11, అక్టోబర్ 2022, మంగళవారం

సమస్య - 4215

12-10-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె”
(లేదా...)
“సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో”

19 కామెంట్‌లు:

  1. సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె
    గొప్ప ప్రశ్నను వేసిరి గురువరులిట
    కుర్ర కుంకల మని మన కు రమ!చెపుము
    భార్య యగునని రామున కార్యు లకిఁక

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    సతులు శ్రీదేవి, భూదేవి శౌరికనఁగఁ
    గలుఁగ సీతగ రమయె భూ గర్భమందు
    శౌరి భూమిని శ్రీరామచంద్రుఁ డనఁగ
    సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె?

    శార్దూలవిక్రీడితము
    ప్రీతిన్ శౌరికి సేవఁజేసి తనరన్శ్రీ, భూ సతుల్ ప్కేమతో
    సీతామాతగ పుట్టి భూరమణికిన్ శ్రీలక్ష్మి, యజ్ఞంబునం
    దేతెంచన్ హరి భూమి రామునిగఁ దానెంచంగ ధర్మాత్ముఁడై
    సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో?

    రిప్లయితొలగించండి

  3. *(అశోక వనంలో సీతకు కాపలాగ యున్న యొక రాక్షసకాంత మాటలుగ.....)*


    నీదు జాడకొరకు జలనిధినె దాటి
    వనము చెరచుచు దనుజుల బారిసమరి
    పట్టణమ్మును గాల్చిన వానరుండు
    సీత! రామున కేమౌనొ చెప్ప గలవె?

    రిప్లయితొలగించండి
  4. రాత్రి యంతయు వినియెను రామ కథను
    కాని సందేహ మొక్కటి కలిగి నంత
    సీత రామున కేమోనొ చెప్ప గలవె
    ననుచు ప్రశ్నించె నొక్కతె యరుదు గాదె!

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    రమ్య సుగుణ సీత *రామునికేమౌనొ
    చెప్పౕఁగలవె?*యనిన శ్రీమతి యని
    బదులు సెప్పె నొక్క బాలిక యొప్పుగా
    తరగతి గదిలోన గురువు మెచ్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      ఖ్యాతింగాంచినప్రేమబంధమిది,వాగర్థంబులట్లున్ సదా
      చేతంబొక్కటె,మేనులొప్పువిడిగాశ్రీరమ్యదివ్యాకృతిన్
      పూతంబైనది వీరి గాథయిలలోఁబుణ్యాత్ములైనట్టి శ్రీ
      సీతారాముల బంధమిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో.

      తొలగించండి
  6. భూతేశా! యని చెంతజేరి యడిగె నా ముక్కంటి వాల్గంటియే
    యా తార్క్ష్యుండకు పంటతొయ్యలియె తానర్ధాంగియే గాదె, భూ
    జాతన్ గుందుడు రాముడై కయికొనెన్ సారంగ మందున్ గదా
    సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో.

    రిప్లయితొలగించండి
  7. శా.

    భూతాత్మమ్ము హిరణ్య వర్ణ మృగమున్ బోవంగ వెన్నాడుచున్
    కాతాళించుచు లేచి దర్భ విడిచెన్ గాకాసురున్ హింసగన్
    భీతిన్ గొల్పు విరాధు జంపి సతికిన్ బ్రీతిన్ శరణ్యంబిడెన్
    *సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో.*

    రిప్లయితొలగించండి
  8. సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో”
    సీతా రాముల సాటి వీరనుచు నేఁ జెప్పంగ శక్యంబునే
    సీతా మాతగఁబుట్టె లక్ష్మియె సుమా శ్రీరాముఁ జేపట్టనౌ
    పాతాళాది సమస్త లోకము ల నే బాలించు పుణ్యాత్ము లే

    రిప్లయితొలగించండి
  9. హరి హరులను బావ మరదు లందురు గద
    శివుని తలపయి జూటము జేరి నిలచు
    సీత, రామున కేమౌనొ చెప్పఁ గలవె
    యనుచు నడుగ , బా లుడు చెల్లె లనుచు దెలిపె

    రిప్లయితొలగించండి
  10. శ్రద్ధగా విని సాంతము రామకథను
    ఛాత్రుడడిగెను బోధకు నాత్రపడుచు
    గురువరా! సందియము దీర్చ కోరుకొందు
    సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె

    రిప్లయితొలగించండి
  11. దేశదేశాల కథలపై దృష్టినిల్పి
    త్రవ్వి తీసినా'డారుద్ర' రామ కథలు
    చదువరికి గల్గె చివరకీ సందియమ్ము
    'సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె'

    రిప్లయితొలగించండి
  12. చేతోజాత పునీత భావనమునన్ సీతమ్మ శ్రీరామునిన్
    చేతంబందున నిల్పి నిశ్చలమతిన్ జీవించె తానొంటియై
    సేతున్ గట్టె మహాబ్ది రాఘవుడుతా సీతన్ గనన్ లంకలో
    సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో

    రిప్లయితొలగించండి
  13. చేతమ్మందునఁ బ్రేమ ముప్పిరిగొనన్ జెన్నైన దాంపత్యమున్
    నీతిన్ నిల్పుచు సంతతమ్ము మనుచున్ నిర్వేదమున్ ద్రుంచుచున్
    ఖ్యాతిన్ బొందిరి ధాత్రిపైఁ బ్రజలకున్ గారుణ్యమున్ బంచిరే
    సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో!

    రిప్లయితొలగించండి
  14. అంచితముగఁ గానల సంచరించు చుండ
    భాగ్య హీనత వైదేహి మృగ్య మయ్యెఁ
    బృథ్వి నెచ్చ టైనను గనిపింప కున్న
    సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె

    ఈ తారా గణ మెన్న నిక్కముగ వే యేండ్లేఁగినన్ సాధ్యమే
    భూతవ్రాతము నెన్న విశ్వమున సంపూర్ణమ్ముగా సాధ్యమే
    యే తంత్రమ్మున నైన సాధ్య మగునే యెన్నంగ భూరేణువుల్
    సీతారాముల బంధ మిట్టి దనుచుం జెప్పంగ సాధ్యం బొకో

    రిప్లయితొలగించండి
  15. పొలము దున్నెడి వేళలో పుడమి యందు
    జనకునకు కూతురయ్యెను చక్కగా ను
    సీత,రామునకేమౌనొ చెప్పగలవె
    యనుచు నడుగంగా తెలిపెదనాలియనుచు

    రిప్లయితొలగించండి
  16. ఏతెంచెన్ భువికిన్ ననంతుడు మహాతేజంబుతో
    రాముడై
    ప్రీతిన్బుట్టి పొలంబునన్ సిరియె సంప్రీతిన్ వరించెన్ దనన్
    చేతంబొక్కటియౌ సతీపతులునై జీవించగా నీధరన్
    సీతారాముల బంధమిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో

    రిప్లయితొలగించండి