19, డిసెంబర్ 2022, సోమవారం

సమస్య - 4284

20-12-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవికర్ణరసాయనములు గాకుల గోలల్”
(లేదా...)
“కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె వింటివా”

31 కామెంట్‌లు:

  1. కవితల పయిన విమర్శలె
    కవికర్ణరసాయనములు ; గాకుల గోలల్
    చవిచూచెదరుగ , వాటికి
    వివరణ నీయక విడిచిన వేళల లోనన్

    రిప్లయితొలగించండి

  2. భువిలో బడుగుల బాధల
    వివరించుచు పేద వారి వేదన ద్రుంచన్
    కవితను వ్రాయగ దలచిన
    కవికర్ణరసాయనములు గాకుల గోలల్.

    (కాకులు=అల్పులు)


    ఊకుడు గాథలన్ విడి మహోద్యమ శంకము నూదనెంచి యీ
    లోకములోని కించనుల రోదన బాపుటె లక్ష్యమంచు కైతలన్
    చీకటి బ్రత్కు పై రణము జేయదలంచినంత చీ
    కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె, వింటివా

    రిప్లయితొలగించండి
  3. గతంలో ఒక పత్రికలో చదివిన 'కాకులోని' అలవాటు నేపథ్యంలో..

    కందం
    స్తవనీయుఁ 'గాకులోడ' న
    నవశ్యమున్ దిండి కాకులందఁగనిడు న
    య్యవినాభావమనంగన్
    గవికర్ణరసాయనములు గాకుల గోలల్!

    ఉత్పలమాల
    వేకువ లేచి చూచి తిను విత్తనముల్ గొని చల్లినంతటన్
    గాకులు మూగుచున్ గుడువ గాంచెను తృప్తిని, 'కాకులోడ'నన్
    లోకులు నామధేయమిడ రుచ్యమునై కొనసాగ వానికిన్
    కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె వింటివా!

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి
  4. నవతను గోరెడు జనులకు
    దవిలియు పేదల బ్రతుకుల దైన్యము లెల్లన్
    కవిగా రచింప నయ్యవి
    కవి కర్ణ రసాయనములు గాకుల గోల ల్

    రిప్లయితొలగించండి
  5. అవి "కావు కావు" కేకలు
    వివరమిడుచు "కావు కావు" వినుమని దెల్పున్
    అవి "కావు కావు" సూక్తులు
    కవికర్ణరసాయనములు గాకుల గోలల్


    కాకులు సల్పుగోల విన కర్ణకఠోరముకాకపోదు చీ
    కాకుల మధ్యచిక్కి నయగారము దూరము సేయబోకుమా
    మూకలగూడినేడు పలు పోకడలెంచుచు సాగుటేల నీ
    కా కులగోల నేఁడు గవి కర్ణరసాయన మయ్యె వింటివా

    రిప్లయితొలగించండి
  6. కవితామాధురి నెరుగని
    యవివేకుల ముందు కవితలద్భుత రీతిన్
    వివరించిన ఫలమేమిటి
    కవికర్ణరసాయనములు గాకుల గోలల్

    రిప్లయితొలగించండి
  7. వేకువ ఝూమునన్గదలి వెండియు భామలు రంగనాధునిన్
    శ్రీకర మైనఁబాశురముల జిత్తము దెల్పుచు మేలుగొల్పగా
    నీకలి కల్మషం బునను నిత్యము నేగెడు వారివైన జీ
    కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె వింటివా
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  8. ఆకులపాటునొందెమది యద్భుత రీతిని కావ్యగానమున్
    వేకువఝామునందు వినిపించిన సత్కవివర్యుఁ గాంచి చీ
    కాకుగ కర్ణయుగ్మమును క్రన్నన మూసెను వెంగళుండహో
    కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె వింటివా

    రిప్లయితొలగించండి
  9. కం:"కవి" యనగ జముడు కాకియు
    వివర మెరిగి శ్లేష నొక్క వికటకవి యనెన్
    కవి ఘోషల విన రండో
    కవికర్ణరసాయనములు కాకుల గోలల్
    (కవి అంటే జముడు కాకి అనే అర్థం కూడా ఉంది.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:ఆ కుల మెల్ల చెడ్డ దని,యా మత మెల్ల వినాశహేతు వం
    చాకుల మీకుల మ్మనక నందరు రెచ్చిరి,భావఘర్షణల్
    లోకము నందు హెచ్చె కవి లోకము సర్వము జిక్కె నిట్టి చీ
    కాకుల, గోల నేడు కవికర్ణరసాయన మయ్యె వింటివా?

    రిప్లయితొలగించండి
  11. భువిఁ గయితగాండ్లు కూయఁగఁ
    గవి! కర్ణ రసాయనములు గాకుల గోలల్
    భువిలోఁ గాకుల కింపుగఁ
    గవి! కర్ణ రసాయనములు గాకుల గోలల్

    [రసాయనము = 1. విషము, 2. ఔషథము]

    తాఁకినఁ గత్తి వాటు మెయిఁ దాళఁగ వచ్చును గాని యౌర చీ
    కాకు సెలంగ డెందములఁ గావ్యము నత్తఱి నాలకింపఁగా
    నాకుల చిత్త తప్తులయి రందఱు పండితమాను లైన యా
    కాకుల గోల నేఁడు కవి కర్ణ రసాయన మయ్యె వింటివా

    [రసాయనము = విషము]

    రిప్లయితొలగించండి
  12. మూకలయో వినాయకుని పూజల పేరిట మండపంబులన్
    కేకలు మోత లల్లరులె కీర్తనలంచు ముగించిరెట్టులో
    కాకుల గోల; నేఁడు గవికర్ణరసాయన మయ్యె వింటివా
    శ్రీకరమౌ వధానమిటు సిద్ధి వినాయక సన్నిధానమున్

    రిప్లయితొలగించండి
  13. దివిజులకథలాలించగ
    కవి కర్ణరసాయనములు; కాకుల గోలల్
    చవులూరించని మాటలు
    వివరించనశక్యములయివేదన గూర్చున్.

    వేకువ యందులేపుచును వేగమె కార్యము లాచరించగా
    కాకులు నిత్యమున్ యరచుకావుమటంచును వేడుపద్దతిన్
    లోకులకెల్లనేర్పెనని రుచ్యముగాననుమాటలన్ వినన్
    *“కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె వింటివా”*

    రిప్లయితొలగించండి
  14. నాకము నుండి పెద్దలు తినన్, దయచేయుదురంచు, పిండముల్
    శ్రీకర మౌనటంచును సురేంద్రుని లోకము చేర్చజీవునిన్
    చేకుర జేసి భక్ష్యముల చెన్నుగ పేర్చ స్మశాన మందునన్
    కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె వింటివా

    రిప్లయితొలగించండి