4, డిసెంబర్ 2011, ఆదివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/5

                   అయ్యప్ప కథాగానం - 2/5

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం|| )


"శబరిగిరిపై నొక్క ఉన్నతస్థానాన
        పరశురాముడు పరబ్రహ్మకై నిష్ఠతో
        ఘనమైన ఒక ప్రతిష్ఠను చేసి ఉంచాడు || ఘనమైన ||
నేను వేసిన బాణము - పడినట్టి
        చోటనే నాకు గుడిని - నిర్మించు
పద్దెనిమిది మెట్లతో - ఆ స్వర్ణ
        మందిరంలో వెలసెద - దివ్యంగ


పట్టబంధం అభయ చిన్ముద్రహస్తాల
        యోగముద్రను వెలసి ఏడాది కొకసారి
        మకరసంక్రమణాన జ్యోతిగా కనిపింతు || మకర ||
ఆనాడు నా నగలను - నీ వంశ
        వారసులె భూషింతురు - ఎల్లపుడు
నా దీక్ష పాటించెడి - నియమాలు
        వివరింతు నీకిప్పుడు - నా తండ్రి! || శ్రీకరం ||


నల్లబట్టలు కట్టి, ముద్రమాలను వేసి,
        మండలకాలమ్ము వ్రతదీక్షలో ఉండి
        ఇరుప్రొద్దు చన్నీటి స్నానాలు చేయాలి || ఇరుప్రొద్దు ||
బ్రహ్మచారిగ ఉండియు - నేలపై
        శయనించి ఏకభుక్తం - చేయాలి
త్రికరణంబుల శుద్ధితో - సాత్విక
        జీవనమ్మును గడుపుతూ - మెలగాలి


ఇరుప్రొద్దు పూజలతో దీక్ష పూర్తిగ చేసి
        గురుస్వామి కట్టిన ఇరుముడిని తలదాల్చి
        వావరుని దర్శించి వనయాత్ర చేయాలి || వావరుని ||
పంబలో స్నానమాడి - గణపతిని
        పూజించి శబరిపీఠం - చూడాలి
నీలిమలపైన ఉన్న - శరంగుత్తి
        దాటియు సన్నిధానం - చేరాలి || శ్రీకరం ||


తలపైన ఇరుముడితో అష్టాదశ దివ్య
        సోపానముల నెక్కి నన్ను దర్శించాలి
        పొర్లుదండాలతో పూజలే చేయాలి || పొర్లు ||
ముద్రటెంకాయలోని - నెయ్యితో
        చేయాలి అభిషేకము - భక్తితో
మాలికాపురత్తమ్మను - దర్శించి
        ఆ తల్లి దీవెనలను - పొందాలి"


అని చెప్పి అయ్యప్ప విల్లెక్కుపెట్టాడు
        ఈశాన్యదిశవైపు బాణమే వేశాడు
        ఆ దిక్కుకే పోయి మాయమైపోయాడు || ఆ దిక్కు ||
బాణమ్ము పడ్డచోట - ఆ రాజు
        స్వర్ణమందిర మొక్కటి - కట్టించె
లోకకళ్యాణార్థమై - అందులో
        సుస్థిరమ్ముగ వెలసెను - అయ్యప్ప || శ్రీకరం ||


విల్లాలివీరుడై వీరమణికంఠుడై
        అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన
        అయ్యప్ప చరితమ్ము ఆద్యంత మధురమ్ము || అయ్యప్ప ||
ఈ కథను శ్రద్ధతోడ - విన్నట్టి
        భక్తులను కరుణించును - అయ్యప్ప
ఆయురారోగ్యాలను - ధర్మార్థ
        కామమోక్షా లిచ్చియు - కాపాడు

ఇరుముడిప్రియ శరణు! భువనేశ్వరా శరణు!
        భక్తవత్సల శరణు! లోకరక్షక శరణు!
        దివ్య పదునెట్టాంబడిక్కధిపతీ శరణు || దివ్య ||
భక్తచిత్తాధివాసా - శరణమ్ము!
        శత్ర్రుసంహారమూర్తీ - శరణమ్ము!
ఎరుమేలి ధర్మశాస్తా - శరణమ్ము!
        సర్వమంగళదాయకా - శరణమ్ము || శ్రీకరం ||


మంగళం అయ్యప్ప! మణికంఠ మంగళం!
        మంగళం అన్నదానప్రభూ మంగళం!
        మంగళం హరిశంకరాత్మజా మంగళం! || మంగళం ||
మంగళం భూతనాథా - మంగళం!
        మంగళం శబరివాసా - మంగళం!
మంగళం ధర్మశాస్తా - మంగళం!
        మంగళం శుభమంగళం - మంగళం!


                             అయ్యప్ప కథాగానం సంపూర్ణం

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.

మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

1 కామెంట్‌:

  1. తమ్ముడూ ! మీ అయ్యప్ప కదా గాన ఫలితమేమో నిన్న మేము " అయ్యప్పస్వామి " గుడికి వెళ్లి వచ్చాము. ఇక్కడికి ౧౫౦ మైళ్ళు దూరం ఉంది. [ మేరీ లాండ్ లొ ] చాలా బాగుంది గుడి . ధన్య వాదములు

    రిప్లయితొలగించండి