15, డిసెంబర్ 2022, గురువారం

సమస్య - 4280

16-12-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తక్షకుఁడు హితకారి యుదంకునకును”
(లేదా...)
“తక్షకుఁ డాప్తుఁడై హిత ముదంకునకుం బొనరించె మేలుగన్”

9 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
గురుసతికటంచు గొనిపోవు కుండలముల
తస్కరించి ప్రయాసఁ బొందంగ జేసి
జగతికి తనదు గురుభక్తిఁ జాటెననఁగఁ
దక్షకుఁడు హితకారి యుదంకునకును

ఉత్పలమాల
శిక్షణనిచ్చినట్టి గురు సేవగ వారల పత్నికోసమై
దక్షత కుండలాలఁగొనఁ దస్కరణంబొనరించినంతటన్
దీక్షగఁ బొంది మాతకిడు తీరున భక్తినిఁ జాట వైరిగన్
దక్షకుఁ డాప్తుఁడై హిత ముదంకునకుం బొనరించె మేలుగన్

sitharamayya solasa చెప్పారు...

కుండలముల నపహరించె గూఢపాత్తు
తక్షకుఁడు , హితకారి యుదంకు
నకును
సర్పజాతి నెల్ల లయము సలుపనెంచి
జన్నమును జేసిన జనమేజయ యధిపతి

M.B.G.TILAK చెప్పారు...

సఫలుడై పరీక్షిత్తును చంపెనుగద
తక్షకుఁడు; హితకారి యుదంకునకును
మార్గమందున గలిసి గోమయమును దిన
మనుచు నాదేశమొసగిన దనుజవరుడు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తక్షకునిచర్య ఫలితముదంకునకును
మేలు సమకూర్చె నెల్లరు మెచ్చు రీతి
పుడమిఁ పంచమవేదమున్బొందజేసె
తక్షకుఁడు హితకారి యుదంకునకును

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

హిత మొనర్చెను గురు పత్ని కెలమి నిచ్చి
పౌష్య పత్ని కుండలములు బ్రాహ్మణుండు
దొంగిలింపఁ గుండలములు దొంగ యయ్యెఁ
దక్షకుఁడు, హితకారి యుదంకునకును

దక్షత నిచ్చునట్లు గురు దక్షిణ పైల మహర్షికిం దగన్
వీక్షణ మాఁత్మఁ జేసి కడు భీతిని నేరక దొంగిలించి తా
రక్షిత కుండలమ్ములు ధరా సుర వర్యున కిచ్చి సుంతయేఁ
దక్షకుఁ డాప్తుఁడై హిత ముదంకునకుం బొనరించె మేలుగన్

Rama Murthy Duvvuri చెప్పారు...

తేటగీతి
అకట!ఘనుడౌ పరీక్షిత్తునకపకారి
తక్షకుఁడు;హితకారి యుదంకునకును
రాజు జనమేజయుండు,స్వరాజ్యమందు
సర్పయాగము సేయగా సమ్మతించె.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

శాపము నమలు పరచంగ సర్ప రాజు
తక్షకుడు హిత కారి :యు దంకు నకును
సర్ప యాగము చేయంగ సాధ్య మయ్యె
నాన తీయగభూపతి యవని యందు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శిక్షణనొంది విద్యలను శిష్యుడుదంకుఁడు పైలు పత్నికిన్
దక్షిణనీయ పౌష్యసతి దాల్చిన కుండలముల్ హరించెనా
తక్షకుఁడట్టి చేష్టితము తద్దయు కీర్తినిఁగూర్చ భావిలో
తక్షకుఁ డాప్తుఁడై హిత ముదంకునకుం బొనరించె మేలుగన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తీర్చ గురుపత్ని కోర్కెను తీరుగాను
నాగ లోకమునకు నేగనాక మంది
నట్టులై చిక్కె నమృతమ్ము నప్ఫుడయ్యె
తక్షకుడుహితకారియుదంకునకును