9, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 146

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.
కృష్ణ శాస్త్రి గారి "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు" ను చంద్రశేఖర్ గారు సూచించారు. వారికి ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

  1. చన్ద్రశేఖర్ గారు వినమ్రంగా యేవో పదాలు కలిపి గురువుగారికి పంపిస్తున్నాను అన్నారు కానీ ఆయన భావానికి గురువుగారిచ్చే రూపము తోడై మెదడుకి మాంఛి మేత పెట్టే క్లిష్టమైన సమస్యలే పుట్టుకొస్తున్నాయి. సంతోషం.

    రిప్లయితొలగించండి
  2. ఎన్ని దాడులు చేసినా ఏమి కాదు,
    ఎన్ని కూతలు కూసినా ఏది పోదు,
    ఎదురు దాడియే నాకున్న పదును శరము,
    నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు!

    రిప్లయితొలగించండి
  3. స్వరలోకపు అత్యంత ప్రీతిపాత్రమైన అక్షతాశీస్సులు నూతన వధూవరులపై వర్షించు గాక!

    రిప్లయితొలగించండి
  4. కులసతిని నిను కటకటా గోవుపగిది
    నమ్ముచుంటినిటుల సాక్షి యన్నపూర్ణ.
    వారణాసీనగరపుణ్యవాసులెల్ల
    నవ్వి పోనిమ్ము, లేదులే నాకు సిగ్గు.

    రిప్లయితొలగించండి
  5. "ఇంత వయసులో? నవ్వరే? యెంత సిగ్గు!
    నేర్చి ఛన్దస్సు పద్యాలు కూర్చ గలవె?"

    "నవ్వి పోనిమ్ము, లేదులే నాకు సిగ్గు.
    విద్య నేర్చుట కున్నదే పెద్ద వయసు?"

    రిప్లయితొలగించండి
  6. చిన్ని చిన్ని సవరణలతో...దయచేసి ఇది వేయండి, ముందుది తొలగించండి.
    శివునివోలె నే సతినిక శిఖన బెట్టు
    కొందు, విష్ణువోలే గుండెలందు నింపు
    కొందు, బ్రహ్మవోలే ముట్టకుండ నుందు
    ఎవని పిచ్చి వానికియింబు, యేమి టనుచు
    నవ్వి పోనిమ్ము, లేదులే నాకు సిగ్గు!
    మనవి: ఇంబు=సంతోషము, ఆనందము

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్న గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరు మిగతా మిత్రులు ఒకే సమస్యని పలు కోణాలలో, అర్థ పరంగా సాహిత్య పరంగా, అద్భుతంగా పూరించటం ఆనంద దాయకంగా వుంది. మాకు వరూధినీ ప్రవరాఖ్యము చెబుతూ మా తెలుగు మాష్టారు అనేవారు, "రసము లేని జీవితము రాయి వంటిదిరా!" అని. అందుకే యేదో కాస్త శృంగారం వైపు గాలిమళ్ళింది. ఇక నా సంగతి అంటారా,
    గణములు ప్రాసలు యతిల
    క్షణములు పదదోషములను కనిపెట్టగ లా
    ఫణితి నెరుంగను శంకర!
    గణి నీవె మరిగతి నాకు ఖట్వా౦గధరా!
    శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ:

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరు మిగతా మిత్రులు ఒకే సమస్యని పలు కోణాలలో, అర్థ పరంగా సాహిత్య పరంగా, అద్భుతంగా పూరించటం ఆనంద దాయకంగా వుంది. మాకు వరూధినీ ప్రవరాఖ్యము చెబుతూ మా తెలుగు మాష్టారు అనేవారు, "రసము లేని జీవితము రాయి వంటిదిరా!" అని. అందుకే యేదో కాస్త శృంగారం వైపు గాలిమళ్ళింది. ఇక నా సంగతి అంటారా,
    గణములు ప్రాసలు యతిల
    క్షణములు పదదోషములను కనిపెట్టగ లా
    ఫణితి నెరుంగను శంకర!
    గణినీ వెమరిగ తినాకు ఖట్వా౦గధరా!
    శ్రీమేధాదక్షిణామూర్తయేనమ:

    రిప్లయితొలగించండి
  9. నాకు పాడడం రాదు, ఆడడం రాదు అయినా ,

    సిందురమ్మును చిలుకుచు చిందులేతు
    మంచిగంధపు పూతలు మరల రాతు
    యెలుగు నెత్తుచు పాడుదు తెలుగు పాట
    నవ్విపోనిమ్ము లేదులే నాకు సిగ్గు

    రిప్లయితొలగించండి
  10. వలపు విరహాల సంకెల బిగుసు కొనగ
    ముద్దు మురిపాలు పంచగ మంగ చెంత
    కొండ దిగిదిగి నడిరేయి గడచి యైన
    నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.
    ....... ...... ........ ....
    పెద్ద వయసున నేర్చ్హిన విద్య లెపుడు
    వమ్ము కాబోదు చదివిన వింత హాయి
    వయసు బేధము లేదన విద్య కెపుడు.
    నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.

    రిప్లయితొలగించండి
  11. మంద పీతాంబర్ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    సత్య గారూ,
    ధన్యవాదాలు.

    ఊకదంపుడు గారూ,
    మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    త్రిమూర్తులకు లేని సిగ్గు మన కెందుకు? బాగుంది. అభినందనలు.
    కాని బ్రహ్మ తన భార్యను ముట్టక పోవడం ఏమిటి? ఈ సందర్భంగా నేను ఎప్పుడో ఒకరి పెళ్ళికి వ్రాసిన "ఆశీస్సుమమాల" లోని మొదటి పద్యం గుర్తుకు వస్తున్నది.

    శ్రీసతి నెప్డు వక్షమునఁ జేర్చి జనావళిఁ గాచు శౌరి, గౌ
    రీ సుదతీ మణిన్ దన శరీరములో సగ మిచ్చి మెచ్చు కై
    లాస గిరి స్థితుండగు కళానిధి మౌళి, సరస్వతిన్ మనో
    ల్లాసముగాఁ జతుర్ముఖములన్ ధరియించిన బ్రహ్మ వేడ్క మీ
    కీ సమయమ్మునన్ శుభము లెన్నియొ గూర్తు రొసంగై దీవెనల్.

    రిప్లయితొలగించండి
  12. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీ రెండు పద్యాలూ హృద్యంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మాస్టారుగారూ, సరస్వతీ దేవి మనోల్లాసినియే గాని (మీ పద్యంలో వున్నట్లు)బ్రహ్మదేవునితో భౌతికముగ స్పర్శ లేదని ఎక్కడో చదివిన గుర్తు. తెలియక నా వచనంలో శాస్త్రదోషం వుంటే మన్నించమని మనవి.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ
    మీ ఆశీర్వచన పద్యము చాలా చాలా బాగుంది. చంద్రశేఖర్ గారు వివరణ యివ్వగలరు. ఆయన పురాణాల పురుగు. ఏదో గూడార్ధం ఉంటొంది, ఆయన పలికేరంటే.

    రిప్లయితొలగించండి
  15. గురువులకు నమస్కారములు
    వొక చిన్న సందేహం. " కందమునకు మూడవ గణము " గగ ' ము ఉండ కూడదు అని నియమము ఉన్నదా ? తెలుప గలరు

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి గారూ,
    కందంలో రెండవ, నాల్గవ పాదాలలో మూడవ గణంగా జగణం కాని, నగణం కాని ఉండాలని నియమం. అక్కడ తప్ప "గగం" ఎక్కడైనా ప్రయోగింపవచ్చు. ఒకవేళ కందం మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే మిగిలిన పాదాలు కూడ లఘువుతో ప్రారంభం కావాలి కదా. అందువల్ల అటువంటి పద్యంలో అన్ని పాదాల్లో మొదటి గణంగా "గగం" రాదు.

    రిప్లయితొలగించండి