2, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3387

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము"
(లేదా...)
"భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్"

55 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వీర్యము హెచ్చెనో సఖుడ! బింకము మీరెనొ వానకాలమున్
    కార్యము కర్మ గానకయె గండర గండుని వోలె పల్కితే!
    సూర్యుడు రాత్రి పుట్టగనె చూడగ వచ్చును సత్యమిందునన్:
    "భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్"

    రిప్లయితొలగించండి
  2. ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము
    నా పలుకులను వినకున్న నరకమగును
    నీదు జీవిత మంతయు నిశ్చయముగ
    యనుచు చెప్పెడి వారల హాళి విడువు

    హాళి = స్నేహము

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఆర్యుల నీతినిన్ విడిచి హ్లాదము నొంది గుడుంబ గ్రోలుచున్
    శౌర్యము జూపగా ఖలుడ! శంకను వీడుచు మిత్రమండలిన్
    ధైర్యము జేసి పోవగను తప్పక రౌరవ వాసమందునన్
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    [కౌశికుఁడు వారాంగనాలోలుఁడై, తన ననునిత్యము సేవించు సుమతి పాతివ్రత్యమహిమ నెఱుంగక, యామెను తన సౌఖ్యమున కొక యడ్డంకిగా భావించి, చంపింపఁబూని, తన మిత్రునితోఁ బలికిన సంతర్భము]

    "ధైర్యము లేదు నాకు, వనితం దగఁ జంపఁగ! నీకు మిత్రమా!
    శౌర్య మదెంతయో కలదు! చక్కఁగ నే నిఁకఁ ద్వత్కృతాన, నీ
    కార్యము సత్వరమ్మె బహు గణ్యముగా నొనరింపఁగాను, నా
    *భార్యనుఁ జంపి, పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్!"*

    _*మధురకవి గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు*_

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణకు సరైన ఘట్టాన్ని ఎంచుకున్నారు. బాగున్నది.
      'త్వత్కృతాన'?

      తొలగించండి
    2. 🙏ధన్యవాదాలండీ🙏
      త్వత్కృతాన=నీవు చేయబోయే ఈ హత్యాక్యత్యము వలన

      తొలగించండి
    3. భార్యను చంపే ధైర్యము నాకు లేదు. మిత్రమా! ఆ హత్యచేయగల ధైర్యము నీకెంతో ఉన్నది. చక్కగా నేను, ఈ పని త్వరగా చేయడానికి, నీవు నాకొఱకు చేయబోయే ఈ హత్యాకృత్యము ద్వారమున, నా భార్యను చంపించి, వారవనితాసౌఖ్యాన్ని పొందుతాను....అని నా భావన.

      రాత్రి నిద్రించడానికి ముందు చరవాణిలో టైపుచేసి, ప్రకటించాను. మళ్ళీ చూసుకొనలేదు. మన్నించండి.

      తొలగించండి
    4. సవరించిన పూరణము:

      "ధైర్యము లేదు నాకు, వనితం దగఁ జంపఁగ! నీవు, మిత్రమా!
      శౌర్యముఁ జూపి, నా సతిని చక్కఁగఁ జంపినచో, సుఖింతు! నీ
      కార్యము సత్వరమ్మె పొసగంగను, బొందియు నీ సహాయమున్,
      భార్యనుఁ జంపి, పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్!"

      తొలగించండి
  5. ఊర్వశితో కిరీటి
    ధైర్యమునన్ విరోధులను దారికితెచ్చుట సాజమే,మనః
    స్థైర్యముతో విచింతనను సైపగగోర్కెల వీరుడేయగున్
    వర్యులు కామమోహముల వర్జనసేయగ బూనిచిత్తజున్
    భార్యనుజంపి పొందవలె,వారవరాంగన!నిత్యసౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  6. 1). తే.గీ//
    నా సొగసుల నీ కొసగెద నాశదీర్చ
    ఆలి నడఁచి పొందుము, వెలయాలి సుఖము !
    లీలలిక నీకు తగదుర తాళను, మురి
    పాలలోన ముంచెద నీకు ప్రాప్తిగలుగ !!

    2). కం//
    నా లాలిత్యము సొసగెద
    ఆలి నడఁచి పొందుము, వెలయాలి సుఖములా !
    లీలలు నీకేల దివిని
    పాలించగ రార వేగ ప్రాప్తిని బొందన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      తేటగీతి పాదాన్ని కందంలో చక్కగా ఇమిడ్చారు.

      తొలగించండి
  7. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః.తేది:02-06-2020. మహోదయులకు నమస్సులతో, శుభోదయం.

    నేటి సమస్యాపూరణాల యత్నం -

    ఏమి పూరణ జేయునో యింకనిచట
    ఔర! యెటువంటి మాటల కైపు నొంది
    తగిలి తానేదొ నాకిట్లు తనర జెప్పె
    ఆలి నడచి పొందుము వెలయాలి సుఖము.

    కార్యము లన్ని పూర్తవగ కారణ మన్నది లేక భార్యతో
    ధైర్యము కూడదీసుకుని దాచిన మాటల నొక్కటొ క్కటిన్
    మిర్యపు ఘాటువేసటగ మెల్లగ నంగ పతిన్! సతిట్లనెన్
    భార్యను జంపి పొందవలె వార వరానన నిత్య సౌఖ్యమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      రెండవ పూరణలో 'అవగ' అన్న ప్రయోగం సాధువు కాదు. 'సతి+ఇట్లనెన్' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
    2. ధన్యోస్మ్యార్యా! స్వీకృతమ్
      .

      తొలగించండి
  8. మోహ నాంగుడా వచ్చెగా దేహి యనుచు

    నిటకు నీ శూర్ఫణక కన్య నెమ్మి‌ కోరి

    నాలి నడచి పొందుము‌ వెల యాలి సుఖము

    రయముగ ననుచున్ బలికె శ్రీ రాము తోడ

    రిప్లయితొలగించండి

  9. కందగీతి :)

    సముఖిని, ఆలి! నడఁచి పొం
    దుము వెలయాలి సుఖము వలదు వలదనకు, రా
    దు మరల అవకాశము! రా!
    విముఖతనిక చూపకోయి విటుడా రమ్మా



    పరార్
    జిలేబి :)

    రిప్లయితొలగించండి


  10. కందోత్పల

    అనుమానమేల! రా చు
    వ్వన భార్యనుఁ జంపి పొందవలె వారవరా
    నన నిత్యసౌఖ్యమున్ సూ
    ర్పనఖను వనసుందరిని! సరసి! సరసకు రా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ఇంటి యిల్లాలియారడి మింటికెగయ
    నిత్యనరకంపు యాత్రనునెఱపుచుంటి
    నంచు మిత్రుడు రోదింప నంటినిటుల
    ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము

    రిప్లయితొలగించండి
  12. దుష్ట యోచన చేయకు దోషమగును
    ఇంటి యిల్లాలి మరచిన ఇహము లేదు 
    పాడు మాటలు వినకుము పలుకుచుంద్రు 
    ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము

    రిప్లయితొలగించండి
  13. ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము
    నన్నవానిమాటలువిని నడచి జూడ
    నిప్పు రవ్వల దోటియు నిన్నుగాల్చి
    చంపివేసెడురోజులెసతియు నేడు

    రిప్లయితొలగించండి
  14. ఆలు నడచి పొందుము వెలయాలి సుఖము
    లనెడి మాటలు విన వల దవని యందు
    నన్ని భంగుల సేవల కాద్య మగుచు
    నిర్మ లంబు గ వెలుగొందు ధర్మ పత్ని

    రిప్లయితొలగించండి
  15. "ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము"
    కవితలల్లెడి కవయిత్రి కలముకదల
    లేకబోయెనే, కారణాలేమొగాని
    పూర్తిజేయక నుండెనే పూరణంబు

    రిప్లయితొలగించండి
  16. మద్యమును గ్రోల మంటివి, మగువ పొందె
    ఘనమటంచు నూరించుచు కపటి వగుచు
    నాలి నడచి పొందుము వెలయాలి సుఖమ
    టంచు చెప్పుట తగునే దురాత్మ నీకు.

    రిప్లయితొలగించండి
  17. ఆలినడచిపొందుమువెలయాలిసుఖము
    నటులజేసినదప్పదునర్ధివృత్తి
    యాలిశపియించనరకమేయగునుదుదికి
    నాలి నెఱుగుముగృహలక్ష్మియనగ మనకు

    రిప్లయితొలగించండి
  18. క్రౌర్యము హెచ్చె నేడిటుల కాలము మారెను పాడు బుద్ధులన్
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్
    చౌర్య మకార్యమైన నిక సంపద బెంచుటె ముఖ్య లక్ష్యమై
    దుర్యశమందుటే ఘనత దుష్టులె జూడగ నాయకాగ్రణుల్

    రిప్లయితొలగించండి
  19. ఆర్యులు మెచ్చురీతిగ నిహమ్మున నిశ్చలమైన ధార్మికా
    హార్యముతో మెలంగవలె యార్ష పథమ్ము గృహస్థు లెప్పుడున్
    ధైర్యము హెచ్చి ధర్మమును దప్పుచు దుర్గతి కోరువారలే
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్

    రిప్లయితొలగించండి


  20. కామమోహితుడొక్కడు కామిని వల
    చిక్కి బాధపడుచు నుండ స్నేహితుండు
    నాలి నడిచి పొందుము వెలయాలి సుఖమ
    నంగతప్పిదమగునటంచనియె నతడు.

    రిప్లయితొలగించండి
  21. నిగమ శర్మ అక్క

    ఆర్యుడు తండ్రి యమ్మయును నందుకు తగ్గ సతీలలామయే
    చౌర్యము కామినీజన విచారము నీ కెటు లబ్బె తమ్ముడా
    దుర్యశ మంటదే సతిని ద్రోసి పరాంగన గూడ నైన నీ
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్.

    రిప్లయితొలగించండి
  22. శౌర్యమె లేనివాడు తస సౌఖ్యము గోరుచు నెల్లవేళ దు
    ష్కార్యములాచరించు కడు స్వార్థపరుండు వచించె నిట్టులన్
    క్రౌర్యపు బుద్ధితో చెలగు కాముకుడైన సుహృత్తుతో యటన్
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్య సౌఖ్యమున్.

    రిప్లయితొలగించండి
  23. మూర్ఖు డొకడు జేర మసువ మోహమొంది |
    కుటిల బుధ్ధిని కుంభిక కోరెనిటుల|
    "ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము"
    భ్రష్టు లైతిరిగెడి వారి పధములింతె |
    (కుంభిక, మసువ - వేశ్య )

    రిప్లయితొలగించండి
  24. భార్యనుజంపిపొందవలెవారవరానననిత్యసౌఖ్యమున్
    నార్యులమాటలేనయివియాలినిజంపుట యుక్తమౌనెభో
    భార్యగజేసికొంటిమిలవహ్నినిసాక్షిగబెట్టియేకదా
    భార్యనువారకాంతవలెభావనజేయుచుసౌఖ్యముండుమా


    రిప్లయితొలగించండి
  25. శౌర్యవిహీనభూరిపరసంపదపాకరణైకశీలి దు
    ష్కార్యనిరంతరాంచితవిచారుడు వంచకుడైన వాడు యే
    చౌర్యముఁ జేసి యైన కడు సౌఖ్యముఁ గోరెడు వాడు సొమ్ముకై
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  26. ధర్మ సమ్మతము గడించి ధనము కరము
    నీడుజోడగు పూఁబోడి నెలమి వెదకి
    సంతతమ్ము హర్షమ్మునఁ జారుతర గు
    ణాలి నడఁచి పొందుము వెల, యాలి సుఖము

    [వెల = మూల్యము /ఫలితము]


    ఆర్య జనుండు సద్గురు గణావన తాంగ విధేయ చిత్తతం
    గార్యము లాచరించుచు నకామియు నై చరియించుచున్ వరౌ
    దార్య దయాది సద్గుణ యుతమ్ము నిజేంద్రియ కాంక్ష కోటి నా
    భార్యను జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్

    [వార వరానన నిత్య సౌఖ్యము = శంకర ముఖ దర్శనంపు సంతత సౌఖ్యము; వారుఁడు = శివుఁడు]

    రిప్లయితొలగించండి
  27. వార వనితల వెంటబడి భార్యా పిల్లల పట్టించుకోని పతితో సతి....

    తేటగీతి
    ధర్మపత్నినిఁ బిల్లలఁ దలఁచ కుండ
    వార వనితల పొందునుఁ జూరఁ గొనితె
    తాళ లేనయ్య, బదులుగాఁ దనయుల నను
    నాలి నడఁచి పొందుము వెలయాలి సుఖము!

    ఉత్పలమాల
    కార్యము లన్ని వీడి పర కాంతల పొందుకు నంగలార్చ నౌ
    దార్యము జూపి తాళ గల దాననె? సంతతి బాగు లెట్లు? మా
    త్సర్యము బెంచుకొంటివె కసాయిగ? నడ్డను కుంటె పిల్లలన్
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్!

    రిప్లయితొలగించండి
  28. అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ ప్రయత్నం..

    *తే గీ*

    సతిని పొగిడిన సతతము సంతసములు
    పలుకు చక్కగ నెప్పుడు వలపు తోడ
    ప్రేమ పంచుచు నీవును వెతలు దీర్చు
    *ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏

    రిప్లయితొలగించండి
  29. చేరి సాహిత్యరంగమ్ముచెలిమిగాగ
    పొద్దు మాపుల నెఱుగక సద్దుసేయ
    నడ్డగించుచునెడనెడనలుగుచుండ
    నాలి నడఁచి పొందుము వెలయాలి సుఖము
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  30. ఉ:

    సూర్యునిబోలు రూప మతి సుందరమైన శరీర సౌష్టవం
    పర్యనుయోగ నుత్సుకత వాసిగ నొప్పగు నాలి కాదన
    న్నార్యుడు ధిక్కరింప భవ నాశము గోరుటె బల్కనివ్విధిన్
    భార్యను జంపి బొండవలె వార వరానన నిత్య సౌఖ్యమున్

    పర్యనుయోగ=తెలుసు కొన వలెననెడి కోరిక

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. 'ఆలి నడచి పొందుము వెలయాలి సుఖము'
    ఘోర మీబలుకు,గలను గూడ దలప
    రాదు,యిటుల పలుకు వారగుదుర మంచి
    సఖులు?విడు మనిశము వాని సహచరంబు.

    రిప్లయితొలగించండి
  32. చర్యలలోనకన్పడదుజాలియొకింతయు వాని యాలికిన్
    ధైర్యము సన్నగిల్లెమది దానవుడాతడు భర్తకాదహో
    క్రౌర్యమనస్కుడిట్టులనెకన్నులనిప్పుల గ్రుమ్మరించుచున్
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్య సౌఖ్యమున్

    రిప్లయితొలగించండి
  33. కార్యములందు దాసి రసగంధిల భోజ్యములందు తల్లి మా
    ధుర్యముఁ బంచు మోవి పరితోషముతో వచియించు కంఠ మౌ
    దార్యముచూపు మానసము ధార్మిక రాగముఁ జూపు, నెవ్విధిన్
    భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్ ?

    రిప్లయితొలగించండి