4, సెప్టెంబర్ 2017, సోమవారం

దత్తపది - 122 (అవ్వ-తాత-అత్త-మామ)

అవ్వ - తాత - అత్త - మామ
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

66 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అవ్వల, శత్రుమండలగతాతత బంధుసుమిత్రకోటినిన్
      యవ్వ! వధించు టెట్లనుచు వ్యర్ధపు యోచన మాని యత్తఱిన్
      గవ్వడి ! లెమ్ము పోరునకుఁ గ్లైబ్యము వీడియె, కర్మలందున
      న్నెవ్వరి కైనఁబట్టు, ఫల మేమను తర్కము నాపుమా!మదిన్
      [శత్రుమండల-గత-ఆతత ]

      తొలగించండి
    2. ఊకదంపుడు గారూ,
      అద్భుతమైన పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు.

      తొలగించండి
  2. అవ్వలా యాగమునకేల యరుగవలెను,
    మామది యెటుల యుసిగొల్పి మయసభ గన
    నంప వలెను,భుతాత్మ సొంపుబడయు
    దొరువు లో కాలు నేరీతి సరసగతిన
    బెట్టవలెయెను,పడవలె నెట్లుదాని
    లోన, అత్తరి పాంచాలి జాణ వచ్చి
    నన్ను జూడ నెటుల, జూచి కన్ను మిన్ను
    గానక పరిహ సించుచూ నాన జేయ
    వలెననుచు గురు నాధుడు వగచె నపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "...నంపవలయును.." అనండి. అలాగే "లోన నత్తరి..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు సవరించుకుంటాను

      తొలగించండి
  3. (అర్జునుడు ఊర్వశితో)
    వనితా!తప్పిది!యొప్పదు;
    నిను నత్తను వలనుపడదు;నిర్మలచిత్తం
    బున నవ్వలి తెరగరయుము;
    కను మామకవిది లతాంగి!కరుణను జనుమా!

    రిప్లయితొలగించండి
  4. పాండవులరణ్యవాసము చేయునప్పుడు విశ్రమించిన తల్లికి సోదరులకు భీముడు కాపలాకాయునప్పుడు

    “అవ్వ”న మందు “తా త”నియ “నత్త”రి “మామ”క మంచు వెంట నీ
    జవ్వనియౌ హిడింబ పడ క్షాత్రపు రీతిని “తా త”మిన్ కరం
    బవ్వన మందుపట్టెనస హాయపు ధీరత “నత్త”డింపగన్
    కవ్వడి మెచ్చభీ ముడట కాంతకు “మామ”కు డయ్యె నంతటన్.
    ( దత్త పదము లేక పాదము నందు గూడ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      చెప్పింది భీముని విషయం. మీరు అర్జునుని వలె సవ్యసాచిత్వాన్ని ప్రదర్శించారు. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. శర్మ గారు మహాద్భుతమైన పూరణ చెప్పారు. మనఃపూర్వ కాభినందనలు.
      చంద్రుని యందు కూడా మచ్చ యున్నట్లు చిన్న చిన్న వ్యాకరణాతిక్రమణలు కన్పించు చున్నవి.
      తాఁ దనియె; తాఁ దమింగరంబు; డింపగంగవ్వడి.
      అప్పుడు తాత పదమునకు హీనత యేర్పడినదేమో!

      ఇట్టి ద్రుత సంధి లోపములు మఱి కొందఱి కవి మిత్రుల పూరణలలో కూడ కన్పించు చున్నవి.
      ద్రుత సంధి నిత్యమన్న సత్యము మఱవ రాదు.

      తొలగించండి
  5. అవ్వడి గనుమా మహిలో
    కవ్వడె యత్తరి శరముల గాండీవముతో
    రువ్వును తాతా తమరిక
    సవ్వడి సేయక వెనుకకు జారిన మేలౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాత' పదాన్ని స్వార్థంలో ప్రయోగించారు.

      తొలగించండి

  6. అవ్వల చక్రంబున్ గొని
    కవ్వడి కై యత్తరి యుడుగణ వీధినహో
    జవ్వాడన్ శ్యామా! మగ
    చువ్వనె తా తలను తుంచుచు జయద్రథునిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. అవ్వల గనుమా మనమున
    వెవ్వెఱ లాడంగ తాత విరటుని కొలువున్
    జివ్వున నత్తరి ముదముగ
    సవ్వడి చేయంగ క్రీడి సహనము నొందెన్

    తాత = భ్రహ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాత' పదాన్ని స్వార్థంలో ప్రయోగించినట్టే లెక్క!

      తొలగించండి
  8. వల చె ను హి డ oబిభీ ము నవ్వని ని గాంచి
    అత్త రి ని వారు మద ను ని మత్తు నందు
    ము ని గి రి సు మా మధు ర మై న మో హ వ శ త
    పూల వని తా త తు ల్ నవ్వే పులకరి oచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు టైపు చేస్తున్నపుడు అక్షరాల మధ్య వ్యవధానం ఎందుకుంటున్నది?

      తొలగించండి
  9. అవ్వ ! ఇదియేమి చోద్యమొ యనుచు జనులు
    నివ్వెర పడిరి అత్తరి కవ్వడి గని
    తాతగుదునని పార్థుడు తరుణి గెలిచె
    చూడుమా మత్స్య యంత్రము క్రీడి గొట్టి.

    రిప్లయితొలగించండి
  10. అవ్వల బంధుల జూచుచు
    కవ్వడి తా తపన విడువ కదనముపైనన్
    హవ్వాయని యత్తరి హరి
    నవ్వుచు మామక యనుచును జ్ఞానము జెప్పెన్.


    రిప్లయితొలగించండి
  11. సుభద్రతో నర్జునుడు!

    వినుమా జవ్వని ! యవ్వల
    పునాధు మామది నమితము పులకలు రేపన్
    చనవున నత్తలపులచే
    గొనవె లతాతన్వి!జేరగా రావెధృతిన్

    రిప్లయితొలగించండి
  12. అవ్వ - తాత - అత్త - మామ

    దూర్వాసమహామునివర్యుని చూచి ద్రౌపది తలంపు........ . . . .

    అత్తఱిఁ గనె నవ్వరమునిఁ
    తత్తఱపడి తాఁతపించె తగు భోజ్యములం
    దెత్తెఱగున నిత్తును పురు
    షోత్తమునిక మామనమున నూహింతునిదే.

    రిప్లయితొలగించండి
  13. అవ్వలి బలగములఁ గాంచ హస్తిపురికి
    పోవలయు సుమా! మంతనములు సలిపెడి
    తంతుతోడుత, నలసతా తగదు తగవు
    నత్తరముగ నచ్చోటి కేనరుగువాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అలసతా' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. వావిళ్ళ వారి నిఘంటువులో ఉన్నది. సంసృతము నుండి వచ్చిన పదమని వాడను.

      తొలగించండి
    3. రెడ్డి గారు అలసతా కేవల సంస్కృత పదము. ఆ కారంత స్త్రీ లింగము. తత్సమము చేసినపుడు “అలసత” అవుతుంది.
      వావిళ్ళ వారి నిఘంటువు సంస్కృత నిఘంటువు.
      “అలసతా భావము” అని మరియొక సంస్కృత పదముతో గాని తత్సమము తో గాని సమాసము చేసిన సాధువు. లేనియెడల అలసత సాధువు.

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అవ్వనిత కృష్ణ తా తల్చు నావళి వలె
    నత్తఱి గిరిధరుండని ననువు జేసి
    వచ్చెనంచు బోధిల్లిన వడి పొలుపుగ
    మామనములలరె ననుచు మానసించె

    రిప్లయితొలగించండి
  15. భీముడు సౌగంధికమునుఁదెచ్చు సందర్భంలో ద్రౌపదితో-
    భామ!నే*నవ్వ*లికిఁజని వత్తు;తెత్తు
    సుమము,నేబాధ్య*తాత*మ స్ఫూర్తి తోడ.
    మనసు నా*యత్త*మొనరింతు మరులుఁగొల్ప
    నీదు పరువము * మామ*ది నిండిపండె

    రిప్లయితొలగించండి
  16. అత్తరుణీమణి భృశ దీ
    నాత్త హృదయ కవ్వగపును నాతఱిఁ గరుణా
    చిత్తాతత బాహు హరి వి
    పత్తుడిపె సుమా మఱవక బాంధవ్యమునున్

    రిప్లయితొలగించండి
  17. వినుమా మదీయ శపథము
    గని యత్తఱి సభను నేను కలవర పడగా
    వనితా తగునా నవ్వగ
    విను మవ్వల పంతగించి వేధింతు నినున్

    రిప్లయితొలగించండి
  18. ఊర్వశి విజయుని తో :

    అవ్వడి లేదె కురువరా!
    జవ్వని తా తపన జూప చలియించవొకో?
    కవ్వడి! యుదాత్తమిదియే?
    యివ్వని తనమా? మగటిమదింతయు లేదో?

    రిప్లయితొలగించండి
  19. అవ్వలిని జచ్చు వారల త్తనువుల నిక
    మరుల భూమికి గొంపోవు మా మరువక
    ననుచు నప్పుడు ధర్మజుండాన తీయ
    బంటు లయ్యెడ తా త మక o బు తోడ
    పర్వు లెత్తిరి యనిలోన వరుస గాను


    రిప్లయితొలగించండి
  20. కురుక్షేత్ర సమరానికి ముందు అర్జునుని మాటలు.

    దవ్వునజూసినన్ మిగుల దగ్గరివారును,బంధువర్గమే
    అవ్వగలేను వారినటు నందరిజంపుచు హంతకుండనే
    తవ్వను దేనియున్ యదుసుతా,తపనాశక,నత్తరిన్ సదా
    నవ్వులు జాలునోననిని నాపుము మా మది శాంత పర్చుచున్

    రిప్లయితొలగించండి
  21. కురుక్షేత్ర సమరానికి ముందు అర్జునుని మాటలు.

    దవ్వునజూసినన్ మిగుల దగ్గరివారును,బంధువర్గమే
    అవ్వగలేను వారినటు నందరిజంపుచు హంతకుండనే
    తవ్వను దేనియున్ యదుసుతా,తపనాశక,నత్తరిన్ సదా
    నవ్వులు జాలునోననిని నాపుము మా మది శాంత పర్చుచున్

    రిప్లయితొలగించండి
  22. అత్తరు నలమెను భామా
    మత్తుడు తా,తమకమధిక మవ కీచకుడా
    పుత్తడి సకి సైరంధ్రిని.
    హత్తుకొనగ నాట్యశాల కవ్వల వేగెన్

    రిప్లయితొలగించండి
  23. అత్తపత్తిగ నున్న కన్యను అర్జునుండటు తాకగన్?
    చిత్తమందు సుభద్ర తా,తనుచేరిపోయినయూహగా
    మత్తు మామదిలోనజేరగ ?మాయగా నొకటవ్వగన్|
    క్రొత్త కోర్కెలుయవ్వ నంబున కోరకే మముజేరెగా|

    రిప్లయితొలగించండి
  24. మత్తకోకిల పద్యం బాగున్నది.అభినందనలు !
    "యౌవనం"అనే పదాన్ని యవ్వనం అని వ్రాయకూడదని మాతెలుగు లెక్చరర్ చెప్పేవారు.

    రిప్లయితొలగించండి



  25. ఆ.వె:అవ్వనమున దిరుగు నసురాంగన మదిలో

          తాతలంచె నిటుల తన్మయతన

          మామకీన వనిన మనసిజు వలెనున్న

         నత్తరుణుడెవరని యర్థి తోడ.
    అర్థి=కోరిక

    ఆ.వె:అవ్వనితయు కోర నర్జును డెడదను

           తాతలంచె నామె తల్లి వరుస

           మఘవు కాంత,నిటుల మామది యొప్పదు

           నత్తలంపు వీడు మంచు పలికె.

    రిప్లయితొలగించండి
  26. మువ్వల వేణుమాధవుని మ్రొక్కిన నవ్వనితా శిరోమణిన్
    రివ్వున తాతతాత తగు రీతిన వస్త్రములిచ్చి గాచియున్
    దివ్వెను జూపెనత్తరుణి దీనత దీర్చి సభాంతరంబునన్
    సవ్వడి లేక కార్యమును సాధ్యమొనర్చెను మామదీశుడే

    రిప్లయితొలగించండి
  27. అవ్వనజాత నేత్ర హరి యర్జును మోహమడంచ నత్తరిన్
    నివ్వెరపోవనాతఁడు వివృద్ధిని చూపెను విశ్వరూపమున్.
    క్రొవ్విదమైన యుద్ధమునకుం బురికొల్పఁగ మా మహేశ్వరుం
    డవ్వనజాత నేత్రుఁడని యంజలి తా తరియింప చేసెనే!

    రిప్లయితొలగించండి
  28. అందరికి నమస్కారములు..
    అనుకున్న ఉద్యోగము రాక, వ్యవసాయములో నష్టము వచ్చి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రూపిరెడ్డి ప్రదీప్ రెడ్డి ఫ్యామిలీని ఆదుకోడానికి మేము ఈ నిధుల సేకరణ మొదలు పెట్టాము. దయచేసి మీరు అందరూ మీ బంధువులు స్నేహితులతో షేర్ చేసుకోండి. దాతలు ఎవ్వరైనా సహాయం చెయ్యగలరు. ప్రదీప్ రెడ్డి కి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారి బాధ్యతలు మేమె చూసుకోవాల్సి ఉంది.
    మేము అతని ఇన్సురెన్సులు మరియు అకౌంట్లు అన్ని ప్రయత్నాలు చేసాము. కానీ ఆత్మహత్య మరియు పేమెంట్స్ చెయ్యకపోవడము , ల్యాప్స్ కావడము వలన ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకా మేము వివిధ ప్రభుత్వ పథకాలకు కూడా అప్లై చేస్తున్నాము.
    ఎవ్వరైనా డైరెక్ట్ గా బ్యాంకు అకౌంట్ కి పంపాలనుకుంటే ఈ ఐసీఐసీఐ అకౌంట్ కి పంపగలరు. ప్రతి చిన్న సహాయమైన మాకు పెద్ద సహాయం. ఈ లింక్ లో అన్ని వివరాలు ఉన్నవి.
    కవిత పి
    061801505070
    సేవింగ్స్ అకౌంట్
    ifsc : icic0000618
    దయచేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి ఆదుకోగలరు.
    https://www.impactguru.com/fundraiser/help-pradip-family-who-sucide

    రిప్లయితొలగించండి