3, డిసెంబర్ 2011, శనివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/4

                   అయ్యప్ప కథాగానం - 2/4
(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


పంతాలు పలుకుచు తనముందు నిలుచున్న
        బాలు డా హరిహరుల పుత్రుడే అని నమ్మి
        తన ప్రాణరక్షణకు అతని నెదిరించింది || తన ప్రాణ ||
ఇరువదిన్నొక రోజులు - ఇద్దరు
        యుద్ధమే చేసినారు - తీవ్రంగ
మణికంఠు డా మహిషిని - పైకెత్తి
        గిరగిరా త్రిప్పి వేసె - భూమిపై


మహిషి శరీరమ్ము భూమిపై పడగానె
        దివినుండి దిగివచ్చి ఆ మహిషి తనువుపై
        అయ్యప్ప ఆనందతాండవం చేశాడు || అయ్యప్ప ||
అతని పాదాలు తాకి - మహిషికి
        పోయె దురహంకారము - ప్రాణాలు
శాపమ్ము తొలగిపోయి - దివ్యంగ
        కనిపించె లీలావతి - ఆచోట || శ్రీకరం ||


తన నుద్ధరించింది దత్తుడని గుర్తించి
        పెళ్ళాడమని కోరి పాదాలు పట్టింది
        ఆమాట అయ్యప్ప మన్నించనే లేదు || ఆమాట ||
బ్రహ్మచర్యం చేయుచు - నే నింక
        సాధించు పనులున్నవి - అన్నాడు
ఎంతకాలమ్మైనను - నీ కొరకు
        ఎదురుచూస్తా నందిలే - లీలమ్మ


"ఏటేట నా కడకు వచ్చు భక్తులలోన
        తొలిసారిగా మాల ధరియించి దీక్షగొను       
        కన్నెస్వాములు వారు నాకు ప్రతిరూపాలు || కన్నె ||
ఆ కన్నెస్వాము లెవరూ - రానట్టి
        ఆ యేట జరిగేనులే - మనపెళ్ళి
మాలికాపురత్తమ్మవై - అందాక
        మంజుమాతగ పూజలు - అందుకో || శ్రీకరం ||


మణికంఠు స్పర్షతో మహిషి శరీరమ్ము
        కొండయై ఈనాడు ఆళుదామే డయ్యె
        ఆమె కన్నీరేమొ ఆళుదానది అయ్యె || ఆమె ||
మహిషిని చంపినట్టి - స్వామిని
        మ్రొక్కి కీర్తించినారు - దేవతలు
వారు చేసిన స్తోత్రమే - ఈనాడు
        శరణుఘోషగ మిగిలెను - భక్తులకు


దేవతలతోడ మణికంఠు డిట్లన్నాడు
        "నా తల్లి తలనొప్పి తగ్గించుటకుగాను
        పులిపాలకై నేను అడవికే వచ్చాను" || పులి ||
ఆమాట విని ఇంద్రుడు - దేవతలు
        పులిరూపు దాల్చినారు - అప్పుడే
పులియైన ఇంద్రు నెక్కి - అయ్యప్ప
        పందళరాజ్యమ్మునే - చేరాడు || శ్రీకరం ||

పులివాహనుం డైన అయ్యప్పనే చూసి
        రాజుతో పాటు ప్రజలంత అబ్బురపడిరి
        తనతప్పు నొప్పుకొని మన్నించమనె రాణి || తనతప్పు ||
నిజరూపముల దాల్చియు - దేవతలు
        అయ్యప్ప జన్మకథను - చెప్పారు
హరిహరుల పుత్రుడైన - దేవుడే
        తనకు కొడుకని మురిసెను - ఆరాజు


"అవతార బాధ్యతలు తీరాయి నన్నింక
        సెలవిచ్చి ప్రేమతో దీవించి పంపండి"
        అని స్వామి కోరగా ఆ తండ్రి విలపించె || అని స్వామి ||
"పూర్వజన్మము నందున - ఇచ్చిన
        వరము దీర్చితి నిప్పుడు - కొడుకునై"
అని చెప్పి తననగలను - తొలగించి
దాచమంటూ తండ్రికి - ఇచ్చాడు || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి