14, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4218

15-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ దగున్”
(లేదా...)
“సానికి మ్రొక్కి పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్”

17 కామెంట్‌లు:

  1. కందం
    పేనగ వైరులు వల బల
    హీనక్షణమందు జిక్క నెంచగ నసువుల్
    బూనుచు 'వదిలించు కొనన్
    సానికి' ,నతుఁడై సతికి, 'విషంబిడఁగఁ దగున్'

    ఉత్పలమాల
    పేనగ వైరులున్ వల నవిజ్ఞతతో బలహీనవేళలోన్
    జాణకు జిక్క మోహమున సంపద దోచియు నెత్తువేయుచున్
    బ్రాణము సైతమున్ గొనఁగ రాన్ 'వదిలించు కొనంగ నెంచుచున్
    సానికి' ,మ్రొక్కి పత్నికి, 'విషంబిడు టొప్పు వివేకశీలికిన్'

    రిప్లయితొలగించండి
  2. హీనుడు దుర్గుణ సహవా
    సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ, దగున్
    వానిని విడువక యురికం
    బానికి నెక్కింప, ధర్మ పాలన కొరకై

    రిప్లయితొలగించండి
  3. ఉ.

    పానము జేసి మద్యమును పంజర వాగ్మిగ నూరకుండుటన్
    *సానికి మ్రొక్కి పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్*
    దానము జేయ సంపదలు ధర్మమె వీడగ దల్లిదండ్రులన్
    సూనుడు పుండరీకుడగు శూన్యము పుణ్యము వ్యర్థజన్మయే.

    రిప్లయితొలగించండి
  4. పాణీయము ద్రావనిచో
    ప్రాణము పోయెడు తరుణము బానిస యతడే
    చానను కాపాడగ దొ
    ర్సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ దగున్.


    భానుడు నిప్పులన్ జెఱగు పాళము నందున దాహమంచు నా
    చానయె కోరినంతనట చాకిరిచేయు గృహమ్ము కేగి యా
    బానిస తెచ్చె కోమలము వాజము నందున నిచ్చినట్టి దొ
    ర్సానికి మ్రొక్కి , పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్.


    (విషము= జలము)

    రిప్లయితొలగించండి
  5. మానక దుర్వ్యాపారముఁ
    గానక నిక మంచిచెడ్డ కదలిక లెపుఁడున్
    మౌనము వహించు నెడలను
    సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ దగున్

    రిప్లయితొలగించండి
  6. తానొక మధుపాన దయిత
    సానుల వెన్నడి దిరుగుట సాధారణమై
    మానసమున దలపోసెన్
    సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ దగున్

    రిప్లయితొలగించండి
  7. కందం
    మేనన్ నొప్పులు మొదలవ
    గానే,తొలి కాన్పునందు కలుగగ బిడ్డం
    డానందంబున మంతర
    సానికి నతుఁడై, సతికి విషంబిడగఁదగున్.
    విషము=నీరు

    ఉత్పలమాల
    చానకు నిండగా నెలలు సారెకు నొప్పులు హెచ్చ మేన,శీ
    ఘ్రాన ప్రసూతి కేంద్రమునకై చనినంతనె, మంత్రసాని,వి
    జ్ఞానిగ పోయగాఁబురుడు చక్కని బిడ్డడు పుట్టె నంత నా
    సానికి మ్రొక్కి, పత్నికి విషంబిడుటొప్పు వివేకశీలికిన్.
    విషము=నీరు

    రిప్లయితొలగించండి
  8. తేనియ మాట లొల్కు మొన తేలిన ఖడ్గము వంటి నాయకుల్,
    వీనుల విందు సేయ దమ వెంట సపత్నుల బోలు కల్లరుల్,
    దీనత వైదొలంగ, దగు దీటగు నేర్పరి యొక్కడైన..మో
    సానికి మ్రొక్కి, పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్.

    రిప్లయితొలగించండి
  9. సానికి మ్రొక్కి పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్
    మానుట యొప్పు మ్రొక్కుటలు మంచిది కాదది మెచ్చ రెవ్వరున్
    గానగ వచ్చునే యరయ కాంతకు నీయగఁ గాలకూటమున్
    సానులఁ మార్చగా వలయు సాధ్వుల రీతిని నుండు నట్లుగా

    రిప్లయితొలగించండి
  10. ఆనాటి పయనమందున
    తానెరుగని చోట పత్ని దాహ మడుగగన్
    కానగ వచ్చిన కిన్నెర
    సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ దగున్

    రిప్లయితొలగించండి
  11. కానుపు కష్టముకాగా
    పూనిక దన శక్తిమేర బురుడును బోయన్
    సూనుని గనుచున్ మంతర
    సానికి నతుడై సతికి విషంబిడగ దగున్

    విషము = జలము

    చేనుకు నీటిపారుదల చేకురనందున బంటలెండగా
    బూనిక దంపతుల్ బెనగి భూమిని ద్రవ్వగ లోతు
    లెంచకే
    ప్రాణము లేచివచ్చినటు రాగ జలంబది నీలకంఠునిన్
    సానికి మ్రొక్కి పత్నికి విషంబిడుటొప్పు వివేకశీలికిన్
    విషము = జలము

    రిప్లయితొలగించండి
  12. దానము ధర్మము జేయుచు
    దీనుల యెడ కరుణ జూపు దివ్యు o డగు నా
    మానితు డొక దుష్టుని. మో
    సానికి నతుడై సతికి విషo బిడ గ దగున్

    రిప్లయితొలగించండి
  13. వే నాశ మౌను జ్ఞానం
    బే నాశ మగు నిజ కీర్తి యెద చల మున్నన్
    మానవునకు మూర్ఖపు రో
    సానికి, నతుఁడై సతికి, విషం బిడఁగఁ దగున్

    కానరు మంచి చెడ్డలను గామ సముద్రము నందు మున్గఁగా
    దానవ బుద్ధి వీడ రెద ధర్మము నెంచరు సుంత యేనియున్
    మానవ! కాంచ నెంచినను మానక దుర్భర రౌర వాదులన్
    సానికి మ్రొక్కి పత్నికి విషం బిడు టొప్పు వివేక శీలికిన్

    రిప్లయితొలగించండి
  14. కం:ఓ నైష్ఠికుడా !కుమతికి
    సానికి నతుడై సతికి విషం బిడగ దగున్
    గానీ వేదాంతివి కద
    జ్ఞానమ్మున మసలుకొమ్ము సతి దేవతయౌ

    రిప్లయితొలగించండి
  15. పూనిక వహించి చూసెను
    మానును చెడునడతను తను మంచిది యనుచున్
    కానిపనులు చేయగ మో
    “సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ దగున్”

    రిప్లయితొలగించండి
  16. మానక కామవాంఛ పలుమారులు
    వెళ్ళియు డబ్బులెన్నియో
    సానికి ధారవోసి, తన సజ్జన భార్యను
    హింసబెట్టు నా
    మానవు డెర్గి సత్యమును మానియు
    నీచబుద్ధి తా
    సానికి, మ్రొక్కి పత్నికి, విషంబిడుటొప్పు వివేక శీలికిన్

    రిప్లయితొలగించండి
  17. కానుక లివ్వగన్ కదిలి కామము దీర్తురు వారకాంతలై
    పానుపులెక్కి గౌరవము పాటిగ దీతురు ధర్మపత్నులై
    దీనిని మెచ్చరెవ్వరును తీర్పుగ యోచన సల్పిచూడ నా
    “సానికి మ్రొక్కి, పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్”

    రిప్లయితొలగించండి