11, ఏప్రిల్ 2021, ఆదివారం

సమస్య - 3690

12-4-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంతలు గనులున్నను దెరువే కననైతిన్”
(లేదా...)
“ఇంతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో”

59 కామెంట్‌లు:

  1. సుంతయు జాలియు లేకన్

    వింతౌ పురుగు భువనములనంతయు చుట్టెన్

    అంతము చేయు విధమునన్

    ఇంతలు గనులున్నను దెరువే కననైతిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. 'లేక' అన్నది కళ. "సుంతైన లేక జాలియు.. వేగమె చుట్టెన్" అనండి.

      తొలగించండి
  2. చెంతకు చేరగ వచ్చె ను
    వంతలు గూర్చుచు కరోన భయ కంపితమై
    యెంతయు యోచన జేసిన
    నింతలు కనులున్నను దెరువే కన నైతిన్

    రిప్లయితొలగించండి
  3. సుంతయిన తెలియ కుండెనె
    యింతి జనకరాజ పుత్రి యెచ్చట కలదో
    కాంతను గాలించుటకై
    యింతలు గనులున్నను దెరువే కననైతిన్.

    రిప్లయితొలగించండి
  4. ఇంతిని గని ప్రవరాఖ్యుడు
    నింతలు గనులున్నను దెరువే కననైతిన్
    జింతను దీర్చవె నా యిలు
    చెంతకు జనదారిజూప చెలియను వేడెన్

    రిప్లయితొలగించండి
  5. అంతయు నీదుసృష్టియని యాద్యము నంతము
    నీవెయేయనిన్
    సంతత భక్తిభావమున సజ్జనసంగతి సాధువాదమున్
    చింతన జేయగా దొరకు జిత్తమునందున నీదురూపమే
    సంతసమందగా తగిన శాశ్వతధామము నీదెయన్నచో
    ఇంతలు కన్నులున్న దెరువే కననైతి యదెంత చోద్యమో

    భౌతిక దృష్టికి భగవంతుడు గోచరమవ్వడని భావన!🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతా పరితాపము

      ఎంతటి పాపము జేసితొ
      వింతగ చెఱబడితి లంక విధినేమందున్
      చింతన జేయగ విడివడ
      నింతలు కన్నులున్నను దేరవే కననైతిన్

      తొలగించండి
    2. సవరణతో

      అంతయు నీదుసృష్టియని యాద్యము నంత్యము
      నీవటంచు నే
      సంతత భక్తిభావమున సజ్జనసంగతి సాధువాదమున్
      చింతన జేయగా దొరకు జిత్తమునందున నీదురూపమే
      సంతసమందగా తగిన శాశ్వతధామము నీదెయన్నచో
      ఇంతలు కన్నులున్న దెరువే కననైతి యదెంత చోద్యమో

      తొలగించండి
    3. సుంతయు జాలిలేక విధి సొక్కగజేయుచు
      ప్రాయమందు దా
      పంతము బట్టినట్టుగను పాపిట బొట్టును నూడ్చివేయగా
      సంతత భాష్పధారలను చాలిమిగోల్పడి శూన్యదృక్కుల
      న్నింతలు కన్నులున్న దెరువే కననైతి యదెంత చోద్యమో

      తొలగించండి
    4. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    5. ధన్యాస్మి గురుదేవా!నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    గుంతలబాట., మధ్యఁ గన కోటికి పైబడి వాహనమ్ములున్,
    చెంతనె యెర్రదీపమును., చీటికి మాటికి మ్రోగు శబ్దమీ
    ప్రాంతము జూడ క్రిక్కిరిసె., బాపురె! యింటికిబోవుటెట్టులో
    యింతలు కన్నులున్నఁదెరువే కననైతినిదేమి చోద్యమో!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ప్రవరుని స్వగతమ్😄

      ఇంతలు కన్నులున్నవని యింతియె నన్ పరిహాసమాడగా
      స్వాంతమునన్ కలుక్కుమనె., చక్కని చుక్కను జూచి నేనునే..
      కాంతముగా దలంతునె? వికారమనస్కుడనౌదునొక్కొ? నా..
      కింతలు కన్నులున్న దెరువే కననైతినిదేమి చోద్యమో!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. చింతనుచేయకపరమును
    వింతగకాలముగడుపుచువేగిరపడకన్
    అంతముచూడనినడకను
    ఇంతలుకనులున్ననుఁదెరువేకననైతిన్

    రిప్లయితొలగించండి
  8. కె.వి.యస్. లక్ష్మి:

    ఎంతటి మాయాజాలము?
    వింతయె మరి తరచి జూడ వివరము తోచెన్
    నంతయు గనికట్టు మహిమ
    యింతలు గనులున్నను దెరువే కననైతిన్.

    రిప్లయితొలగించండి

  9. పంతము బూని రామసతి పావని జానకి జాడకోసమై
    క్షాంతిని నాల్గుదిక్కులును సామియె పంపగ కాంచవచ్చినన్
    గాంతను గాననైతి కనకాంగి యయోనిజ యున్నచోటునే
    నింతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమిచోద్యమో.

    రిప్లయితొలగించండి
  10. ఇంతిరొ యేమని దెల్పుదు
    నింతదనుక గోపబాలుడెందున్నాడో
    సుంతదెలియ లేకున్నా
    నింతలు గనులున్నను దెరువే కననైతిన్

    రిప్లయితొలగించండి
  11. కాంతయు కనులను జూడగ
    అంతయు నెరుపెక్కి జూడ బాధగనుండెన్
    వింతగ దోచెను భర్తకు
    ఇంతలు గనులున్నను దెరువే కననైతిన్

    రిప్లయితొలగించండి
  12. పొంతముగోరి మాధవుఁని పూనికతో దరిచేర నెంచనో
    యింతిరొ కాననైతి హరి నెందును గాంచితివేమొ దెల్పుమా
    పంతమదేల వెన్నునకు బాలను జాలిగ చేరజీర నా
    కింతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    సంతకు బోవ నక్కడొక చక్కని చుక్కకు కన్ను గీటగన్
    చెంతకు చేరి బావ యని చిక్కిన పైకము చేతబూని తా
    నింతిని కాదటంచు నొలి నెంచితి నంచన తోచకుండనై
    యింతలు గన్నులున్న దెరువే కననైతి నిదేమి చోద్యమో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. బంధు సుతుల మరణానంతరం రావణుని స్వగతము...

    ఇంతిని గాంచి మరులు గొని
    పంతముతో నాహరించి వంతల బెడితిన్
    అంతంబయె వంశమయో
    ఇంతలు గనులున్నను దెరువే కననైతిన్

    రిప్లయితొలగించండి


  15. వింతైన దేశమిది రెం
    డింతలు గనులున్నను దెరువే కననైతిన్
    పంతము బట్టెను కేంద్రము
    కొంత వెసులుబాటులేదు కుర్సీకి కదా !
    జగన్నాధుని
    మనోరథ
    చక్రాలు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  16. పనిముందుకు నడవదు మే
    దిని యింతలు గన్నులున్నఁ దెరువే కననై
    తి నిదేమి చోద్యమో ద్ర
    వ్యనిధి కుదియుచుండె జీతభత్యములెట్లా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. సమస్య :
    ఇంతలు గన్నులున్న తెరు
    వే కననైతి నిదేమి చోద్యమో

    ( మయసభలో కాలుజారిన సుయోధనుని అంతరంగపు ఆవేదన )

    ఉత్పలమాల
    ------------

    అంతటి రాజరాజునయి
    యక్కజ మయ్యెను మోసపోతినే !
    యెంతయొ క్రుంగె నామది ; మ
    రెంతయొ కౌరవగౌరవంబదే
    యంతము నందె ; ద్రౌపదియె
    యాస్యము పొంగ హసించె నక్కటా !
    యింతలు గన్నులున్న తెరు
    వే కననైతి నిదేమి చోద్యమో ?

    రిప్లయితొలగించండి
  18. ఇంతటి వెత నెన్నడెరుగ
    చెంతన గల దీపముడిగె , చీకటి ఱేయిన్
    సుంతయు వెలుతురు లేదే
    ఇంతలు గనులున్నను దెరువే కననైతిన్

    రిప్లయితొలగించండి
  19. ఇంతిని కోరి తెచ్చితిని లంకను చేర్చితి జానకీ సతిన్

    జంతువు బాసటై నిలిచి కాంతుడు భీకర యుధ్ధ ఘోషనన్

    అంతము చూపు రీతినను రాముని బాణము చుట్టు ముట్టగన్

    ఇంతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  20. ప్రవరుని పొందు గోరిన వరూధిని ఆవేదన...

    కందం
    కంతుని మించెడు ప్రవరుని
    సొంతము సేసుకొననెంచి చుంబింపఁగఁ గ
    వ్వింతలకుసి గొల్పెడు నా
    కింతలు గనులున్నను దెరువే కననైతిన్

    ఉత్పలమాల
    కంతుని మించు సుందరుడు కాంతలపాలి జయంతు నంద నే
    నెంత తపించితో! వగల నింపుగఁ జిందుచుఁ గన్నుగీటి క
    వ్వింతల ముంచుచున్ ప్రవరు ప్రేమనుఁ బొంది రమించ జూడ నా
    కింతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి
  21. పంతముతో పొలమ్ము చని పామును కాంచితి రాత్రివేళలో
    చెంతకు వచ్చి నృత్యమును చేయుచు నుండ ఫణమ్ము విచ్చుచున్
    భ్రాంతి ఘటిల్లె వేగముగ పాదములందు వడంకు హెచ్చగా
    నింతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  22. స్వంత తనూజులన్ దునిమి స్వాంతన గూర్చగ వచ్చు వానిపై
    గంతలు గట్టు సాధ్వి తన కన్నులు జేవురిలంగజేయ దృ
    ష్ట్యాంతపు తీవ్రతన్ కమల నంఘ్రియుగంబు యుధిష్ఠిరుండనెన్
    యింతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  23. ఇంతీవరూధినీ!నా
    కింతలు గన్నులున్నను దెరువే కననైతిన్
    నంతయు నయోమయమయే
    చింతలు లేకుండ నేగ చెప్పుమ దారిన్

    రిప్లయితొలగించండి
  24. గంతలుగట్టినట్లుగను గన్నులుగల్గుట యోవరూధినీ!
    యింతలుగన్నులున్న దెరువేకననైతి నిదేమిచోద్యమో
    యంతయునుండెగానరయనంతముజిక్కనిమార్గమిచ్చటన్
    నింతివరూధినీ!చెపుమ యిచ్చటి మార్గము బోవ యింటికిన్

    రిప్లయితొలగించండి
  25. చింతాక్రాంతుండ నయితి
    సాంతము వ్యాపింప నిచట నకటా యటవీ
    ప్రాంతమున నంధకారం
    బింతలు గను లున్నను దెరువే కన నైతిన్


    వింతలు మెండు విశ్వమున వృక్షము లెట్లు జనించె నాదిలో
    సంతతి మూగ జీవులకు సంధిలు నెవ్విధి పెర్గు నింపుగా
    నింతిరొ తాటి చెట్టునకు నెవ్విధిఁ దూఱెనొ గుంజు ముంజలో
    నింతలు గన్నులున్నఁ దెరువే కన నైతి నిదేమి చోద్యమో

    [కన్నులు = తాటి ముంజ కున్న మూడు రంధ్రములు]

    రిప్లయితొలగించండి
  26. కాంతునివిశ్వరూపమునుగాంచిరిముఖ్యులుదివ్యదృష్టినిన్
    శాంతనవాదులున్గనిరిసారధికృష్ణునిదివ్యరూపమున్
    చింతనజేయగానొకడుఁజిత్తమునందునభారమందుచు
    న్నింతలు గన్నులున్నఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో”

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  27. వింతగదోచు నీ జగతి
    విభ్రమ సంభ్రమము ల్జెలంగుచున్,
    సుంత యెఱుంగజాల మిట,
    శోధన కందని దీ ధరిత్రి, తా
    నంతయు కానరాదది, య
    నంతము, నంత గ్రహింప జాలమే,
    యింతలు గన్నులున్నఁ దెరు
    వే కననైతి నిదేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి
  28. వింతగదోచు నీ జగతి
    విభ్రమ సంభ్రమము ల్జెలంగుచున్,
    సుంత యెఱుంగజాల మిట,
    శోధన కందని దీ ధరిత్రి, తా
    నంతయు కానరాదది, య
    నంతము, నంత గ్రహింప జాలమే,
    యింతలు గన్నులున్నఁ దెరు
    వే కననైతి నిదేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి