16, ఆగస్టు 2022, మంగళవారం

సమస్య - 4164

17-8-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారము లేనట్టి తిండి శక్తి నొసంగెన్”
(లేదా...)
“సారము లేని తిండిఁ దిని శక్తి గడించిరి లోకులెల్లరున్”

27 కామెంట్‌లు:

  1. కారము తీపియు నుప్పును
    చేరిన వగరును వరించు చేదును పులుపున్
    గోరుచు నిత్యము.. రుచి ని
    స్సారము లేనట్టి తిండి శక్తి నొసంగెన్!

    రిప్లయితొలగించండి
  2. నీరసముఁ గలుగు జనులకు
    సారము లేనట్టి తిండి ,శక్తి నొసంగెన్
    నారార పాలుఁ ద్రాగుచు
    నోరార తిండిఁ దినగను నోముల రమకున్

    రిప్లయితొలగించండి
  3. చారువలదు, తినవలె నతి
    సారము లేనట్టి తిండి,శక్తి‌ నొసంగున్
    జోరుగ మజ్జిగతో పలు
    మారులు తినిన‌యని మాత ‌మంచిగ జెప్పెన్


    విరోచనములతో‌ బాధ‌పడు‌ సుతునకు మాత పలుకులు

    రిప్లయితొలగించండి

  4. ఆరోగ్యమునకు హానియె
    సారము లేనట్టి తిండి, శక్తి నొసంగెన్
    క్షీరము తాజా ఫలములు
    కూరలు పప్పుదినుసులను కోరిభుజింపన్.

    రిప్లయితొలగించండి
  5. నీరస మొందిమూర్ఛిలిరి నీరజ నాభుని భక్తులందరున్
    సారము లేని తిండిఁ దిని, శక్తి గడించిరి లోకులెల్లరున్
    నారస రూపు శంకరుని నాయత రీతిని వేడుకోవగాఁ
    గారణ భూతుఁ డాశివుఁడు కాంచగ నెమ్మిని నాక్షణంబునన్

    రిప్లయితొలగించండి

  6. క్షీరము కాయగూరలుము చేవను బెంచెడు దుంపజాతులన్
    భూరిగ దిన్న వార్తమని పూజ్యులు చెప్పిరి కాదె నేడిలన్
    కోరి భుజించెడిన్ మురుగు గుంతల దాపున నమ్ము నట్టి యా
    సారము లేని తిండిఁ , దిని శక్తి గడించిరి లోకులెల్లరున్?

    రిప్లయితొలగించండి
  7. కందం
    నూరక మరలో బియ్యము
    గోరక మల్లెపువువంటి కూడు, దినంగన్
    గూరె బలము, గతమున ని
    స్సారము లేనట్టి తిండి శక్తి నొసంగెన్

    ఉత్పలమాల
    నూరియు బియ్యమున్ మరను నోటికిఁ దెల్లగ మల్లెపూ వలెన్
    జేరుచ నిత్యకృత్యముల చేవగలుంగట సాధ్యమెట్లొకో?
    కోరుచు మున్ బలమ్మదియె కూడుగ దంపుడు బియ్యమెంచి ని
    స్సారము లేని తిండిఁ దిని శక్తి గడించిరి లోకులెల్లరున్

    రిప్లయితొలగించండి
  8. కోరకు రుచ్యంబైనను
    సారము లేనట్టి తిండి, శక్తి నొసంగెన్
    తీరుగ నిస్రావమ్మును
    నీరుల్లినిలవణముఁగొని నీటినిఁ ద్రావన్

    (నిస్రావము=గంజి)

    రిప్లయితొలగించండి
  9. కారణమగు రోగములకు
    సారము లేనట్టి తిండి :శక్తి నొసంగెన్
    దోరపు పోషక విలువల
    సారము గల యట్టి తిండి సర్వుల కిల లోన్

    రిప్లయితొలగించండి
  10. చేరును దరిరోగముతిన
    సారములేనట్టితిండిశక్తినొసంగెన్
    కూరలు మెండుగగొన్నన్
    దూరముచేయుచు రుజలను తోషము కూర్చున్

    రిప్లయితొలగించండి
  11. నీరసకారణమౌగద
    సారము లేనట్టి తిండి, శక్తి నొసంగెన్
    క్షీరము మరియు సమతులా
    హారము నిత్యంబొసగగ నారోగులకున్

    రిప్లయితొలగించండి
  12. కందం
    కారము పెంచగ నామ్లత
    మీరిన తీపి మధుమేహమిడె! ఉప్పుయు మీ
    రన్ రేగె బీ. పి! రుచి, ని
    స్సారము లేనట్టి తిండి శక్తి నొసంగెన్

    రిప్లయితొలగించండి
  13. దారకు వండుట దెలియక
    గారవమును వేసి వండి గతుకుమనంగా
    మారు పలుకక తినగ నా
    సారము లేనట్టి తిండి శక్తి నొసంగెన్

    రిప్లయితొలగించండి
  14. కారము క్షారముంగలిపి గాడిద గంపెడు బొక్కినట్లుగా
    పూరణసేయ కుక్షి,తగు పోషకముల్ లభియించునే కటా!
    *సారము లేని తిండి;తిని శక్తి గడించిరి లోకులెల్లరున్*
    కూరలు,పప్పు,మాంసములు కూర్మిని భోజనమందు జేర్చుచున్.

