26, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4569

27-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్”
(లేదా...)
“కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్”

21 కామెంట్‌లు:

  1. కాలమొక తృణముగ దలచి
    మేలుగ నడపక నటమట మెండుగ జేయన్
    చాల వడిగ గడచి మరల
    వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్

    రిప్లయితొలగించండి
  2. శీలము తృణ ము గ నెంచుచు
    తాలిమి గోల్పోయి జనులు తప్పులు సేయన్
    శీలము గల వా రగు టకు
    వీలగు నొ కొ తృణ ము గొన గ వే వే లి డి నన్

    రిప్లయితొలగించండి

  3. ఆలకు గ్రాసము కొరకై
    యేలూరుకు పంపకుండ నెందుల కెడవున్
    బాలేరునుపంప నిచట
    వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్.



    పొందగ వచ్చు గోవులకు పుష్ఠికరమ్మగు గ్రాస మచ్చటే
    బందరు నందు పుష్కలము పల్వురు చెప్పిర టంచు శుంఠవై
    యెందులకేగుతెంచితివి యియ్యది థారు యెడారి కాదుటే
    కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్.

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    అందముగా ఘనాపఠియె హస్తమునన్ గరికన్ ధరించెడిన్
    విందయె వీనులన్ జదువ వేదము సుస్వర రాగ బద్ధమై
    దందడి దీక్ష, పాఠ్య ఫలితమ్ముగ నీరము ధారవోయగా
    *కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్.*

    రిప్లయితొలగించండి
  5. ఏల ధనమెల్ల?వ్యర్థము!
    నేలయిసుక మయమట గననేర మ్మెపుడున్-
    లీలా మాత్రపు హరితము,
    వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్”

    రిప్లయితొలగించండి
  6. రాలించినచో పైకము
    వీలగునట వెలకుఁదీయ విశ్వము పైనన్
    మేలుగ చంద్రుని పైనన్
    వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్

    ఆందును సర్వతోముఖము నగ్గలమౌనిధి సొంతమైనచో
    పొందగ వచ్చు విత్తమున పుత్తడినైనను లాఘవంబునన్
    కొందఱు గొప్పవారు తమ కోర్కెలు తీరగ చందమామపై
    కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్

    రిప్లయితొలగించండి
  7. వీలగు చంద్రునిఁ జేరగ
    వీలగు హిమశైలమెక్కి విహరింపంగన్
    కాలము వృధగా గడచిన
    వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ మేలగు భక్తిని నిలుపక
    వీలగు నొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్
    మూలము భక్తి ధనమగున
    వీలుగ దైవము కృపఁగన వినవో నరుఁడా


    ఉ॥ అందరి వాఁడు దైవమిల నన్యముఁ దల్చక భక్తి నిల్పుచున్
    సుందర రూపుఁ గొల్చగను శోభగఁ జాలును సర్వమిచ్చునే
    పొందఁగ లేవు సంపదలు పూజ్యుని సంప్రసాదంబుఁ దెల్పఁగన్
    గొంద మటన్న వీలగునొకో తృణముం బది లక్షలిచ్చినా!

    రిప్లయితొలగించండి
  9. మేలగు ఆంధ్రావనిలో
    వేలకువేలుగ స్థలముల వెలపెరుగంగన్
    చేలన్ని మాయమకటా
    వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్

    రిప్లయితొలగించండి
  10. కందం
    శ్రీలు గలుఁగ వేల సతులు
    నేల శివా! తిరిపెమునకు నిద్దరు సతులున్?
    మేలిడు గంగను, గరువున
    వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్?

    ఉత్పలమాల
    పొందుగ సంపదల్ గలుఁగ మోదమిడున్ సతులెందరున్న మీ
    కెందుకు భిక్షమయ్య! సతులిద్దరు? పన్నగధారి! త్ర్యంబకా!
    కుందగ క్షామమై జనులు, గోల్పడు గంగను గోగణమ్ముకై
    కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్?

    రిప్లయితొలగించండి
  11. విందు వినోదముల్నెరపి వేల ధనంబును గ్రుమ్మరించియున్
    కొందరి మెప్పు పొందనగు గొప్పతనమ్మును జూపి యుర్విపై
    కొందలపాటునన్ మనము కుందగ నెవ్వరికైన స్వాస్థ్యమున్
    కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్

    రిప్లయితొలగించండి
  12. కాలము విలువను దెలియక
    పాలసు డది గడ్డి పోచ పగదిని గాంచున్
    తెలసియు గడచిన సమయము
    వీలగు నొక తృణము గొనుట వేవేలిడినన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    చేలన్ని యెండి పోయెను
    ఆలకు గ్రాసమ్ము లేక యాతన పడుచున్
    హాలికులకు క్షామములో
    వీలగు నొకొ తృణము గొనగ వేవేలిడినన్?

    రిప్లయితొలగించండి
  14. కాలుని వలెపైబడుచును
    జాలమ్మునుచేయుఖలుల సంహారమ్మున్
    తేలికగా చేయుజనుల
    వీలగునొకొ తృణముగొనగ వేవేలిడినన్

    రిప్లయితొలగించండి