30, నవంబర్ 2011, బుధవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/1

                  అయ్యప్ప కథాగానం - 2/1

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


అంతలో అక్కడికి తన శిష్యగణముతో
        మునులలో శ్రేష్ఠుం డగస్త్యుడే వచ్చాడు
        రాజు చేతులలోని పసిబాలునే చూసె || రాజు ||
దైవకార్యం తీర్చగా - పుట్టిన
        హరిహరుల తనయుడంటు - గుర్తించె
రాజును దీవించియు - మునిరాజు
        అతనితో పలికినాడు - ఏరీతి


"ఓ రాజ! సంతానమే లేక బాధపడు
        నీకు ఈ పసికందు దైవప్రసాదంబు
        కొడుకుగా భావించి పెంచుకో నీవింక || కొడుకుగా ||
మెడలోన హారమ్ముతో - దొరికాడు
        మణికంఠు డను పేరుతో - పిలుచుకో
సామాన్యు డనుకోకుమా - పన్నెండు
        వత్సరాలకు తెలియును - ఇత డెవరొ || శ్రీకరం ||


ఆనంద ముప్పొంగ ఆ రాజశేఖరుడు
        మణికంఠు నెత్తుకొని నగరికే వచ్చాడు
        తనయు డంటూ చెప్పి తన రాణి కిచ్చాడు || తనయు ||
ముగ్ధమోహన రూపము - వీక్షించి
        పరవశత్వం చెందెను - ఆ రాణి
రాణివాసం నందున - రాజ్యాన
        సంబరాలే చేసిరి - అందరు


మణికంఠు రాకతో పందళ రాజ్యమ్ము
        సకల సంపదలతో తులదూగ సాగింది
        ప్రజ లెల్ల సుఖముగా జీవింపసాగారు || ప్రజ ||
ఇంతలో గర్భవతియై - ఆ రాణి
        పండంటి ఒక కొడుకును - ప్రసవించె
రాజదంపతు లప్పుడు - వానికి
        రాజరాజను పేరును - పెట్టారు || శ్రీకరం ||


రాజు మణికంఠుణ్ణి ‘అయ్య’ అని పిలిచాడు
        రాణి కడు ప్రేమతో ‘అప్ప’ అని పిలిచింది
        అయ్య అప్పలు కలిసి అయ్యప్పగా మారె || అయ్య ||
ఆ పేరె స్థిరపడ్డది - లోకాన
        అందరికి ఆప్తుడయ్యె - అయ్యప్ప
శుక్లపక్షపు చంద్రుడై - దినదినం
        వర్ధిల్లె మణికంఠుడు - అప్పుడు


గురుకులంలో చేరి గురుసేవలే చేసి
        సకల శాస్త్రమ్ములూ యుద్ధవిద్యల నన్ని
        నేర్చినా డయ్యప్ప ఏకసంథాగ్రాహి || నేర్చి || 

చదువు చెప్పిన గురువుతో - తా నేమి
        దక్షిణగ ఇవ్వవలెనో - అడిగాడు
అయ్యప్ప మహిమ తెలిసి - ఆ గురువు
        అతనితో అలికినాడు - ఈ రీతి || శ్రీకరం ||


"నాయనా! మణికంఠ! నా ఒక్క పుత్రుడు
        మూగవాడూ గ్రుడ్డివాడుగా జన్మించె
        లోపాలు సరిదిద్ది జ్ఞానిగా చేయు" మనె || లోపాలు ||
అయ్యప్ప తాకగానే - బాలునకు
        వచ్చె మాటలు చూపును - చిత్రంగ
గురు వెంతొ సంతసించి - దీవించి
        పంపినా డయ్యప్పను - పందళకు


తన తమ్ముడైనట్టి రాజరాజే రాజ్య
        వారసుండని యెంచి పందళరాజుకు
        భృత్యభావంతోడ సేవలే చేసాడు || భృత్య ||
ఈ రీతి మణికంఠుడు - పన్నెండు
        వత్సరమ్ములు గడపెను - ఆచోట
రాజశేఖరు డతనికి - పట్టాభి
        షేకమే చేయాలని - భావించె || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి