14, జనవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1293 (సమకూర్చున్ సకలాంధ్ర)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య(?) ఇది...
సమకూర్చున్ సకలాంధ్రసజ్జనులకున్ సంక్రాంతి శ్రీసౌఖ్యముల్.

33 కామెంట్‌లు:

  1. ప్రమదంబొప్పగ శంకరాభరణ సభ్యశ్రేణి ప్రేమోన్నతిన్
    సుమవర్షంబును మించు నాశిషములన్ శోభిల్లు పద్యాలలో
    కమనీయంబుగ జిల్క మేలగు శుభాకాంక్షల్ ప్రకాశింపగా
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  2. గురువు గారికి అన్నయ్య గారికి మిత్రబృందమునకు నమస్సులు, మరియు సంక్రాతి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  3. కమనీయంబుగ నిత్యపద్యరచనన్ గావించు మిత్రాళికిన్,
    శ్రమ యొక్కింతయు లేనిరీతి సతమున్ సన్మార్గముం జూపు నీ
    ప్రముఖుల్ పండిత,శంకరార్యులకిలన్ భాగ్యంబు లందించుచున్
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  4. గురువర్యులకు, కవి మిత్రులకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. సమతాభావము పంచుచున్, పలుకులో సభ్యత్వముం గూర్చుచున్,
    మమతాగంధము నింపుచున్ హృదిని, సన్మానంబు లందించుచున్,
    భ్రమలం ద్రోచుచు, హర్షదాయి యగుచున్, భాగ్యప్రదంబై సదా
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  6. గురువుల పాదపద్మములకు ప్రణమిల్లుతూ, తమకూ, కవిమిత్రులకు..
    సకల భోగభాగ్యముల నొసగు పౌష్యలక్ష్మి సర్వ శుభములనొసగాలని ఆకాంక్షిస్తూ,సంక్రాతి శుభాకాంక్షలు ! .. శైలజ

    రిప్లయితొలగించండి
  7. గురువర్యులకు, కవి మిత్రులకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

    సీసము:
    ముగ్గుల్ల గొబ్బిళ్ళు ముంగిళ్ళ రంజిల్లు
    హరిదాసు భజనల్లు హాయి జల్లు
    గంగిరెద్దులగంతు గమ్మత్తు చప్పుళ్ళు
    గాలిపటములు, కోళ్ళ జూదగాళ్ళు
    అల్లుళ్ళ కోడళ్ళకత్తింట సందళ్ళు
    బోసి నగవుల తలను భోగి పళ్ళు
    పులగమునరిసెల్లు పులిహోర పొంగళ్ళు
    పరవశమ్మొందేటి పల్లెటూళ్ళు

    ఆటవెలది:
    కనుమ నాడు నిండు కర్షక తమ్ముళ్ళ
    కనగ సంతసమున కనుల నీళ్ళు
    ఆంధ్ర జనులకెల్ల ఆనంద పరవళ్ళు
    సంకురాత్రి నాటి సంబరాలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    సమయస్ఫూర్తిని జాటు సత్కవితలన్ సాగించుచు న్నిత్యమున్
    సమతాభావముపెంచి సజ్జనులతో సాంగత్యమున్ సల్పుచున్
    క్రమమౌరీతిని విత్తసంచయమునన్ కామ్యార్ధియై పొందగా
    సమకూర్చున్ సకలాంధ్రసజ్జనులకున్ సంక్రాంతి శ్రీసౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి

  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    సమతాభావనతో పరస్పర వికాసస్ఫూర్తి సద్బుధ్ధితో
    కమనీయంబగు తెన్గు తోట విరియంగా పెంచి పోషించుచున్
    భ్రమరమ్ముల్ శుకకేకి కోకిలలు గా వైషమ్యముల్ లేనిచో
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  10. సమయంబందున చేయు నిర్ణయములై సద్భావనల్బొందగా
    సమ న్యాయంబని వేరుబాట లనుచున్ సంకీర్ణమంచున్ సదా
    భ్రమలన్ బెంచక నన్నివర్గములతో రాజీని సాధించగా
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  11. రమణీయంబగు జీవితాశయములన్ రాజిల్లు ధీ శక్తియున్
    సమతా భావ సుగంధమున్ మిగుల సస్యశ్యామలానందమున్
    మమతారాధన బుద్ధి సద్గురుల సన్మానించు భావోన్నతిన్
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  12. సమతాభావవిశాలదృక్పథములశ్రాంతమ్ము వెల్గొంది భా
    వమునన్ నిశ్చలతత్వసాధనకళాప్రావీణ్యతన్ బొంది క్షే
    మముగల్గన్ విబుధైకమండలి దిశామార్గాను సంధానమై
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీసౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  13. మమతల్ బంధముఁ బెంచగా మిగుల సమ్మానంబు సౌభ్రాత్వముల్
    భ్రమలన్ ద్రెంచగ; మేధ,శక్తులిట సౌభాగ్యమ్ములన్ బెంచగా
    రమణీయంబుగ నైక్యతన్ బడసి నైరాశ్యమ్మువీడంగ తా
    సమకూర్చున్ సకలాంధ్రసజ్జనులకున్ సంక్రాంతి శ్రీసౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఎనాటి అందరి పద్యములు అలరించు చున్నవి. అందరికి అభినందనలు. కొని సూచనలు:

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    మీ సెస పద్యములో:
    భజనల్లు - అనరాదు.
    2, 3 పాదములలో గణభంగము కలదు.
    పులగము నరిసెల్లు అనరాదు.
    పరవశమ్మొందెడు పల్లెటూళ్ళు అందాము.
    కర్షక తమ్ముళ్ళు మరియు ఆనంద పరవళ్ళు అను సమాసములు సాధువులు కావు.

    మత్తేభములో: "సమ న్యాయంబని" అనుటలో న్యాకి ముందున్న మ గురువు అగును - అందుచేత గణభంగము.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
    మీ పద్యములో:
    సౌభ్రాత్రము అందాము.
    2వ పాదములో భ్రమలన్ ద్రెంచ వివేక శక్తులిట అందాము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. మమతల్ బంధముఁ బెంచగా మిగుల సమ్మానంబు సౌభ్రాత్రముల్
    భ్రమలన్ ద్రెంచ;వివేకశక్తులిట సౌభాగ్యమ్ములన్ బెంచగా
    రమణీయంబుగ నైక్యతన్ బడసి నైరాశ్యమ్మువీడంగ తా
    సమకూర్చున్ సకలాంధ్రసజ్జనులకున్ సంక్రాంతి శ్రీసౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  16. రమణీయంబుగ సేద్యకారులు శుభారంబివ్వ కష్టించుచున్
    కమతమ్ముల్ తెగ దున్నిపంటలను విక్రాంతమ్ముతో దీయగా
    ప్రమదంబాయెను క్రొత్త ధాన్యములు సంప్రాప్తించ శాంతమ్ముతో
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచనలు:
    మొదటి పాదములో "కష్టించుచున్"కి బదులుగా "ప్రోత్సాహులై" అందాము.

    సౌఖ్యము అనే పదము ద్విరుక్తి కాకుండా 3వ పాదములో చివర సౌభాగ్యముల్ అందాము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నేమాని వారికి నమస్కారములు. సవరణలు సూచనలకు ధన్యవాదములు. ఇంకా యేవైనా దోషములున్నచో తెలుపగలరు.

    ముగ్గుల్ల గొబ్బిళ్ళు ముంగిళ్ళ రంజిల్లు
    హరిదాసు భజనలే హాయి జల్లు
    గంగిరెద్దులగంతు గమ్మత్తు చప్పుళ్ళు
    గాలి పటము, పందె గాళ్ళ కోళ్ళు
    అల్లుళ్ళు కోడళ్ళకత్తింట సందళ్ళు
    బోసినోటి తలను భోగి పళ్ళు
    పులగమన్నమరిసె పులిహోర పొంగళ్ళు
    పరవశమ్మొందెడు పల్లెటూళ్ళు

    కనుమ నాడు రైతు కళ్ళలోపల సుడులు
    కనగ సంతసమున కదలు నీళ్ళు
    ఆంధ్ర జనులకెల్ల నాహ్లాద బాష్పాలు
    సంకురాత్రి నాటి సంబరాలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శుభాశీస్సులు.
    మీ సవరణలు బాగుగ నున్నవి. కొన్ని సూచనలు.
    అల్లుళ్ళూ మరియు పులగం అనునవి టైపు పొరపాటులు కావచ్చు.

    3వ పాదములో బుజ్జాయిల తలల భోగి పళ్ళు అందాము.
    కనుమ నాడు రైతు కనులలో గాంతులు అందాము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ నేమాని వారికి నమస్కారములు. సవరణ సూచనకు ధన్యవాదములు. గణ సవరణతో...

    సమయంబందున చేయు నిర్ణయములై సద్భావనల్బొందగా
    సమ దూరమ్మని వేరుబాట లనుచున్ సంకీర్ణమంచున్ సదా
    భ్రమలన్ బెంచక నన్నివర్గములతో రాజీని సాధించగా
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  21. శ్రీ నేమాని వారికి నమస్కారములు. చక్కని సవరణలకు ధన్యవాదములు. సవరణలతో..

    ముగ్గుల్ల గొబ్బిళ్ళు ముంగిళ్ళ రంజిల్లు
    హరిదాసు భజనలే హాయి జల్లు
    గంగిరెద్దులగంతు గమ్మత్తు చప్పుళ్ళు
    గాలి పటము, పందె గాళ్ళ కోళ్ళు
    అల్లుళ్ళు కోడళ్ళకత్తింట సందళ్ళు
    బుజ్జాయిల తలల భోగి పళ్ళు
    పులగమన్నమరిసె పులిహోర పొంగళ్ళు
    పరవశమ్మొందెడు పల్లెటూళ్ళు

    కనుమ నాడు రైతు కనులలో కాంతులు
    కనగ సంతసమున కదలు నీళ్ళు
    ఆంధ్ర జనులకెల్ల నాహ్లాద బాష్పాలు
    సంకురాత్రి నాటి సంబరాలు.

    రిప్లయితొలగించండి
  22. తమ స్వార్థమ్మున కన్నదమ్ముల నిలన్ దాయాదులంజేయుచున్
    మమకారమ్ముల మాపి వారి నడుమన్ మంత్రాంగముల్ పన్నుచున్
    భ్రమలన్ దేలెడు రాజకీయ తతికిన్ భంగమ్ము గా నాశలే
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని గురు దేవులకు నమస్సులు, మీరు సూచించిన సవరణలు శిరోధార్యములు.

    మహారాష్ట్రలో సంక్రాంతి రోజున బెల్లంతో తయారు చేసిన నువ్వుల ఉండలను పంచుట ఆనవాయితి.

    కొమ్మలు వేసిన ముగ్గులు
    గుమ్మమునకు తోరణములు గొబ్బెమ్మలతో
    నిమ్ముగ సంక్రాంతి దినము
    కమ్మని నువ్వుండ లిచ్చి కాచును మనలన్

    రిప్లయితొలగించండి
  24. సవరణతో.....

    రమణీయంబుగ సేద్యకారులు శుభారంభమ్ము గల్పించగన్
    కమతమ్ముల్ తెగ దున్నిపంటలను విక్రాంతమ్ముతో దీయగా
    ప్రమదంబాయెను క్రొత్త ధాన్యములు సంప్రాప్తించ సౌభాగ్యముల్
    సమకూర్చున్ సకలాంధ్ర సజ్జనులకున్ సంక్రాంతి శ్రీ సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  25. మిత్రుల ఈనాటి పూరణలు అన్నియును అలరించు చున్నవి. అందరికి అభినందనలు.
    అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    శ్రీ హరి....మూర్తి గారు: 2 చక్కని పద్యముల నందించేరు - 1 పద్య కవులను ప్రశంసించుచూ, 2.జనులలో సమతాది గుణములను వర్ణించుచు. చాలా బాగుగ నున్నవి.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: 2 మంచి పద్యములను వ్రాసేరు. 1 సంక్రాంతి శోభలు 2. సమైక్యతా భావమును గురించి. చాలా బాగుగ నున్నవి.

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: విందైన పద్యము వ్రాసేరు - సత్కవితా ప్రశంస .

    శ్రీ నాగరాజు రవీందర్ గారు: పంటలు బాగుగా పండుననియు సుభిక్షమైన స్థితిని వర్ణించేరు - చాల బాగుగ నున్నది.

    శ్రీ తిమ్మాజీరావు గారు: మంచి వినూత్న భావముతో తెనుగు తోటలలో సాహిత్య పిపాసులైన వివిధ పక్షులతో వర్ణన చాల బాగుగ నున్నది.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు: జనులలో ధీశక్తి, ఉదార గుణములను వర్ణించేరు. మంచి పద్యము.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: విబుధుల మార్గాను సంధానము గూర్చి మనకు విందు చేసేరు.

    శ్రీమతి లక్ష్మీదేవి గారు: మనలోని సౌభ్రాత్రము మొదలైన మంచి గుణములను వర్ణించేరు. చాలా బాగుగ నున్నది.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: 2 మంచి పద్యములను అందించేరు. 1. రైతుల కృషి, 2. నువ్వుండల సంప్రదాయము. చాల బాగుగ నున్నవి.

    శ్రీ మిస్సన్న గారు: మంచి విందు చేసేరు. రాజకీయములను గుర్తు చేసేరు. చాలా బాగుగ నున్నది.

    అందరికి శుభాకాంక్షలను అందించిన శ్రీ గన్నవరపు వరాహ నరసింహ మూర్తి (మా తమ్ముడు) కి, మరియు శ్రెమతి శైలజ గారికి శుభాశీస్సులు.



    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు.
    సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మనోహరమైన పూరణలు చెప్పిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నాలుగు రోజులపాటు నేను బ్లాగుకు అందుబాటులో ఉండను. రోజువారి సమస్యలను షెడ్యూల్ చేసి ఉన్నాను. ఈ నాలుగు రోజులు మిత్రులు ఉత్సాహంగా పూరణలు చేస్తూ, పరస్పర గుణదోష విచారణ చేయవలసిందిగా మనవి.
    ఈనాడు తమ చక్కని పద్యాలతో బ్లాగును అలంకరించిన మిత్రులు...
    పండిత నేమాని వారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    మిస్సన్న గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    శుభాకాంక్షలు తెలిపిన
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    శైలజ గారికి,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. శిష్యవాత్సల్యంతో, సౌజన్యంతో, పద్యకవిత్వాభిమానంతో మిత్రుల పూరణల గుణదోష విచారణ చేస్తూ తగిన సూచనల నిస్తున్న గురుదేవులు పండిత నేమాని వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. శ్రమనున్ జెందుచు నెత్తి కెత్తుకొనుచున్ సంతానమున్ వెర్రిగా
    కొమరుల్ బావలు బంధు మిత్రులచటన్ కూడంగ వీక్షించుటన్
    సమయుజ్జీలగు కోడి పుంజులనినిన్ చావంగ నాత్మీయతన్
    సమకూర్చున్ సకలాంధ్రసజ్జనులకున్ సంక్రాంతి శ్రీసౌఖ్యముల్

    రిప్లయితొలగించండి