30, జనవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1309 (పగటిపూట నిద్రింప)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పగటిపూట నిద్రింప సంపద పెరుగును.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. పనులు చెడిపోవు, వాస్తవ మనుదినంబు
    పగటిపూట నిద్రింప, సంపద పెరుగును
    సావధానాత్ములైయుండి సవ్యగతిని
    వ్యవహరించుచు నుండెడి వారలకును.

    రిప్లయితొలగించండి
  2. వలదు వలదని పెద్దలు కలత పడును
    పగటి పూట నిద్రింప , సంపద పెరుగును
    మూడు సంధ్యల యందున ముచ్చ టనగ
    పూజ జేయుచు తరియించ పుణ్య ఫలము

    సోదరులు శ్రీ శంజరయ్య గురువులు తొందరగా కోలు కోవాలని దీవిస్తూ అక్క

    రిప్లయితొలగించండి
  3. క్షమించాలి శ్రీ శంకరయ్య గురువులు అని ఉండాలి

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    నటులు తారలు రైళ్ళను నడుపు వారు
    తగిన విశ్రాంతి కొఱకయి తప్పదెపుదు
    పగటిపూట నిద్రింప ; సంపద పెరుగును
    వారికామార్గ మొక్కటే వరము గాగ !


    త్రాగి వీధిని బడివాగె రోగి యిటుల
    భళిర ! పొగత్రాగ నూరేళ్ళు బ్రతుకవచ్చు
    వారకాంతల గూడిన నేరమవదు
    పగటిపూట నిద్రింప సంపద పెరుగును.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ గుండా సహదేవుడు గారి పూరణ:

    పవలు రేలును శ్రమలేక భవిత లేదు
    దినము రెక్కాడగనె సేదదీరు రాత్రి
    రాత్రి కర్తవ్యముల జూచు ధాత్రిజనులు
    పగటి పూట నిద్రింప సంపద పెరుగును

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు
    పగటి పూట నిద్రింప సంపద పెరుగును
    రాత్రి మేల్కొన నారోగ్య రక్ష నొసగు
    ననగ యక్ష రాక్షసు లెల్ల రహము నందు
    నిదుర బోయెదరట మేల్కొనెదరు రాత్రి.

    రిప్లయితొలగించండి
  7. ధ్యానమునకు రాత్రియె యనువైన వేళ
    యనుచు యోగులు ధ్యానమునందు మునుగు
    చుండి సేద దీరుటకయి యొక్క కొంత
    పగటి పూట నిద్రింప సంపద పెరుగును

    రిప్లయితొలగించండి
  8. లేమి గలుగును దప్పక భామ లార !
    పగటి పూట నిద్రింప, సంపద పెరుగును
    శివుని బూజించు వారల కవిర ళ ముగ
    పగటి నిద్రలు మానుట బాగు మనకు

    రిప్లయితొలగించండి
  9. సంపదలను బొంద నరు లసౌఖ్యమనక
    రెక్కలను నమ్మి సమయము లెక్క గొనక
    రాత్రి వేళలో పనిజేసి లక్షణముగ
    పగటి పూట నిద్రించ సంపద గలుగును.

    రిప్లయితొలగించండి
  10. అతడు పని జేయు మంచాలనమ్ము చోట
    హాయిగా నిదురించు భాగ్యమును జూపు
    టతని పని! యెంత నిద్దురకంత ఫలము
    పగటిపూట నిద్రింప సంపద పెరుగును

    రిప్లయితొలగించండి
  11. కొన్ని కొలువుల తప్పదు కొంత సేపు
    పగటి పూటనిద్రింప, సంపద పెరుగును
    రాత్రి పనిజేసి నందుకు లక్షణముగ
    పగలు రేలని యెంచిన ఫలము చెడును

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి మిత్రులందరి పూరణలు అలరించు చున్నవి. అందరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    నిద్ర లేచినది మొదలు రాత్రి వరకు ప్రతీ చోట ఘర్షణలే
    =============*================
    'పగ'లు పెరుగు చుండె భువిని పగటి పూట,
    పగులు చుండ హృదయములు బండ వలెను,
    పగటిపూట నిద్రింప సంపద పెరుగును
    రామ రామ యనగ మీరు రాత్రి పూట !

    రిప్లయితొలగించండి
  14. సంపదలను బొంద నరు లసౌఖ్యమనక
    రెక్కలను నమ్మి సమయము లెక్క గొనక
    రాత్రి వేళలో పనిజేసి లక్షణముగ
    పగటి పూట నిద్రింప సంపద పెరుగును.

    రిప్లయితొలగించండి
  15. చక్కని సవరణలతో పద్యాన్ని ప్రచురించిన శ్రీ నేమని గురుదేవులకు ధన్యవాదములు. కవిమిత్రుల పూరణలన్ని బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు
    మరియొక పూరణ
    పగటి పూటనిద్రింప సంపద,పెరుగును
    వెగటు గాజేయువిధమున. పెంట జేర్ర్చు
    కలిమి నంతయు, రొగముల్ కలుగజేయు
    పగటిపూటను నిదురింప పనికి రాదు

    రిప్లయితొలగించండి
  17. పనియె లేదని యేడ్చేవు వరద రాజ !
    నైటు వాచ్మెను నౌకరీ నయముగాను
    రార ! చూపెద పనిజేసి రాత్రులందు
    పగటి పూటనిద్రింప సంపద పెరుగును

    రిప్లయితొలగించండి
  18. శ్రీ కంది శంకరయ్య గారు ఈరోజు స్వస్థతతో లేరో లేక తీరిక లేకుండా ఉన్నారో తెలియదు. వారు స్వస్థతతో నుండాలి అని మా ఆకాంక్ష.

    ఈనాటి సమస్యకు మన మిత్రులు అందరు చేసిన పూరణలు వైవిధ్యముతో అలరారుచున్నవి. అన్నియును చాల బాగుగ నున్నవి. పేరు పేరునా అందరికీ అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులు మన్నించాలి. ఈరోజు ఉదయం హైదరాబాదు వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకున్న మా వియ్యపురాలిని పరామర్శించి ఇంతకుముందే ఇల్లు చేరాను. అందువల్ల మీ పూరణలపై వెంటవెంట స్పందించలేకపోయాను.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘పెద్దలు కలతపడును’ను ‘కలత పడరె’ అనండి.
    అన్నట్టు... నా ఒంటినొప్పులు చాలావరకు తగ్గాయి. కుడిచేతి మణికట్టు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నది. మందులు వాడుతున్నాను. ధన్యవాదాలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    విరుపుతో మొదటి పూరణ, త్రాగుబోతు మాటగా రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    గుండా సహదేవుడు గారూ,
    మన్నించాలి. ప్రయాణంలో ఉండగా నా సెల్ ఫోన్‍కు మీ మెయిల్ వచ్చింది. ఫోన్ ద్వారా బ్లాగులో వ్యాఖ్యలు, పోస్టులు పెట్టలేకపోతున్నాను. మీరు నేమాని వారి ద్వారా ప్రకటింపజేశారు. సంతోషం.
    నైట్ డ్యూటీ చేసేవాళ్ళు పగలు నిద్రపోవడం సహజమే. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    అందుకేనా వాళ్ళను రాత్రించరులన్నారు! బాగున్నది మీ పూరణ.
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఆధ్యాత్మిక సంపదను పొందే యోగుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    రాత్రి పనిచేసే కష్టజీవుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    ఆదిత్య గారూ,
    మంచాలమ్మేవాడు గురించిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    పగలు ‘పగ’లు పెరుగుతున్నాయన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నైట్ వాచ్‍మెన్ ఉద్యోగం గురించిన మీ పూరణ చమత్కారజనకంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి