27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సమస్య - 2610 (వెడలి రెల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ"
(లేదా...)
"పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్"

106 కామెంట్‌లు:

  1. అదిగొ గౌరి వచ్చెనన్ని నగల తోడ
    సుందరాంగి శివుని సొంతకత్తె
    పరుగు పరుగులిడుచు పర్వతములుదాటి
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    భీష్ముడు = శివుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సొంతకత్తె = సొంతపు స్త్రీ
      (శ్రీహరి నిఘంటువు)

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      'భీష్మ' శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. పిన్ని కొడుకు పిలిచె పెండ్లికి రమ్మని
    ప్రతిన బూనె నపుడు వలద టంచు
    ప్రేమ కుదిరె నేమొ ప్రీతిగా మనువంచు
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    గిరిజ తపము జేసి హరుని వరింపగా
    గరుడరథమునెక్కి హరియు సిరియు
    హంసవాహనమున నబ్జజ శారదల్
    వెడలి రెల్ల *భీష్ము* పెండ్లిఁ జూడ" !!

    భీష్ముడు.. శివుడు

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. క్రన్నన తారకున్ దునుమగా శివసూనుడె శక్తిమంతుడౌ
      నెన్నగ నంచు వ్యూహము రచింప దివౌకసులెల్ల , దేవకా...
      ర్యోన్నతిఁ బార్వతీసతిని నొద్దిక జేకొనుచుండనీశుడున్
      పిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  4. ఘోర తపమొనర్చ కోమలి పార్వతిన్
    హరుడు మెచ్చి పెండ్లి యాడు వేళ
    ముదము నంది సురులు మునులు గంధర్వులు
    వెడలి రెల్ల భీష్ము పెండ్లి జూడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సురలు" అనండి. సురుడుకు బహువచనం సురలు. భూసురుడుకు బహువచనం భూసురులు.

      తొలగించండి
  5. ఎన్నక భారతమ్మునను నెన్నియొ పాత్రలు చేరియుండినన్
    మన్నికకెక్కి మానసపు మందిరమందున భీష్ముడుంటచే
    గన్నకుమారు నామమిడె కాంతయ;యుద్వహనంబు వానికిన్;
    బిన్నలు పెద్ద రేగిరట భీష్మునిపెండ్లిని జూడ వేడుకన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      సుకర్ణో వంటి భీష్ముడన్నమాట! బాగుంది మీ పూరణ. అభినందనలు.
      (ఇండోనేషియా ప్రధాని సుకర్ణో. అతని తండ్రికి మహాభారతంలోని కర్ణుడంటే ఎంతో ఇష్టం. కాని భారతంలోని కర్ణుడు దుష్టసాంగత్యం చేత దుష్టకర్ణుడనిపించుకున్నాడు. తన కొడుకు మంచి కర్ణుడు కావాలని 'సుకర్ణో' అని పేరు పెట్టాడట!)

      తొలగించండి
  6. పన్నుగ దేవతా గణము బారులు దీరుచు సంత సంబునన్
    మన్నన చేయుచున్ మదిని మాధవు స్తోత్రము మిన్నుము ట్టగా
    కన్నుల విందుగా తరలి కాంతల తోడను వాయు వేగమున్
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్

    రిప్లయితొలగించండి
  7. అన్నన యెంతమాట తమరంటిరి పృచ్ఛక తప్పు దొర్లె లే
    *"పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్"*
    తిన్నగ జేతు ప్రశ్ననిట తీరిచి దిద్దెద మెచ్చ పండితుల్
    పిన్నలు పెద్ద లేగిరట *భీముని*పెండ్లినిఁ జూడ వేడుకన్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      సమస్యాపూరణలో ఇదీ ఒక పద్ధతే. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  8. ఇంట నుండె గాద చిన్నాన్న యొక్కరు
    వర్షములయె పెండ్ల వలె; జిలేబి
    యొకతె కుదురగ, నయయొ మురిసి బందరు
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ!

    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గాద... పెండ్లవలె'...?

      తొలగించండి
  9. గ్రామమందు నెద్ద"రౌడీ"కరాటెలో
    పేరుఁగొన్నవాడు,భీకరుండు,
    కోరి వలచె నొక్క కోమలి మనసార
    వెడలిరెల్ల భీష్ము పెండ్లిఁజూడ

    రిప్లయితొలగించండి


  10. అన్నువ లన్న పెండ్లమన నామడ దూరము బోవునాతడే
    కిన్నరకంఠి యొక్కతెయు గీటుచు కన్నుల బిల్వ మక్కువన్
    తిన్నగ చేసుకొందునని తిగ్మము తాళక నూగిబోవగా
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. భీష్ముడు=A terrible or formidable person శం.నా.నిఘంటువు

    రిప్లయితొలగించండి
  12. అన్నులమిన్న హైమ కరమందగఁజేయు తలంపుతోడుతన్
    చెన్నగుపూలభాణముల చెచ్చెర వేయగ శంబరారి యా
    జన్నపువేటగాడు గొనె శాంభవి హస్తము పారవశ్యతన్
    పిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లిని జూడ వేడుకన్

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    భీష్మ తపము జేయు విశ్వనాథుని జూపు
    నయ్యపర్ణ వైపు నజుఁడుఁ ద్రిప్పి
    కాలి బూడిదౌచు కల్యాణమును జేయ
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    రిప్లయితొలగించండి
  14. శ్రీని గూడి విష్ణు శ్రీమంతు డగుచును
    వాణితోను నలువ బాగుగాను
    దేవఋషియు సకల దేవతా గణములు
    వెడలె రెల్ల భీష్ము బెండ్లి జూడ!

    భీష్ముడు= శివుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పన్నుగ సత్యసుందరుడు పార్వతి హస్తము జేతబూనెడిన్
      యెన్నిక యైననా ప్రముఖ వేడుక జూడగ నుత్సహించుచున్
      మన్నన గూర్చగా నలువ, మాధవు, డింద్రుడు, నారదాదులున్
      పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లిని జూడవేడుకన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో '...బూనెడిన్+ఎన్నిక' అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "...బూనగా । నెన్నిక..." అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! తప్పక సవరించెదను!🙏🙏🙏🙏

      తొలగించండి
  15. ఉర్వి జనుల కెల్ల యుత్సాహ మేపార
    వెడలి రెల్ల భీష్ము పెళ్ళి జూడ
    దేవతలును వచ్చి దీవెన లిడిరంట!
    తేలి పోగ కలయె మేలు కొంటి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      స్వప్నవృత్తాంతపు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2610
    సమస్య :: *పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లిని జూడ వేడుకన్.*
    భీష్ముని పెండ్లికి పిల్లలు పెద్దలు వెళ్లినారని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: తన తండ్రి యైన శంతనుడు సత్యవతిని వివాహం చేసికొనాలని అనుకోగానే వారి పెళ్లి జరిపించేందుకు అడ్డు అవుతుందని ఈ జన్మలో నేను వివాహం చేసికొనను అని ప్రతిజ్ఞ చేసినవాడు భీష్ముడు.
    ఐతే కుండిన పురాన్ని రాజధానిగా చేసికొని విదర్భ దేశాన్ని పాలించిన భోజ వంశపు రాజులలో భీష్మకుడు అనేవాడు భీష్ముడు అనే పేరుతో కూడా పిలువబడేవాడు. ( ఆ భీష్మకుని కుమార్తెయే రుక్మిణి )
    అతడు వివాహం చేసికొంటూ ఉండగా పిల్లలు పెద్దలు ఆ భీష్ముని పెండ్లికి వెళ్లినారని విశదీకరించే సందర్భం.

    మున్నట భోజ వంశమున బుట్టి విదర్భకు రాజు లేలినా
    రన్నున దాము కుండిన పురమ్మును , వారల భీష్మకుండు దా
    నెన్నగ భీష్మ నామము ధరించిన వాడు వివాహమాడగా,
    *పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లిని జూడ వేడుకన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (27-2-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖరార్యు రమ్యమౌ పద్యముఁ
      రాటు తేలెనుగ పురాణ పటిమ
      రాజు కవుల నితడు లావణ్యమౌ రీతి
      వ్రాయునెపుడు ఘనపు వ్రాతలెల్ల!
      🙏🏻👌🏻

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      భీష్మకుని వివాహ ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. (ఈ రోజు 5-52 pm కి )పై సమస్సకు ప్రాస ఒకవేళ దుష్కరం గా ఉంటే అందుకోసమ పూరణ పంపబడినది.

      తొలగించండి
    4. పద్య రూపంలో ప్రశంస చేసిన సహృదయులు శ్రీ ps Rao విట్టు బాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు. కోట రాజశేఖర్.

      తొలగించండి
  17. "పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్"
    కన్నది కాదు విన్నదియుఁ గాదు మరెట్టి చరిత్ర లందు. మీ
    రన్నవిధమ్ము భారతము వ్రాసిన రెండవ వ్యాసు డెవ్వరో?
    క్రన్ననఁ బూర్తిఁ జేయ కృత కమ్మగు నిట్లుగఁ బూరణమ్ములున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవపాదంలోని సవరణ గమనించ ప్రార్థన.
      "వ్రాసె నదెట్లుగ వ్యాసు డెయ్యడన్"

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. పెండ్లి మాని తాను భీష్మ ప్రతిన జేయ
    భీష్ముడం చు నుతుల పేర్మిన oద-
    వింత యగును గాదె వినుట కు నెక్కడ
    వెడలి రెల్ల భీష్ము పెండ్లి జూడ ?

    రిప్లయితొలగించండి
  19. భీష్ము డనుచు శివుని బిలిచిరే పెద్దలు
    భీష్మ తపము వలన బిరుదు గాన
    మాత పార్వతినట మనువాడ నెంచెగా
    "వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ"

    రిప్లయితొలగించండి
  20. రణరంగమున విజృంబిస్తున్న భీష్ముడిపై కృష్ణుడికి మహాగ్రహం కలుగగా చక్రం ధరించి భీష్ముని ముందుకురికినాడు.భీష్ముడికి పెళ్ళి (తగిన శాస్తి)తప్పదని యుద్ధరంగంలలో ఎక్కడెక్కడో ఉన్న యువకులు,పెద్దలు చూడాలని తరలి రాగా కడకు తానిచ్చిన మాట మేరకు కృష్ణుడు శాంతించాడు.భీష్ముని పెళ్ళిజరగ లేదపుడు.ఇది నా సొంతంకాదు. గతంలో ఒక అవధాని యిలాగే పూరించినాడు.కొత్త పదాలే నా సొంతం.
    ******
    చక్రి కొఱలి యనిని చక్రము బూనగ
    "వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ"
    యెదురు చూచి రంద రేపార నుత్కంఠ
    కడకు శౌరి చల్ల బడెను నాడు.
    (కొఱలు = ఆగ్రహించు)

    రిప్లయితొలగించండి
  21. అన్నుల మిన్న సచ్చరిత హారములన్విడి వల్కలంబులన్
    మిన్నగ దాల్చి శంకరుని మెప్పును గోరి తపంబు సల్ప ము
    క్కన్నుల వాడు ధీర నగకాంతను మెచ్చి వరించి నంతనే
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్

    రిప్లయితొలగించండి
  22. ఆ.వె.
    కులమతముల నెంచు కుత్సిత యోచనల్/
    నేను బొందననెడు నీతిమంతు/
    భీష్మశపథముగని “భేషు భేషని” మెచ్చి/
    “వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసరాజు గారూ,
      'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ఉత్పలమాల
    అన్నులమిన్న పార్వతి నహర్పతి కూడ కుమారసంభవ
    మ్మన్నది తారకాసురుని కంతమటన్న సురాది యాచనన్
    బన్నగ భూషణుండు నొగి పంతము వీడి వరించ నెంచఁగన్
    బిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్

    రిప్లయితొలగించండి
  24. గిరిజ పెండ్లి కొఱకు గిరిరాజు పిలువంగ
    వెడలి రెల్ల భీష్ము పెండ్లి జూడ
    నాది దంపతులిక నానంద మొందుచు
    నిత్తు రన్ని సిరులు భక్తులకిల



    రిప్లయితొలగించండి
  25. పన్నుగ పెండ్లి వద్దనుచు పంతము పట్టెనొకండు వానికిన్
    చెన్నుగ భీష్ముడంచు చెలువారగ నామమునుంచి యెల్లరున్
    కన్నెయొకర్తు తా వలచె కాముడు పెండ్లికి నానతీయగన్
    పిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నామము నుంచి రెల్లరున్" అనండి.

      తొలగించండి
  26. చెన్నుగ నంపశయ్యపయి చేరువ పాండవులండయుండగా
    కన్నని యానతిన్ నరుడు గంగను కూర్చియు దప్పిదీర్చగా
    వెన్నుని గాంచుచున్ వలచు వేళకు మృత్యుని కాగలించగా
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగు బాగు! పెద్దల చావు పెండ్లితో సమానమనే నానుడి యున్నదికదా!
      🙏🙏🙏🙏

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      చావు కూడా పెళ్ళి లాంటిదే అంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      "మృత్యువు కౌగలించగా" అనండి.

      తొలగించండి
    3. "Marriage and death are equally good endings for a story...in both cases the interest passes on to the next generation."

      ...Somerset Maugham in "Razor's Edge"

      🙏🙏🙏

      తొలగించండి
  27. మత్స్యయంత్ర మపుడు మానుగ ఛేధింప
    దాశెరాజు కోరె తనయ కొరకు
    కదలినారు ప్రజలు కడుమోదమందుచు
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      అందరూ పెళ్ళిని, పెళ్ళికి వచ్చిన భీష్ముని చూడడానికి వచ్చారన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. అన్నగరాజుదాబిలువ హర్షముతోడన వేగిరంబుగ
    న్బిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లిని జూడవేడుక
    న్నన్నువబార్వతీ పతికి నామెకు గానుకగానిడన్నతు
    ల్బన్నుగ వారలిత్తురిక బ్రాభవ మొందగసంపదల్సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      హర్షము తోడను.... అనండి.

      తొలగించండి
  29. సినిమ జూడ నెంచి సిద్దమై నందున
    వెడలి రెల్ల భీష్మ॥ పెండ్లి జూడ
    బోక విందు కేగి భోజనమును జేసి
    ఇంట జేరి రంట వంట లేక !

    రిప్లయితొలగించండి
  30. దేవ కార్య మెంచి దేవేంద్రు పనుపున
    మన్మధుండు సేయ మంచి పనినిఁ
    బార్వతి తప మెల్ల ఫలియించ మనువయ్యె
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    [భీష్ముఁడు = శివుఁడు]


    క్రన్నన నేగి కాశికినిఁ గాంతు సభాస్థలి రాజకోటి వి
    చ్ఛిన్నము సేసి యంబికను జిన్న సహోదరి నిచ్చి నెమ్మి తాఁ
    బిన్న విచిత్రవీర్యునకుఁ బెండిలి సేయుచు నుండ హస్తినం
    బిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్

    [భీష్ముని పెండ్లి = భీష్ముడు చేయు పెండ్లి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 4/11/2015 నాటి పూరణ:

      అన్నుల మిన్న మన్మధ వధాంతర భగ్నమనోరధార్తియై
      యన్నగరాజ నందన హిమాద్రి తటిం దప మాచరించి ము
      క్కన్నుల వేల్పు నీల ఘనకంఠుని పార్వతి పెండ్లియాడగన్
      పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్.

      [భీష్ముడు = శివుడు]

      తొలగించండి
    2. సవరణలతో
      అన్నుల మిన్న మన్మధ వధాంతర భగ్నమనోరధార్తియై
      యన్నగరాజ నందన హిమాద్రి తటిం దప మాచరించి ము
      క్కన్నుల వేల్పు నీల ఘనకంఠునిఁ బార్వతి పెండ్లియాడగం
      బిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్.

      [భీష్ముఁడు = శివుఁడు]

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      అయితే ఇది గతంలో ఇచ్చినదే అన్నమాట! నాకు జ్ఞాపకం లేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. కాశిరాజు సుతలు వాసిగాంచినవారు
    తమ్ములకును దగిన తరుణులనుచు
    యుధ్ధమెంతొ జేసి యుక్తితోడను దేగ
    వెడలరెల్ల భీష్ము పెండ్లిజూడ!

    భీష్ముడు చేసిన పెండ్లి (తృతీయ విభక్తి)

    రిప్లయితొలగించండి
  32. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు వరంగల్లులో చేశారా? ఏ డిపార్ట్‌మెంట్ లో?

    రిప్లయితొలగించండి
  33. వాడ లోన పెద్ద రౌడి, పెండ్లి యనుచు
    బిలిచె వాడ యంత ,భీతి తోడ
    మనము జంపు కొనుచు మగువల తోగూడి
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ"

    భీష్ముడు = భయంకరమైన వాడు

    రిప్లయితొలగించండి
  34. అన్నుల మిన్న యైన మరు నాలిని బోలిన నొక్క కన్యకన్
    మిన్న, నొకండు కోరెను, దమింగని యామె తిరస్కరించ, న
    భ్యున్నతభీష్మమౌ ప్రతినఁ బూనె, ఫలించ నెట్టకేలకున్
    పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో "ఫలించగ..." అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  35. డా.పిట్టా
    వంశ "మంపశయ్య" వక్ర బుద్ధి నలుసు
    పెళ్ళి వదలె "భీష్ము"పేరు నంద
    ధనిక విధవ వాని దానె వలచె గాన
    వెడలిరెల్ల "భీష్ము" పెళ్ళి జూడ!
    (నలుసు ,రేణువు )

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టా
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెళ్ళిని జూడ వేడుకన్
    గన్న"య(అ)హాహభారతము",గద్య కవిత్వములోన జెప్పగా
    "మిన్నగ యున్నదం" చనిరి మేదిని పద్యము బాతిపెట్ట నా
    పన్నుడు కోతి మూకలను వ్యాసుడు పాపము!యెట్లు మెల్గునో!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భక్తి తోడ మెలగు భాగవతు లచట
    పస్తు చేసి శివుని పరిచరించి
    పావన శివరాత్రి పండుగ దినమున
    వెడలిరెల్ల భీష్ము పెండ్లిజూడ

    రిప్లయితొలగించండి
  38. చెన్నుగ పెండ్లిమాట తన చెంతను మెచ్చని బ్రహ్మచారియై
    మన్నన జేయుచున్ ప్రతిన మాన్యుడు యుద్ధము గెల్చి తెచ్చె నా
    కన్నెల కాశిరాజుని సుకన్యల తమ్ముల కీయ రారొకో
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని, పెండ్లినిఁ జూడ వేడుకన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      భీష్ముని, అతని తమ్ముల పెండ్లిని చూడడానికి వెళ్ళారన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మిస్సన్న గారు మీ పూరణ బాగున్నది. నేనుకూడ నా విధముగా పూరిద్దా మనుకొని కించి ద్వ్యాకరణ భేద భయమున విరమించితిని.
      భీష్మునిఁ బెండ్లిని నని యున్న చో మీరనుకొన్న భావము (భీష్మునిని, పెండ్లిని) వచ్చును. ద్రుతమును నిర్లక్ష్యము సేయఁ దగదు. ద్రుత సంధి నిత్యము.
      లేనిచో “భీష్ముని పెండ్లి” యని సమాసమగును. అప్పుడు భీష్ముని చే పెండ్లి గాని భీష్ముని యొక్క పెండ్లి యని విగ్రహ వాక్యము చెప్పు కోవాలి.
      గురువు గారు సందేహ నివృత్తి జేయగలరు.

      తొలగించండి
    3. పెద్దలు కామేశ్వర రావుగారికి నమస్సులు. మీ సూచన సహేతుకము. భీష్మునిన్ అనే అర్థం వచ్చేలా అరసున్న ఉండవలసిందే. అయితే శంకరయ్య గారు కొన్ని సూక్ష్మమైన వ్యాకరణ దోషాలను అంతగా పట్టించుకోక పోవడం మనకు తెలిసినదే ( అది కూడా సభ్యలను ఉత్సాహపరచడానికి అని కూడా మనకు తెలుసును) మీ రన్నట్లు నా పూరణలో భావాన్ని భీష్ముని యొక్క పెండ్లి అంటే భీష్ముడు చేయించే పెండ్లి అని సరిపెట్టుకుంటాను. మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదములు.

      తొలగించండి
  39. *పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లిని జూడ వేడుకన్.*
    పై సమస్యలో ప్రాసను దుష్కరంగా మార్చి
    *భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు వేడ్క జూడగన్.*
    అని ఇస్తే ఎలా చేస్తారు అని ఒక మిత్రుడు అడుగగా సిద్ధం చేసిన పూరణ.

    భీష్ముడనంగ తండ్రి కిల పెండ్లిని జేసిన వాడె గాదుగా ,
    భీష్ము డనంగ భీష్మకుడు, వీరుడు, కుండిన నేలె భోజు, డా
    భీష్ముడు దా విదర్భ నిల విజ్ఞత పాలన జేసె, నట్టి యా
    *భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు వేడ్క జూడగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (27-2-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీరు సవ్యసాచులు. దుష్కరప్రాసతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి


    2. మష్మము కాదు రాజులకు మాన్యము కయ్యములోన గెల్చె, తా
      నిష్మల మైన బుద్ధి గని నీమము తప్పక తెచ్చె వీరుడై!
      గ్రీష్మపు తీవ్రతల్ సరళి గింగురు కన్యల, నా సభాస్థలిన్
      భీష్ముని, పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు, వేడ్క జూడగన్!

      జిలేబి

      తొలగించండి
    3. ప్రశస్తమైన పూరణ అవధానిగారూ! అందుకోండి అభినందనలు!!🙏🙏🙏

      తొలగించండి
  40. శ్రీ కోట రాజశేఖరార్యుల సమస్యకు పూరణ:
    ******
    భీష్ముని వోలెనాతడొక భీషణ మొప్పు ప్రతిజ్ఞ జేసియున్
    గ్రీష్మములో బ్రభాకరుని రీతిని దండ్రియె యాగ్ర హింపగన్
    సుష్మను చేకొన న్నపర శూరుడు భీష్ముడు సమ్మతింపగన్
    *భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు వేడ్క జూడగన్.*

    రిప్లయితొలగించండి
  41. కనగ సినిమహాలు కమ్మని పోస్టరు:
    "భీముపుత్రి తోడ భీష్ముపెండ్లి",
    పనికిమాలినోరు పరుగు పరుగులెట్టి
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    రిప్లయితొలగించండి
  42. .పేరిడి రతని కిల భీష్ము డటంచును
    పెరిగి కొలువు నంద పెండ్లి చేయ
    నెంచ బంధు మిత్రు లెల్లసంబరమున
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ.
    ఉ.మా:
    అన్నుల మిన్నయౌ గిరిజ నవ్వనిలోపల గాంచుచున్ వడిన్
    పన్నుగ శూల పాణి యట పార్వతి నుద్వహమాడనెంచగన్
    గ్రన్నన దేవతల్ మునులు గాఢపు రక్తిని చూపుచుండగన్
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్"*

    ఆకులలుములు విడి యడవిలో పార్వతి
    చేయు చుండ తపము శివుడు వచ్చె
    మారు వేషమందు,మనువాడ నెంచగ
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ.

    గరళకంఠునకును గౌరి దేవికి పెండ్లి
    చేయు నెంచి సురలు శీఘ్రముగను
    నద్రి రాజు నడుగ నంగీకరింపగ
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ.




    రిప్లయితొలగించండి
  43. ..........సమస్య
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    1 వ పూరణము:--

    సందర్భము...
    పార్వతి చెలు లిలా పరిహసిస్తున్నారు.
    "తొలుత బిడియపడ్డాడు. భీష్మించు కున్నాడు. ఇప్పుడేమో పెండ్లి కొడుకైనాడు. లలనచేతిలో చిక్కినాడు."
    బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం..
    ~~~~~
    "బిడియపడుచు మిగుల భీష్మించుకొనె నమ్మ!

    తొలుత పెండ్లి కొడుకు; లలన చేత

    చిక్కె నే;" డటంచు చెలులు పరిహసింప...

    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    2 వ పూరణము:--

    సందర్భము...
    మన్మథుని బూదిగా మార్చిన వానికా పెండ్లి! ఐతే చూచి తీరాల్సిందే! అంటూ సురలు, ఋషులు మున్నగు వారంతా
    శివుని పెండ్లికి బయలుదేరినారు.
    ~~~~~~
    "మదను బూదిఁ జేయ మరిగిన వానికా

    యింత వైభవముగ నిపుడు పెండ్లి!"

    యనుచు సురలు,ఋషులు,
    యక్షులు, సిద్ధులు

    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    3 వ పూరణము:--

    సందర్భము... ఒక ఉపాధ్యాయుడు పిల్లలతో అంటున్నాడు..
    ~~~~~~~~
    "బెత్త మందుకొనర! పెండ్లి జేయుదు వీని..

    పద్య మప్ప జెప్పు భడవ! యన్న

    పారిపోవుచుండె బడి గ్రౌండున" కనంగ

    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ

    -----------------
    ....సమస్య

    "పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ
    జూడ వేడుకన్"

    సందర్భము... నా కొక స్వప్నం వచ్చింది.
    భీముడు హిడింబాసురుని సంహరించి ఆతని సోదరియైన హిడింబను వివాహం చేసుకుంటున్నా డట! కురువీరు లంతా వెళ్ళా రట! అందరికంటె గొప్ప వాడైన భీష్ముడూ అక్కడే వున్నా డట!
    భీముని పెండ్లికి వెళితే భీష్మ పితామహుణ్ణీ చూడవచ్చు. అని పిన్నలూ పెద్దలూ వెళ్ళారట! భలే బాగుంది.
    (నిజానికి లాక్షాగృహ దహనం తర్వాత పాండవులు సొరంగపు దారిగుండా బయటపడి హిడింబ వన ప్రాంతంలోకి చేరుకుంటారు. భీముడు హిడింబాసురుని సంహరిస్తాడు. వాని సోదరి హిడింబను తల్లి అనుమతితో పెండ్లాడుతాడు. ఆ తర్వాత ఏకచక్ర పురానికి వారు చేరుకుంటారు..
    ఆ పెండ్లి కెవరూ వచ్చే ఆస్కారం లేదు. కాని నేను కలఁ గన్నాను గదా!)
    ~~~~~~~~
    కన్న కథాంశ మిద్ది; కల
    గంటి హిడింబ వివాహ మెంతయో

    కన్నుల పండు వౌచు జరు
    గన్ గురు వీరులు నేగిరంట; స

    ర్వోన్నతుడైన భీష్ము డట
    నొప్పగ భీముని పెండ్లి వేళలో

    పిన్నలు పెద్ద లేగి రట
    భీష్ముని, పెండ్లినిఁ జూడ వేడుకన్!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ పూరణలన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  44. పిన్నలు పెద్దలన్ వినక భీష్ముడు పెండ్లి నిరాకరించగా
    కన్నడు డింపులయ్యకిక కాంగ్రెసు కన్యను సోనియమ్మ తా
    పన్నుగ దానమిచ్చుచును పాడగ తియ్యని మంగళారతుల్
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్!

    రిప్లయితొలగించండి