16, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4560

17-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదుగురాడు మాట పాడి గాదు”
(లేదా...)
“పదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్”

19 కామెంట్‌లు:

  1. ఎవరి స్వార్థము వారిదౌ, నెదుటి వారి
    గూర్చి దలప రెవరు, గుంభనముగ
    తమపనులు చక్క బెడుచునితరుల గూర్చి
    పదుగురాడు మాట పాడి గాదు”

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    అన్న రక్షణార్థమరుగుదెంచెడు వేళ
    కథనమల్లకున్న కవివరుండు
    లక్ష్మణుండు గీసె రామకై గీతయన్
    బదుగురాడు మాట పాడి గాదు

    చంపకమాల
    సదమల రీతి నాదికవి చక్కగ వ్రాసిన రామగాథలో
    ముదమొనగూర్ప పండితులు పోకడలల్లిరి మార్చి, సీత నా
    సుదతిని గావ రేఖలను చుట్టుగ గీసెను లక్ష్మణాఖ్యుడన్
    బదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్

    రిప్లయితొలగించండి
  3. సదమలమతి తోడ జాతిమేలును గోరి
    పలుకు నుడులె నిలుచు నిలనుగాని
    భువికి భారమైన మోఱకు లైనట్టి
    పదుగురాడు మాట పాడి గాదు.



    సదమల చిత్తులున్ గనగ సద్గుణ శ్రేణియు, కీర్తి మంతులౌ
    చదువరు లాడు మాటలవి సంస్తుత నీయమ టంచు ధాత్రిలో
    పదిలము గాను నిల్చు నిది వాస్తవ మందురు శుంఠకాయలౌ
    పదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్.

    రిప్లయితొలగించండి
  4. పదుగరాడుమాట పాటిగాదెన్నడు
    సత్య దూరమైన సజ్జనుండ
    ఒక్క డాడిన చాలు నొనరంగ సత్యంపు
    పలుకు జగతిలోన ప్రజ్వరిల్లు.

    రిప్లయితొలగించండి

  5. ధరణియందుజూడదప్పకనిజమౌను
    *“పదుగురాడు మాట, పాడి గాదు”*
    పరులమాటలువినిబంధుజనములను
    కరకుమాటలాడికలతబెట్ట

    రిప్లయితొలగించండి
  6. స్వార్త బుద్ది చేత వ్యర్థ మైన పనులు
    పెక్కు జేసి మిగుల నిక్కు వాని
    మంచి వాడ టంచు మరిమరి నుతియించు
    పదుగు రాడు మాట పాడి గాదు

    రిప్లయితొలగించండి

  7. నేడు రాష్ట్ర మందు నేతల పనుపున
    జరిగినది సకలము జనులెరిగియు
    పాభవమున కింత భయము చెందినపుడు
    పదుగురాడు మాట పాడి గాదు

    రిప్లయితొలగించండి
  8. న్యాయమూర్తి పలుకు న్యాయమైయొప్పును
    చట్టసభలుచేయ చట్టమగును
    వందలాదిజనులు వాక్రుచ్చనొకరీతి
    పదుగురాడు మాట పాడి గాదు

    చదివిన సూక్తులందుగని చప్పున చెప్పిన నిక్కమందుమా
    కుదురుగ గుర్తెరింగి మరి గోచరమైనవి కల్లలందుమా
    యెదురుగ వందమంది జనులిమ్ముగ పల్కిన మాటలన్ గనన్
    బదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్

    రిప్లయితొలగించండి
  9. ఆ॥ రాజకీయ మందు రభసఁ జేసి పలుకు
    చుండ్రు పలువిధముల సూక్ష్మముఁ గన
    ప్రజల చేత గాక నిజము గ్రహించకఁ
    బదుగురాడు మాట పాడి కాదు

    చం॥ పదుగురు రాజకీయమనఁ బండిత వర్యుల రీతి మాటలన్
    ముదముగ నాడు చుండుటను బొంకము మీరఁగఁ జూతు మెల్లెడన్
    వెదుకఁగ నందు తప్పులను వేలకు వేలుగఁ గాంచ వచ్చునే
    పదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్

    (ముఖ్యంగా రాజకీయము రాజకీయ నాయకులగురించి)

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది
    బలిమితో పలికిన పలుకులవి సభన
    పదుగురాడు మాట పాడి గాదు
    జనహితమ్ము గణన సలుపలేని తడవు
    రాజకీయ రచన రాణ కెక్క.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

    రిప్లయితొలగించండి
  11. కోట్లజనులునేడు‌ కుటిలనేతనుపెంచి‌
    చావుదెబ్బకొట్టె‌ సత్యమునకు‌
    కొత్త సామెతిపుడు‌ గొప్పగా నిలచేను‌
    పదుగురాడు‌ మాట పాడి‌ గాదు‌.


    మంచి‌పనులపేర‌ మాయలోముంచేటి‌
    నేత‌ దేవుడనుచు నిష్ఠుడనుచు‌
    వెర్రితలలు పోయి‌ వెగటుగా పొగుడుచూ‌
    పదుగు‌ రాడు‌ మాట‌ పాడి‌ గాదు

    రిప్లయితొలగించండి
  12. నివురుగప్పియున్న నిప్పువంటి నిజము
    కానకున్న నదియె కల్ల యౌనె ?
    మంచివానిఁ గూర్చి వంచకుడతఁడని
    పదుగురాడు మాట పాడి గాదు

    రిప్లయితొలగించండి
  13. పదుగురి మేలుఁ గోరి తనవంతుగ సాయమొనర్చు మాన్యునిన్
    నిదురనునైన నెవ్వరిని నిందయొనర్చని సచ్చరిత్రునిన్
    పదుగురు గూడి యాతడొక ప్రల్లదుడంచు నధఃకరించగన్
    పదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్

    రిప్లయితొలగించండి
  14. *_అయోధ్యలో చాకలి వాని నింద._*

    చం.

    హృదయముతో వచింతు నిట హీనపు కార్యము భార్య చేసెడిన్
    సదయుని నా పరోక్షమున సాగిన జీవన కాలమల్పమా?
    పదకము సీత దెచ్చి పరిపాలన రాముని నీతి నొప్పనే
    *పదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్?*

    రిప్లయితొలగించండి
  15. అధములు ధూర్తులందరు కడ

    సత్యపు దుర్నయులైనవారలున్

    పదుగురు పల్కుమాట యెటు

    పాడియగున్, దలపోసి చూసినన్

    సదమల నీతిమంతుడును సత్యము

    వల్కెడు వాడు నేర్పుతో

    గుదురుగ బల్కినన్నదియు గొప్పగ

    నాదరమందు ధాత్రిలో.

    రిప్లయితొలగించండి
  16. పదుగురాడు మాట పాడి గాదనుట న
    పాడి గాదు సామి! పుడమి యందు
    పదుగు రాడు మాట పాటియై ధరఁ జెల్లు
    వేమ నార్యు సూక్తి వినగ లేదె?

    రిప్లయితొలగించండి
  17. పదవులు పొంది బేషజపు పల్కులతోడ ధనమ్ముదోచుచున్
    హృదయ విదారకమ్ము ఘటియింపగ జేయుచు పేదవారికిన్
    పదిలముచేయగా పదవి పాలసులన్ సమకూర్చి గొప్పగా
    పదుగురు పల్కుమాట యెటు పాడియగున్ ?దలపోసి చూచినన్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పలు విధాల నిజము పల్కినను జనులు
    సాక్ష్యమున్ వలయును చట్టమునకు
    తీర్పు వచ్చు దాని తీరును బట్టియే
    పదుగురాడు మాట పాడి గాదు.

    రిప్లయితొలగించండి