22, సెప్టెంబర్ 2022, గురువారం

సమస్య - 4198

23-9-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రేపొనర్చు జనులనే పొగడెద”
(లేదా...)
“రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్”

21 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
కొందరిదను మాట కోటను దాటెడున్
చేతలెరుగరయ్య చిత్రమేమొ?
నేడనుకొనియు మరు నిమిషమ్ము గాకున్న
రేపొనర్చు జనులనే పొగడెద!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉత్పలమాల
ఊపున మాటలాడుచుఁ బ్రయుక్తమునైనను గార్యమన్నదే
యోపికఁ జేయనొప్పరుఁ బ్రయోజనకారిగనందరాడినన్
యేపని నైన నేడనియు నింగితమెంచుచుఁ గాక వెంటనే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్!

M.B.G.TILAK చెప్పారు...

చిత్తశుద్ధితోడ విత్తమాశించక
రాజకీయమందు రాటుదేలి
నాణ్యమైనసేవ నాడు నేడు మరియు
రేపొనర్చు జనులనే పొగడెద

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మొదలుపెట్టి పనులు పూర్తికాలేదంచు
మదిని బాధ పడక మాను గాను
చేయదలచినట్టిచెయ్దములువిడక
రేపొనర్చుజనులనే బొగడెద

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

జాగు సేయ కుండ జరుగ వలసి నట్టి
పనులను గమనించి పట్టు బట్టి
శ్రద్ధ తోడ సలుప సమకట్టి వెంటనే
రేపొనర్చ జనుల నే పొగ డెద

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మరొక పూరణ
ఆచరించవలసి నట్టి కార్యములను
చేయలేక బాధ చెందు వారు
పట్టు వదలకుండ వంతను విడనాడి
రేపొనర్చు జనుల నేబొగడెద

subbarao చెప్పారు...

చిత్త శుద్ధి తోడఁ జేయు కోరికఁగల్గి
యెపుడు నైన గాని యిపుడు గాని
జేయఁ బూను నెడల చివరకు మొదటగా
రేపొనర్చు జనులనే పొగడెద.

sitharamayya solasa చెప్పారు...

ఖాయముగ నది తమ కర్తవ్య మనుకొని
పుడమి పైన తాము పుట్టి నట్టి
నేల కీర్తిపెంచ నేడు కాకుండిన
రేపొనర్చు జనులనే పొగడెద

విరించి చెప్పారు...


మీన మేషమంచు మిడుకుచు పనులను
వాయిదాలువేయు వానికంటె
నేడు పూర్తి కాగ నిలువ యున్న పనుల
రేపొనర్చు జనులనే పొగడెద.


ఓపిక లేదునాకని ముహూర్తము మంచిది కాదటంచు తా
నాపని చేయలేనని నిరాశను చూపక శ్రద్ధతోడ తా
మాపటి కార్యమయ్యది సమాప్తము కాని సశేష కార్యమున్
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.

Rama Murthy Duvvuri చెప్పారు...

ఆటవెలది
చూపనెపుడు శ్రద్ధ*రేపొనర్చు జనుల;
నే పొగడెద*వేగ నేడు జేయ
మంచి పనుల కంటె మించినదేలేదు
వాయిదాల నెపుడు వేయఁదగదు.

subbarao చెప్పారు...

ప్రాపును బొందగోరుచును రాముని పాదము లాశ్ర యించగా
రేపులు మాపు లొక్కటిగ రేపఁగ నెయ్యము లొక్కటౌచు నే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
మాపని యంచుఁ మార్వలుకు మాటలు సెప్పఁజాలనే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సలుపవలయు నేడు తలచిన కార్యము
వాయిదాలు వేసి వదలరాదు
నేడు కాని పనికినిస్పృహ చెందక
రేపొనర్చు జనులనేపొగడెద

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఏపనినైన చేయునపుడెట్టి యవాంతరముల్ ఘటించినన్
ఓపికబూని దీక్షగొని యొడ్డుకు జేర్చెడివాడె వంద్యుడౌ
మాపొనరించలేనియెడ మానక యోచనసల్పి యాపనిన్
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్

Rama Murthy Duvvuri చెప్పారు...

ఉత్పలమాల
కాపురుషుల్ వచించెదరుగా పనిఁజేయగ బద్దకించుచున్
రేపని, వాయిదానిడ సరే!యని మెచ్చను,నేడు సేయుటే
గా పనివారి లక్షణము కావున ముందుగ నేడొ వెంటనే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.

Subbarao Ayyalasomayajula చెప్పారు...

ఉ.

ప్రాపుగ నన్నయాది కవి పండిత భారత పద్యముల్ వహిన్
గాపుయు గాదు, కర్షకుడు గావ్యపు కర్తయు పోతనాఖ్యునిన్
నైపుణి, కాశి, ఖండముగ నాథుని కావ్యము నాంధ్రజాతికిన్
*“రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్”*

A.Satyanarayana Reddy చెప్పారు...

చూపుచు మానవత్వమును సొంపుగ సాయము చేయుచున్ సదా
దాపున చేరుపేదలకు తద్దయు ప్రీతిని, చిత్తశుద్ధితో
శ్రీపతి కోవెలందునను చేసెడి సేవల నేడుకానిచో
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తెల్లముగఁ దలఁచి మది "సహసా విదధీత
నక్రియా" మని వచనములు కలుగ
వేగిరపడ కుండ నాఁగి విచారించి
రే పొనర్చు జనులనే పొగడెద

రేపటి నాదు జీతమును బ్రీతిగ నేఁడ యొసంగ శంకతో
నాపక సంతసించి కడు నంచిత రీతిని మిక్కుటమ్ముగా
రేపినఁ గొంత వట్టునను రేపటి కావలి నాటి కార్యమున్
రే పొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్

Koninty Ramesh చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Koninty Ramesh చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sistla Sharma చెప్పారు...



నిన్న మన కొసగిన నిజమైన చేతన
నేటి దినము దాని నిగుడ జేసి
బ్రతుకు దారిలోని పనులను యోచించి
రే పొనర్చు జనుల నే పొగడెద!

subbarao చెప్పారు...

వారిజ నాభుఁడ చ్చటను పాండవ పక్షపు రాయబారిగాఁ
గోరి స యోధ్యఁ జేయగను గూరిమి తోడను రాజరాజ!మీ
తోరణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ
వారికి యీయుమా యిపుఁడె భాగము వారిది సంతసింపగా
వారును మీరు సౌఖ్యముగఁ బాలనఁ జేయఁగ వీలు గల్గునే