18, అక్టోబర్ 2022, మంగళవారం

సమస్య - 4223

19-10-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాస్త్రమర్మముల్ గలవు సీసాలలోన”
(లేదా...)
“సీసాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్”

17 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    రమ్యమైన గాథ రామాయణంబున
    నౌర!కనగ వ్యాస భారతమున
    మహితధర్మ *శాస్త్రమర్మముల్ గలవు;సీ
    సాలలోన *లేవు శంకరార్య!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      శ్రీసాహిత్య సరస్వతీ చరణ సంసేవారతుల్ సత్కవుల్
      ధీ సామర్ధ్యముతో రచించిరి గదా తెల్గుంబ్రబంధంబు లె
      న్నో, సేబాసు!బళీ!యనంగ బుధులున్,నూత్నంపు పద్యాలలో
      సీసాలందున నిండియున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్.

      తొలగించండి
  2. వేదముల యందుఁ జూడగా విపులముగను
    శాస్త్రమర్మముల్ గలవు, సీసాలలోన
    యన్ని రకముల ద్రవములు చెన్ను మీర
    భద్ర పఱచుదురట వాటి బాగు కొఱకు

    రిప్లయితొలగించండి
  3. శా.

    గ్రాసమ్మున్ రుచిగా తినంగ వలయున్ గ్రాహ్యంబు పూర్ణత్వమున్
    *సీసాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్*
    వాసాగారమునందు స్త్రీలను ఛవిన్ వాంఛించు ప్రాణేశులున్
    దోసమ్మే యెలుగెత్తిచాటు విధమున్ దుండిన్ నివారింపగన్.

    రిప్లయితొలగించండి
  4. పెక్కు విషయాలు వివరించి పేర్మి మీర
    పద్యముల నల్లె గొప్యమై పండి తుండు
    వాని చదివిన వారె ల్ల పలికి రిట్లు
    "శాస్త్ర మర్మముల్ గలవు సీ సాల లోన "

    రిప్లయితొలగించండి
  5. కవిగ శ్రీనాథుడు రచించె కావ్యములను
    సీసపద్యరచనమున శ్రేష్ఠుడతఁడు
    సార్వభౌముడు కవులందు శాస్త్రవిదుఁడు
    శాస్త్రమర్మముల్ గలవు సీసాలలోన

    రిప్లయితొలగించండి

  6. శాస్త్రములెరుగనట్టి పెచ్చారు లెల్ల
    మద్యమున్ గ్రోలినను చాలు మత్తు తోడ
    ధర్మ శాస్త్రములె వచింత్రు ధాటిగాను
    శాస్త్రమర్మముల్ గలవు సీసాలలోన.


    ఏ శాస్త్రంబు పఠింపకున్న నిలలో హీనాత్ములౌ వారలే
    వాసిన్ మద్యము గ్రోలి స్నేహితులతో వాగ్వాదమున్ జేయుచున్
    సీసాలెన్నియొ ఖాళిసేసి వచియించేరెన్నొ ధర్మంబులన్
    సీసాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్.

    రిప్లయితొలగించండి
  7. అతడు క్రమము తప్పక దాని నసుర వేళ
    నారగించునేల యనుచు నడుగ “కామ
    శాస్త్రమర్మముల్ గలవు సీసాలలోన”
    ననుచు వివరించె నాతని యాప్తు డొకడు

    రిప్లయితొలగించండి
  8. మీసాలున్న మనుష్యునంచు సభలో మీమాంసలే సేయుచున్
    మూసిన్ బోలెడి ముచ్చుబుద్ధిమతులన్ మోహింపగా నేటికో
    మోసంబుల్ మరి మానుమింక మగడా ముందుండ నందాల రా
    సీ, సాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్.


    సాల-ఇల్లు

    రిప్లయితొలగించండి
  9. మద్యపాన నియంత్రణ మనుచు చెప్పి
    ముమ్మ రమ్ముగ మద్యమ్ము నమ్మ వచ్చు
    పణము లేకున్న మద్యమే ఋణము దెచ్చు
    శాస్త్ర మర్మముల్ గలవు సీసాలలోన

    రిప్లయితొలగించండి
  10. ధర్మశాస్త్ర జ్ఞులుదెలుపు ధర్మములవి
    పొందుపర్చిరి చక్కగా పూర్వకవులు
    శ్రద్ధగాపరికించగ చక్కనైన
    "శాస్త్రమర్మముల్ గలవు సీసాలలోన”

    రిప్లయితొలగించండి
  11. వీసంబంత వినోదమొందక ను నావేశంబు తోనుండుచో
    నాసాయీశుని జేర గావలయుగా నాశీస్సు లొందంగ నౌ
    నాశా దీపము వెల్గఁ దోడ్పడుసుమా యాదేవుఁ డే జాతికిన్
    సీసాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    త్రాగి మేటి కవిత్వమ్ము వ్రాయగలఁడు
    శాస్త్ర సమ్మతిననఁగ నాశ్చర్యమగును
    తీరుఁ జూచిన ననిపించు వారలొలుకు
    శాస్త్రమర్మముల్ గలవు సీసాలలోన

    శార్దూలవిక్రీడితము
    ప్రాసల్సింద కవిత్వ మాధురులతో భావాల నుద్రేకముల్
    రాశుల్ వోసెను మద్యపానరతుడై రంజింప 'శ్రీశ్రీ' ,గనన్
    దోసమ్ముండని శాస్రసమ్మతినిఁ గాదో? ,వారలున్ గ్రోలెడున్
    సీసాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్

    రిప్లయితొలగించండి
  13. గాసింబొందక సీసపద్యములతో గావ్యంబులన్ వ్రాయుచున్
    వాసింగాంచె కవీశ్వరుండు తనభవ్యంబైన విద్వత్తుతో
    కాశీఖండములోని సీసముల సంఘాతంబులన్ జూడగన్
    సీసాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్

    రిప్లయితొలగించండి
  14. సీస పద్యము లందు నశేషముగ లి
    ఖింప సర్వ శాస్త్రమ్ముల నిం పొదవఁగ
    ధర్మ శాస్త్ర విజ్ఞానులు తథ్యముగను
    శాస్త్ర మర్మముల్ గలవు సీసాల లోన

    దోసం బెంచక సత్కవి ప్రవరు లుద్ఘోషించి డెందమ్ములం
    ద్రాసం బేర్పడ దుమ్ము వట్టు నని నిర్ధారించి రాజన్మహో
    ల్లాసం బొప్పఁగఁ గట్ట వస్త్రమున నుద్గ్రంధమ్ము లింపార ని
    స్సీ సా లందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్

    [సాలు = సన్న వస్త్రము]

    రిప్లయితొలగించండి
  15. తా సాహిత్యపు సేవజేయుచును సద్భా
    వంబుతోజక్కగా
    నీ సంసారపు జీవ యాత్రపయి న్నెంతో
    ప్రభావంబుగా
    వాసింగాంచిన సీసపద్యములలో
    భాసించె శేషప్ప యా
    సీసాలందున నిండియున్నవిగదా చెన్నొంద శాస్త్రార్థముల్ 19/10

    రిప్లయితొలగించండి
  16. సీ.!
    ఎవ్వానిపద్యములింపుసొంపారగ
    సాటియై యొప్పు సీసాలలోన
    తిలకమేటికినీకు తెలుగున సద్భక్తి
    సారము తెల్ప సీసాలలోన
    దివిజ కవివరులు నెవరి సరసమగు
    సాహిత్యము వినె సీసాలలోన
    మానిత కథలను మాధురీ మహిమతో
    సాధించి వ్రాసె సీసాలలోన

    తే.గీ.
    భావ విస్తృకి తగునట్లు పరిధి గల్గి
    యెత్తు గీతిలో నందము నినుమడించు
    గొప్ప కవులు తెలిపిన నిఘూడ ధర్మ
    శాస్త్ర మర్మముల్ గలవు సీసాలలోన

    - కాకరమురళీధర్.

    రిప్లయితొలగించండి