7, ఆగస్టు 2022, ఆదివారం

సమస్య - 4156

8-8-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరసతినిఁ గోరి కవివర్య వాసిఁ గంటె”
(లేదా...)
“పరసతి నెంతగా వలచి వాసినిఁ గంటివొ సత్కవీశ్వరా”

17 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సేవకు ప్రతిరూపమ్ముగ చిత్తమందు
    ప్రేమఁగాంచితొ భార్యలో విశ్వనాథ!
    సాధ్విఁ ద్రిశతిఁబొగడి మరుజన్మలో న
    పర సతినిఁ గోరి కవివర్యవాసిఁ గంటె!

    చంపకమాల
    మెరయగ విశ్వనాథవర! మీవగు సేవల తోడునీడఁగన్
    మరణము జాలిలేనిదన మానిని దూరము సేసినంతటన్
    దిరముగ నిల్చెడున్ ద్రిశతిఁ దీర్చుచు మేటిగ సాహితీ పరం
    పర, సతి నెంతగా వలచి వారిని గంటివొ సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    సేవకు ప్రతిరూపమ్ముగ చిత్తమందు
    ప్రేమఁగాంచితొ భార్యలో విశ్వనాథ!
    సాధ్విఁ ద్రిశతిఁబొగడి మరుజన్మలో న
    పర సతినిఁ గోరి కవివర్యవాసిఁ గంటె!

    చంపకమాల
    మెరయగ విశ్వనాథవర! మీవగు సేవల తోడునీడఁగన్
    మరణము జాలిలేనిదన మానిని దూరము సేసినంతటన్
    దిరముగ నిల్చెడున్ ద్రిశతిఁ దీర్చుచు మేటిగ సాహితీ పరం
    పర, సతి నెంతగా వలచి వాసిని గంటివొ సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. లంకకే కీడుఁ దెచ్చెను రావణుండు
    పరసతినిఁగోరి,కవివర్య !వాసిఁ గంటె ?
    పద్య సుమమాల శ్రీరాము పాద పద్మ
    ములదరి నునుచి జేయు నీపూజ వలన

    రిప్లయితొలగించండి

  5. విద్యనుగుడువ వచ్చిన విశదరశ్మి
    యందమునుగాంచి మోహించి యతివ తార
    కోర కాదనక శశియె గురువు భార్య
    *“పరసతినిఁ గోరి , కవివర్య , వాసిఁ గంటె.

    రిప్లయితొలగించండి
  6. భరువు గొలుచు లంకేశుడు భ్రష్టు డయ్యె
    పరసతినిఁ గోరి ; కవివర్య వాసిఁ గంటె
    పెరిమగ రచించు కవితల వెల్లువ విని
    పురమునందలి జనులెల్ల ముదము నొంద

    రిప్లయితొలగించండి
  7. అరయగ డెందమందు ధవళాంగిని నిల్పుచు నామె నామమున్
    నిరతము తల్చువాడవయి నిశ్చల భక్తిని జూపుచున్ సదా
    శరణమటంచుగాదె జలజాసనుడా చతురాస్యుడౌ పరా
    త్ప రసతి నెంతగా వలచి వాసినిఁ గంటివొ సత్కవీశ్వరా.

    రిప్లయితొలగించండి

  8. పరసతి నెంతగా వలచి వాసినిఁ గంటివొ సత్కవీశ్వరా
    సరసతఁ గల్గి యుండుచును సార్ధక మౌగద నీదు ప్రేమయున్
    పరసతిఁ జూడగాఁదగునె?భార్యగ మేదిని గామ వాంఛకున్
    నిరతము జూడుమా సతిని నీరజ నాభుని ధర్మపత్నిగా

    రిప్లయితొలగించండి
  9. చంపకమాల
    వరకలహంసవాహన,దివౌకస వందిత పాదపద్మ,సుం
    దర దరహాస,హస్తధృత నవ్య విపంచిక,శ్వేతవస్త్ర,శ్రీ
    కర మునిసంస్తుతా నిగమ గానవినోదిని బ్రహ్మదేవ వా
    క్పరసతి నెంతగా వలచి వాసిని గంటివొ సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  10. మంచి పెంచంగ యత్నించు మాన్యు డగుచు
    ఘటనల్ గాంచి స్పందించు ఘనుడు గాగ
    కాంక్ష తోడుత వరి యించె కవిత యనెడు
    పరసతిని గోరి కవి వర్య వాసి గంటె

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    రావణుడు మరణించె పరవశ మొంది
    పరసతినిఁ గోరి, కవివర్య వాసిఁ గంటె
    గొప్ప కావ్య రచనలకు కూర్పరులయి
    జనుల మదిలోన నిలిచిరి శాశ్వతులయి.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  12. చిత్రమైనది తనకున్న సృజన శక్తి
    తనదు రచనలతో నొందె దైవ కృపను
    భూరి వరముకోరుమనగ మురిసి యుక్తి
    పర సతినిఁ గోరి కవివర్య వాసిఁ గంటె

    రిప్లయితొలగించండి
  13. వ్రాయదలచితి మనమున పట్టి కలమ
    పరసతిని గోరి, కవివర్య వాసి గంటి
    నంబ కరుణించ వ్రాసితి "నాసర"యను
    నొక్క పద్య కావ్యమ్మునునుత్సుకతన

    రిప్లయితొలగించండి
  14. చదువుతొయ్యలి చరణముల్ మదిని నిల్పి
    పద్యములఫలములను నైవేద్యమిచ్చి
    భక్తిఁ బూజలు సలుపుచు పలుకుజెలి న
    పరసతినిఁ గోరి కవివర్య వాసిఁ గంటె!

    రిప్లయితొలగించండి
  15. కావ్య రచనా ధురంధర కర విరాజి
    త వర పుస్తక మిక్కిలి ధన్యుఁడవు గ
    దన్న యేక పత్నీవ్రత సన్నుత గుణ
    పర సతినిఁ గోరి కవివర్య వాసిఁ గంటె


    పరమ పతివ్రతా తిలక భార్యను గూడి యశోధనుండవై
    వర పద భావ సంకలిత పండిత పామర సప్రజా మనో
    హర రచనా సమాకుల సమంచిత సుందర కావ్య నామ కా
    పర సతి నెంతగా వలచి వాసినిఁ గంటివొ సత్కవీశ్వరా

    రిప్లయితొలగించండి
  16. పరమకృపా నిధిన్ ప్రథిత పావన మూర్తిని పల్కుబోటినిన్
    నిరతము మానసంబున వినిశ్చలతన్ గొలువుంచి భక్తితో
    నెరపుచు పూజలన్ సతము నిర్మల చిత్తమునందునన్ పరా
    త్పరసతి నెంతగా వలచి వాసినిఁ గంటివొ సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  17. భారత కర్ష కావళియు బాధ్యతతోడను
    ఖాద్య సస్యముల్
    మీరిన శ్రద్ధతో బ్రజల మేలుదలంచియు
    మంచి యెర్వులన్
    భూరిగ వేసి పెంచుటచె పొందరి మిక్కిలి
    మంచి పంట ని
    స్సారము లేనితిండిదిని శక్తి గడించిరి లోకులెల్లరున్

    రిప్లయితొలగించండి