12, జులై 2019, శుక్రవారం

సమస్య - 3073 (కాకరతీఁగలకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్"
(లేదా...)
"కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ"
(ఈ సమస్యను పంపిన శాస్త్రుల రఘుపతి గారికి ధన్యవాదాలు)

43 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    భవిష్య పురాణం: 👇

    పలువురు కాంగ్రెసోత్తములు ప్రార్ధన జేయగ రాహులయ్యకున్
    వలువలు వీడ నేతలకు భళ్ళున రాహులు త్రిప్పికొట్టగా
    చెలియలు సమ్మతించగను చెంబుల తోడను నీళ్ళుపోయగా
    కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ

    చెలియలు = చెల్లెలు

    రిప్లయితొలగించండి
  2. కాకర కాయలు కాచెను
    శ్రీకృష్ణుని మేని జూచి సిగ్గును జెందెన్
    వేకువ మందారమ్ములు
    కాకర తీఁగలకు, నల్లకలువలు, పూసెన్.

    రిప్లయితొలగించండి
  3. లోకములను కాపాడగ
    గోకులమున పెరిగెనుహరిగోపాలునిగా
    ప్రాకటమాయెనుభువిలో
    కాకరతీగలకునల్లకలువలుపూసెన్

    రిప్లయితొలగించండి

  4. ఏదైనా మా జగను బాబు వల్లే :)


    వైకాపా ఘనతండీ!
    మాకందంబాయె ముఖ్య మంత్రి చలువగా,
    డ్వాక్రా మహిళలు వేయగ
    కాకర, తీఁగలకు నల్లకలువలు పూసెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. సోకులు దిద్దెను ప్రకృతి-
    వేకువనే వింతపూల విందులు కనుమా
    కాకరకాయలుకాసెను
    కాకర తీగలకు; నల్ల కలువలు పూసెన్

    రిప్లయితొలగించండి
  6. కాకరలు కాసె విరివిగ
    కాకర తీగలకు, నల్ల కలువలు పూసెన్
    గోకారి యె వెన్నె లీనుచు
    చీకటి దునుమాడు వేళ చెఱువుల లోనన్

    రిప్లయితొలగించండి
  7. వేకువ ఝామున కోకిల
    ప్రాకట మగుగాన మందు పలువురు మెచ్చన్
    కాకుల గోలల నడుమను
    కాకర తీగలకు నల్ల కలువలు పూసెన్

    రిప్లయితొలగించండి
  8. చెంగలరాయుడు మోతుబరి, సరసుడు. కాకరపంట వేసాడు. కలుపు పెరిగింది. కూలీలను రప్పించాడు. అప్పుడు ఆవిష్కృతమైంది అద్భుతదృశ్యం....

    కలుపును దీయవచ్చిరటఁ గాకర పైరునఁ గన్నెలందరు
    న్నలుపగు రూపురేఖలఁ గనంగను ముచ్చటగా మనంబునం
    జెలువము మీఱఁ దోచెనని జెంగలరాయడు సెప్పెనిట్టులం
    "గలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన కవితాత్మక భావన విట్టుబాబుగారూ,అభినందనలు!

      తొలగించండి
    2. ధన్యవాదాలు సీతాదేవి గారూ
      🙏🏻🙏🏻

      తొలగించండి
    3. మూడవపాదం సవరణ:

      జెలువము మీఱఁ దోచెనని చెంగలరాయడు సెప్పెనిట్టులం

      – విట్ఠుబాబు

      తొలగించండి

    4. ఊహల్లో మడిసి, కవి , చెంగలరాయుడు‌ , మరెప్పుడు రంగస్థలములో దిగబోతారో ? :)



      జిలేబి

      తొలగించండి
  9. కాకర=కాకర యను పేరుగల అమ్మాయి
    కందము
    కాకర కలువల మొక్కల
    ప్రాకటముగ నాటెను. గృహప్రాంగణ మందున్
    వేకువనె నీరు బోసెను
    కాకర. తీగెలకు నల్లకలువలు పూసెన్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  10. రాకాశశి వదనమ్మున
    జేకూరగ దొండవంటి చెన్నగు పెదవుల్
    శాకంబరి రూపమ్మున
    కాకరతీగెకు నల్లకలువలు పూచెన్

    నల్లకలువల కన్నులని భావన

    రిప్లయితొలగించండి
  11. లోకములో శాస్త్రజ్ఞులు
    ప్రాకటముగ చేయనదియ ప్రాయోజితమై
    లోకుల కనులకు కనబడె
    కాకర తీగలకు నల్ల కలువలు పూసెన్

    రిప్లయితొలగించండి


  12. తొలకరి జల్లు మీదపడి తొయ్యలి మేనియు తూగగానటన్
    నలతను తీర్చగా సతికి నమ్మిక గొల్పుచు మోజు తీర్చ సై
    చెలువము మీరగా పతియె చెంగట చేరుచు ముద్దులీయగా
    కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    అలకలు ఫాలభాగమున నట్టిటులూగుచునుండునట్లుగా
    లలనలు తీర్చిదిద్దగ విలాసముగా , కవి పల్కె లేత తీ...
    వల వలెనున్న జుత్తుల విభాసితమౌ కనుదోయి గాంచుచో
    కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అల గనుడా హిరణ్యకశిపాత్మజునా హరిభక్తు , నిత్యని...
      ర్మలహృదయున్ విభీషణుని రామపదాంబుజ సేవకున్ , ధరన్
      కలుషిత దైత్యవంశమున గాదె జనించిరి ! పోల్చ తెల్లనౌ
      కలువలు పూసెనల్ల ., నివి కాకర తీఁగలకున్ భళీ భళీ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    ప్రాకటరీతిని కవనపు
    కాకలు దీర్చంగ వ్రాసి గడచిన వెనుకన్
    వీకగ స్మారక నిధినిన్
    గాకరతీగలకు నల్ల కలువలు పూసెన్

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    బలువగు ఛాంధసాగ్రణులు పద్య కవుల్ ఛవి జావ;గేయపున్
    వలువల నంచు ధోవతుల భాతిని ఖ్యాతి నొసంగ పత్రికా
    చలువలె కారణమ్ములన సాగెను తీగెల చేదు మాయ మై
    కలువలు పూసె నల్లనివి కాకర తీగలకున్ భళీ, భళీ!

    రిప్లయితొలగించండి
  16. కాకర కాయలు తెమ్మన
    నా కలువల దెచ్చితి విక నలసుడ వౌచున్
    సాకుల జెప్పుదు వెటులను
    కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్

    రిప్లయితొలగించండి
  17. ఛీ! కాయొక్కటి కాయని
    ఆకుల పాదులను పీకిరంతట చెదరెన్,
    చీకటి వేళకు చెరువున,
    కాకర తీఁగలకున్+అల్ల కలువలు పూసెన్..

    రిప్లయితొలగించండి
  18. (కాటుకకన్నుల క్రొత్తయిల్లాలు ప్రొద్దున్నే కూరకోసం
    కాకరకాయలు కోయబోతే ...)
    మెలకువనంది నూత్నసతి
    మెల్లగ కాయల కోయ నింటికిన్
    వెలుపల కాయగూరమడి
    వెంబడి నేగుచు కాకరల్ గనన్
    కలికి ; విశాలనేత్ర ;తన
    కాటుకకన్నుల నెత్తుచుండగా
    కలువలు పూసె నల్లనివి ;
    కాకరతీగలకున్ భళీభళీ !!

    రిప్లయితొలగించండి
  19. కాకర కాయలు గాచగ
    కాకర తీఁగలకు , నల్లకలువలు పూసె
    న్నాకేశవు ఛాయను గొని
    చేకొన గమ్యంబు పిదప శ్రీధరు చెంతన్

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఈకువయౌ నల్లతొగలు
    జోకగ తడియారుటకని వాటిన్
    కాకర తీగల నుంచిన
    కాకర తీగలకు నల్లకలువలు పూసెన్.

    కాకర కాయలు కాచెను
    కాకర తీగలకు; నల్లకలువలు పూసెన్
    కోకారియె చిందించెడి
    జోకగు వెన్నెల సుషిమము సోకిన వేళన్.

    రిప్లయితొలగించండి
  21. నాకేమి తెలియ కున్నది
    నీకేమయిన కనికట్టు నేరిమి గలదో
    యే కారణంబున యిటుల
    కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్

    రిప్లయితొలగించండి
  22. కాకర తీగలు ప్రాకుచు
    ప్రాకటముగ కొలను కలువలను పెనవేయం
    గా గనుల కిటుల గనపడె
    కాకర తీగలకు నల్ల కలువలు పూసెన్

    రిప్లయితొలగించండి
  23. కాకరకాయలుకాసెను
    కాకరతీగలకు,నల్లకలువలుపూసెన్
    మాకనపాలెపుచెఱువున
    నాకలువలుజూడనాకుహర్షముగలిగెన్

    రిప్లయితొలగించండి
  24. ఆ కారండవ కలహం
    సాకంపిత కోకనద న లాకర వారిన్
    రాకా నిశీధి జల భే
    కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్

    [జల భేక +ఆకర = జలభేకాకర; జలమునకు,కప్పలకు నాకరమైన సరస్సు]


    కలువలు నీకు నెఱ్ఱనివి కావలె నంచు తలంచి తీ వయో
    కలువలు పూసె నల్లనివి, కా కర, తీఁగలకున్ భళీ భళీ
    మలగఁకు మయ్య నిస్పృహత మంచివి గాంచెద మిచ్చ టచ్చటం
    గొలఁకుల నీవు చిత్తమునఁ గోరెడు కోకనదమ్ము లింపుగన్

    [కాకు + అర = కాకర; సగ మవకు, చిన్నఁబోకు]
    సమస్యాపాదమున కాకర లో నరసున్న లేకపోవుట మేలైనది.

    రిప్లయితొలగించండి
  25. జలములు వట్టిపోయె యిల సాగునె జీవనమంచు, వీడి భూ
    తలమును, వేల్పుటేరుఁ జను దారినిఁ గాకరపందిరడ్డగన్
    విలసిలు నట్టి కూర్పుఁ గని వీక్షకు లచ్చెరువొంద, వింతలై
    కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ.

    రిప్లయితొలగించండి


  26. కాకర కాయలు కాసెను
    కాకర తీఁగలకు; నల్లకలువలు పూసెన్
    నేకాగ్రతతోడను నా
    రాకా చంద్రునివెదుకుచు రయమున నవియున్.


    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సరదా శంకరాభరణం:

    పలువురు పండితోత్తములు వంకలు పెట్టగ వ్హాటుసప్పునన్
    చలువను జూసి వృద్ధుడిని చల్లగ జూడగ కందిశంకరుల్
    విలువలె లేని పూరణలు విందును చేయగ నాదు హృత్తునన్
    కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ

    చలువ = దయ

    రిప్లయితొలగించండి
  28. కలికి సరంబులోగనగగాంతులనొప్పుచుచంద్రురాకతో
    కలువలుపూసెనల్లనివి,కాకరతీగలకున్భళీభళీ
    చెలువదనంబుతోదనరిచిందులువేయువిధంబుగాదగన్
    దలపులలోనగల్గెనికదామమువోలెనునుండెబాగుగా

    రిప్లయితొలగించండి
  29. ఏకరువు బెట్టుచుండెను
    నాకరవాణిచరవాణి నయనానందం
    బై,కాంచితి యూట్యూబున
    కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్!!

    రిప్లయితొలగించండి
  30. ఓ కోతలరాయుడ!విను!

    చీకాకు పరుచకు నన్ను జెప్పుచు నిటులన్

    "కాకికి గోయిల పుట్టెను,

    కాకర తీగలకు నల్ల కలువలు పూసెన్

    రిప్లయితొలగించండి
  31. కాకరకాయలుగాచెను
    *కాకర తీఁగలకు; నల్లకలువలు పూసెన్*
    రాకాశశిరాకగనియు
    జోకపడ జగము మురియగ జోజోయంచున్

    రిప్లయితొలగించండి
  32. పలువల తుల్వలన్ ప్రజలు పాటిదలంపరు క్షీరనీరమై
    యిల ప్రభవింపరే యజుని హేలగు గశ్యపుసంతె దానవుల్
    ఖలులు సురల్ బుధుల్ జడధి కన్యలు బెద్దమ తల్లితల్లియున్
    *గలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ"*

    రిప్లయితొలగించండి
  33. చెలువముమీరచెంగలువచెంగటనల్లినదొక్కవల్లికా
    వలయముచూడముచ్చటగ వావిరిగా కడువిస్తృతంబుగా
    కలయగజూసినంతనదికన్నులకింపుగతోచె వింతగా
    కలువలుపూసెనల్ల,నివికాకరతీగలకున్ భళీ భళీ!

    రిప్లయితొలగించండి
  34. కలుముల వాడు వాడిల మగాడు దనూజ సుఖించు నంచు శం
    కల విడనాడి లక్ష్మికళ కన్యను బద్మిని గట్టబెట్టె నా
    కలయిక బిడ్డపాపలును గల్గిరి తాత దలంచె జూచుచున్
    *కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ"*

    రిప్లయితొలగించండి
  35. తళుకుల నీనుచున్న చిరు తారల మధ్యన చంద్రుడొల్కెడిన్
    వెలుగులు సోకి కాకరలు వింతగ కాంతులనీన గాంచి యో
    కలికియె పల్కెనిట్లు తన కాంతుని తోడ వనమ్ము లో గనన్
    కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ

    రిప్లయితొలగించండి
  36. కాకరల పైన రాతిరి
    తారాధిపుఁ గాంతి సోకి తళతళ లాడన్
    పోకిరి యదిగాంచి పలికె
    కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్

    రిప్లయితొలగించండి