9, సెప్టెంబర్ 2013, సోమవారం

ఏకవింశతి పత్ర పూజ (పాట)



ఏకవింశతి పత్ర పూజ (పాట)

ఏకదంతా! నీ కిదే మా - ఏకవింశతి పత్రపూజ

కరుణతో మా కొసగవయ్యా - కలిమి బలిమిని విఘ్నరాజా        || ఏకదంతా ||



సుముఖ! వీతభయా! సదయ! నీ - కిదియె మాచీపత్రము

ఓ గణాధిప! శాశ్వతా! నీ - కిదియె బృహతీపత్రము

శ్రీ ఉమాసుత! గజస్తుత్యా! - బిల్వపత్ర మ్మిదియె నీకు

హే గజానన! అవ్యయా! నీ - కిదియె దూర్వాయుగ్మము

హరతనూభవ! గణపతీ! దు-త్తూరపత్ర మ్మిదియె నీకు

మౌనినుత! లంబోదరా! నీ - కిదియె బదరీపత్రము

హే గుహాగ్రజ! గ్రహపతి! అపా-మార్గపత్ర మ్మిదియె నీకు

భక్తవాంఛిత దాయకాయ వి-నాయకాయ నమో నమః          || ఏకదంతా ||



శ్రీపతీ! గజకర్ణకా! నీ - కిదియె తులసీపత్రము

ఏకదంత! దయాయుతా! గతి! - చూతపత్ర మ్మిదియె నీకు

వికట! ఇంద్రశ్రీప్రదా! కర-వీరపత్ర మ్మిదియె నీకు

భిన్నదంతా! దాంత! విష్ణు-క్రాంతపత్ర మ్మిదియె నీకు

వటు! ద్విజప్రియా! నిరంజన! - దాడిమీపత్రమ్ము నీకు

కామీ! సర్వేశ్వరా! దేవ-దారుపత్ర మ్మిదియె నీకు

ఫాలచంద్ర! సమాహితా! నీ - కిదియె మరువకపత్రము

భక్తవాంఛిత దాయకాయ వి-నాయకాయ నమో నమః          || ఏకదంతా ||



హేరంబా! హే చతుర! సింధు-వారపత్ర మ్మిదియె నీకు

శూర్పకర్ణ! అకల్మషా! నీ - కిదియె జాజీపత్రము

హే సురాగ్రజ! పాపహర! ఇదె - గండకీపత్రమ్ము నీకు

అధ్యక్ష! ఇభవక్త్ర! శుద్ధా! - శమీపత్ర మ్మిదియె నీకు

హే వినాయక! శక్తియుత! అ-శ్వత్థపత్ర మ్మిదియె నీకు

దేవ! సురసేవిత! కృతీ! నీ - కిదియె అర్జునపత్రము

కపిల! కలికల్మష వినాశక! - అర్కపత్ర మ్మిదియె నీకు

భక్తవాంఛిత దాయకాయ వి-నాయకాయ నమో నమః       || ఏకదంతా ||


(దాదాపు పదేళ్ళ క్రితం మా వీధిలో గణేశమండపం వాళ్ళ కోరికపై వ్రాసి ఇచ్చిన పాట)




7 కామెంట్‌లు:

  1. అయ్యా! శుభాశీస్సులు.
    మీ పాట చాల భక్తి రసభరితముగా నున్నది. అభినందనలు. చిన్న టైపు పొరపాటు: గండకీ పత్రము అనుచోట ఆ పొరపాటును సరిజేయండి. స్వస్తి.
    సన్యాసిరావు

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గురుదేవులకు, మీ ఏకవిశంతి పత్ర పూజ పాటకు పాదాభివందనములు.

    పరితోషమ్మున వ్రాసిరి
    సుర సేవితుడవని మ్రొక్కి సుందర గేయం,
    వర సిద్ధి వినాయక మా
    గురుదేవుల స్తుతి గని,నిడు కోరిన వరముల్,

    రిప్లయితొలగించండి
  3. ఇరువది యొక్కటి పత్రము
    లిరవగునట్టిట్లు మీరలీగేయమునన్
    వరముగ వ్రాసిన శ్రీ శం
    కరవర్యా మీకు శుభము గణపతి యిచ్చున్.

    రిప్లయితొలగించండి
  4. మంచి పాట నందించిన
    శంకరార్యుల కభినందన సహిత
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు
    మంచి పాటను పంచిన పూజ్య గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    వరప్రసాద్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వసంత కిశోర్ గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    వరప్రసాద్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వసంత కిశోర్ గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి