27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సర్వ లఘు సీస బంధములో నారసింహ స్తుతి చిత్రమాల


అడవినెల వరుల నడచగ   హరిపురి  నడయరి గెడ, పనుపడె గద  నక
రణి, బెరసె దితి తరుణి కడుపున, విధి వరము లిడ దనకు మరణము దరి
తొరలదని దలచి, సురలకు వెసనము లొసగుచు ,దురితములు సలుప ,హరి
దరికి  వెడలబడి మొరలిడె దివిజులు, వసుధన యసురిని  సిసువు  హరిని
దలచుచు సతము కొనలిడ తనయుని పెఱ
యనుచు మెరమెరల నిడగ ,హరి నరహరి
గ  పొరలి సరిగొనెను, అటి ఘన నరనెర
పరికి నమసము నిడుదును శరణుయనుచు

తాత్పర్యము
మునులను (సనకసనందులను) వైకుంఠపు  వాకిలి వద్ద అడ్డగించెను సేవక ద్వయము (జయవిజయులు) దాని కారణమున శాపము పొందెను.  ఆదితి కడుపున పుట్టి  బ్రహ్మ చే  మరణము లేకుడా వరములు పొంది దేవతలను బాధ పెట్టగ   వారు హరికి మొర బెట్టుకొనెను. భూ లోకములో  తన కొడుకు (ప్రహ్లాదుడు ) సతతము హరి నామము  చేయుచు పెరుగు చుండ   అతనిని పగ వాడిగా దలచి బాధలు బెట్ట సాగగా  హరి  నరసింహుడుగా అవతరించి హిరణ్య కశిపుని చంపెను   అట్టి  నరసింహునికి వందనము చేసెదను

అడవినెల వరులు = మునులు,  అడచు =  ఆపు ,  అడయరి = బంటు,  ఆమడ  =జంట , పనుపడు =  పొందు , ఆకరిణి = శాపము,  బెరయు  = పుట్టు , వెసనము = బాధ  ,తొరలు  =కలుగు , కొనలిడు   =పెరుగు ,   పెఱ  = శత్రువు, మెరమెర = బాధలు ,పొరలి  =పుట్టి సరిగొనె= చంపెను,  నర నెపరి =   నర సింహుడు

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

4 కామెంట్‌లు:

 1. కృష్ణ సూర్య కుమార్ గారు మీ ప్రయత్నము ప్రశంస నీయము.
  అడవి నెలవరి అరణ్యవాసులను నరర్థమున మునులన వచ్చును గాని సనక సనందాదులు బ్రహ్మ మానస పుత్రులు వన వాసులు కారు.
  ఘన నర నెఱపరి దుష్ట సమాసము.
  “సరిగొనెను, అటి”; “శరణు యనుచు” దోషములు. ఈ విషయము మీకు చాలా సార్లు చెప్పితిని.
  ఉత్వ సంధి చేయక పోవడము భాషామతల్లికి తీరని యపచారము. కుకవి తుల్యము. కడివెడు పాల లో విష మొక్క చుక్క చాలు విఱిగి పోవుటకు.
  మీ మనస్సును గష్ట పెడితే క్షంతవ్యున్ని.

  రిప్లయితొలగించండి
 2. గురు తుల్యులు కామేశ్వర రావు గారికి నమస్కారములు. వ్యాకరణ దోషములు వచ్చ్చుచున్నవి సరి చేయట ఎటులో బోధ పడుటలేదు దయవుంచి ఉత్తమ సలహా ఈయగలరు మీరు ఇచ్చు ఉత్తమమైన సలహాలకు నేను ఎప్పుడు బాధ పడను సర్వడా మీరు కవిత్వ రంగములో శ్రేయోభిలాషులు మీరు పెద్దవారు క్షంతవ్యుడను అన్న మాట ఒక్కటి నా మనస్సు గాయ పరచు చున్నది. మీరు ఇచ్చిన సలహాలు మనస్పూర్తిగా స్వీకరిస్తాను అంతే గాని నా మనస్సు బాధపడదు. సర్వ కాలములందు ఈ బ్లాగులో మీ యక్క అండ దండలు నాకు కావాలి నిర్మొహమాటముగా గురువు శిష్యుడిని దండించు రీతిలో తెలుపగలరు మరియొక్క మారు మీకు కృతఙ్ఞతలు కృష్ణ సూర్య కుమార్

  రిప్లయితొలగించండి