రచన : మధురకవి గుండు మధుసూదన్
"క్షమ నొసంగుము భగవతీ! కమల లక్ష్మి
శుద్ధ సత్త్వస్వరూపిణీ శోభితాంఘ్రి
కోపపరివర్జితా సృత్వరీ పరాత్ప
రీ క్షమాశీలి తాపహంత్రీ నమోఽస్తు!
సర్వ సాధ్వులలో సాధ్వి, సర్వ రూప
వతులలో రూపవతివి నీవమ్మ! నీవు
లేనిచో జగమంతయుఁ బ్రేత సమమ
గుచును నిష్ఫలమ్మగునమ్మ! కూర్మినిమ్మ!
సకల సంపత్స్వరూపవు, సర్వరూప
వీవె! రాసేశ్వరుల యధిదేవి వీవె!
సకల సతులందు నీ కళ సంక్రమించు!
లేరు నిను మించు దేవత లిజ్జగమున!
నీవె కైలాసమున శివానివిగఁ, బాల
కడలిలో సింధుసుతగ, స్వర్గమ్మునందు
స్వర్గ లక్ష్మిగా, భూతలోపరిని మర్త్య
లక్ష్మిగా వెలుఁగుదువమ్మ! రాఁగదమ్మ!
నీవె వైకుంఠమున లక్ష్మి! వీవె దేవ
దేవి, తులసి, సరస్వతీదేవి, గంగ;
వీవు సావిత్రివే గద విశ్వసృజుని
లోకమునఁ గన, నో తల్లి, నీకు నతులు!
నీవె కృష్ణుని ప్రాణాధిదేవతగను,
ప్రధిత గోలోకమున స్వయం రాధికగను
ధన్యత నిడియు, వెలయ బృందావనమున
బృంద; రాసాన రాసేశ్వరివయితీవె!
నవ్య భాండీరముననుఁ గృష్ణప్రియవయి,
చందన వనానఁ జంద్రవై, చంపకవన
మందు విరజవై, శతశృంగమందు నీవె
సుందరివయి వెల్గితివమ్మ సుకరముగను!
పద్మవనమున నవ పద్మవయ్యు, మాల
తీ వనమ్మున నవ మాలతివయి, కుంద
వనమునం గుందదంతివై తనరి, మిగుల
స్థిరతఁ గేతకీ వనిని సుశీలవైతి!
తగఁ గదంబ వనమునఁ గదంబమాల,
రాజగృహమున ఘన రాజలక్ష్మి, యటులె
ప్రతి గృహమ్మున గృహలక్ష్మి వలెను నిలిచి
పూజలను గొనుచుందువు పుడమిపయిని!
అంబుజాస నాతిచ రాబ్ధి జామ లేంది
రేశ్వరీ కమలాలయా శ్రీద విష్ణు
వల్లభా రమా మాధవీ వాహినీశ
నందినీ మారజననీ వినమ్ర నతులు!"
అనుచు దేవతల్, మునులును, మనుజులంత
నమ్రవదనులై భక్తితో నతులు సేసి,
శుభ్రకంఠోష్ఠతాలువుల్ శోభిలంగఁ
బ్రార్థనము సేసి తరియించ్రి రమణమీఱ!
ఇట్టి లక్ష్మీస్తవమ్మును నెవ్వఁ డుదయ
మునను భక్తిఁ బఠించు, నతనికి నెపుడు
ధ్రువముగాఁ బుణ్యములు శుభా లొదవునట్లు
తల్లి లక్ష్మియే కరుణించుఁ దనివితీఱ!
చాలా బాగుంది మధుసూదన్ గారూ. సమయోచితంగానూ ఉంది.
రిప్లయితొలగించండిచాలా సంతోషమండీ...ధన్యవాదాలు!
తొలగించండిమధు సూదన్ గారూ
రిప్లయితొలగించండిలక్ష్మి స్తోత్రం చాలా ప్రశస్తoగ గలదు.
చాలా సంతోషమండీ...ధన్యవాదాలు!
తొలగించండిచక్క ని అనువాద మ్ బాగుంది
రిప్లయితొలగించండిచాలా సంతోషమండీ...ధన్యవాదాలు!
తొలగించండిమద్విరచిత సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రము (తెనుఁగు సేఁత)ను శంకరాభరణంలో ప్రకటించి తమ సహృదయతను చాటుకున్న మన్మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారికి మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు!
రిప్లయితొలగించండి