23, ఆగస్టు 2022, మంగళవారం

సమస్య - 4171

24-8-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే”
(లేదా...)
“మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగ ముచ్చటాయెరా”

39 కామెంట్‌లు:

 1. నిరతముఁ ద్రాగుచు నింటను
  బరుషపు మాటలు బలుకుచు బాధలు వెట్టన్
  భరియించ లేక బాధలు
  మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే

  రిప్లయితొలగించండి
 2. నర్తనశాలకు వచ్చెడు కీచకుని అలికిడి విని సైరంధ్రి రూపంలో నున్న వలలుని అంతరంగము...

  కందం
  బిరబిర నర్తనశాలకుఁ
  జిరునగవుల కీచక! కుతిఁ జేరితె? వలలున్
  దరుణిగ ననుకొంటివొ? నీ
  మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే?

  చంపకమాల
  మరులను జూపగన్ వలచె మాలిని నన్నని కీచకాధమా!
  బిరబిర మోహ చిత్తునిగ వేడ్కను నర్తనశాలఁ జేరితో?
  దరుణిగ మారితిన్ వలలుఁ దప్పదు నీకిక మంగళంబు నీ
  మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగ ముచ్చటాయెరా?

  రిప్లయితొలగించండి
 3. తరుణవయస్కులర్భకులుదైత్యశిఖామణితాటకాంగనన్
  శరణముగోరప్రాణమనిజంపగజెచ్చెరవచ్చెయక్షిణీ
  *మరణముఁగోరివచ్చినది; మానిని సూడఁగ ముచ్చటాయెరా*
  విరిసినజాజిమల్లెవలెవెన్నెలనవ్వులసీతసౌరులన్

  రిప్లయితొలగించండి
 4. ఉ.అంహసు రూపుమాపి యనఘాత్ములుగా సలుపంగుమారులన్
  సంహతనీతిచంద్రికల జల్లగ జల్లెడు చందమామలై
  సంహితలైన సూరికృతసత్కృతులన్ రసరమ్యపాత్రలన్
  సింహముతల్లి;తేలుసతి;చేపలుమిత్రులు;పీతచెల్లెలౌ.
  ....చంద్రమౌళి రామారావు, బాపట్ల.

  రిప్లయితొలగించండి
 5. తరుణము దొరికిన దానిని
  కరముప యోగ పడు నట్టి కార్యక్రమమున్
  నెరపెడు పరుల పయిన లే
  మ రణ మ్మును గోరి వచ్చె మానిని గంటే!

  రిప్లయితొలగించండి
 6. నిరతముఁ ద్రాగు చుండుచును నేర్వక మంచిని గోలఁజేయగాఁ
  బరువును బోయెనంచునిఁక భామిని వేదనఁ జెంది తానుగా
  మరణముఁ గోరి వచ్చినది,మానిని సూడఁగ ముచ్చటాయెరా
  యరుదగు వస్త్రధారణము,హ్లాదముఁ గల్గెడు దేహ కాంతి తోన్

  రిప్లయితొలగించండి
 7. తరుణము రాగ ధీరతను దక్కువ గాదని జూపు భామినుల్
  గరళము ద్రావ శంకరుని గావఁగ లోకుల గౌరి వేడెనే
  నరకము జూపు భూసుతుని నాశము జేయగ శార్ఙ్గధన్వు భా“
  మ, రణముఁ గోరి వచ్చినది, మానిని సూడఁగ ముచ్చటాయెరా”
  తరతమ మెంచరే ధరణి ధర్మము నిల్పగ వీరనారులున్

  రిప్లయితొలగించండి
 8. చెరలాడి తనను వీడక
  కరోన తగులుకొన , దాని గతి నణచకనే
  చరమ దశకు చేరుటచే
  మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే

  రిప్లయితొలగించండి
 9. నరవర! తవ దివ్యోద్భా
  సురమౌ ఘనదేహభాతి సురకాంతలనే
  మురిపింప, నూర్వశి యను
  స్మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే?

  రిప్లయితొలగించండి
 10. సరసోక్తుల, కను సైగల
  నరనవ్వుల, హావ భావ, హంస నడకలన్
  సరిజోడునీవ యని, కా
  మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే.

  విరిసిన ముద్దబంతి ఘనవేనలి వెన్నెల నవ్వు లీనుచున్
  సరసము లాడు చుండి, కను సైగల మైమర పింప జేయుచున్
  వర కలహంసయానముల వన్నెలు చిన్నె లు గుల్కు చుండి, కా
  మరణము గోరి వచ్చినది మానిని సూడగ ముచ్చ టయ్యరా !

  రిప్లయితొలగించండి
 11. పరదేశమునందుండియు
  పరిచితులను చిన్ననాటి పరివారంబున్
  చిరకాలపు మిత్రుల సం
  స్మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే

  రిప్లయితొలగించండి
 12. తరుణీ గమనించితివా
  సరగున పరిపరి తెరగుల శలభము శిఖిపై
  తిరుగుచు నుండెను విడువక
  మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే

  రిప్లయితొలగించండి
 13. కరుణనొకింతయు చూపక
  తరుణీమణులేగునట్టి దారులయందున్
  చెరపట్టెడి క్రూరాత్ముని
  మరణమును కోరి వచ్చె మానిని గంటే

  పరవనితనుకామించెడు
  దురూహ తోవెంటబడినదుష్టుని గనుచున్
  విరటుని యర్ధాంగియనుజు
  “మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే”

  కరమున శరమును దాల్చుచు
  హరినొక కంటను గనుచును నావేశముతో
  నరకుని గాంచుచు నాతని
  మరణమ్మును గోరివచ్చె మానిని గంటే


  రిప్లయితొలగించండి
 14. ఎరుగక నిప్పుఁ దాకినపుఁ డెవ్వరికేనియు కాకపుట్టదా
  పరగగఁ జూడుమొక్క శలభమ్మెటు చేరినదగ్ని కీలపై
  మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగ ముచ్చటాయె రా
  పెరిగియు వహ్నిలో దుముక నేలదలంతురొ యవ్వనమ్మునన్

  (రాపు=నిప్పు అంటుకొను రగులు.)

  రిప్లయితొలగించండి
 15. చం.అరయగ నీలవేణి భుజగాస్త్రముగా, సొగసైన భ్రూవిని
  ర్భరధనురుజ్ఝితేక్షణఖరప్రదరంబులె వృష్టిగా, పురం
  దరపురభిచ్చతుర్ముఖజితస్మితమోహనబాణమౌర!మ
  న్మరణముఁగోరివచ్చినది మానిని చూడగ ముచ్చటాయెరా!
  (జగన్మోహినిని చూచి మైమరచిన భస్మాసురుని మధురోహాప్రపంచము)
  ....చంద్రమౌళి రామారావు, బాపట్ల.

  రిప్లయితొలగించండి
 16. తరుణీ రత్నము వల్కెడు
  గిరలను విన స్పష్ట మేరికి నయినఁ దలపం
  గ రయమ్మున, నిది నిశ్చయ
  మ, రణమ్మును గోరి వచ్చె మానిని గంటే

  తరుణులఁ గాంచ మన్యులను ధాత్రిని నివ్విధి సక్త చిత్తలం
  దరుణము నందు నిర్ణయము తప్పక కైకొను నట్టి వారినిన్
  నిరతము ప్రేమ పంచఁగను నీరజ లోచన వెంట నుండ నా
  మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగ ముచ్చ టాయెరా

  రిప్లయితొలగించండి
 17. దురితపు బుద్ధితో ఖలుడ దుష్టుడు నాశము
  నొందగోరి యా
  తరుణిని ద్రౌపదిన్ వలచి తద్దయు రమ్మన
  నిట్టి సంగతి
  న్నెరిగియు భీముడుగ్రుడయి యింతిగ
  మారియు చేరె వానిదౌ
  మరణము గోరి వచ్చినది మానిని సూడగ ముచ్చటాయెరా

  రిప్లయితొలగించండి

 18. నరకుడు ప్రాగ్జ్యోతిష పుర
  పరిపాలకుడౌ దనుజుని పాలిసుడను తా
  పరిమార్చనెంచి పుత్రుని
  మరణమ్మును గోరివచ్చె మానిని గంటే.  కొరకొర చూపులేల సుమ కోమలి నన్ణు వరించమన్న యా
  మొఱకుని ద్రుంచనెంచుచును ముద్దియ కృత్రిమ ప్రేమజూపుచున్
  సరసము లాడరమ్మనుచు సైగను చేసె ఖలుండు కీచకున్
  మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగ ముచ్చటాయెరా

  రిప్లయితొలగించండి
 19. కం:నరుడా!యీ అచ్చర నీ
  సరసత్వమ్ము జూడ గోర సందియ మేలా?
  వరపుత్రుడ!నీతో కా
  మరణమ్మును గోరి వచ్చె మానిని కంటే!
  (అని ఊర్వశి అర్జునుని తో అన్నది.)

  రిప్లయితొలగించండి
 20. చం:తురగము నెక్కి వచ్చి తమ తో రణ మందున నిల్చు లక్ష్మి లో
  కరకు దనమ్ము గాంచి తమ గర్వము ప్రక్కన వెట్టి యిట్లు మె
  చ్చిరి పలు తెల్ల సైనికులు "చేసి రణమ్మును రాణి నెగ్గునే
  మరణము గోరి వచ్చినది మానిని చూడగ ముచ్చటాయె రా!"

  (తమతో యుద్ధానికి ధైర్యం గా నిలబడిన ఝాన్సీ లక్ష్మిని చూసి శత్రువు లైన ఆంగ్లసైనికులే మెచ్చుకున్నారు.ఆమె ఎలాగూ గెలవదు కానీ ఒక స్త్రీ చావుకి తెగించి రావటం చూడ ముచ్చట గా ఉన్న దని.యుద్ధం లో కొన్ని సార్లు శత్రువులని ప్రశంసించటం జరుగుతుంది.)

  రిప్లయితొలగించండి