22, జనవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1301 (ఓడినవారలకుఁ దృప్తి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఓడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు  గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. వీడే నాశిష్యుండా?
    వీడే జగమెల్ల మెచ్చు వీరుడ యనుచున్
    పోడిమి చెడి శిష్యునితో
    నోడిన వారలకు దృప్తి యొనగూడు గదా!

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి !

    రుద్రవీణ సినిమాలో ఒక తండ్రి :

    "నమస్కారం !
    నేను సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని
    సూర్యనారాయణ శాస్త్రి-- తండ్రిని --నేను
    సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేనేనని
    గర్వంగా చెప్పుకుంటున్నాను !
    ఓడిపోయి గెలిచానో
    గెలిచి ఓడిపోయానో
    తెలియని పరిస్థితి నాది !
    సంగీత కళానిధి బిల్హరి గణపతి శాస్త్రి కొడుకుననే బింకంతో
    పంతాలు పలకవద్దని హెచ్చరించిన నేనే
    యిప్పుడు సూర్యనారాయణశాస్త్రికి తండ్రినని సంతోషంగా
    సభాముఖంగా పరిచయం చేసుకుంటున్నాను !
    మల్లెపువ్వు వల్ల తీగను మల్లెతీగ అంటారు
    మామిడి పండు వల్ల చెట్టును మామిడి చెట్టు అంటారు !
    సూర్యంవల్ల నేను సూర్యానికే తండ్రి నయ్యాను !
    సంగీతమే సర్వస్వమని
    సంగీతమే పరబ్రహ్మ స్వరూపమని
    నమ్మిన నాకు
    సంఘహితమే సంగీతమని తెలియ జేసాడు నా బిడ్డ !
    నా పాట కొన్ని వేలమంది వింటే
    సూర్యం నడిచిన బాట కొన్ని లక్షల మందికి ఆదర్శ మయ్యింది !
    ఈ దశాబ్దంలో ఎందరో గాయకుల్లో ఒకణ్ణి నేను !
    కాని మా సూర్యం యీ దశాబ్దానికే నాయకుడయ్యాడు !
    కాబట్టి సంగీతానికి పరమావధి యిప్పుడు నా కర్థమైంది !
    నేను సైతం యీ ప్రపంచ సంగీతంలో ఒక సద్గతి నౌతాను !
    నేను సైతం మీ బృందగానం లో గొంతు కలుపుతాను ! "
    http://www.youtube.com/watch?v=2W1sCGYfiIY

    ఫలానా వాడికి కొడుకు ననిపించు కోవడం కన్నా గొప్పే ముంటుంది ఏ తండ్రికైనా :

    01)
    ___________________________

    వాడే నా కొడు కనకను
    వాడికి నే తండ్రినంచు - పలికెడి నాడే
    మేడెము నను సుతు చేతను
    ఓడినవారలకుఁ దృప్తి - యొనఁగూడు గదా!
    ___________________________
    మేడెము = యుద్ధము(పోటీ)

    రిప్లయితొలగించండి
  3. పబ్లిక్ ప్రాసిక్యూటరైన తండ్రి కెదురుగా
    డిఫెన్సులాయరుగా ఒక కేసు వాదిస్తానంటే
    మంచిమనసులు సినిమాలో యశస్వి సాయిత్రితో:

    "నేను గెలిస్తే లాయరుగా నాకు గెలుపు !
    నువ్వు గెలిస్తే నిన్ను కన్నతండ్రిగా నాదే గెలుపు
    తప్పకుండా వాదించమ్మా " అంటా డానందంగా

    కూతురు చేతిలో ఓడినా తండ్రి కానందమే :

    02)
    ___________________________
    ఓడితివా ? నాదె గెలుపు !
    ఓడిననూ నేనె గెలుతు - నోహో యనుచున్
    వీడెల్ల నిన్ను బొగడగ !
    ఓడినవారలకుఁ దృప్తి - యొనఁగూడు గదా !
    ___________________________
    వీడు = పట్టణము
    *****
    మంచి మనసులు :
    ఇదొక గొప్ప
    ప్రేమ-త్యాగం
    కరుణ-కర్తవ్యం
    వినోదం-విషాదం
    మంచితనం-మానవత్వం
    తగుపాళ్ళల్లో కలిపి
    పంచదార పలుకులవంటి మాటలు
    కమ్మని సంగీతంతో కలగలిపి
    తీసిన చిత్రం !
    చూడండి !
    పిల్లలకు చూపించండి తప్పకుండా !

    రిప్లయితొలగించండి
  4. మన్మథయుద్ధం(ప్రణయకేళి)లో
    ఓటమే గెలుపు-గెలుపే ఓటమి :

    03)
    ___________________________

    కూడినను పారవశ్యము !
    ఓడుట,గెలుచుట కతీత - మోయది గనినన్ !
    ఆడిన వారెల్ల గెలుతు
    రోడిన వారలకుఁ దృప్తి - యొనఁగూడు గదా !
    ___________________________

    రిప్లయితొలగించండి
  5. పోడిమిగల శిష్యునకును,
    వీడక జీవితమునందు విస్తృతయశముల్
    జోడించిన సత్పుత్రున
    కోడినవారలకు దృప్తి యొనగూడు గదా!

    రిప్లయితొలగించండి
  6. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం
    22-01-2014 తెల్లవారుఝాము గం 2-45లకు
    *****
    నిర్దయుండగు విధియొక్క - నిర్ణయమున !
    నిలువ లేనిక నేలపై - నిలువ ననుచు
    నింగి కెగసెను ధ్రువతార - నిశ్చయముగ
    నిన్ను నన్నును యందరి - నేడ్వమనుచు
    నిలచి యుండును తనకీర్తి - నేలమీద
    నింగి సూర్యుని కడదాక - నిజము నిజము !

    రిప్లయితొలగించండి
  7. చూడగ చదరంగములో
    నాడుచునుత్తేజమొంది హ్లాదమునన్ పో
    రాడెడు సత్పుత్రునితో
    నోడిన వారలకుఁ దృప్తి యొనఁగూడుకదా!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    శిష్యుని చేత ఓడిన గురువుకు తృప్తి కలగడం సహజం. మంచి పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    అక్కినేని చిత్రం మంచిమనసులును పూరణలో ప్రస్తావించడం నన్ను నా బాల్యానికి తీసుకుపోయింది. ఎన్ని ఆ జ్ఞాపకాలు ఆ చిత్రంతో... మా నాన్న జేబులోంచి డబ్బులు దొంగిలించడం, స్కూలు ఎగ్గొట్టి స్కూలు పక్కనే ఉన్న శ్రీనివాసా టాకీస్‍లో మాట్నీషో చూడడం, రాత్రి మా నాన్నచేతా, మరునాడు స్కూల్లో మా తరగతి ఉపాధ్యాయుని చేత దెబ్బలు తినడం...
    రెండవ పూరణలో ‘ఓడిననూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు :-)
    అక్కినేని వారికి శ్రద్ధాంజలి ఘటించిన పద్యం బాగుంది. ధన్యవాదాలు.
    ‘నన్నును + అందరి’ అన్నప్పుడు యడాగమం రాదు. అందుకని ‘నిన్ను నన్ను తెలుగువారి నేడ్వమనుచు...’ అందాం.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చదరంగంలో కొడుకు చేత ఓడిన తండ్రి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. కీడునుఁ జేసెడు వారల,
    చీడగ మారిన మనుజుల చీల్చుచు, విధి చెం
    డాడగ; వారల యాటల
    కోడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!

    రిప్లయితొలగించండి
  10. ఓడిన సతీసుతులతో
    ఓడుట కాదది గెలుపుకి ఓనజరానా!
    వీడని పౌరుష మున్నను
    ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా!

    రిప్లయితొలగించండి
  11. కీడును చేయక నెవరికి
    వేడుకగానాడినోడ వీగుట గాదే!
    పోడిమి పోయిన గానీ
    ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా!

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణలోని ‘లాజిక్కు’ బాగుంది. ఓడినవారు తమనోడించినవారికి అపకారం కలిగితే తృప్తిపడతారు కదా. మంచి పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘ఓడు’ శబ్దానికి ఉన్న వివిధార్థాలను వినియోగించుకొని మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘గెలుపుకి’ అన్నారు. ఉకారాంత పదాలకు ‘కు’ ప్రత్యయం, ఇకారాంత పదాలకు ‘కి’ వస్తాయికదా. ఒకను ‘ఓ’ అన్నారు. అక్కడ ‘గెలుపున కొక నజరానా’ అంటే సరి!
    రెండవ పూరణలో ‘చేయక యెవరికి’ అని ఉండాలి. ‘అక’ ద్రుతాంతం కాదు.

    రిప్లయితొలగించండి


  13. ఓడఁగ విభజన బిల్లది
    కూడిన సభ్యులు సమైక్య కూటమి నందున్
    కీడెరిఁగి వాతఁ బెట్టగ
    నోడిన, వారలకుఁ దృప్తి యొనగూడుఁ గదా!

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    ‘కూటమి యందున్’ అనాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    ఓడియు దుఃఖించని సా
    లీడు గెలుపునొందు గాధ లెరిగినవారల్
    వీడక యత్నమొనర్చిన
    ఓడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    ఓడెను పూవులు కోయగ
    కూడుచు మాలలుగశివుని కూరిమి జేరెన్
    వీడెను నిర్మాల్యముగను
    ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా

    రిప్లయితొలగించండి

  17. పాడగును వారి మనసులు
    ఓడినవారలకు దృప్తి యొనగూ డు గదా
    వీడగ విభజన సంగతి
    పోడిమతో నుం డదగును పురజను లికపైన్

    రిప్లయితొలగించండి
  18. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. ఓడుచు పందెము లందున
    పోడిమి గోల్పోయి బాధఁ బొందగ జనముల్
    దాడులు చేయ ప్రభుత్వము
    ఓడిన వారలకు దృప్తి యొనగూడు గదా!

    రిప్లయితొలగించండి
  20. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ఆడెడి క్రికెట్టునందున
    నోడగ " ఫిక్సింగు " జేసి నోట్లను ముంచన్
    వీడుచు దేశపు భక్తిని
    ఓడిన, వారలకు దృప్తి యొనగూడు గదా!

    రిప్లయితొలగించండి
  22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మ్యాచ్ ఫిక్సింగులో ఓడి ‘తృప్తి’ పడిన వారిని గురించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,

    నే రాద్దామనుకున్న విషయాన్ని నా కన్నా ముందు నా కన్నా చక్కగా వ్రాశారు. అభినందనలు

    రిప్లయితొలగించండి
  24. గురువుగారిసవరణకు ధన్యవాదములు.
    మరియొక ప్రయత్నం:
    పాడఁగ వేలపు పాటను
    గూడిన ప్రత్యర్థిఁ దెబ్బ కొట్టఁగఁ బాడన్
    మూడింతలుఁ బెంచి విడచి
    యోడిన వారలకుఁ దృప్తి యొనగూడుఁ గదా!

    రిప్లయితొలగించండి
  25. గోడలు దూకుచు భళియని
    మోడీతో కలసిమెలసి మోసము తోడన్
    బోడిగ హా! తమ పక్ష
    మ్మోడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!

    రిప్లయితొలగించండి


  26. వేడుకగా నీతో దే
    వా! డాగలి మూతల సరి పాచిక లాటల్
    వేడెద! నీవో నేనో
    ఓడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. పోడిమి మీరగ ముద్దిడి
    తాడో పేడో యనుచును తల్లిని బహుధా
    ఝాడించెడి పెండ్లానికి
    నోడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!

    రిప్లయితొలగించండి