29, నవంబర్ 2011, మంగళవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/5

                   అయ్యప్ప కథాగానం - 1/5

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


తన భక్తురాలైన కన్నికను రక్షింప
        శివుడు పంపించంగ శ్రీధర్మశాస్తా
        తన మిత్రుడు కరుప్పస్వామితో వచ్చె || తన ||
తంత్రవిద్యలతోడను - ఆ రాజు
        నోడించి రక్షించెను - కన్నికను
అతని రూపం చూసిన - పుష్కళ
        వరియించి పెళ్ళాడెను - శాస్తాను


మలయాళ రాజైన పింజకన్ ఒకసారి
        భూత భేతాళాల చేతిలో చిక్కాడు
        తనను కాపాడంగ శాస్తాను ప్రార్థించె || తనను ||
భూతనాథుని చూసిన - భూతాలు
        దాసోహ మని చేరెను - శరణమ్ము
తన కుమార్తెను పూర్ణను - పింజకన్
        ధర్మశాస్తా కిచ్చెను - భార్యగా || శ్రీకరం ||


తన కూతురైన పుష్కలదేవి ఉండగా
        మరల పూర్ణను పెళ్ళిచేసికొన్నాడని
        కోపించినాడు ఆ నేపాళరా జపుడు || కోపించి ||
మనిషిగా భూమిపైన - శాస్తాను
        బ్రహ్మచారిగ ఉండగా - శపియించె
అది దైవలీలగానే - భావించి
        శిరసా వహించేనులే - ఆ శాస్తా


శ్రీ పూర్ణ పుష్కళాంబా సమేతుండైన
        భూతనాథుని పిల్చి శివుడిట్లు చెప్పాడు
        "నాయనా! విను మొక్క దేవరహస్యమ్ము || నాయనా ||
మహిషికి మోక్షమిచ్చి - జనులను
        కాపాడు కర్తవ్యమే - నీ కుంది
పందళరా జింటను - పన్నెండు
        వత్సరమ్ములు గడుపగా - పోవాలి" || శ్రీకరం ||


మలయాళ దేశాన పందళ రాజ్యాన
        రాజశేఖరుడనే రాజొక్క డున్నాడు
        ప్రజల బిడ్డల రీతి పాలించుచున్నాడు || ప్రజల ||
సంతానమే లేకనూ - ఆ రాజు
        సంతాపమే పొందియు - దుఃఖించె
తాను చేసిన పూజలు - వ్రతములు
        వ్యర్థమైపోయె నంటూ - భావించె


ఆ రాజు ఒకరోజు వేటాడగా దలచి
        మంత్రి పరివారమ్ముతో అడవి నున్నట్టి
        పంపానదీతీర ప్రాంతమ్ము చేరాడు || పంపా ||
స్వేచ్ఛగా సంచరిస్తూ - అడవిలో
        ఎన్నెన్నొ జంతువులను - వేటాడె
మధ్యాహ్నకాలానికి - ఆ రాజు
        అలసి సొలసి చేరెను - ఒక నీడ || శ్రీకరం ||


కునుకు తీస్తున్నట్టి ఆ రాజు చెవి సోకె
        మృదుమధుర గానమై పసివాని ఏడుపు
        "ఈ ఘోరవనిలోన రోదనం ఎక్కడిది?" || ఈ ఘోర ||
 అని లేచి రా జప్పుడు - ఏడుపు
        వినబడ్డ దిక్కుకేగె - వేగంగ
అటు పోయి వీక్షించెను - చిత్రంగ
        పసివాణ్ణి పాముపడగ - నీడలో


"ఎవ్వడీ పసివాడు? ఎందు కిట నున్నాడు?
        పాము పడగను పట్టె బహుగొప్ప జాతకుడు
        వదలిపోరాని ముద్దులమూటరా ఇతడు || వదలి ||
కులగోత్రములు తెలియక - నా వెంట
        ఏరీతి కొనిపోదును - ఇతనిని
ఎవరైన కనిపించరా" - అనుకొని
        అన్ని దిక్కులు వెదికెను - ఆ రాజు || శ్రీకరం ||


                                                       మొదటి భాగం సమాప్తం

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి