2, డిసెంబర్ 2011, శుక్రవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/3

                అయ్యప్ప కథాగానం - 2/3

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


"నామీది ప్రేమతో శంకించుచున్నావు
        అల్పునిగ భావించి వెనుకాడుతున్నావు
        నా శక్తి ఎంతటిదొ త్వరలోనె తెలిసేను || నా శక్తి ||
నీ దీవెనల బలముతో - పులిపాలు
        సాధించి వస్తానులే - ఓ తండ్రి!
ఈశ్వరుడె తోడు నీడై - నన్నింక
        నడిపించు" నని చెప్పెను - అయ్యప్ప


దైవమ్ముపై రాజు భారమే వేశాడు
        వనయాత్ర కోసమై ఏర్పాట్లు చేశాడు
        సంచినే తెప్పించి ఇరుముడిని కట్టాడు || సంచినే ||
ఒక్క భాగంనందున - నెయి నింపి
        నారికేళం కట్టెను - పూజకై
మరియొక్క భాగమందు - తిండికై
        బెల్ల మటుకులు నింపెను - ఆరాజు || శ్రీకరం ||


తండ్రి అనుమతి పొంది ఇరుముడిని తల కెత్తి
        ఒంటరిగ పయనించి అడవికే చేరాడు
        రాళ్ళల్లొ ముళ్ళల్లొ నడక సాగించాడు || రాళ్ళల్లొ ||
ఉన్నాడు ఆ అడవిలో - వావరుడు
        బందిపోటై దోపిడీ - చేస్తాడు
చూశాడు అయ్యప్పను - బాలునిగ
        భావించి దోచాలని - చూశాడు


అయ్యప్ప అంతట తన శక్తి యుక్తులతో
        వావరు న్నెదిరించి మట్టి కరిపించాడు
        అది చూసి ఆ దొంగ ఆశ్చర్యపడ్డాడు || అది చూసి ||
కా డితడు సామాన్యుడు - తప్పక
        దైవాంశసంభూతుడే - అని నమ్మె
పద మంటి శరణు కోరె - ఇకనుండి
        దుష్టమార్గం విడుతును - అన్నాడు || శ్రీకరం ||


శరణన్న వావరుని మిత్రునిగ చేపట్టి
        "నను నీవు కలిసిన ఈ చోటు ఇకమీద
        ఎరుమేలి పేరుతో ప్రఖ్యాతి చెందేను || ఎరుమేలి ||
ఇకనుండి నా భక్తులు - అడవిలో
        ఈ దారినే వత్తురు - నా కొరకు
వారిని కాపాడుతు - క్షేమంగ
        నా కడకు చేర్చాలిరా - అన్నాడు


అయ్యప్ప తనపైన చూపించు ప్రేమకు
        పులకించి వావరుడు గంతులే వేశాడు
        అతనితో అయ్యప్ప నాట్యమే చేశాడు || అతనితో ||
అది చూసి సంతసించి - వావరుని
        అనుచరులు ఆటవికులు - ఆడారు
ఆనాటి ఆ ముచ్చటే - ఈనాడు
        పేటతుళ్ళై మనలను - మురిపించు || శ్రీకరం ||


అక్కడికి ఎనిమిది ఆమడల దూరాన
        పంపానదీ తీర మందున్న కొండపై
        తపము చేస్తున్నట్టి శబరి వద్దకు పోయె || తపము ||
తన దివ్యహస్తాలతో - తాకాడు
        మోక్ష మిచ్చెను శబరికి - అయ్యప్ప
ఆ కొండ నాటునుండి - శబరిగిరి
        అను పేర ప్రఖ్యాతిని - పొందింది


దేవతలు వచ్చారు స్తోత్రాలు చేసారు
        "స్వామి! నీ అవతార మర్మమ్ము తెలుసుకో
        మహిషి సంహారమ్ము గావింప రావయ్య" || మహిషి ||
అని చెప్పి ప్రార్థింపగా - అయ్యప్ప
        స్వర్గమే చేరినాడు - వారితో
తనతోడ పోరాటమే - చేయగా
        రమ్మంటు పిలిచినాడు - మహిషిని || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి