22, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4227

23-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వారకామినులం జేరువాఁడు బుధుఁడు”
(లేదా...)
“వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు విజ్ఞుఁడౌ”

17 కామెంట్‌లు:

  1. చిఱు నగవు మోము గలుగుచు శిరము నిమిరి
    సాను నయముగ వర్తిల్లి సరసఁజేరి
    మృదు మధురముగఁ బలుకుచు మిక్కిలి చెలు
    వార,కామినులం జేరువాఁడు బుధుఁడు

    రిప్లయితొలగించండి
  2. వ్యర్థ వెసనములోబడి వంతపడును
    వారకామినులం జేరువాఁడు, బుధుఁడు
    విడక సన్మార్గ మెన్నడు వెఱపు లేక
    సకల సంపద లలరఁగ సౌఖ్యమొందు.

    రిప్లయితొలగించండి

  3. విజ్ఞుడవని యడిగెదనో వేమనార్య
    యాశ్రితులనాదరించుచు ననవరతము
    తల్లిదండ్రుల కొలుచు నందనుని కన్న
    వారకామినులం జేరువాఁడు బుధుఁడు?


    నేరక యడ్గుచుంటినిది నీవొక విజ్ఞుడవంచు తెల్పుమా
    కూరిమి జూపుచున్ బరమ కూళుల నైన క్షమించుచున్ సదా
    పేరిమి దల్లిదండ్రులిల వేల్పులటంచను వాడి కన్న నా
    వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు విజ్ఞుఁడౌ ?


    (పై రెండు పద్యములు వేమనను అతని వదినగారు అడిగినట్లుగా నూహించి వ్రాసినవి)

    రిప్లయితొలగించండి
  4. మారడు గాక మారఁడిక మాపులు రేపులె యెన్ని వచ్చినన్
    వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు ,విజ్ఞుఁడౌ
    కారణ భూతుఁడౌచునిల గాఁగల జన్మకు నాందిఁ బల్కనౌ
    భూరిగ దానధర్మములు బ్రీతిని జేయుచు నుండు వాడహా

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    వేద శాస్త్రముల్ చదివిన విబుధుఁడగును
    చదువు సంధ్యలు విడనాడి సంతతంబు
    వారకామినులంజేరు వాఁడు బుధుడు
    కాఁడు, ముమ్మాటికిని మిండగాఁడె యగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      వారక వారకామినుల వద్దకుఁజేరెడు వాఁడు విజ్ఞుడౌ
      నా?రహి మోహ వార్నిధి జనంబులు నవ్వగ మున్గి పోవు,సం
      సారము సారహీనమగు సారెకు భార్యయు తిట్టుచుండు వ్యా
      పారములందు నష్టములు వచ్చును కావుననాతఁడజ్ఞుఁడౌ.

      తొలగించండి
  6. కూళుడె యనువగు గృహిణి కొంపనుండ
    వారకామినులం జేరువాఁడు ;
    బుధుఁడు
    తన సతినె కామినిగమార్చి ధన్యు డౌను
    స్థితి ననుకూలముగ మార్చ సిద్ధియగును

    రిప్లయితొలగించండి
  7. తలిరు విలుకాని శరముల ధాటికి చెలు
    వార కామినులం జేరువాఁడు బుధుఁడు
    కాదు వానికి జనకుడౌ కాంతి మతుడు
    తార గర్భమునకుతానె కారకుండు

    రిప్లయితొలగించండి
  8. కోరికలుప్పతిల్ల మది కూళతనమ్మున లజ్జవీడితా
    వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు విజ్ఞుఁడౌ
    నేరడు, బుద్ధిహీనుడగు, నేరము కాదొకొ నీతి వీడినన్
    దూరము వెట్టగా నెలమి దుష్టుని రీతిగనెంచి వానినిన్

    రిప్లయితొలగించండి
  9. జీవితమ్మున నిండిన చీకటులను
    తొలగచేయుచునుసుఖసంతోషములను
    నింపనెంచిహితవుతెల్ప నెమ్మితోడ
    వారకామినులన్ చేరువాడు బుధుడు

    రిప్లయితొలగించండి
  10. మరొక పూరణ
    డా బల్లూరి ఉమాదేవి
    వేరుమార్గము కానకవిటులొసంగు
    ధనముపైయావతోడనుదారితప్పి
    సంచరించెడువారికి సన్మతినిడ
    వారకామినులన్ జేరువాడు బుధుడు

    రిప్లయితొలగించండి
  11. మనుజు లందున భేదాలు మాన్పు కొఱకు
    సంఘ జీవన మందున సమత బెంచ
    వారి తల వ్రాత మార్చెడు వాంఛ తోడ
    వార కామినులo జేరు వాడు బుధుడు

    రిప్లయితొలగించండి
  12. చేరుటకు నుండుఁ గనఁ బెక్కు కారణములు
    పాడు చింత లేల నెదల భామ లందు
    మే నలర వచించిరి యిట్లు నేను గన్న
    వా రకామినులం జేరు వాఁడు బుధుఁడు

    కా రిల వారు నైజమునఁ గామిను లెన్నఁగ శుద్ధ బుద్ధినిన్
    దారుణ మైన వేళలను దామర సాక్షులు దారిఁ దప్పఁగాఁ
    గోరుచు నుద్ధరింపఁ దగఁ గూరిమి మీఱఁగ మంద భాగ్యలన్
    వారక వారకామినుల వద్దకుఁ జేరెడి వాఁడు విజ్ఞుఁడౌ

    రిప్లయితొలగించండి
  13. బుద్ధిలేనివారు భువిని మూర్ఖు లౌచు
    "వారకామినులన్‌ జేరు, వాడు బుధుడు"
    ఇంటగృహకాంతతోనుండు నెళ్ళవేళ
    సంతసమ్ముగ సంసార సాగరమున

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    ఆ త్రిమూర్తుల కామినులందజేయ
    విద్యనైశ్వర్యమున్ శక్తి వేడ్కగాను
    తల్లులంచును నర్చింపఁ దైన్యతఁ జెలు
    వార కామినులం జేరువాఁడు బుధుఁడు

    ఉత్పలమాల
    మేరలు లేని యాకలికు మేదిని యెట్టి యుపాధి లేదనన్
    భారమునైన నా బ్రతుకు వారలు నెంచిరటంచు ఖిన్నులై
    వారలఁ బ్రోవ గౌరవ యుపాధికి మార్గము సూపు దీక్షతో
    వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు విజ్ఞుఁడౌ

    రిప్లయితొలగించండి
  15. దారుణ కృత్యమంచునిది దంపతులెందరొ దూరమైరిలన్‌
    మారుము సంఘమందుకడు మాన్యత నొందుము మీరలంచు, మీ
    తీరును మార్చు కొండనుచు తెల్పుచు వారల వాడలందునన్
    “వారక, వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు విజ్ఞుఁడౌ”

    రిప్లయితొలగించండి
  16. చేరి వచించుచున్ గరము చెన్నగు మాటల చిన్నపిల్లలన్
    దూరముచేసి పెద్దలకు దోష మనస్కులు సాని వాడలన్
    చేరిచి యమ్మివేయగను, చేయ విముక్తి పవిత్ర చిత్తులై
    వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు విజ్ఞుఁడౌ

    రిప్లయితొలగించండి