్పుడు గణదోషం ఉంది. దానిని "భయ విహ్వలత గల్గు" అంటే సరిపోతుంది కదా. ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  13. నచికేత్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. తడు అచ్చుతప్పండీ, భయభ్రాంతులు - గణ దోషమె ( ఎందువల్లో భయ లో భ గురువుగ లెక్కకట్టుకున్నాను- మీరు చెప్పిన మార్పు బాగుంది, ధన్యవాదములు.
    వైరి జట్ల - ఫరవాలేదా మాష్టారూ ..
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  15. చుట్టుఁ బట్టలేదు, కట్టడి యదిలేదు,
    వట్టి పెట్టుడుఁ గొని గట్టి బలిని
    మట్టిఁ గొట్టె నొక్కొ పుట్టువటువు శౌరి!
    పొట్టివాఁడె కాని గట్టివాఁడు!
    (చుట్టు - చక్రము, పెట్టుడు - దానము)

    రిప్లయితొలగించండి
  16. ఇంకొక రకంగా పూరణ:
    మూడడుగులడిగియు మోస బుచ్చె
    పొట్టి వా(డె,- కాని గట్టి వా(డు
    ప్రఖ్యుడా బలియజయాఖ్య మాయగెలిచె,
    భావి మనువగు బలిబంధ(ను) నాన!

    మనవి: మూడడుగులడిగింది వామనుడు. బలి అజయాఖ్యమాయ గెలిచినాక, భావి కాలంలో మనువగుదు వని ఆజ్ఞాపించింది విష్ణువుగా మారిన హరి. ఆ సుళువుని పద్యంలో పెట్టటానికి ప్రయత్నమే ఈ పద్యం.

    రిప్లయితొలగించండి
  17. ఒంటి వాడ నంచు నొకటి రెండడుగులు
    కపట వటువు యడిగె కడకు మూడు..
    బలిని యణచి నిండె బ్రహ్మాండ మంతయు
    పొట్టి వాడె కాని గట్టి వాడు .!

    రిప్లయితొలగించండి
  18. ఊకదంపుడు గారూ,
    "వైరి జట్ల" అనడం "శత్రు మూక" లాంటిది. ఫరవాలేదు.

    రిప్లయితొలగించండి
  19. రవి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. చంద్రశేఖర్ గారూ,
    భావం మంచిదే. దానిని ఛందోబద్ధం చేయడంలో కొద్దిగా తడబడ్డారు. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం ఉంది. ప్రఖ్యుడు అనే పదంలేదు. ప్రఖ్యాతి కలవాడు అనే అర్థంలో మీరు వాడి ఉంటారు.
    నా సవరణ ...
    మూడడుగు లడిగియు మోసబుచ్చె వటుఁడు
    పొట్టివాఁడె కాని గట్టివాఁడు
    ముఖ్యుఁడై బలి యజయాఖ్య మాయ గెలిచె
    బావి మను వగు ననె వామనుండు.

    రిప్లయితొలగించండి
  21. నేదునూరి రాజేశ్వరి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    "వటువు + అడిగె = వటు వడిగె" అవుతుంది. "వటువు యడిగె" అని యడాగమం రాదు.
    "కపట వటు వడిగెను కడకు మూడు" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి