15, డిసెంబర్ 2016, గురువారం

సమస్య - 2225 (ఇన శశి బింబయుగ్మము....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఇన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్"
(ప్రాచీనమూ, ప్రసిద్ధమూ అయిన సమస్య)
లేదా...
"ఇన హిమకర బింబము లుదయించె నొకమొగిన్"

52 కామెంట్‌లు:

  1. డా.పిట్టా
    ఘన నిశి యను పెంజీకటి
    మనమునదే కలత బెట్టె మనునటె శాంతి?
    న్గననగు నావల ధృతియుత
    ఇన హిమకర బింబములుదయించె నొకమొగిన్!
    వినుము మనోవినిగ్రహము వేకువ ఝామగు ధ్యాన వేళలన్
    తనివి దలర్ప చక్రముల దాటుచు వెళ్ళగ ఢక్కు ఢక్కనన్
    గనుమదె కంటి పాపల సగౌరవ రీతిని నొ(ఒ)క్కచూపుగా
    మనగను చీకటుల్ సరిసమాన సుషుమ్నన వీడిపోవు; నా
    ఇన శశి బింబ యుగ్మముదయించె దినాంతమునందు దద్దిశన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ధృతియుత+ఇన' అన్నపుడు గుణసంధి వచ్చి 'ధృతియుతేన' అవుతుంది కదా!

      తొలగించండి
  2. జ్ఞాతులు బినదండ్రులు మరి
    తాతలు మామలు గలరట సంగ్రామమునన్,
    ఆతత కలవర మున హృ
    ద్గితను బోధించె నరుడు గీష్పతి వినగన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యం మధ్య అచ్చులు రాకూడదు కదా! 'సంగ్రామమున। న్నాతత.../ సంగ్రామములో। నాతత...' అనండి.

      తొలగించండి
  4. ఇనుడట వెలయగ తూరుపు
    వెనువెంటనె పడమటింట వెలుగుల రేడై
    కనుపించగ జగతి సొగసులు
    ఇన హిమకర బింబము లుదయించె నొకమొగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'కనుపించ జగతి సొగసులు' అనండి.

      తొలగించండి
    2. ఇనుడట వెలయగ తూరుపు
      వెనువెంటనె పడమటింట వెలుగుల రేడై
      కనుపించ జగతి సొగసులు
      ఇన హిమకర బింబము లుదయించె నొకమొగిన్

      తొలగించండి
  5. ఇనకులతిలకుడు రాముడు
    ఘనతరమగు శివదనుస్సు ఖండించంగన్
    కని జంటను ప్రజ తలచిరి
    ఇన హిమకర బింబములుదయించె నొకమొగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. మనమున చింతనల్ సతము మాధవురూపమె యోగికైవడిన్
    ఘనతరపారమార్థికపు కాయముగల్గిన భక్తుడైన "పో
    తన"హరిగాంచెనా పరమతత్త్వ విశారదు దివ్యతేజుని
    న్నిన శశి బింబయుగ్మముదయించె దినాంతమునందు తద్దిశన్.

    (శ్రీ మహావిష్ణు నేత్రమలలో నొకటి రవి, మరొకటి శశి )

    ఘన విష్ణుభక్తుడగుటను
    ననయంబును వేడుచుండు నార్తుండగుటం
    గనప్రహ్లాదునకయ్యెడ
    నినహిమకర బింబములుదయించె నొకమొగిన్.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. కన్యా కుమారి యొద్దన
    ని న హిమకర బింబము లుదయించె నొక మొగి
    న్నె నరగ బౌర్ణమి రోజున
    కనువిందగు జూడ మనకు గాంచిన గొలదిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాస తప్పింది. దానివల్ల ప్రథమాక్షరం గురువవుతున్నది.

      తొలగించండి
  8. ఇననిభ తేజ నేత్రము ఫణీంద్ర విభూషణు ఫాల మందునం
    దనర శశాంకమౌళి యమదర్ప విఘాత మనోభిలాషియౌ
    యినజ మృకండ సూనులకు నీశ్వర భాసుర మూర్ధ మందు నా
    యిన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్


    జనని శివప్రియ సావి
    త్రి నగాత్మజ గౌరి బాలదినకర నిభ మా
    కనక తిలక ముఖ శశిని
    న్నిన హిమకర బింబము లుదయించె నొకమొగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. ----------------------
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ( అర్జునునకు కృష్ణుడు విశ్వరూపము చూపగా

    ఆయన నేత్రము ల౦దు సూర్యచ౦ద్రులు ... .)


    విను పార్థ ! " స౦గ్రామ మ౦దు

    . వీరుల నే చ౦పవలయు

    ననుచు స్వా౦తమున భావి౦చ

    . కయ్య | నిమిత్త మాత్రుడవె |

    కనుము , నా విశ్వరూప " మని

    . క౦సారి సాక్షాత్కరి౦ప > >

    నిన హిమకర బి౦బము లుద

    . యి౦చె నొక మొగిన్ గనులలొ

    ______________________________________

    క౦సారి సాక్షాత్కరి౦ప = కృష్ణుడు నా యొక్క

    విశ్వరూపము చూడు మని సాక్షాత్కరి౦పగా }
    ______________________________________

    రిప్లయితొలగించండి
  10. ఘనమౌ శశివదనమ్మున
    తనరగ నొసటన తిలకము దపనుని వోలెన్
    తనుమధ్యనుగన కవియనె
    యినహిమకర బింబము లుదయించె నొకమొగిన్!!!

    రిప్లయితొలగించండి
  11. కనుముర రాజ శేఖరుడ !కాంతులు జిమ్ముచు నాకసంబున
    న్నినశశి బింబయుగ్మ ముదయించె, దినాంత మునందు దద్దిశన్
    గనుమిక నెఱ్ఱ కాంతులు వికారము బుట్టు విధంబుగా మరిన్
    గనబడు చుండెనే జెపుమ కాంతుల మధ్య న వెల్గు నాశివున్

    రిప్లయితొలగించండి
  12. కన పూర్ణిమ దివ సంబున
    యినుఁడుదయించంగ శశియు నిర్గమ మగుచున్
    కనుమరు గగుటను దలుపగ
    ''యిన హిమకర బింబము లుదయించె నొకమొగిన్''

    నిన్నటి సమస్యకు నా పూరణ
    వాతము పిత్తమున్ గలియ వాకొనరాని ఋజున్ చరించుచున్
    చేతన వీడి బల్కుచునె చిందులు వేయుచు గాధ లల్లుచున్
    చేతను మధ్యమున్నునిచి జీర్ణ శరీరుడు బల్కె నొక్కచో
    గీతను జెప్పె నర్జునుండు గీష్పతియే వినఁగన్ రణంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      '..దలుపగ। నిన హిమకర...' అనండి.

      తొలగించండి
  13. ఘనతరమైన చీకటులు క్రమ్మెడు వేళ సరిత్తటంబునన్
    వనగత జంతుజాలము సభన్ నడిపించుచు నుండ చిత్ర మా
    యినశశిబింబయుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్
    కనబడె నాకు స్వప్నమున గాంచితి నంచనె మిత్రు డొక్కడున్.

    కనినాడను స్వప్నంబున
    ఘనతరముగ నిరులు జగతి గ్రమ్మిన వేళన్
    వినుడని పలికెను మిత్రుం
    డినహిమకరబింబము లుదయించె నొక మొగిన్.

    తెనుగుకవీంద్రులందు రవితేజుడునా కవి సార్వభౌముడున్
    ఘనుడగు పోతనార్యుడొక కాలమునన్ మడి కేగుచుండ నా
    వనమున నున్నవారు కవివర్యుల గాంచి దలంచి రిట్టు లౌ
    నినశశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్.

    ఘనుడగు శ్రీనాథుం డా
    యనఘుడు పోతన్న తోడ నటు నడువంగా
    కనువార లిట్టు లాడిరి
    యినహిమకరబింబము లుదయించె నొక మొగిన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ నాలుగు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. వినయము విజ్ఞతన్ గలిగి విశ్వమనోహర రామచంద్రుడే
    మునిజన రక్షగోరిఖలు మూకల ద్రుంచెడు వేళలో గన
    న్ననిన యహస్కరుండవగ నచ్చటి తాపసు లెల్లబల్కిరే
    ఇన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్


    ఇనకుల చంద్రుండనిలో
    ఘనుడౌ శ్రీరాముడగ్ని కణముల్ రాల్చన్
    గనిన కపీశ్వరుడిట్లనె
    ఇన హిమకర బింబము లుదయించె నొకమొగిన్

    రిప్లయితొలగించండి
  15. రణమునఁ బోరనెంచి తగు లగ్నము నెన్నగ నాశ్వినేయునిన్
    వినతిగ కోరినట్టి కురు వీరుని ధారిక తప్పనెంచి భా
    వనమున కృష్ణుడంత నమవాసిగ బల్కుచు నర్ఘ్యమీయగా
    యిన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అనిరుద్ధుని భక్తుడు రెయి
    కనిన స్వప్నమున శౌరి కమనీయంబౌ
    కనుదోయిని గాంచిన వడి
    ఇన హిమకర బింబములుదయించె నొకమొగిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. వనధిని వడిగా దివిజులు
    దనుజులు సుధకై నటునిటు దరచగ పుట్టెన్
    వినిమయ మొనరించు తరిని
    యినహిమకర బింబములుద యించెనొకమొగిన్.

    ఘనుడా శౌరియు నుడివెను
    వినుమో పార్థా జగతిన వినిపించెద నీ
    కును గీతననగ నచ్చో
    యిన శశిబింబములుదయించె నొకమొగిన్.

    రణరంగమునందున రా
    వణసంహరవేళలందు వాతాత్మజు మూ
    పున నెక్కిన వాని కనుల
    యిన శశిబింబములుదయించె నొకమొగిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. కనుమోయి విశ్వరూపము

    ననుచు ప్రదర్శింప శౌరి యర్జునుడపుడున్

    గనె కృష్ణుని కనుదోయిని

    యిన హిమకర బింబములుదయించె నొకమొగిన్.

    రిప్లయితొలగించండి
  19. వినగను వింత దోచుమది వేల యుగమ్ముల నుండి చిత్రమౌ
    ఘనమగు సేవ చేయుచును కాలపు చక్రము నాపకుండగన్
    ఇనుడట తూరు పున్విరిసి, యింపుగ పశ్చిమ దిక్కు నందునన్
    ఇన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతము నందు దద్దిశన్

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దినమణి వలె చండభుడౌ
    జనకుడు తనకగు కొలువుకు సంబర పడుచున్
    పొనుపడె నప్పుడె శశిగా
    ఇన హిమకర బింబములుదయించె నొకమొగిన్.

    రిప్లయితొలగించండి
  21. ఇందుముఖి ఫాలమందున చెందిరంపు
    బొట్టు యిన హిమకర బింబములుదయించె
    నొకమొగిన్నన వింతగ ప్రకటమయ్యె
    సాధ్వి సైరంధ్రి గనిన కీచకున కపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      తేటగీతిలో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  22. అనుమానంబును లేకన్
    గననట గాంధీ జవహరు కార్యోన్ముఖులై
    బెనగగ స్వాతంత్ర్యమునకు
    ఇన హిమకర బింబములుదయించె నొక మొగిన్!

    రిప్లయితొలగించండి
  23. అనవరతంబు హాయినిడు యద్భుత శక్తులె సూర్యచంద్రులై
    గనబడు నాకశానమనకంటికినొంటికి మేలుగూర్చగా
    మనుగడ ఈశ్వరాజ్ఞ లనుమానమ?దేవుని రెండు కళ్ళుగా
    ఇనశశి బింభయుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్|
    2.జనసామాన్యులునెంచెడి
    జననీ మనదుర్గ మాత జగతిని గనగా?
    అనవరతముతనకళ్ళుగ
    ఇనహిమకర బింబము లుదయించె నొకమొగిన్|


    రిప్లయితొలగించండి
  24. ఇనుని మురారి కప్ప హరిహేతి ప్రయోగముతోడ చెచ్చెరన్
    కనబడియెన్ నిశీథమట కౌరవ సేన ముదంబు నొందగన్
    ఘనమగు చక్రమున్ మలప కైటభవైరి వియత్తలమ్ముపై
    యిన శశి బింబ యుగ్మముదయించె దినాంతమునందు దద్దిశన్
    కనుగొని భీతినొందగను కౌరవులున్ మరి సిందు పాలుడున్
    హరిహేతిః చక్రము

    రిప్లయితొలగించండి
  25. మునిగణ దుఃఖ కారకుడు మూర్ఖుడు రాముని ధర్మపత్నినిన్
    కనికర మింత లేక కడు గాసిల జేసిన రావణాసురున్
    మన రఘురాము డేయగను మానిని పట్టగరాని వేడుకై
    యిన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్

    రిప్లయితొలగించండి