21, జనవరి 2014, మంగళవారం

1300 సమస్యలు! వేలకొద్ది పూరణలు!!


కవిమిత్రులకు నమస్కృతులు.
నేటికి శంకరాభరణంలో ఇచ్చిన సమస్యల సంఖ్య 1300కు చేరింది. అందరి సహకారం, భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమయింది. సమస్యలను పంపి సహకరించిన వారికి, సమస్యాపూరణలు చేసి బ్లాగు పురోగమనానికి బాటలు వేసిన వారికి, భాషాసాహిత్య చర్చలతో జ్ఞానాన్ని పంచిన వారికి, ముఖ్యంగా బ్లాగును నిరాటంకంగా కొనసాగించడానికి నాకు ఆత్మస్థైర్యాన్నిచ్చినవారికి, గుణదోష విచారణ చేస్తూ, తగిన సూచనలను ఇస్తూ ఔత్సాహిక కవులను ప్రోత్సహిస్తూ బ్లాగుకు పెద్ద దిక్కుగా ఉన్న పండిత నేమాని వారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఇది మన బ్లాగు.. మనందరి బ్లాగు... మన తెలుగు పద్యసాహిత్యాన్ని అభిమానించే బ్లాగు. దీనిని ఇలాగే కొనసాగిద్దాం!

18 కామెంట్‌లు:

  1. సరస కవిత్వ తత్త్వ విలసఛ్ఛుభ మానసులార! శంకరా
    భరణ పవిత్ర వేదిని సువర్ణ నిధానముగా నొనర్చు సో
    దర కవివర్యులార! ప్రమదంబున గూర్తు ప్రశంసలన్ సుధీ
    వరుడగు శంకరార్య కవి పండిత మండను ప్రస్తుతించుచున్

    రిప్లయితొలగించండి
  2. గురువుగారికి మన బ్లాగు మరిన్ని మైలురాళ్ళను అధిగమించాలని కాంక్షిస్తూ అభినందన త్రయోదశ శతము.

    రిప్లయితొలగించండి
  3. ఇక్కడ మంచి మంచి పద్యాలు అందిస్తున్న కవి వర్యులందరికీ పేరు పేరునా ధన్యవాదములు ... బ్లాగు ని నడుపుతున్న శంకరయ్య గారు, మీకు ప్రత్యెక ధన్య వాదములు అభినందనలు .. మీకు వీలయితే ఒక ఇవన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లో అందివ్వగలరు .. ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  4. శంకరాభరణం ద్వారా నాలాంటి ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పద్యసాహిత్య పురోగమనానికి బాటలు వేస్తున్న ఈ బ్లాగుకు, దానిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న శంకరార్యులకు నా మనఃపూర్వక ధన్యవాదములు.

    వంశీకృష్ణ గారు,
    Unicodeలో ఉన్న సమాచారమును శోధన (search) చేయవచ్చు. PDFను search చేయడము అంత శులభము కాదు. అందువలన, ఈ బ్లాగుని PDFలో కన్నా Unicodeలో ప్రచురించడం మంచిదని నా అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  5. మన ' సమస్యలు ' వందలు.. వేలు కావాలని సమస్యాపూరణలు గను వారలకు ' గని ' కావాలని ఆకాంక్షిస్తూ..శ్రీ శంకర గురువర్యులకు అభినందనలు, నమస్సులతో..

    అనితర సాధ్యంబిదియే
    వినయముతో జెప్పుచుంటి విజ్ఞులకెల్లన్
    ఘనమైన బ్లాగు ' మనదిగ '
    మనవలె శ్రీ శంకరార్య మాన్యుని చేతన్.

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణ పద్య సాహిత్య భ్లాగ్ నిర్వాహకులు శ్రీ కంది శంకరార్యులతో పాటు దోషములు సవరిస్తూ సూచన లిస్తున్న శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు. శంకరాభరణ భ్లాగ్ కారణంగా నేను కూడా నేటికి 300 పద్యములు పూరించి పంపడం జరిగినది . ఈ భ్లాగ్ ఇదే విధంగా కొనసాగాలని సాహిత్య పిపాసకు లందరు సహకరించాలిని కోరుతూ శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను .
    అయ్యా! శంకర గురువర
    నెయ్యముతో నడుపుచున్న నీ బ్లాగుకు నే
    నయ్యా! నతులను జేతు శి
    వయ్యా శీస్సులను బొంది వఱ లనుదినమున్.

    రిప్లయితొలగించండి
  7. శంకరాభరణ బ్లాగు శతముకొలది
    పూరణల దోడ విలసిల్లె పొలుపుగాను
    శంకరార్యుల కృషి తోడ ,శంక లేదు
    వందనంబులు వానికి వంద లాది .

    రిప్లయితొలగించండి
  8. ఏరోజునంగాని యిసుమంత యలసత్వ
    ..........మందక యిద్దియే విందటంచు,
    ఆరోగ్యసహకార మందకున్ననుగాని
    ..........కవుల కానందంబు కల్గజేయు
    బహుసమస్యలనిచ్చి ప్రతిదినంబును కావ్య
    ..........రచనంబు చేయించి రమ్యముగను
    శంకరాభరణాఖ్య సత్కళావేదికన్
    ..........నిర్వహించుచునుండి నేర్పుమీర
    అస్మదాదులైన యల్పజ్ఞజనులకు
    జ్ఞానభిక్ష పెట్టి మాన మొసగు
    కందిశంకరార్య! కవివర్య!గుణధుర్య!
    వందనంబు లిప్పు డందుకొనుడు.

    వివిధమార్గాలలో విస్తృతంబగురీతి
    ..........పద్యాలు రచియించు పద్ధతులను
    ఛందస్స్వరూపంబు నందమొప్పగ నేర్పి
    ..........దొసగులు సవరించి యసదృశమగు
    మార్గదర్శన చేసి మామానసంబుల
    ..........నుత్సాహమును నింపుచుండి సతము
    శంకరాభరణాన సత్కావ్యరచనంబు
    ..........చేయించుచుండెడి ధీయుతుండు
    కవివరేణ్యు డౌచు ఘనయశంబులనంది
    క్రమత నెన్నియేని గ్రంథములను
    వెలువరించినట్టి విద్వజ్జనాగ్రణిన్
    పండితార్యఘనుని ప్రస్తుతింతు.

    ఏసమస్యకునైన నింపారు కవితలన్
    ..........దారి చూపుచునుండు వారలకును,
    వర్ణనాంశములంది బహుసమర్ధతతోడ
    ..........పద్యాలు రచియించు వారలకును,
    శంకరాభరణాన సర్వకాలములందు
    ..........వ్యాఖ్యానములు చేయు వారలకును,
    మేటివాక్యాలతో మిత్రులకుత్సాహ
    ..........వర్ధనం బొనరించు వారలకును,
    సాధుహృదయు లౌచు సద్భావపూర్ణులౌ
    బంధుతుల్యులైన పాఠకులకు,
    అస్మదీయులైన ఆత్మీయజనులకు
    వందనంబు లార్యు లందరకును.

    శంకరాభరణాన సత్కావ్యరచనంబు
    ..........సాగుచుండెడుగాత! సంతతంబు,
    ఈకళాస్థలియందు నింపుగా నెప్పుడు
    ..........వేవేల పూరణల్ వెలయుగాత,
    సాహిత్యనిలయమై సన్మానములనందు
    ..........నీదివ్య ధామంబు నెల్లగతుల
    విద్వద్వరేణ్యులౌ విజ్ఞుల యాశీస్సు
    ..........లందుచుండెడుగాత యనవరతము
    సంతసంబు గూర్చి సాహితీప్రియులకు
    మిత్రతుల్యమౌచు మేదినిపయి
    సద్యశంబుగూడి శంకరాభరణంబు
    చిరము వెలుగుగాత స్థిరతనంది.

    రిప్లయితొలగించండి
  9. శంకరాభరణము బ్లాగును నిర్వ హిస్తున్న గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి 1300 సమస్యల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అభినందనలు. అదే విధంగా సమస్యలను ఆసక్తితో పూరిస్తున్న కవి మిత్రులకు, సమీక్ష చేస్తున్న పండిత నేమాని గురువర్యులకు నమోవాకములు.

    శంకరయ్య గారి శంకరాభరణమ్ము
    ప్రతి దినమ్మునొక్క పద్య పాద
    మివ్వ పూరణమ్ము లిడుచున్న కవి మిత్రు
    లందరికిడుచుంటి వందనములు.

