18, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4562

19-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదికి ముదము గలిగిన దవమానము సేయన్”
(లేదా...)
“మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్”

16 కామెంట్‌లు:

  1. ముదితను సభకీడ్చుట త
    ప్పిదమను స్పృహలేక పలు సభికులట నుండ
    న్నధముడు, లజ్జా రహితుడి
    మదికి ముదము గలిగిన దవమానము సేయన్”

    రిప్లయితొలగించండి
  2. సదమల చిత్తుల కిలలో
    పదుగురు మెచ్చ o గ గలుగు బహు ముదము గదా
    హృదయము రగులును గా యే
    మదికి ముదము గలిగిన దవ మానము సేయన్?

    రిప్లయితొలగించండి
  3. చదువుల పోటీ జరిపెడు
    సదమున తప్పులు బలికెడు సమయము నందున్
    పదిమంది జనులలో తొ
    మ్మదికి ముదము గలిగిన దవమానము సేయన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీతెనాలి రామలింగకవి తిరుమల రాయుని పొడుచు...


    కందం
    ముదితను గూడిన హరుడవు,
    ముదిత విడ నసురగురుడవు పూవిలుతుడె క
    న్నొదవగన ప్రభువు తిరుమల
    మదికి ముదము గలిగిన దవమానము సేయన్!

    చంపకమాల
    ముదితను గూడినన్ హరుడు ముద్దియ వీడగ శుక్రుడంచు క
    న్నొదవిన మన్మథుండనుచు నొప్పగ బల్కఁగ రామలింగఁడున్
    పదుగురి ముందు స్తోత్రముగఁ బల్కుచు తిర్మలరాయునెంచుచున్
    మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ ముదముగ ద్రౌపది వస్త్రము
    సదమున నూడ్చఁగఁ బ్రతినలు సలుపఁగ భర్తల్
    మది ద్రోణ నాశముఁ గనఁగ
    మదికి ముదము గలిగిన దవమానము సేయన్

    చం॥ పదుగురు చూచు చుండఁగను బ్రాజ్ఞత లేకయె కౌరవాధముల్
    సదమున వస్త్రమూడ్చఁగను సల్పఁగ భర్తలు ఘోర యాడికల్
    ముదితయు ద్రోణనాశనముఁ బోరునఁ గాంచుచు నిట్లు తల్చెనే
    మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్

    ఆడిక ప్రతిజ్ఞ (నిఘంటువు సహాయమండి)
    (ముదిత ద్రౌపది)
    ద్రౌపది దృష్టద్యుమ్నులకు ద్రోణుని చావుపైనే చింత కదండి

    రిప్లయితొలగించండి
  6. వదలక కురులను పట్టుచు
    సుదతిని యీడ్చుకుని వచ్చి సుగ్గడి తలముల్
    వదలక నూడ్వ సుయోధను
    మదికి ముదము గలిగిన , దవమానము సేయన్.


    పదుగురు గాంచుచుండ సతి పాండవు లెల్లరి ధర్మపత్ని ద్రో
    వదినట కీడ్చితెచ్చి పరిపమ్ములనూడ్చుచు దాసివంచు ప్రా
    ణదయితు లెల్ల గాంచ యువ నాయకుడు నగ్రజుడౌ సుయోధనున్
    మది ముదమందఁ జేసి, రవమాన మొనర్చి సభాంగణమ్మునన్.

    రిప్లయితొలగించండి
  7. పదుగురిలో నవమతి తన
    కెదురైనన్ రాజరాజ కృపతో రాజ్యం
    బొదివిన రాధేయునకున్
    మదికి ముదము గలిగిన దవమానము సేయన్

    కుదిరిక నస్త్రవిద్యలను గొప్పగ చూపిన సవ్యసాచి కే
    యెదురుగనిల్చె నార్కి తన కెల్లరు కర్కశమైన ప్రశ్నలన్
    వ్యధనిడ ధార్తరాష్ట్రుడట పట్టముగట్టెగ నంగరాజుగా
    మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్

    రిప్లయితొలగించండి
  8. మదమెక్కి దుస్ససేనుడు
    సుదతిని ద్రోవతిని జనులు చూచుచునుండన్
    సదమున వస్త్రములూడ్చెను
    మదికి ముదము గలిగిన దవమానము సేయన్

    రిప్లయితొలగించండి
  9. సుదతిని ద్రోవతిన్ పతులు చూచుచు నుండగ నిస్సహాయులై
    సదమునకీడ్చి కౌరవులు సల్పిరి బన్నము నిర్దయన్ సభా
    సదుల సమక్షమందు నపచారమునెంచక రాజరాజుకున్
    మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్

    రిప్లయితొలగించండి
  10. పదుగరి యెదుట సభను ద్రౌ
    పది వలువలు విప్పుచుండ బకపక
    నగుచున్
    ముదితను జూడ సుయోధను
    మదికి ముదము కలిగిన దవమానము సేయన్.

    రిప్లయితొలగించండి
  11. చం.

    కదనము గెల్వ పాండవుల కార్యము యాగమె రాజసూయమున్
    పదిలము వీటికన్ బ్రథమ వందన మందుట వాసుదేవుడా?
    *మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్*
    వదరుచు నాగ్రహించి శిశుపాలుడు చచ్చెను చక్రధారిచే.

    ... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  12. మదిలోదురూహనిండగ
    వదరుచు పరిపరి విధముల వనితామణులన్
    బెదిరించు ఖలుని గొట్టగ
    మదికి ముదము కలిగిన దవమానముజేయన్.

    రిప్లయితొలగించండి