12, సెప్టెంబర్ 2019, గురువారం

సమస్య - 3130 (దైవమునుఁ గొల్వ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు"
(లేదా...)
"దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్"

57 కామెంట్‌లు:

  1. శరణు జొచ్చిన వారిని కరుణ తోడ
    నాద రింపక వారిని బాధ పెడుచు
    దల్లి దండ్రుల విడనాడి ధరణి యందు
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెడుచు' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    చావుల్ దప్పెను నోడి పోవగనుభల్ జంబమ్ముతో పోరగా
    రావే యీశ్వర కావవే ననునటన్ రాగమ్ముతో పాడుచున్
    బావుర్మంటును నేడ్చి వైరులకికన్ ప్రాణంబులన్ తీయుమన్
    దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చావుల్ దప్పె పరాజయంబును గనన్... బావుర్మంచును' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి


  3. జీవితమునకు లక్ష్యము స్థిరము గాను
    దైవమును గొల్వు టొక్కటె! తపమటంచు
    కోరికల తోడు జీవించి కొవ్వు బట్టి
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గొల్చు టొక్కటె' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  4. కవిమిత్రులకు మనవి... ఈరోజు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శ్రీకాకుళం బయలుదేరుతున్నాను. రేపు ఉదయం ఆముదాలవలస ద్వారా శ్రీకాకుళం చేరుకుంటాను. అక్కడ రేపటి నుండి శ్రీ ఆముదాల మురళి గారి శతావధానం ఉంది. ఆముదాలవలసలో కాని, శ్రీకాకుళంలో కాని మన సమూహ మిత్రులెవరైనా ఉన్నారా? శ్రీకాకుళంలో రేపు ఒక్కరోజే ఉండి అదేరోజు రాత్రి మళ్ళి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‍లో హైదరాబాదుకు తిరుగు ప్రయాణం...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి స్పందన:

      జయోऽస్తు... విజయోऽస్తు 💐🙏🙏💐💐🙏🙏

      సరసమనోహరమ్మయిన శాబ్దిక పుష్టిని గల్గి.., భారతీ
      వరపదభావనాగరిమ భావసమృద్ధిని పొంది., సత్కవీ...
      శ్వరులు శిరమ్ములూచునటు పద్యములల్లుచు నాముదాల శ్రీ
      మురళి శతావధాననవమోహనరాగములన్ ధ్వనించుతన్.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. అస్తి నాస్తి వాదన లన్ని అడ్డుదగుల
    దైవచింతనజేయుట దైన్యమగున?
    అంతరంగమునందున అలుకజూపి
    దైవమునుగొల్వరాదంద్రు ధర్మవిదులు.

    రిప్లయితొలగించండి
  6. సకల సారమునెఱిగిన సజ్జనాళి
    వేదవిధులన్నిదెలిసిన వేత్తలవగ
    మైల యున్నట్టి రోజుల మైకమందు
    దైవమునుగొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావెల వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవగ' అన్న ప్రయోగం సాధువు కాదు. "వేత్త లగుచు/లైన" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా
      సవరణపాఠము ప్రచురించెద
      కృతజ్ఞతలు

      తొలగించండి
    3. తేటగీతి
      తల్లి దండ్రులె ప్రత్యక్ష దైవములను
      వేదవచనంబు మరచి నిర్వేదమునను
      ఆశ్రమాలలొ వదిలెడి యల్పనరులు
      దైవమును గొల్వ రాదండ్రు ధర్మవిధులు
      ఆకులశివరాజలింగం వనపర్తి

      తొలగించండి


  7. జీవాధారయతండు! లక్ష్యమతడే చేగూరు మోక్షమ్ము, శ్రీ
    కైవల్యంబది కోరికల్ విడువ సాక్షాత్కారమౌ, మాలినీ
    దైవమ్మున్ గొలువంగ, రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్,
    భావావేశపు చేష్టలున్ తలపులున్ ప్రారబ్ధ కర్మాదులున్ !



    శుభోదయం

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
      'జీవాధార మతండు...' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  8. తోచిన యన్రుతములు కూర్మితోను చెబుతు
    ఇరుగుపొరుగు వారి నెపుడు మరుగు పెడుతు
    భక్తి చాల నున్నదనుచు ముక్తి కోరి
    దైవమును గొల్వరాదండ్రు ధర్మ విధులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనృతములు' టైపాటు. 'చెబుతు, పెడుతు' అనడం సాధువు కాదు.

      తొలగించండి
    2. 🙏 ధన్యవాదాలు గురువు గారూ

      తోచిన యనృతములు కూర్మితోను చెప్పి
      ఇరుగుపొరుగు వారి నెపుడు మరుగు పెట్టి
      భక్తి చాల నున్నదనుచు ముక్తి కోరి
      దైవమును గొల్వరాదండ్రు ధర్మ విధులు

      తొలగించండి

  9. స్నాన మాడక ప్రాభాత సమయమందు
    శుభ్రవస్త్రాల ధరియించు చొప్పు లేక
    భస్మధారణ జేయక భక్తి లేక
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు.

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    భక్తకన్నప్ప....

    నే వేటాడ లభించె మాంసమిదిగో ! నీకే నివేదింపగా
    నా విజ్ఞాపన తప్పుతప్పనిరిదే న్యాయ్యంబొకో ? యివ్విధిన్
    దైవమ్మున్ గొలువంగ రాదనిరయో ధర్మజ్ఞులున్ యోగులున్ !
    శ్రీవాత్సల్యగుణాకరా ! భవహరా ! శ్రీకాళహస్తీశ్వరా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి:
    దేవ నామది గంటిని దేహి యనగ
    రార దయజూడఁ బిల్చిన రావదేమి ?
    ఆణువణువు నిండిన నిన్ను దలచి, వేరు
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు"

    రిప్లయితొలగించండి
  12. మూగజీవుల యందెల్ల ముదిమి లేక
    కోర్కె తీర్పు కొరకు చాల కూర్మి జూపి
    తగుదు నమ్మ నంచు తిరిగి తన్మయమున
    దైవమును గొల్వరాదండ్రు ధర్మ విధులు

    రిప్లయితొలగించండి

  13. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రావద్దంచును హైద్రబాదుకనివే రాద్ధాంతమున్ జేయగా
    బ్రోవన్ గోరుచు నాంధ్రవాసులనికన్ పోషించితిన్ కృష్ణనున్
    దైవంబెవ్వడు నన్నుమించగనిటన్ దండంబులన్ బెట్టుమన్
    దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్

    వే = వేగముగ

    రిప్లయితొలగించండి
  14. భావంబందున శుద్ధిలేక మదిలో పాపంబులన్ సర్వదా
    గావించంగ దలంచుచుండి త్రిజగత్కల్యాణముం గూర్చు వా
    డౌవానిన్ గలడంచు నమ్మని ఖలుం డందంగ సర్వార్థముల్
    దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్"

    రిప్లయితొలగించండి
  15. మైల వస్త్రముల్ ధరియించు వేళలందు
    గ్రహణ సమయము లందున ఖచ్చితముగ
    నాత్మ శుద్ధియె లేకుండ యవనిలోన
    దైవమున్ గొల్వరాదంద్రు ధర్మవిదులు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేకుండ నవనిలోన' అనండి.

      తొలగించండి
    2. సత్య ధర్మాలు విడనాడి స్వార్థ ముగను
      దుష్ట భావన ల్ గల్గియు దురితు డగుచు
      బాహ్య నటన తో నమ్మింప భక్తుడ గుచు
      దైవము ను గొల్వ రాదంద్రు ధర్మ విదులు

      తొలగించండి
  16. కారణము లేక చీమయు కదలబోదు
    పనులు సమకూరు ధరలోన పట్టుదలతొ
    సాధనమునందు, సుంతైన శౌచమనక
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు!

    రిప్లయితొలగించండి
  17. లోక కల్యాణమును గోరి ప్రాకటముగ
    ప్రార్థన సలుప వలయును భక్తి తోడ
    పరుల నాశనమును గోరి భక్త జనులు
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  18. మతము పేరిట జనులను మాయ జేసి
    తమదు దైవము గొప్పయె దప్ప నితర
    దైవమునుఁ గొల్వరాదంద్రు; ధర్మవిదులు
    దైవ మొకడంద్రు వేరగు దారులైన

    రిప్లయితొలగించండి
  19. తల్లిదండ్రుల విడనాడుతనయు లికను
    దైవమును గొల్వరాదండ్రు ధర్మవిదులు
    వారి పిదపనే దైవము బరగు గాన
    తల్లిదండ్రుల పూజయే దైవపూజ

    రిప్లయితొలగించండి
  20. ఇహము కోరుచు మానవులహరహమ్ము
    పరము తలుపక మనినచో ఫలితమేమి
    ఐహికమ్మగు సుఖములకాశచెంది
    దైవమునుఁగొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  21. శార్దూలవిక్రీడితము
    లావొక్కింతయు లేదు లేదనిననే రక్షించె వేదండమున్
    నీవే దిక్కని యాజ్ఞసేని పిలువన్నెక్కొల్పెఁ దా చీరలన్
    భావంబందు శరణ్యమాతడను విశ్వాసమ్ము లేకుండగన్
    దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్

    రిప్లయితొలగించండి
  22. దైవమ్మున్గొలువంగ రాదనిరయో ధర్మఙ్ఞులున్యోగులున్
    దైవమ్మేగద రక్షజేయునుమహిన్ ధర్మంబె యట్లంటిరే
    దైవమ్మున్ గొలువంగ వచ్చునుసదా ధ్యానంబుపూజాదులన్
    గావన్ బృధ్విని జంతుజాలమునీలన్ గారుణ్యమొప్పారగన్

    రిప్లయితొలగించండి
  23. శక్తి కొలదికొలచినను చాలు భక్తి
    కల్గిచేయు పూజలెమిన్న గాన హంగు
    నార్భటుల యాత్మ శుద్ధిలేనట్టివారు
    దైవమునుకొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  24. 4వపాదము చివర
    జంతుజాలమునిలన్
    గా చదువప్రార్ధన

    రిప్లయితొలగించండి
  25. శక్తి కొలదికొలచినను చాలు భక్తి
    కల్గిచేయు పూజలెమిన్న గాన హంగు
    నార్భటుల యాత్మ శుద్ధిలేనట్టివారు
    దైవమునుకొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  26. శక్తి కొలదికొలచినను చాలు భక్తి
    కల్గిచేయు పూజలెమిన్న గాన హంగు
    నార్భటుల యాత్మ శుద్ధిలేనట్టివారు
    దైవమునుకొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  27. విశ్వ కళ్యాణ మూహించి విశ్వ జనులు
    దయ్యమును గూడ పూజింపఁ దగును గాని
    లోక నాశనార్థమ్ముగ లోకు లెట్టి
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు


    దైవాకారపు విగ్రహమ్ములకు నిత్యప్రోక్త సత్పూజకై
    ప్రావీణ్యమ్ముగఁ బంచలోహములనే వాడంగ నొప్పున్ భువిం
    గైవల్యమ్మును బొందఁ గోరినను ధిక్కాలాయస స్కంధమౌ
    దైవమ్మున్ గొలువంగ రాదని రయోధర్మజ్ఞులున్ యోగులున్

    [అయోధర్మజ్ఞులు = ఇనుము గుణములు తెలిసినవారు]

    రిప్లయితొలగించండి
  28. అంటు సమయములందు నే యాలయమున
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు
    మనసున కొలుచు కొనుటకేమాత్రపడ్డు
    లేదనుచు తెలుపుదురు వరేణ్యులెపుడు

    రిప్లయితొలగించండి
  29. తేటగీతి
    దేవుఁడొక్కడే యనుమాట ధిక్కరించి
    లౌకికమ్ముల దేవుని రంగరించి
    మతము మార్చంగఁ జూచు నమానుషమున
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  30. నీవా స్వార్థము వీడకుండ సతమున్ నేరాలనే చేయుచున్
    నీవేదిక్కని నమ్మి నట్టి జనులన్ నిర్భాగ్యులన్ ద్రొక్కుచున్
    నీవే పాపము దీర్చువాడవనుచున్ నిత్యమ్ము పేరాశతో
    దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్.

    రిప్లయితొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు

    సందర్భము: పౌరుషం లేదా పురుషకారం ఉద్యోగానికి అంటే ప్రయత్నానికి కారణం. ప్రయత్నం కర్మకు కారణం. కర్మ నిష్కామంగా జరిగితేనే కర్మయోగంగా పరిణమించి నరుడు తరిస్తాడు. లేకపోతే కర్మబంధంతో జననమరణ చక్రంలో పడి గిరగిరా తిరుగుతూనే వుంటాడు.
    కర్మయోగంతో జీవితానుభవం కలుగుతుంది. అది సమస్యలతో సతమత మౌతున్న తోటివారికి పనికి వస్తుంది. ఏ పనీ చేయని వాని కే యనుభవమూ రాదు కదా!
    పౌరుషం అవలంబించకుండా దైవబలం చేకూరా లని చూడరాదు. దైవంమీద భారం వేయకుండా కేవల పౌరుషాన్నీ అవలంబించరాదు.. అలా వున్నప్పుడు మాత్రమే పౌరుషం సార్థక మవుతుంది.
    *నిత్యం స్వపౌరుషా దేవ*
    *లోక ద్వయ హితం భవేత్..*
    (నిజ పౌరుష బలంతోనే ఇహపరలోకాలు రెంటనూ మంచిని పొందవచ్చు.) అని యోగ వాసిష్ఠం లో వసిష్ఠుడు చెబుతాడు. అంతే గాక
    *మూఢైః ప్రకల్పితం దైవం*
    *మన్యంతే యే క్షయంగతాః*
    ( మూఢులచే కల్పించబడిన దైవాన్ని (అదృష్టాన్ని) ఆశ్రయించిన వారు నశింతురు.) అంటాడు.
    కాబట్టి దైవమే అన్నీ చూసుకుటుం దని పురుషకారం అక్కర్లే దని ఊరికే దైవాన్ని కొలుచుకుంటూ కూర్చుంటే ఏ కర్మా జరుగదు.. సోమరితనం వచ్చేస్తుంది. మెదడు ఖాళీగా వుండటంవల్ల పనికి మాలిన ఆలోచనలకు ఆలవాల మౌతుంది. (Empty mind is devils work shop అని సామెత.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఉత్తమ పౌరుషం బుద్యోగమునకు, నా
    యుద్యోగ మది కర్మ యోగమునకుఁ
    గర్మయోగం బెంచగా జీవితానుభ
    వమునకు నగు కారణములు మరియుఁ
    జింతించు నరులకు నెంతే నుపకరించు
    జీవితానుభవంబు గావున ధరఁ
    దత పౌరుషము సార్థకత జెందుటకు గాని
    దైవంబు.. నది లేక దైవబలము
    కలుగునే! సోమరితనమె కలుగు, నతని
    మనము దయ్యాల కొంపగా మారుఁ.. గాన
    పురుషకారంబుఁ బూర్తిగాఁ బోనడంచి,
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    12.9.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  32. నేల విడుచుచు సామునునెపుడుజేయు
    వారిపట్లను మెలకువ వలయుసుమ్ము
    నింగి నెక్కగజేయగ నెనరుజూపి
    దైవమునుగొల్వరాదంద్రు ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  33. కోరినట్టి కోర్కెలు నెరవేరకున్న
    తిట్టు కొనుచనవరతము దేశమందు
    సంచరించుచు నున్నట్టి జనము లన్య
    దైవమును గొల్వ రాదంద్రు ధర్మ విధులు

    అక్రమార్జనమును చేసి యవనియందు
    తప్పులను కప్పిపుచ్చంగ దైవమునకు
    కానుకలొసంగుచు సతము ఘనముగాను
    దైవమునుగొల్వ రాదంద్రు ధర్మ విధులు

    భక్తితో పూజ చేయంగ వలెను సతము
    దైవమును, గొల్వరాదండ్రు ధర్మవిదులు
    వామ మార్గము పూనుచు బలినొసంగు
    మనెడు కుత్సిత యోగుల ననవరతము

    రిప్లయితొలగించండి
  34. sardulamu:
    కైవల్యంబును గోరఁగా బుధులునే కైంకర్య ధర్మంబులన్
    శైవంబున్ మరియా హరీ నలువ శ్రీ, శైలేయి,బ్రాహ్మీ నిలన్
    జీవంబే యొసగే త్రిమూర్తులును నీజీవాత్మ లైయుండఁగన్
    దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్

    రిప్లయితొలగించండి