    రిప్లయితొలగించండి
  10. అభినందనలు, ఆశీస్సులను తెలిపిన మిత్రులు...
    పండిత నేమాని వారికి,
    మిస్సన్న గారికి,
    పరుచూరి వంశీకృష్ణ గారికి,
    పుష్యం గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    సుబ్బారావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    ఒక విశ్వవిద్యాలయం, ఒక మహాసంస్థ, ఒక మహోద్యమం సాధించలేని అపూర్వమైన పద్యకవితా పునరుజ్జీవనోద్యమాన్ని నిర్విరామంగా నిర్వహించిన మీ దీక్షకు, దక్షతకు తెలుగువారు ఎన్ని ప్రశంసలను కురిపించినా అవి అల్పీయస్తరాలే అవుతాయి. పదమూడు వందల సమస్యలకు కనీసం ఒక్కొక్క సమస్యకు ఇరవై సమాధానాలని అనుకొంటే ఇప్పటికే ఇరవైఅయిదువేల పూరణలు లెక్కకు వస్తాయి. ఆ పైని వర్ణనలు, దత్తపదులు వంటివి పరిగణనీయాలు ఉన్నాయి. వాటి సంఖ్యకూడా అసంఖ్యాతంగానే ఉంటుంది. ఒక మహారాజు, ఒక ఆంధ్రసారస్వత పరిషత్తు చేయలేని మహాకార్యాన్ని మీరు ఒక్క చేతిమీదుగా సంసాధించారు. ఇవన్నీ ఒక యెత్తు కాగా, మీరు ఈ బ్లాగు నిర్వహణముఖాన వెలుగులోకి తీసికొనివచ్చిన కవులు, పూరయితలు, విమర్శకులు, ప్రాథమికులు, పండితమ్మన్యులు, పండితమాన్యులు లెక్కలేనంతమంది ఉంటారు. వారందరూ కేవలం ఈ బ్లాగులోనే కాక తమ సాహితీవరివస్యను కొనసాగించి ఎన్ని పద్యాలను, ఎన్నెన్ని స్వతంత్రకవితలను, ఎంతటి కావ్యావళిని ప్రకల్పించి ఉంటారో ఉఃహాతీతమైన విశేషమనిపిస్తున్నది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు తారసిల్లినా నీరసింపక, ఎన్ని విమర్శలు ఎదురైనా అవమర్శింపక శాంతచిత్తంతోనూ, స్థితప్రజ్ఞతతోనూ అనునిత్యం మీరు దీనిని నడిపిన తీరు ఎటువంటివారికైనా అచ్చెరువును గొలుపక మానదు.
    అందుకు మీకు హృదయపూర్వకమైన అభినందనలను, ఋణగ్రస్తతను తెలియజేసికొంటున్నాను.

    నిజానికి పద్యకవితను ఇన్నిన్ని రూపాల ఉజ్జీవింపజేస్తున్న మీకు గౌరవ డాక్టరేటును ప్రదానం చేసి ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు తమ విలువను కాపాడుకోవటం సమంజసంగా ఉంటుంది. ఆ సద్బుద్ధి వారికి కలగాలని పద్యకవితాసరస్వతిని ప్రార్థిస్తున్నాను.

    ఈశ్వరానుగ్రహం వల్ల మీకు ఆయురారోగ్యాభివృద్ధులు, మనశ్శాంతి సమకూడాలని, మీ కైసేత ఫలంగా శ్రీ శారదాదేవి పాదాల చెంత భావికాలంలోనూ ఇన్నిన్ని పూజాపుష్పాలు మహితమంగళాస్పదంగా భాసురిల్లాలని, మీ ఆశీస్సులు మా అందరికి శిరోవతంసాలై నిత్యవిరాజమానాలు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  12. వందలు వేలవ్వాలని నా ఆకాంక్ష :

    ___________________________

    పలుకుతల్లికి పద్యపు - వరుస లనగ
    వర్ణమాతృక పాదాల - ప్రసవము లన
    వందలు పదమూడు ముగిసె - నందముగను
    వందనములివె వాణికి - వంద వేలు !

    వందలవి వేలు కావలె - వాస్తవమున
    విందు కావలె విద్యార్థి , - వేదులకును
    వందనములివె సత్కవి - వర్యులకును
    వందనమిదె శంకర కవి - వర్య నీకు
    ___________________________
    వరుస = హారము = మాల
    ప్రసవము = పువ్వు

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా !

    13000-1300 = 11300
    11300/365 = 30.93
    అనగా
    కనీసం
    మరొక 32 సంవత్సరములు
    నిర్విరామంగా
    నిర్వివాదంగా
    నిరాటంకంగా
    ఈ బ్లాగు
    కొనసాగాలని
    నా కోరిక !

    రిప్లయితొలగించండి
  14. గురువు గారు శ్రీ కంది శంకరయ్య గారికి , అన్నయ్య గారు శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారికి నమస్సులు. నిరాఘటంగా సమస్యా పూరణాల తోరణాలతో తెలుగు పండుగ ప్రతిదినము జరిపిస్తున్న గురువు గారికి అభివందనములు.

    రిప్లయితొలగించండి
  15. ఏల్చూరి మురళీధర రావు గారికి,
    వసంత కిశోర్ గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి