19, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4224

20-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్”
(లేదా...)
“చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో”

18 కామెంట్‌లు:


  1. వెలుగులయిక్కను గ్రమ్ముచు
    జలధరములట కురుపించు జల్లులుదధి మే
    ఖల దడుపగ వీచిన చిరు
    చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్.

    రిప్లయితొలగించండి

  2. కలవారి యింటఁ బుట్టిన
    గలకంఠికి వేయ యేసి కడు సంతసమునన్
    గలలను గంటుచు, హాయిని
    చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    మలమల మాడ్చగ నెండలు
    జలజల స్వేదము స్రవించ స్నానముఁజేయన్
    వలెనంచునేగగనె బ
    చ్చలి, వేసవిలోనఁజెలికి సంతసమిచ్చెన్.
    బచ్చలి=స్నానాలగది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      మలమల గ్రీష్మకాలమున మాడ్చుచునుండగ చండభానుఁడున్
      జలజల రాలగాఁజెమట సారెకు దప్పిక హెచ్చఁజల్లనౌ
      జలములు,తామరాకులును శైత్యపు భోజ్యములందు తీగ బ
      చ్చలి గడు సంతసఁబిడెను చానకు వేసవి మండుటెండలో.

      తొలగించండి
  4. చం.

    కులహితమున్ మహోన్నతినిఁ గూర్చెడి సద్గుణముల్ త్యజించుచున్
    గొలుసులు వెండి బంగరు, సుకోమల పుష్పములన్ వికాసమున్
    దలచెను నిండు పున్నమిగ ధన్యము బాగరి ఛత్రధారఁ బుం
    *శ్చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో*.

    రిప్లయితొలగించండి

  5. పులిసిన భగ్నసంధికము పుల్లని వాసన వచ్చుచుండెనే
    వలదని భార్యచెప్పగనె వల్లభు డంతట తెచ్చి పత్రముల్
    పులుసుగ జేసి నాతికిడ మోదము చెందెను దానిలోని బ
    చ్చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో.

    రిప్లయితొలగించండి
  6. నెలబాలునిగన్నంతనె
    జలనిధియుప్పొంగిపోవుసంతోషముతో
    అలలవి మేనుతడుప చిరు
    చలి వేసవిలోన చెలికి సంతసమిచ్చెన్

    రిప్లయితొలగించండి
  7. కలువలదాయి యిడు వడకు
    జిలజిల పుట్టించు చుండు చెమటలు పట్టన్
    చలియిక్క వీచగ కలుగు
    చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్

    రిప్లయితొలగించండి
  8. మలమలమాడ్చు గ్రీష్మము నమైకము కమ్మిన యట్లు క్రుంగుచున్
    గిలగిలలాడుచున్సతియుకేలనుపట్టగతా ళవృంతమున్
    బలముగగాలివీచుచును వర్షము జోరుగకుర్సినం తనే
    చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో”*

    రిప్లయితొలగించండి
  9. అలికులవేణి మోదమున నాతని చెంతను నుండ వీచు నా
    చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో
    కలువల ఱేని శీతలము కాయముఁ సోకుట కారణంబు నన్
    జలిగను నుండుఁ గావునను జానలు సంతస మొందు రయ్యెడన్

    రిప్లయితొలగించండి
  10. కలికిపడకింటి లోనన్
    గలవట వాతానుకూల్యకరణపు యంత్రం
    బులు తత్ప్రభావమువలన
    చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్

    రిప్లయితొలగించండి
  11. మల మల యె o డలు మాడ్చగ
    కలవర పడుచున్న వనిత కౌతుక మొప్పన్
    జల పాత o బున మున్గగ
    చలి వేసవి లోన జెలికి సంతస మిచ్చె న్

    రిప్లయితొలగించండి
  12. చెలువము లొలుకుచు మదిలో
    చెలికాని తలంపు గురిసి సిగ్గుల జడియై
    యలివేణి మేను తడిపిన
    చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్

    రిప్లయితొలగించండి
  13. మలమల మాడుచుండె నొక మానిన
    వేడిమిచేత చేనులో
    నులవల పంటగోయుచు గడుత్తమరాలు
    భరించి వేదనన్
    బిలబిల జోరు వాన పడి వేండ్రము
    నంతయు చల్లబర్చె నా
    చలి గడు సంతసంబిడెను చానకు వేసవి
    మండుటెండలో.

    రిప్లయితొలగించండి
  14. కలవర మందఁగ వేఁడికి
    నలు దిక్కులు దిట్టముగఁ దనరి నల్లని మ
    బ్బులు కమ్మి కురియ వర్షము
    చలి వేసవి లోనఁ జెలికి సంతస మిచ్చెన్

    లలనకు నిష్ట మంచు ననురాగము మీఱఁగ సత్వరమ్ముగన్
    సలసల కాచి తోయమునఁ జక్కని వంటక మెంతొ ప్రీతినిన్
    వలసిన యంత కమ్మని సువాసన నీనెడు కూర సేయ బ
    చ్చలి గడు సంతసం బిడెను జానకు వేసవి మండు టెండలో

    రిప్లయితొలగించండి
  15. చెలువఁపు పూలబాణములు చేడియ మేనును తాకినంతనే
    కలవరమొంది నెమ్మనము గ్రన్నన తాపవికీర్ణమయ్యె సం
    చలనమునాపి సాంత్వనకు చల్లని నీటను తానమాడనా
    చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో

    రిప్లయితొలగించండి
  16. కందం
    అలజడి పడి పతిదేవుడు
    వలచిన సతి జ్వరమన తడి వలువను నుదుటన్
    తొలిగా నిడ నుపశమనఁపు
    చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్

    చంపకమాల
    అలజడితో మగండు జ్వరమన్ సతిఁ జేర్చియు వేగ శయ్యకున్
    గలతను దాకుచున్ నుదురు కాలుటఁ జూచియు తక్షణంబునన్
    దొలుతగ తేమతో వలువ తోయలి పైనిడ సేదదీర్చెడున్
    చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో

    రిప్లయితొలగించండి
  17. వలచిన కన్య భార్యయయి బాధ్యతతో గృహమున్ జరించుచున్
    కలివిడిగా కుటుంబమున కార్యములన్ బొనరించి మించగా
    చెలికొరకై విభుండు లలిఁ జేకొనఁ గమ్మని కందతోడ బ
    చ్చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో

    రిప్లయితొలగించండి