    రిప్లయితొలగించండి
  15. కందము
    నీరసము హెచ్చె తినగా
    సారము లేనట్టి తిండి;శక్తినొసంగెన్
    కూరలు,పప్పులు రోగికి
    వారము భుజియించినంత వ్యాధియు తగ్గెన్.

    రిప్లయితొలగించండి
  16. ఆరోగ్యము జెడుబరచెను
    సారము లేనట్టి తిండి ; శక్తి నొసంగెన్
    భూరిగ కూరల తోడన
    గారవమును వేసి వండి గతుకుచు
    నుండన్

    రిప్లయితొలగించండి
  17. మ.విలసద్భారతపుణ్యధాత్రినతులస్వేచ్ఛామృతాంశూదయో
    జ్జ్వలవజ్రోత్సవవేళ వెన్నెలలయోజన్ హర్షమేపారె;భో
    గలతల్ ద్రెంపి మృతిన్వరించిన యశఃకాయోల్లసద్దృక్కులన్
    గలువల్ పూచె వియత్తలంబునఁబవల్ గన్గొంటివా సత్కవీ?
    ....చంద్రమౌళి రామారావు, బాపట్ల.

    రిప్లయితొలగించండి
  18. కందం
    నీరస మిచ్చును ఘనరస
    సారము లేనట్టి తిండి ,శక్తి నొసంగెన్
    కూరలు పప్పుదినుసులున్
    నేరిమి వండి తినిపించ నెచ్చెలి ప్రీతిన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  19. సారవిహీనమైనయెడ స్వాదమునైనను చూడరాదు ని
    స్సార పదార్ధముల్దినిన స్వస్థత చేకురుటెట్లు సాధ్య?మిం
    పారగ కాయగూరలను పండ్లను దిన్నను మేలుగూర్చు ని
    స్సారము లేని తిండిఁ దిని శక్తి గడించిరి లోకులెల్లరున్

    రిప్లయితొలగించండి
  20. కారణ జన్ముడౌ కమతకాడు పొలమ్మున సాంప్రదాయకుం
    డై రహియించుచున్ కృతకమైన విధమ్మును వీడి, దీక్ష భూ
    సారము పెంచునట్టి వ్యవసాయము చేయ, రసాయనమ్ముదౌ
    సారము లేని తిండిఁ దిని, శక్తి గడించిరి లోకులెల్లరున్
    అసనారె

    రిప్లయితొలగించండి
  21. ఏ రీతిం గలుగు బలము
    సారము లేనట్టి తిండి చాల నమలినం
    దీరుగ వచింపు వడి నే
    సారము లేనట్టి తిండి శక్తి నొసంగెన్

    వారక యేపుగా బలము వర్ధిలఁ జేయు పదార్థ జాలమున్
    వారము వార మింపుగను బన్నుగఁ గొంచును బొట్ట నిండుగం
    గారము నింక నా పులుపు కమ్మఁ దనమ్ము సెలంగు చున్న ని
    స్సారము లేని తిండిఁ దిని శక్తి గడించిరి లోకు లెల్లరున్

    రిప్లయితొలగించండి
  22. చేరును దరిరోగముతిన
    సారములేనట్టితిండిశక్తినొసంగెన్
    కూరలు మెండుగగొన్నన్
    దూరముచేయుచు రుజలను తోషము కూర్చున్


    మరొక పూరణ

    భూరిగపంటపండునని మూటలు మూటల మందువేయ ని
    స్సారములేనిపంటలవిసంచులునిండగవచ్చినంతని
    స్సారములేనితిండితినిశక్తిగడించిరిలోకులెల్లరున్
    కోరినవెల్లదక్కెనని కూరిమి తోడను పల్కిరొప్పుగా

    రిప్లయితొలగించండి
  23. ఉ.

    గౌరవ పండితుల్ కృతయుగంబున శూరులు భక్తి జూపగన్
    ధీరులు వీరులున్ బుధులు దివ్యులు బ్రహ్మను విష్ణు నీశునిన్
    గీరితి వర్ణనన్ సలుప కేలును జోడ్చిరి కాదె ! విప్రతీ
    సారము లేని తిండిఁ దిని శక్తి గడించిరి లోకులెల్లరున్.
    ............ ........................

    విప్రతీసారము = అకృత్యము

    రిప్లయితొలగించండి